Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



        అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ |
        యుయో ధ్యస్మజ్జుహు రాణమేనో భూయిష్ఠాతే నమ ఉక్తిం విధేమ ||

                                         అయిదవ ప్రపాఠకము

                                        మొదటి అనువాకము

        (4 - 12 నందలి త్వష్ట కథకు ఇది పూర్వభాగము.)

    1. త్వష్ట పుత్రుడు విశ్వరూపుడు. అతడు దేవతలకు పురోహితుడు అయినాడు. అతడు అసురులకు మేనల్లుడు. విశ్వరూపునకు మూడు తలలు కలవు. అతడు ఒక దానితో సోమపానము చేసినాడు. రెండవ దానితో సురాపానము చేసినాడు. మూడవ దానితో అన్నము తినువాడు.

    విశ్వరూపుడు ప్రత్యక్షముగా దేవతలకు హవిస్సు అర్పించమని చెప్పినాడు. పరోక్షముగా అసురులకు హవిర్భాగము అందించమని చెప్పినాడు. అందరి ముందు ఒకమాట చాటుగా ఒకమాట చెప్పువాని విషయము నమ్మకము కలుగకుండును.

    విశ్వరూపుడు అట్లు చెప్పుటవలన ఇంద్రునకు అనుమానము కలిగినది. అతడు స్వామి ద్రోహము చేయుచున్నాడనియు, దేశమును అన్యులకు వప్పగించగలడనుకున్నాడు. ఇంద్రుడు తనవజ్రాయుధముతో విశ్వరూపుని మూడుతలలు నరికినాడు.

    అట్లు నరుకబడిన తలలో సోమము త్రావినది కముజు పుట్ట కల్లుత్రాగినది పిచ్చుక - అన్నము తినునది తీతువు అయినవి.

    2. ఇంద్రుడు విశ్వరూపుని హత్య చేసినాడు. ఆ బ్రహ్మహత్యాపాతకమును తన దోసిట పట్టి సంవత్సరకాలము భరించినాడు. సకల ప్రాణులు ఆ ఇంద్రుని బ్రహ్మహస్త అని ఆక్రోశించినవి.

    3. ఇంద్రుడు భూమి వద్దకు పోయినాడు. తన బ్రహ్మహత్యా పాపపు మూడవభాగము తీసికొనవలసినదని కోరినాడు.

    ఇంద్రుడా! జనులు నన్ను స్వేచ్చగా త్రవ్వుచున్నారు. అందువలన నేను బాధలు పడుచున్నాను. కావున అట్లు జనులు త్రవ్విన గుంతలు సంవత్సరము లోపల నిండవలెను. అందువలన నా బాధలు తగ్గును అని భూమి అన్నది.

    సంవత్సరమున కన్న పూర్వపువి అయినను జనులు త్రవ్విన గుంతలు నిండునట్లు వరము ఇచ్చుచున్నాను అన్నాడు ఇంద్రుడు. ఆ వరము పొందిన భూమి ఇంద్రుని పాపమునుండి మూడవ భాగమును తీసికొన్నది.

    ఆ విధముగా ఇంద్రుని నుండి భూమి గ్రహించిన బ్రహ్మహత్య పాతకపు మూడవభాగము భూమి మీద ఊషరక్షేత్రమైనది. కావున శ్రద్ధగల ఆహితాగ్ని పరుడు తనంతటతాను ఊషరక్షేత్రమున నివసించరాదు. అది బ్రహ్మహత్యారూపము అగును కదా!

    4. ఇంద్రుడు వృక్షముల వద్దకు పోయినాడు. తన బ్రహ్మహత్యాపాపము యొక్క మూడవభాగము తీసికొనవలసినదని కోరినాడు.

    ఇంద్రుడా! మమ్ములను కొట్టిన చోట మాకు బాధకలుగుచున్నది. మాకు అట్టి బాధకలుగకుండునట్లు వరము ప్రసాదించుము అని చెట్లు కోరినవి.

    ఇంద్రుడు ఆ వరము ఇచ్చినాడు. చెట్టును కొట్టిన చోట మరిన్ని మొలకలు మొలుచును అని చెప్పినాడు. చెట్లకు వరము లభించినందున అవి ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకము నందలి మూడవ భాగమును తీసికొన్నవి. ఆ బ్రహ్మహత్యా పాతకము చెట్లనుండి వెడలి ఘనీభూతమగు రసము అయినది.

    అందువలన చెట్టు నుండి రసముగా ప్రవహించి ఘనీభవించిన భాగమును భుజించరాదని నిషేధము. అది బ్రహ్మహత్యారూపము అగును కదా!

    కాని అట్లు ఛిన్నప్రదేశము నుండి వెలువడి ఘనీభవించిన లోహిత వర్ణ పదార్థము మాత్రమే తినరానిది. ఇతర విధమగు నిర్యాసము నిషేధము కాదు.

    5. ఇంద్రుడు స్త్రీల వద్దకు వెళ్లినాడు. తన బ్రహ్మహత్యా పాపము యొక్క మూడవ భాగము తీసికొనవలెనని కోరినాడు.

    ఇంద్రుడా! మేము రుతుసంబంధమగు వీర్యము వలన సంతానమును పొందుచున్నాము. మాకోరికననుసరించి ప్రసవము వరకు పురుషుని కలుసుకొనునట్లు వరము ఇమ్ము అని అడిగినారు.

    ఇంద్రుడు ఆ వరము ఇచ్చినాడు. అందువలననే స్త్రీలకు రుతు సంబంధ వీర్యము వలన సంతానము కలుగుచున్నది. వారు ప్రసవ పర్వంతము పురుషునితో సంగమించుచున్నారు. అప్పుడు స్త్రీలు బ్రహ్మహత్య యొక్క మూడవ భాగమును తీసుకొన్నారు.

    బ్రహ్మహత్య యొక్క మూడవభాగము స్త్రీల రజస్వల అయినది. అందువలన రజస్వల అయిన స్త్రీతో మాట్లాడరాదు. ఆమెతో సహా కూర్చుండరాదు. ఆమెతో అన్నము తినరాదు. స్త్రీ యొక్క రజస్వల బ్రహ్మహత్యకదా!

    కొందరు దీనికి పక్షాంతరము చెప్పుదురు. స్త్రీలకు స్నానము అన్నము వంటిది. కావున స్నానము చేయరాదనియు, మిగిలినవి వారి ఇష్టమని నిర్ణయించినారు.

    6. రజస్వలయైన స్త్రీ సంభోగము వలన ఆమెకు మిథ్యాపవాదు కలవాడు పుట్టును.

    రజస్వలయై అరణ్యము నందు సంభోగించిన దానికి దొంగ పుట్టును.

    రజస్వలయై సిగ్గుచే మాట్లాడు దానికి సంభోగము వలన సిగ్గుపడు వాడు పుట్టును.

    రజస్వలయై స్నానము చేయు దానికి సంభోగము వలన మరణశీలుడు పుట్టును.

    రజస్వలయై తైలాభ్యంజనము చేయుదానికి సంభోగము వలన కుష్ఠురోగి పుట్టును.

    రజస్వలయై బొమ్మలు గీయు దానికి సంభోగము వలన కేశశూన్యుడు, అపమరణ యుక్తుడు జన్మించును.

    రజస్వలయై కంటికి కాటుక పెట్టుకొను దానికి సంభోగము వలన గ్రుడ్డివాడు పుట్టును.

    రజస్వలయై పండ్లుతోము కొను దానికి సంభోగము వలన మలినదంతుడు పుట్టును.

    రజస్వలయై గోళ్లను కత్తిరించుకొను దానికి సంభోగము వలన పిప్పగోళ్ల వాడు పుట్టును.

    రజస్వలయై గడ్డి కోయుచున్న దానికి సంభోగము వలన నపుంసకుడు పుట్టును.

    రజస్వలయై త్రాడు పేనుచున్న దానికి సంభోగము వలన ఉరిపెట్టుకొని చచ్చువాడు పుట్టును.

    రజస్వలయై ఆకుతో నీరు త్రాగు దానికి సంభోగము వలన పిచ్చివాడు పుట్టును.

    రజస్వలయై కాలిన మట్టి మూకుడులో నీరుత్రాగు దానికి సంభోగము వలన పొట్టివాడు పుట్టును.

    రజస్వలయై సంతాన రక్షణకోరు స్త్రీ మూడు రాత్రులు వ్రతమును ఆచరించవలెను. దోసిలితో గాని, పచ్చిమట్టి మూకుడుతో గాని నీరు త్రాగవలెను.

    ఆలోచనామృతము

    1. మానవుడు స్వేచ్చాజీవి. స్వార్థపరుడు. నిరంకుశుడు. తమ తమ స్థాయిలలో ఇది అందరకు వర్తించునది.

    మానవుడు సంఘజీవి. అతని బ్రతుకునకు ఎంతమంది సాయమో కావలెను. నీరు త్రాగుటకు మాత్రమునకు 1. నీటి వనరు ఏర్పరచువాడు 2. నీరుతెచ్చువాడు. 3. పాత్ర చేయువాడు 4. నీరు అందించువాడు కావలసి ఉన్నారు.

    మానవులందరు కొంత స్వేచ్చవదులు కొని నిబంధనలకు లొంగి ఉండునట్లు చేసిననే మానవుడు జీవించగలడు. ఈనాటి మనిషి - తనకు తెలియకనే - కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నాడు.

    మానవుని ఈ దశకు తెచ్చుటకు ఎన్ని యుగములు, ఎన్ని పరిశోధనలు, ఎందరు మహానుభావుల త్యాగములు అవసరమైనవో! ఇందుకు వేదము ఎంతగానో తోడ్పడినది అనుట నిర్వివాదాంశము.

    ఎంతటి పరిశ్రమ వలననో మానవ సంబంధములు, కుటుంబము స్థిరపడినవి. ఈ యాంత్రిక నాగరకత మానవ సంబంధములను కకావికలు చేసి మనిషిని మొదటికి తెచ్చుచున్నది. ఈ విషయము ఎల్లరు గ్రహించుచున్నారు. అయినను అందరు నిస్సహాయులైనారు.

    2. ఈ కథ ఎంత సొగసుగా చెప్పినాడు! మానవుని బలహీనతలను ఎంత సూక్ష్మముగా పరిశీలించినాడు! చెప్పావలసినది చాలా ఉన్నది. స్థలము సమయము నియంత్రించుచున్నవి.

    మానవ సమూహములు మంచి కొరకు ఏర్పడినవి. సామూహిక జీవనము, పరస్పర అవగాహనకు అవి ఏర్పడినవి. మానవులు, దేవతలు, రాక్షసులు ఇట్టి తెగలు.

    విశ్వరూపుడు త్వష్టయను దేవత పుత్రుడు. అతడు అసురులకు మేనల్లుడు అయినాడు. అతడు ఉభయుల పక్షము వహించ వలసి వచ్చినది. అదియే ప్రమాదమునకు దారి తీసినది.

    మన పూర్వులు ఆంతరసామూహిక సంబంధములనే కాని బాహిరసామూహిక సంబంధములను నిషేధించుట ఎంతో ఆలోచించి చేసిన నిర్ణయము. అనాలోచితముగా దానిని మనము విడిచినాము. అనుభవించుచున్నాము.

    ఏది చేసినను నేరుగా చేయవలెను. చాటుగా చేయరాదు. విశ్వరూపుడు చాటుగా చేసినాడు. ఇంద్రుని వలన శిక్ష అనుభవించినాడు.

    శిక్షించిన ఇమ్దుడు శిక్ష ఎందుకు అనుభవించినట్లు? ఇంద్రుడు తన సమూహపు రక్షణకు విశ్వరూపుని వధించినాడు. ఇది విశ్వశ్రేయస్సు కాదు. అందువలన సంవత్సరము శిక్ష అనుభవించినాడు. అపఖ్యాతి పాలైనాడు.

    ఇంద్రుడు తన తెగను రక్షించుటకు శిక్ష విధించినది నిజము. కాని అతడు వంచనను శిక్షించినాడు. ఇది విశ్వశ్రేయకము. అందువలననే భూమి, వృక్షము, మాతృమూర్తి అతనికి సహకరించినారు!

    వరములు ఎంతబాగున్నవి! భూమిలో ఏర్పడిన గుంతలను పూడ్చవలెను. నేడు సహితము గనులు త్రవ్వినపుడు పూడ్చవలెనను శాసనము ఉన్నది. అది చేయనందుకే భూకంపము.

    కొట్టిన చెట్టునకు కోకొల్లలుగ పిలకలు మొలవకున్న ప్రాకృతిక సంపద నిలువజాలదు. నేటి సైంటిస్టు చెట్లన్నింటిని కొట్టి చెట్టు విలువ తెలుసుకున్నాడు. కాని సమాజము సైంటిస్టు అధీనమున లేదు. స్వప్రయోజన పరులు చెట్లను ఎదగనీయుట లేదు.

    3. స్త్రీ మాతృస్వరూపిణి. ఆమెకు సంబంధించిన ప్రధాన విషయములు ఇచట చెప్పబడినవి.

    ఆధునిక పరిశోధన వెర్రితలలు వేయుచున్నది. పాలపొడి పెత్తందార్ల కింద నలిగిన పరిశోధన దశాబ్ధముల తరువాత తల్లిపాలు మంచివని తేల్చినది. కుక్క, పిల్లి, పంది వంటి జంతువులకు సహజముగా తెలిసిన దానికి పరిశోధనలు! "మాతృస్తనావివశిశోరమృతాయమౌనౌ" శ్రీ వేంకటేశ్వరుని పాదద్వయము శిశువులకు స్తన్యము వలె అమృతాయమానమగును.

    సంభోగ సమయమున స్త్రీ యొక్క మానసిక పరిస్థితి మీద సంతానము భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువలన స్త్రీ జాతి సంతోషముగా ఉండవలెననియే "యాత్ర నార్యస్తు పూజ్యంతే" అను ఆర్యోక్తి. ఇందుకు సంబంధించి ఒక భారత వృత్తాంతము ఉన్నది.

    భరతవంశము అంతరించుచున్నది. సత్యవతి వ్యాసుని తలచినది. అతను వచ్చినాడు. ఆమె వ్యాసుని తన కోడండ్లకు సంతానము కలిగించమన్నది. అతడు అంగీకరించినాడు. ఆమె వ్యాసుని అంబిక వద్దకు పంపినది. వ్యాసుని చూచి అంబిక భయమున కనులు మూసుకున్నది. ఆమెకు గ్రుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టినాడు. అంబ వ్యాసుని కూడినపుడు భయమున పాలిపోయినది. పాండు రాజు పాండు రోగముతో పుట్టినాడు.

    సంతానమునకు స్త్రీల మనసు ఎంతో ముఖ్యమని గమనించవలెను.

                                    రెండవ అనువాకము

    1. ఈ లోకములను ఆక్రమించినందున వృత్రునకు ఆ పేరు కలిగినది.

    2. ఇంద్రుడు ప్రజాపతి వద్దకు వెళ్లినాడు. నాకు శత్రువు పుట్టినాడు అని విన్నవించినాడు. ప్రజాపతి మంత్రజలమున వజ్రమును తడిపినాడు. ఈ వజ్రము చేత శత్రువును వధించుము అని ఇంద్రుని చేతికి ఇచ్చినాడు. ఇంద్రుడు ఆ వజ్రమును అందుకొని బయలు దేరినాడు.

    3. వజ్రముతో ఉన్న ఇంద్రుని చూచి "ఇంద్రా! మేము వృత్రుని ముఖమునందున్నాము. వృత్రుని వధించకుము" అన్నాడు అగ్ని సోములు.

    "మీరు నాకు సంబంధించిన వారు. నావద్దకురండి" అని ఇంద్రుడు అన్నాడు.

    "అట్లయిన మాకు హవిర్భాగములను ఏర్పరుచుము" అని అగ్ని సోములు ఇంద్రుని అడిగినారు.

    పూర్ణమాసి యాగమందు అగ్ని సోములకు కూడా దశకపాల పురోడాశమును ఇంద్రుడు ఏర్పరచినాడు.

    4. 'ఇంద్రా! మేము వృత్రుని నోటిలో ఉన్నాము. అతని దంతముల క్రింద నాలుగుచున్నాము. రాలేకున్నాము' అన్నారు అగ్ని సోములు.

    అది నిన్న ఇంద్రుడు చలిజ్వరమును, తరువాత కలుగు తాపమును పుట్టించినాడు. ఇది శీతజ్వర, తాపముల జన్మవృత్తాంతము. ఈ విషయములు తెలిసిన వానికి శీతజ్వర తాపములు ఉండవు.

    ఇంద్రుడు ఈ శీతజ్వర తాపములను వృత్రుని మీద ప్రయోగించినాడు. శీతజ్వర బాధలో ఉన్న వృత్రుని ముఖము నుండి అగ్ని సోములు బయటపడినారు.

    5. అప్పుడు వృత్రుని ప్రాణ, అపానములు విడిచినవి. ప్రాణము దక్షశబ్దవాచ్యము. అపానము క్రతుశబ్ద వాచ్యము. కావున యజమాని క్రతువునందు 'నాకు దక్షక్రతువులు కలుగును గాత' అను మంత్రమును ఉచ్చరించవలెను. అందువలన యజమానికి ప్రాణ, అపానములు, దీర్ఘఆయువు కలుగును.

    6. ఇంద్రుడు ఆ విధముగా అగ్ని సోములను వృత్రుని నోటినుండి విడిపించినాడు. పూర్ణిమనాడు వృత్రహనన హేతువగు ఆజ్యభాగ హవిస్సును ఆర్జించినాడు. ఈ వృత్రాంధకారమును పూర్ణిమ ధ్వంసము చేయుచున్నది. అమావాస్యనాడు అంధకారము తిరిగి ఆవరించుచున్నది. అందువలన పూర్ణిమనాడు వృత్ర హనన సంబంధమగు "అగ్నిర్వృత్రాణి....." అను ఋక్కును - అమావాస్యనాడు "కవిర్విప్రేణ......." అను ఋక్కును పఠించవలెను.

    7. ఇంద్రుడు వృత్రహనన హేతువగు ఆజ్యరూపమును సంపూర్ణము చేసినాడు. వజ్రమును అందుకున్నాడు. వృత్రుని మీదకుసాగినాడు.

    "వృత్రుడు పృథివి నుండి దివి వరకు వ్యాపించియున్నాడు. అతనిని వధించవలదు" అని ద్యావాపృథ్వులు అన్నవి. అందుకు ఇంద్రుడు సుముఖుడుగా లేడని గ్రహించి వరములు అడిగినవి. నేను నక్షత్రములతో కూడుకొని ఉండవలెనని దివి కోరినది. నేను మనుష్య, పశు, వృక్ష, నగ, నదీ, సముద్రాది విచిత్ర అలంకారము కలదానిని కావలెనని భువి కోరినది. ఇంద్రుడు వారికి ఆ వరములను ఇచ్చినాడు. అందువలననే దివి నక్షత్రాలంకృతమును, భువి చిత్ర, విచిత్ర అలంకృతయు అయినవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.