Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    "విదురుడా ! పరుల గుణములను పొగడుట నీ పుర్రెన పుట్టిన బుద్ది . మావద్ద ఉందువు. మాతిండి తిందువు. పాండవులను పొగడుదువు. ఉండుము. తినుము. కాని నీతులు మాత్రము చెప్పకుము" అని దుర్యోధనుడు నిందించినాడు.
    విదురుడు వికలుడు అయినాడు. "దుర్యోధనా! మంచి మాటలు వినుటకు అర్హత కావలెను. సదా ముఖస్తుతులు చేయువారు హితము చెప్పలేరు. మాట కటువయినను హితకరమున మాట చెప్పువారు అరుదు. చెప్పువారు ఉన్నను వినువారు అరుదు. నేను ధృతరాష్ట్రుని సహాయుడనై ఉన్నాను. వంశపు మేలుకోరి చెప్పినాను. నీవు విపరీత బుద్దిచే నన్ను నిందించినావు. పాండవులతో కలహము నీకు మేలు చేకూర్చదు" అని హితోపదేశము చేసినాడు.
    దుర్యోధనుడు విదురుని మాటలు విననట్లు నటించినాడు. దుర్యోధనుని చూచినాడు శకుని. ధర్మరాజును ఈసడించినాడు. "ధర్మజా! నీవు సకల సంపదలను మాకు ఓడినావు. ఏమున్నది నీ దగ్గర పందెమునకు? మేము నీతో జూదమాడుటకు సమ్మతింపము. పందెము వేయు వస్తువును చూపుము" అని కాయలను వెనుకకు తీసుకున్నాడు.
    శకుని మాటలకు ధర్మరాజు మండిపడినాడు. సకల రాజ్యమును పందెమున ఉంచినాడు. ఓడినాడు. రాజ్యమును ఓడిన ధర్మరాజు మూర్తిభవించిన దుఃఖమువలె ఉన్నాడు. దేవ బ్రాహ్మణ మాన్యములు తప్ప భూమి నంతయు ధర్మరాజు శకునికి ఓడినాడు. బ్రాహ్మణులు తప్ప సకల జనులను ఓడినాడు. ఒక్కొక్క రాజపుత్రుని ఒడ్డి పుత్రులను ఓడినాడు. మహాబల సత్య ధర్మవంతులయిన సహదేవ, నకుల , అర్జున, భీములను ఒక్కొక్కరిని ఓడినాడు.
     విధివంచితుడు అయిన ధర్మరాజు సకల సంపదలను ఓడినాడు. రాజ్యమును ఓడినాడు. భూములను ఓడినాడు. జనులను ఓడినాడు. ఇంక ఏమున్నది ఓడుటకు? ఏమున్నది పందెమునకు?
    ధర్మరాజునకు మిగిలినది ఏమియు లేదు.
    ధర్మరాజు మాత్రమూ ఉన్నాడు.
    ధర్మరాజు తనను పందెమున పెట్టినాడు.
    ధర్మరాజు తనను తాను ఓడినాడు.
    ధరామండలమందలి సకల రాజులను జయించి, రాజసూయము చేసి అఖండఖ్యాతిని ఆర్జించిన ధర్మమూర్తి ధర్మరాజు జూదమున తన్ను సైతము తాను ఓడినాడు!
    "ధర్మజా! నీ వద్ద మరొక ధనమున్నది. దానిని మరచినావు. నిన్నే నీవు ఓడినావు. దానినేల పందెమున పెట్టవు?" అని శకుని హెచ్చరించినాడు.
    ధర్మరాజు శకుని మాటలు విన్నాడు. జూదపు మైకమున ఉన్నాడు. వివేకము కోల్పోయినాడు. పరమ పతివ్రత అయిన ద్రౌపది ని పందెమున పెట్టినాడు. ద్రుపద రాజు పుత్రి, పాండవుల పత్నిని ధర్మరాజు పందెమున ఓడినాడు.
    జూదమాడుటకు మరేమియు మిగులలేదు.
    దీనుడై, ధుఖితుడై గర్వము విడిచిన ధర్మరాజు జూదము చాలించినాడు.

        
                                                                                  ఆలోచనామృతము

    సకల ధర్మములు తెలిసిన ధర్మరాజు జూదము నందు సకలమును పోగొట్టుకున్నాడు. "విధి వియుక్తుడయి" ధర్మరాజు జూదమాడుటకు హస్తినకు వెళ్ళినాడని చెప్పబడినది. దైవ నిర్ణయమును మార్చుట ఎవరికిని తరము కాదు. అయినను మానవుని తప్పులను బలహీనతలను గురించి ఆలోచించవలసి ఉన్నది.
    ధర్మరాజునకు ధర్మాములన్నియు తెలియును. వానిని ఆదరించలేదు. తెలియుట కన్న ఆచరించుట మిన్న.
    రాజసూయ సందర్భమున ధర్మరాజు భీమార్జునులను లెక్క చేయలేదు. రాజసూయము తరువాత ధర్మరాజునకు ఇసుమంత గర్వము పొడసూపినట్లు కనిపించుచున్నది.
    రాజసూయ సందర్భమున సోదరులను సంప్రదించినాడు. అని చెప్పబడినది. జూదము విషయమున మాట మాత్రము కూడ తమ్ములను సంప్రదించలేదు.
    విదురుడు పాండవ శ్రేయోభిలాషి. లక్క ఇంట సందర్భమున హస్తినలో పాండవుల చారుడుగా పనిచేసే వారిని మృత్యు ముఖము నుండి కాపాడినాడు. ఆ విదురుడే ధర్మరాజును తీసుకొని వెళ్ళుటకు ఇంద్ర ప్రస్థమునకు వచ్చినాడు. మాయాజూదమున రాజ్యమును అపహరించవలె ననేడి దుర్యోధనుని కుట్ర విదురునకు స్పష్టముగా తెలియును. ధర్మరాజు "జూదంబు కార్యంబు చెపుము", అని విదురుని అడిగినాడు. విదురుడు సలహా చెప్పకముందే హస్తినకు బయలుదేరినాడు.
    రాజసూయమును దిగ్విజయముగా నిర్వహింపచేసినవాడు శ్రీకృష్ణుడు. ద్వారకకు పయనమగుచు శ్రీకృష్ణుడు "అప్రమత్తుడవై ప్రజపాలనము చేయుము" అని ధర్మరాజును హెచ్చరించినాడు. "నిన్ను విడిచి మేము నిముషమయిన నిలువజాలము" అన్నాడు  చెప్పాడు ధర్మరాజు. ధర్మరాజు శ్రీకృష్ణుని హెచ్చరికను లెక్కచేయలేదు. ప్రమత్తుడయి జూడమునకు ఉరికినాడు. కొంతకాలము ఆగి శ్రీకృష్ణుని సంప్రదించవచ్చును కదా! అదియును చేయలేదు.
    పాండవులు ఇంతవరకు స్వంత నిర్ణయములు చేయలేదు. కొంతకాలము విదురుడు, కొంతకాలము వ్యాసుడు, తరవాత శ్రీకృష్ణుడు వారిని రక్షించినారు.
    ద్రౌపది వివాహము వరకు మాతృభక్తులయిన పాండవులు ఆమెను వెనుకకు తోసినారు. కుంతి అచటనే ఉండవలె. ఆమెను సహితము సంప్రదించవలెను.
    నలుగురిని సంప్రదించక ఒకడు నిర్ణయించు కార్యము ప్రమాదకరము. అయినను ధర్మరాజు ఎవ్వరిని సంప్రదించక జూదమాడుటకు నిర్ణయించి హస్తినకు ఉరికినాడు.
    ఇది మానవ దోషము. దైవ దోషము కాదు.
    ధర్మరాజునకు జూదపు బలహీనత ఉన్నది. అది ఎరిగియే దుర్యోధనుడు ఉచ్చు పన్నినాడు. దశరధునకు ఉన్న ఒకానొక బలహీనత వలననే కైక శ్రీరాముని అడవులకు పంపగలిగినది.
    ధర్మరాజు బలహీనతకు అతి సామాన్యునివలె ఆత్మార్పణము చేసినాడు. ఏమాత్రము నిగ్రహము ప్రదర్శించలేక పోయినాడు.
    జూదము ఆనాటి ప్రధాన వినోదముగా కనిపించుచున్నది. దానికి యుద్దమునకు ఉన్నంతటి ప్రాధాన్యతను ఇచ్చినారు. అందుకు ఒక శాస్త్రము కూడా ఉన్నదని చెప్పబడినది. జూదమునకు పిలిచిన కాదనరాదు అంటాడు ధర్మరాజు. అతనిని స్నేహ జూదమునకు పిలచినారు. అతడు పందెపు జూదమేల అడవలెను?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.