Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                   జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                 ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                           ఇరువది అయిదవ అధ్యాయము

1.    శాదం దద్భిరవకాం దన్తమూలైర్మృదం బర్స్యైస్తేగాం దంష్ట్రాభ్యం సరస్వత్యా అగ్రజిహ్వం జిహ్వాయా ఉత్సాదమన క్రన్దేవ తాలువాజం హనుభ్యామప ఆస్యేన వృషణమాణ్డాభ్యామాదిత్యాం శ్మశ్రుభిః పన్థానం భ్రూభ్యాంద్యావాపృథివీ వర్తోభ్యాం విద్యుతం కనీనకాభ్యాం శుక్లాయస్వాహా కృష్ణాయస్వాహా పార్యాణి పక్ష్మాణ్యవార్యాఇక్షవ్కోవార్యాణి సార్యాఇక్షమః

    దంతములచే శాదదేవతను, ఇగుళ్లచే భవక దేవతను, దంతముల వెనుక భాగముచే మదదేవతను, దంష్ట్రములచే తేగదేవతను, జిహ్వాగ్రమున సరస్వతిని, జిహ్వచే ఉత్సాదుని, తాలువులచే అవక్రందుణి, హనువులచే వాజమును, ముఖముచే జలదేవతలకు ముదము చేకూర్చదును.

    అండకోశములచే వరుణదేవునకు, గడ్డపు వెంట్రుకలచే ఆదిత్యులకు, మీసములచే పన్థానం, కనుబొమలచే ద్యావాపృథ్వులకు, కంటిపాపలచే విద్యుత్తులకు ముదము కలిగింతును.

    శుక్లాయ స్వాహా. కృష్ణాయస్వాహా.

    నేత్రలోమములు, కంటిరెప్పలు పారదేవతాకములు. అవార్యాణి పక్ష్మాణి.

    2. అశ్వపు ప్రాణమున వాయువును, అపానమున నాసికను, క్రిందిపెదవిచే ఉపయామమును, పై పెదవిచే సత్తును, పైకాంతిచే అంతరమును, దిగువ కాంతిచే బాహ్యమును, మూర్ధమున నివేష్యమును, తలలోని మెదడుచే స్తయత్నను, మస్తిష్కమున అశ్వినులను, కనీనికములచే విద్యుత్తును, కర్ణములచే శ్రోత్రమును, శ్రోత్రములచే కర్ణములను, నిమ్న కంఠముచే తేదనిని, శుష్కకంఠమున జలమును, మెడవెనుక ఉండు మన్య నాడులచే చిత్తమును సంతోషపెట్టుదును.

    అదితిని శీర్షమునమ్ నిర్జల్పమున నిరృతిని, సంక్రోశమున ప్రాణమును, స్తుపమున రేష్మణమును ఆనందపరతును.

    3. మశకములచే వెంట్రుకలను, స్వపసమున ఇంద్రుని, దుముకుట వలన బృహస్పతిని, ఖురముల కూర్మమును, స్థూలగుచ్ఛములచే ఆక్రమణమును, నాడులచే కపింజలమును, జంఘలచే జవమును, బాహువులచే అధ్వానమును, మోకాళ్లచే అరణ్యమును, ఊరువులచే అగ్నిని, భుజములచే పూషను, స్కంధములచే అశ్వినులను, స్కంధగ్రంధులచే రుద్రుని ఆనందింపచేతుము.

    4. (గుర్రపు ప్రక్క టెముకలను 'వంక్రి' అందురు. అవి ఒకవైపు 13 మరొకవైపు 13 ఉండును. ఇది వాటి దేవతానిరూపణ)

    అగ్నికి మొదటివంక్రిచే, వాయువునకు క్రింద వంక్రిచే, ఇంద్రుని మూడవ దానిచే, సోమమును నాలుగవ దానిచే, అదితికి అయిదవ దానిచే,  ఇంద్రాణిని ఆరవదానిచే, మరుత్తులను ఏడవదానిచే, బృహస్పతిని ఎనిమిదవ దానిచే, ఆర్యమను తొమ్మిదవ దానిచే, ధాతను పదవదానిచే, ఇంద్రుని పదకొండవ దానిచే, వరుణుని పన్నెండవ దానిచే యముని పదమూడవ వంక్రిచే ప్రీతులను చేయుదుము.

    5. (రెండవ ప్రక్కనుంచి)

    ఇంద్రాగ్నులను తొలివంక్రిచే, సరస్వతిని రెండవదానిచే, మిత్రుని మూడవ దానిచే, నిరృతిని నాలుగవ దానిచే, అగ్ని, సోములను అయిదవ దానిచే, సర్పములను ఆరవదానిచే, విష్ణువును ఏడవదానిచే, అగ్ని, సోములను అయిదవ దానిచే, సర్పములను ఆరవదానిచే, విష్ణువును ఏడవదానిచే, పూషను ఎనిమిదవ దానిచే, త్వష్టను తొమ్మిదవ దానిచే, ఇంద్రుని పదవ దానిచే, వరుణుని పదకొండవ దానిచే, యముని పన్నెండవ దానిచే, జలమును పదమూడవ దానిచే ప్రీతులను చేతుము. ద్యావాపృథివ్యో దక్షిణం పార్శ్వం విశ్వేషా దేవానాముత్తరం.

    6. (అథాంగాంతరాణాం దేవతా ఆహ)

    మరుత్తులకు స్కంధములచే, విశ్వేదేవతలకు ప్రథమకీకసముచే, రుద్రులకు రెండవదానిచే, ఆదిత్యులకు మూడవ దానిచే, అగ్ని సోములను నితంబములచే, కుంజమును శ్రోణులచే, ఇంద్రబృహస్పతులను ఊరువులచే. మిత్రావరుణులను ఊరుసంధులచే, ఆక్రమణమును నితంబస్థూలభాగముచే, బలమును నితంబస్థ కూపకులచే సంప్రీతులను చేయుచున్నాము.

    7. పెద్దపేగులచే పూషను స్థూలగుదమున అంధసర్పములచే నిహుతుని, హస్తిచే జలమును, అండకోశములచే వృషణుని, శేఫమున వాజిని, రేతస్సుచే ప్రజను, పిత్తకోశమున  చాషుని, పాయువున ప్రదరుని, విష్ఠపిండములచే కూశ్మానమును సంప్రీతులను చేయుచున్నాము.

    8. ఇంద్రుని క్రోడమున, అదితిని పాజస్యమున, దిశలను జత్రువున, ఆదిత్యులను భసతమున, జీమూతమును హృదయస్థ మాంసమున, అంతరిక్షమును ఆంత్రమున, నభమును హృదయస్థ మాంసమున, చక్రవాకములను మతస్నాయువులచే, దివమును వృక్కమున, గిరిని నాడ్యగ్ర భాగములచే, ఉపలములను ప్లీహమున, వాల్మీకములను క్లోమమున, గుల్మములను నవనాడులచే, స్రవంతులను హిరములచే, హ్రదములను కుక్షులచే, సముద్రమును జఠరమున, వైశ్వానరుని భస్మమున సంప్రీతులను చేయుచున్నాము.

    9. నాభిచే విధృతిని, రసమున ఘృతమును, పక్వాన్ని రసమున జలమును వసాబిందువులచే మరీచులను, శరీరగత ఊష్మమున నీహారమును, వసచే శీనమును. బాష్పములచే పృష్వను, కంటిపుసులచే హ్లాదునిని, రుధిరమున రాక్షసులను, అనుక్త అంగముల చిత్రదేవులను, రూపమున నక్షత్రములను, చర్మమున పృథివిని ఆనందపరచుచున్నాము. జుమ్భకాయ స్వాహా.

    10. హిరణ్య గర్భః సమవర్తతాగ్రే భూతస్యజాతః పతిరేక ఆసీత్|
    సదాధార పృథివీం ద్యాముతేమాం కస్మైదేవాయ హవిషా విధేమ ||

    23-1 చూడగలరు.

    11. యః ప్రాణతో నిమేషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ|
    య ఈశే అస్యద్విపద శ్చతుష్పదః కస్మైదేవాయ హవిషా విధేయ ||

    23- 3 చూడగలరు.

    12. ఎవని మహిమకు ప్రతీకగా ఈ హిమవత్పర్వతము ఈ హిమవత్పర్వతము నిలిచి ఉన్నదో, ఎవని మహిమను నదుల సహితముగ సముద్రము గానము చేయుచున్నదో, ఎవని భుజములు ఈ విశాల దిశలగునో అట్టి ప్రజాపతికి హవిస్సులు అర్పించుచున్నాము.

    13. ఎవడు ఆత్మను, బలమును ప్రసాదించువాడో, ఎవని శాసనమున సకల విశ్వములు ప్రవర్తిల్లునో, ఎవని ఆజ్ఞను సకలదేవతలు అనుసరింతురో, ఎవని కరుణ అమృతస్వరూపమగునో, ఎవని క్రోధము మృత్యువగునో అట్టి ప్రజాపతికి హవిస్సులు అర్పించుచున్నాము.

    14. సకల దిశలందు మమ్ము ఆహింసితులను, అనాక్రాంతులను చేయునదియు, శత్రుభేదకమును, శుభప్రదమును అగు యజ్ఞము మాకు లభించును గాత. దేవతలు మాకు సదా అభ్యుదయము కలిగింతురు గాథ. వారు అప్రమత్తులై ప్రతినిత్యము మమ్ము రక్షింతురు గాత.

    15. దేవతల శుభప్రదమగు సహృదయము మా విషయమున మరింత నిజమగును గాత. మాకు సదా దేవతల దానము లభించును గాత. మేము నిత్యము దేవతల స్నేహ పాత్రులము అగుదుము గాత. మాజీవనమునకు గాను దేవతలు మా ఆయువులను మరింత పొడిగింతురు గాత, "దేవా న ఆయుః జీవసే".

    16. ప్రాచీనస్తుతులచే మేము భగుని, మిత్రుని, అదితిని, అహింసక దక్షుని ఆహ్వానించుచున్నాము. వారితో ఆర్యను, వరుణ, సోమ అశ్వినులను కూడ  ఆహ్వానించుచున్నాము. సుభగ సరస్వతి మాకు శుభములు కలిగించవలెను.

    17. వాయుదేవత ఔషధము వంటి గాలిని సుఖకరమగునట్లు వీచును గాత. తల్లిభూమి తండ్రి ద్యులోకము అట్లే చేయుదురు గాత. సోమాభిషావకములు, సుఖస్థానములగు శిలలు మాకు అవే సుఖసంతోషములను కలిగింతురు గాత. అశ్వినులారా! మీరు స్వచ్చందముగా మాకు ఆ సుఖ సంతోషములనే కలిగించండి.

    18. అతడు ఈశానుడు. సమస్త జగత్పతి. బుద్ధిని వికసింపచేయువాడు. సకల ఐశ్వర్య వంతుడు. అతనినే - అతనినే మేము ఆహ్వానించుచున్నాము.

    పూష మా ధనములను వృద్ధి పరచును. అతడే రక్షక, పాలక, అనుపహింసిత పూష మాకు శుభములు కలిగించవలెను.

    19. స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః |
    స్వస్తి నస్తార్క్ష్యోఅరిష్టనేమిః స్వస్తినో బృహస్పతి ర్దధాతు ||

    20. పృశ్నిమాతరములగు పృషదశ్వములు శుభగతులు - యుద్ధమునకు సాగువారు మా యజ్ఞమునకు విచ్చేయవలెను. అగ్ని జిహ్వులు, ఆలోచనాపరులు, సూర్య ప్రకాశులగు మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను. తమ సకల రక్షణలచే విశ్వేదేవతలు మా యజ్ఞమును విచ్చేయవలెను.

    21. దేవతలారా! భద్రం కర్ణేభిః శ్రుణుయామ. యజనీయ దేవతలారా! భద్రం పశ్యేమ అక్షిభిః | మా సర్వాంగములు స్థిరములు కావలెను. మేము సదా దేవతలను స్తుతించు చుండవలెను. దేవతలు ప్రసాదించిన ఆయువు మా దేములందు నిలువ వలెను.

    22. దేవతలారా! శతశరత్తులు గడిచిపోవును. ఈ వ్యవధి లోనే మా దేహములకు వార్ధక్యము ఏర్పరచినారు. అప్పుడే మా పుత్రులు తండ్రులగుదురు. జీవన యానపు ఆయువును మధ్యలో త్రుంచకండి.

    (జరసం తనూనామ్, వార్థక్యము దేహమునకు మాత్రమే! పుత్రాసో యత్ర పితరో భవంతి, తన కొడుకులు తండ్రులైనప్పుడు వార్థక్యము)

    23. అదితి ద్యులోకమగును. అదితి అంతరిక్షమగును. అదితి తల్లియగును. అదితి తండ్రియగును. అదితి పుత్రుడగును. అదితి విశ్వే దేవతలగును. అదితి పంచమానవులగును. ఇంత ఏల అదితియే స్పష్టి. అదితియే ప్రజనన శక్తి. అదితర్జాత మదితిర్జనిత్వమ్.

    24. అశ్వము దేవభూతము. సర్పణశీలము. అట్టి అశ్వమును మేము యజ్ఞమున వర్ణించుచున్నాము. కావున మిత్రా వరుణులు, ఆర్యమ, వాయు, ఇంద్ర, ఋభుక్ష, మరుత్తులు మమ్ము నిందించరాదు.

    25. అశ్వము స్నానమున పరిశుద్ధమైనది. ధనముచే కప్పబడినది. ఆజ్యసక్తు, ధనధాన్యాదుల సహితముగా అశ్వము ముందు సాగినది. ఆ వంటల పరిమళమునకు వెనుక వచ్చుచున్న ఇంద్ర పూషాదులకు ప్రియ భక్ష్యమును, మేమే అను - మేక ముందుకు ఉరుకుచున్నది.

    26. ఈ మేక పూష దేవత యొక్క భాగము. విశ్వేదేవతల హితకర్త. వేగవంత అశ్వము మేకను తన  ముందుకు తెచ్చుకొనును. అప్పుడు ప్రజాపతి త్వష్ట దేవతలకు ప్రియమైనదియు, ప్రథమ దేయమును అయిన మేకను అశ్వము దగ్గరకు చేర్చును.

    27. అశ్వము హవిర్భూత. ప్రతి ఋతువున దేవయాన పథగామి. ముగ్గురు మానవ హోతలు కుశములచే నీళ్ళు చల్లి అశ్వమును పవిత్రము చేయుదురు. అప్పుడు, పూషకు ప్రథమ యజ్ఞ భాగమగు  మేక తన పలుకుణ దేవతలకు యజ్ఞ సూచన ఇచ్చును. ముందునకు వచ్చును.

    28. హోతలారా! అధ్వర్యులారా! ప్రతిపస్థాతలారా! అగ్నిమిన్ధులారా! గ్రావస్తోతలారా ! ప్రశస్తలారా! బ్రహ్మ! ఈ అశ్వమేధము సులక్షణ అలంకృతము, సమ్యక్ హుతము. ఈ యజ్ఞపు పయో, దధి, పయస్య, పురోడాశాదులను దానము చేయండి.

    29. యూపము కొరకు చెట్టు కొట్టిణ వారున్నారు. కొట్టిన చెట్టును మోసిన వారున్నారు. యూపపు అగ్ర భాగమున కట్టవలసిన ముక్కలను చెక్కినవారున్నారు. అశ్వము కొరకు చేయవలసిన వంటకు కట్టెలు చేర్చినవారున్నారు. వారందరి శ్రమ ఈ యజ్ఞమును సఫలము చేయును గాత.

    30. పూజ్యమగు ఈ యజ్ఞఫలము నాకు లభించినది! ఆ యజ్ఞ ఫలము నాలో చేరినది. ఈ  అశ్వము దేవతల ఆశలను సఫలము చేయును గాత. దీనివలన విద్వాంసులు, ఋషులు ఆనందింతురు గాత. ఈ అశ్వము దేవతలకు  పుష్టి కలిగించుటకు వారికి బంధువగును గాత.

    31. వేగవంత అశ్వపు త్రాడు, దాని జీను, తలకు కట్టిన త్రాడు, నోటికి వేసిన కళ్ళెము, దాని గడ్డి మున్నగునవి ఇక  దేవతలకు చేరును గాత.

    32. ఈగలు ముసిరిన అశ్వమాంసము. నరుకునపుడు కత్తికి అంటిన అశ్వమాంసము. కసాయి వాని చేతులకు, గోళ్ళలో చేరిన అశ్వమాంసము ఇక దేవతలకు చేరును గాత.

    33. అశ్వపు పేగులందు సగము అరిగిన గడ్డి ఉండును. అది కోసినంత బయటపడును. పచ్చి మాంసము వాసన ఉండును. దానిని కోయునట్టి పుణ్యాత్ములు వానిని శుభ్రము చేయవలెను. వంటవారు అశ్వపు మేధ మున్నగు మాంసమును, కరిగిపోకుండ, పచ్చి లేకుండ, వండవలెను.

    34. అశ్వమాంసము, నిప్పు మీద బాణలిలో వండినపుడు నెల మీద పడును. అది నెలపాలయినట్లు కాని, గడ్డిగాదమున కలసినట్లుగాని కాదు. అది సాంతము దేవతలకు చేరినది.

    (భూమి దేవతయే కదా!)

    35. అశ్వమాంసము ఉడుకునపుడు ఆహా! ఎంత మంచి పరిమళము అనువారుందురు. ఉడికినది తీసికొని పొండు అనువారుందురు. మాంసపు భిక్ష అడుగువారుందురు. వారందరి సంకల్పములు మా యజ్ఞమును సఫలము చేయవలెను.

    36. మాంసము వండునపుడు మాటిమాటికి చూడవలసిన గిన్నె ఉండును. ఉడికినంత గుమ్మరించవలసిన గిన్నె ఉండును. అది చల్లారకుండ పెట్టవలసిన మూత ఉండును. మాంస రూప హృదయాదులను చూపు యష్టి మున్నగు పనిముట్లుండును. కోయుటకు ఉపయోగపడిన కత్తులుండును. అవన్నియు అశ్వమును దేవయోగ్యము చేయును.

    37. అశ్వమా! పొగకప్పిన నిప్పు నిన్ను వండునప్పుడు చప్పుడు చేయకుండవలెను. ఉడుకు మాంసము నుండి సద్ బుద్ చప్పుడు రాకుండవలెను. అగ్ని మంట నుండి నీ వాసనను సతతము చూచునప్పుడు కదలకుండవలెను. యాజిత, భక్షిత, ఉద్యమిత, వషట్ కృతమయిన ఈ అశ్వమాంసమును దేవతలు గ్రహింతురు. 'దేవాసఃప్రతిగృభ్ణ్యన్త్యశ్వమ్'

    38. అశ్వము వెడలుట, కూర్చుండుట, పోర్లుట, పదబంధము, అది త్రాగిన నీరు, తిన్న గడ్డి సర్వము దేవతలను చేరును గాత.

    39. అశ్వమును కప్పిన బట్ట, క్రింద పరచిన బట్ట, అశ్వమునకు కట్టిన స్వర్ణ ముద్రలు శిరో భూషణము, పాద బంధము, ఇవన్నియు ప్రియకర్మపు అశ్వము దేవతలను చేరు ఉపయమగును.

    40. అశ్వమా! రౌతు నిన్ను ఉరికించినాడు. నీవు ఉస్సురుమన్నపుడు  ఉరికించినాడు. మడమలతో తన్ని, కొరడాతో కొట్టి  నీకు బాధ కలిగించినాడు. ఉరికించినాడు. నేను స్రువమున యజ్ఞమున హవి అర్పించియు, మంత్రములు చదివియు నీ యొక్క ఆ బాధను పోగొట్టుచున్నాను.

    41. వేగవంతము, దేవప్రియమగు అశ్వపు నలుబది మూడు వంక్రులను కరవాలము ఛేదించును. ఋత్విజులారా! జ్ఞానవంతులై అశ్వపు ఒక్కొక్క అవయవమును ప్రకటించండి. దీని ప్రత్యంగమును దొషరహితము చేయండి. తదుపరి ఛేదించండి.
   
    (4వ మంత్రమున వంక్రులు 26గా చెప్పబడినది. తానిచప్రతి పార్శ్వం త్రయోదశ భవంతి అని ఉవటుడు. 4,5 మంత్రములందు సహితము త్రయోదశి, త్రయోదశీ అని చెప్పబడినది. ఇచట మంత్రమున'చతురస్త్రింశత్' అని చెప్పినాడు)

    42. అశ్వమును నరుకువాడు ఒక్క ప్రజాపతి. ద్యావాపృథ్వులు ఉభయులు అతనిని నియంత్రించువారు.

    అశ్వమా! నేను అధ్వర్యును. నీ అవయవములను ఛేదించుచున్నాను. అట్లు వేరు చేసిన మాంస పిండములను అగ్నియందు హోమము చేయుచున్నాను.

    (దేవతల కొరకు గాని నాకు కాదని చెప్పుట)

    43. అశ్వమా! నీవు స్వర్గమునకు ఏగుచున్నావు. అప్పుడు నీ శరీరము నీకు ఆటంకము కాకుండును గాత. ఈ ఖడ్గము నీ శరీరమును ఆపకుండును గాత. ఆశాపరుడు, అకుశలుడు అగు కసాయి సహితము నీ శరీరమును శాస్త్ర సమ్మతముగా ఛేదించును. కోసి వృధా చేయడు.

    44. అశ్వమా! నీవు యజ్ఞము కొరకు వధించబడినావు. నవా ఉపతన్మ్రియతే న ఋష్యసి. అందువలన నీకు మరణము కలుగదు. నష్టము కలుగదు. ఇక నీవు దేవ మార్గములందు సాగుదువు. నీవు పయనించు రథమునకు ఇంద్రుని హర్యశ్వములు, మరుత్తుల పృషతులు పూన్చబడును. అశ్వినుల రాసభము ముందు మరింత వేగవంత అశ్వము సాగును.

    45. దేవత్వమునకు చేరుకున్న వేగవంత అశ్వమా! మమ్ము గోయుతులను, అశ్వవంతులను చేయుము. పురుషార్థులగు పుత్రవంతులను చేయుము. వీరినందరిని పోషించతగినంత ధనమును ప్రసాదించుము. అఖండ్య అశ్వమా! మమ్ము పాపరహితులను చేయుము. హవిర్యుక్త అశ్వమా! మాకు రాజ్యప్రదానము చేయుము.
   
    46. మేము అశ్వమేధము చేసినాము. ఈ లోకములను సాధించినాము. విశ్వే దేవతలు, మరుద్గణ, ఆదిత్య సహితుడగు ఇంద్రుడు మాకు వైద్యము చేయుదురు గాత. ఆదిత్యులతో కూడిన ఇంద్రుడు మా యజ్ఞమును, మా దేహములను రక్షించును గాత.

    47. అగ్నీ! నీవు మాకు కడు దగ్గరివాడవగుము. మాకు రక్షకుడవు, శరణమవు. శుభంకరుడ వగుము.

    అగ్నీ! నీవు వాసకుడవు. ధనదానమున కీర్తిశాలివి. నీవు మా యజ్ఞమునకు విచ్చేయుము. మాకు దీప్తియుక్త ధనము ప్రసాదించుము.

    అగ్నీ! నీవు  అత్యంత దీప్తివంతుడవు. అందరిని ప్రకాశింప చేయువాడవు. మిత్రుల సుఖము కొరకు నిన్ను ధనము యాచించుచున్నాము.

    అగ్నీ! మా ఆహ్వానములు ఆలకించుము. హింసకులందరినుండి మమ్ము రక్షింపుము.

    ఆలోచనామృతము
   
    1. ఇది భారత దేశము. సుందర దేశము మహోన్నత దేశము. సనాతన దేశము.

    ఇది ఆర్యావర్తము. ఇది పుణ్య భూమి. పునీతన భూమి. పుష్ప పరిమళభూమి.

    ఇచటి మునులు, ఋషులు, జిజ్ఞాసువులు, విద్వాంసులు సమస్త మానవ కళ్యాణమునకు నిరంతరము వారి జీవితములను కప్పురములుగ కరిగించినారు. వారు తమ కొరకు ఇసుమంత ఆశించలేదు. సర్వేపి సుఖిస్సంతు, సమస్త మానవాళి సుఖజీవనమునకు పూలబాటలు పరచినారు!

    ఈ అదృష్టము, ఈ భాగ్యము, ఈ సంపద భరత జాతికి మాత్రమే దక్కినది. ఇది ఆర్యావర్తః పుణ్యభూమిః

    2. అపౌరుషేయము, భగవత్ప్రసాదము, మునిజన సేవితములగు వేదములు రత్ననిధులు. ఇవి భారతదేశమున అవతరించినవి. కాని సకల మానవాళి హితము కోరునవి. ఇందలి సదాశయములు, మహొన్నత ఆలోచనలు, విశాలతమ దృక్పథములు మరెచ్చటనుకానము.

    ఆనోభద్రాః క్రతవో యన్తు విశ్వత్కోదబ్ధాసో అపరితాస ఉద్బితః
    దేవానో యథా సదమిధృతే ఆసన్నప్రాయువో రిక్షితారో దేవేదివి 25 - 14

    ఇంతటి ఉదాత్తములగు ఆలోచనములు వేదములు, ఉపనిషత్తులు, భారత సాహిత్యమునకే సాధ్యపడినది.

    ఇదంతయు కొంచెపు పాశ్చాత్య నాగరికతకు తాకట్టు పడి ఉండుట భారతజనుల దైన్యము, దుస్థితి, దాస్యమును తెలియపరచుచున్నది.

    ఇది సూర్యునకు పట్టిన గ్రహణము మాత్రమే! ఇవి భారత సంస్కృతీ భానుని కాంతి పుంజములను కప్పి ఉంచలేవు. సూర్యుని వెలుగు ప్రసరించకపోదు. ఈ జాతి మరల మానవాళికి మార్గదర్శకము కాకపోదు.

    3. యజ్ఞ యాగాది క్రతువులు, హోమ కుండములు, మనసులను కదలించు మంత్రములు, పరాత్పరుని గురించిన చర్చలు, మానవ కళ్యాణపు ఆలోచనలు ఇవన్నియు భారతదేశమునకు, భారత జాతికి మాత్రమే దక్కిన మహా వరములు. వీనిని పాటించిన భారతజాతి మరొకసారి మానవ జాతికి తలమానికమగును.

    అశ్వమేధ మంత్రములు మనసును కదలించునవి. కన్నులను తడిచేయునవి. మంత్రములకు ఆ శక్తి ఉన్నది. మనిషి మనసు ఎత్తులను పెంచగలవు. నరుని మానవుని చేయగలవు. మహోన్నతుని చేయగలవు. ఆ నాదమునకు ఆశక్తి ఉన్నది!

    అశ్వమేధము యాగములందు ప్రదానము. ఈ విషయము పురాణాదులందు వ్యక్తమయినది. దీనిని గురించి చదివిన, అనువదించిననే మనసు పులకించినది! నేత్రములు బాష్పాకులములయినవి!! కనులారా గాంచిన ఎట్లుండెడిదో!!!

    వేదములకు సకల ప్రాణి జాలము అనంతమైన ప్రేమానురాగములు! అశ్వము, అదెంత! దానికి నోరున్నదా? జ్ఞానమున్నదా? కాని వేదము అశ్వమును అట్లు పరిగణించలేదు.

    అశ్వమును వధించిన మాట వాస్తవము. ఆ వధ ఎవరి కొరకు జరిగినది? సంకుచిత స్వార్థమునకు కాదు. సమస్త మానవాళి కళ్యాణమునకు! దేవతలను ప్రీతులను చేయుటకు!

    అశ్వవధకు ఏర్పడిన అనంత కర్మకాండ మహా మంత్రములు! యాగములు!! అగ్నిహోత్రము!!! ఇది ఒక జంతువునకు జరుగు సంస్కారమా! ఒక దేవతకు జరుగు ఆరాధనయా!

    'న వా ఉ ఏత న్మ్రియసే నరిష్యసి' నీకు మరణము లేదు. నష్టము లేదు అనుచున్నాడు.

    అశ్వమును స్వర్గమునకు సాగనంపిన తీరు ఆమోఘము!!!

    ఇంద్రుని హర్యశ్వములు ఆ అశ్వపు రథమునకు తగులునట! మరుత్తుల పృషతులు తగులునట! అశ్వనుల రాసభములు ముందర సాగునట! వానికి అగ్రమున వేగవంత అశ్వము సాగునట!

    మానవుడే అశ్వమును పెంచినాడు! మానవుడే అశ్వమునకు తనంతటి అంతస్థు కలిగించినాడు. మానవుడే దానిని వధించినాడు! మానవుడే దానికి ఎంతయో కర్మచేసినాడు. మానవుడే అశ్వమును దేవతలందు చేర్చినాడు! మానవుడే దేవత అయిన అశ్వమును ప్రార్థించుచున్నాడు!!!

    సుగవ్యం నో వాజీ స్వశ్వయం పుంసః పుత్రంఉత విశ్వాపుషం రాయిమ్ |
    అనాగాస్త్వం నో అదితిః కృణోతు క్షత్రంనో అశ్వో వనతాంహవిష్మాన్||

    మానవుని మహామహుని చేయుట జంతువును సహితము దేవతను చేయుట ఒక్క వేదమునకు మాత్రమే సాధ్యము. ఇతరమునకు అసాధ్యము! అసాధ్యము!! అసాధ్యము!!!

    వేదమునే కాదు, దేనినైనను, కామెర్ల కంటితో చూడరాదు! కామెర్ల కంటికి సకలము పసుపుగనే కనిపించును!! ఎలనన అతని రక్తము పచ్చబారును.

   
                            దాశరథి రంగాచార్య విరచిత
              శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
         అశ్వమేధమంత్రముల ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము
                     "కాలే వర్షతు పర్జన్యః పృథ్వివీ సస్యశాలినీ"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.