Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
ఇరువది ఆరవ అధ్యాయము
ఇషేత్వేత్యారాభ్య దర్శ పౌర్ణమాస పితుర్య జ్ఞాగ్నిహోత్రో పస్థాన పశుచాతుర్మాస్యాగ్నిష్టోమ
వాజపేయ రాజసూయగ్ని సౌత్రామణ్యశ్వమేధ సంబద్ధామన్త్రా వ్యాఖ్యాతాః|
ఇదానీం ఖిలాన్యుచ్యన్తే || (మహీధరవ్యాఖ్య నుంచి)
1. అగ్నిశ్చపృథివీచ సంన్నతే తే! మే సంన్నమతామదోవాయుశ్చ్కాన్తరిక్షంచ సంన్నతే తే మే సంన్నమతామద ఆదిత్యశ్చద్యౌశ్చ సంన్నతే తేమే సంన్నమతామద ఆపశ్చవరుణశ్చసంన్నతే తే మే సంన్నమతామదః | సప్త సంసదో అష్టమీ భూత సాధనీ| సకామాఁ అధ్వానస్కురు సంజ్ఞానమస్తు మ్కేమునా||
అగ్నియు భూమియు సంగతులగుదురు గాత. సంగతులైన వారు మాకు అనుకూల రగుదురు గాత.
వాయువు అంతరిక్షములు సంగతులగుదురు గాత. సంగతులైనవారు మాకు అనుకూలురు అగుదురు గాత.
ఆదిత్యులు ద్యులోకము సంగతులగుదురు గాత. సంగతులైనవారు మాకు అనుకూలురు అగుదురుగాత.
అగ్ని, అంతరిక్షము, వాయువు, ఆదిత్యులు, ద్యులోకము, జలము, వరుణుడు ఏడుగురు అధిష్టాతలు.
దేవా! మా మార్గములను అభీష్టపూర్ణము చేయుము. మమ్ము సంజ్ఞానులను చేయుము.
2. నేను జనుల కొరకు శుభవాక్కులు పలుకుచున్నాను. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకును, నాఅనుయాయులకును శుభములు కూర్చును గాత. నాఅభీష్టములు వర్ధిల్లును గాత. నేను దానములు ఇచ్చువాడను. దేవతలకు ప్రీతపాత్రుడను కావలెను. దేవదత్తాదులు అనుకూలురు అగుదురు గాత.
3. బృహస్పతీ! ఏవి రమణీయ రత్నాదులగునో, వేటిని సంపన్నులు మిక్కిలి ఆశింతురో, ఏది యజనహేతువగునో, ఏది జనసాధారణులకు కాంతివంతమగునో, ఏది బలమును దీప్తివంతము చేయునో, అట్టివిచిత్ర ధనమును మాకు చేర్చుము.
గ్రహమా! నీవు ఉపయామమున గ్రహించబడినావు. నేను నిన్ను బృహస్పతి కొరకు గ్రహించినాను. ఇది నీస్థానమగును. బృహస్పతి కొరకుగాను నిన్ను ఇచట స్థాపించుచున్నాను.
4. గోవంత ఇంద్రా! ఇచటికి, ఈ యజ్ఞమునకు విచ్చేయుము. ఈ యజ్ఞసోమము శిలలచే అభిషుతమై ఉన్నది. ఈ సోమరసమును పానము చేయుము.
గ్రహమా! నీవు ఉపయామమున గ్రహించబడినావు. నేను నిన్ను గోవంతుడగు ఇంద్రుని కొరకు గ్రహించినాను. ఇది నీ స్థానమగును ఇంద్రుని కొరకు నేను నిన్ను ఇచట స్థాపించుచున్నాను.
5. వృత్రహంతఇంద్రా! నీవు శతప్రజ్ఞవు. ఇచటికి, ఈ యజ్ఞమునకు విచ్చేయుము. ఈ యజ్ఞసోమము శిలలచే అభిషుతమైనది. ఆవుపాలు కలుపబడినది. ఈసోమరసమును పానము చేయుము.
ఉపయామగృహీత్కోసేన్ద్రాయ త్వాగోమత ఏషతే యోనిరిన్ద్రాయ త్వాగోమతే.
(పైమంత్రపు రెండవ పరిచ్ఛేదము దీనికి వచనమగును)
6. వైశ్వానరుడు యజ్ఞవంతుడు. సత్యజ్యోతి రక్షకుడు. అనుపక్షీణుడు. అజసం ధర్మమీమహే, అతనిని అక్షయ ధర్మమును యాచించుచున్నాను.
"ఉపయామగృహీత్కోసి వైశ్వానరాయ త్వైషతే యోని ర్వైశ్వానరాయత్వా"
7. నేను వైశ్వానరుని సద్భావమున నిలుతును గాత. ఆ రాజు భువనములకు శ్రీ వంతుడు. అతడు ఈ భూమినుండియే పుట్టి ఈ భూమిని వీక్షించుచున్నాడు. వైశ్వానరాగ్ని సూర్యుని యందు చేరి ప్రకాశించును.
"ఉపయామ గృహీత్కోసి వైశ్వానరాయ త్వైషతే యోని ర్వైశ్వానరాయత్వా"
8. మమ్ము రక్షించుటకు వైశ్వానరాగ్ని విచ్చేయవలెను. వహనక్షమ ఉక్ధలద్వారా విచ్చేయవలెను. సుదూర ప్రాంతము నుండి విచ్చేయవలెను.
"ఉపయామ గృహీత్కోసి వైశ్వానరాయత్వైషతే యోనిర్వైశ్వానరాయ త్వా"
9. అగ్ని ద్రష్ట, పావకుడు. పంచజనులహితుడు. తమీమహే మహాగయమ్, అతనిని మహాగమనము యాచించుచున్నాము.
"ఉపయామ గృహీత్కోస్యగ్నయే త్వావర్చస ఏషతే యోనిరగ్నయే త్వావర్చసే"
10. మహానుడు, వజ్రహస్తుడు, షోడజ ఇంద్రుడు మాకు సుఖములను ప్రసాదించును గాత. అతడు మమ్ము ద్వేషించుపాపిని హతమార్చును గాత.
"ఉపయామ గృహీత్కోసి మహేన్ద్రాయ త్వైషతే యోనిర్మహేన్ద్రాయత్వా"
11. ఇంద్రుడు దర్శనీయుడు. శత్రుంజయుడు. వాసహేతువు. సోమపానమున మదోన్మత్తుడు. యజమానులారా! ఆ ఇంద్రుని మీ కొరకు మేము, నవప్రసూతగోవు తనదూడ కొరకు అంబారవము చేసినట్లు, స్తుతించుచున్నాము.
12. ఉద్గాతలారా! కాంతి ధనుడగు అగ్ని కొరకు, అత్యంత ప్రాపణీయ, బృహత్సామమును గానము చేయండి.
అగ్నీ! మహిషవలె నీధనము, నీ అన్నము దానార్థమే ఉద్గమితమగును.
యథాప్రథమపరిణీతాస్త్రీ గృహాత్ భోగార్థం పతింప్రతి ఉద్గచ్ఛతి. మొదటి భార్య పతి భోగము కొరకు ఇంటినుండి వెడలును. అగ్నియు అట్లే ధన, అన్నములను దానము కొరకే ధరించును.)
13. అగ్నీ! మేము నీస్తుతులు గానము చేయుచున్నాము. ఇంకను గానము చేయుదుము. విచ్చేయుము. సోమరసము సిద్ధముగా ఉన్నది. సేవించుము. మదోన్మత్తుడవగుము. ఏహి- రమ్ము.
14. యజమానీ! ఋతువులు నీయజ్ఞమును విస్తరించును గాత. మాసములు హవిని రక్షించును గాత. సంవత్సరములు నీ యజ్ఞమును భరించును గాత]. వారందరు మాసంతతిని పాలింతురు గాత.
15. పర్వతముల వద్దను, నదుల సంగమ స్థలములందును, విప్రుల బుద్ధియందును సోమము వర్ధిల్లును.
16. సోమమా! నీ రసాంశము పైకి ఎగిసినది. ఆహుతుల ద్వారా ద్యులోకమునకు చేరినది. అదే వర్షరూపము దాల్చినది. ఉగ్ర, సుఖస్వరూప, మహాకీర్తిమయమై పృథ్వికి చేరినది.
17. సోమమా! నీవు ధనప్రాపకుడవు. యజనీయ ఇంద్ర, వరుణ, మరుత్తుల కొరకు అభిషుతమగుము.
18. మానవుల సమస్త ధనములను సోమస్వామి మావద్దకు చేర్చవలెను. దానిని మేము వితరణ చేయుదుము. అనుభవింతుము.
19. దేవతలు మా యజ్ఞములను ఋతువుల ననుసరించి స్వీకరింతురు గాత. అట్లయిన మేము గోవులు, అశ్వములు, పుత్రులు అన్యపదార్థములందు సమృద్ధులము అగుదుము. ద్విపద, చతుష్పాత్తులచే మేము పరిపుష్టులము అగుదుము.
20. అగ్నీ! మంచిని కోరు దేవపత్నులను, త్వష్టను కూడ సోమపానమునకు తీసికోని రమ్ము.
21.ఋతుదేవతలారా! మాయజ్ఞమును కీర్తించండి.
బహుపత్నుల అగ్నీ! నేష్టా! సోమపానము చేయండి.
మీరే కదా రత్నములిచ్చువారు. త్వంహిరత్నధా అసి.
22. ఋత్విజులారా! అగ్ని ధనదాత. అత్యంత సోమప్రియుడు. అగ్నికి సోమపు ఆహుతులు అర్పించండి. అందుకు సంబంధించిన పనులు చేయండి. నేష్టసహితము దేవతలతో కూడి సోమపానము చేయును గాత.
23. ఇంద్రా! ఇదిగో ఈ సోమరసము నీకొరకే వేచి ఉన్నది. రమ్ము ప్రసన్నుడవగుము. యథేచ్ఛగా సేవింపుము. ఈ దర్భాసనమును కూర్చుండుము. సోమరసమును నీ ఉదరమున పోయుము.
24. దేవపత్నులారా! మీరు ఆహ్వాన సులభులు, రండి. విచ్చేయండి. దర్భాసనము మీద కూర్చొనండి. ముచ్చట్లాడండి. త్వష్టా! దేవపత్నుల సహితుడవై, సచ్ఛీలుడవగునీవు, స్వేచ్ఛగా సోమము సేవించుము. మదోన్మత్తుడవగుము.
25. సోమమా! ఎంతో రుచికరమవై, మాదకమవై ధారగా పవిత్రమగుము. ఇంద్రుని పానమునకు అభిషుతమగుము.
26. సోమమా! రాక్షసహంత. విశ్వద్రష్ట. సోమపాత్ర ఇనుమున మలచబడి సోమము నిలుచునట్లు చేయబడినది. సోమము ద్రోణకలశమున ప్రశాంతముగా చేరును గాత.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
అనుక్త మంత్రకథనమను ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
లోకాస్పమస్తాస్పుఖినోభవంతు.





