Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    4. అగ్ని తేజము అత్యంత దీప్తిమంతము తాపము కలిగించునది దండ సంపన్నము. యజమానులు ఆశ్రయించునది జరాశూన్యము అభినవము అదిపైకి ఎగయుచున్నది.

    5. శోభన యజ్ఞ అగ్నీ! నీవు అనంతదీప్తిగలవాడవు. వెలుగొందువాడవు స్తవనీయుడవు దీప్తిమంతమగు జ్వాలలతో ఎగయుము.

    6.అగ్నీ ! నీవు హవ్యవాహకదూతవు కావున దేవతలకు హవ్యములందించుచు చక్కని స్తుతులతో వెళ్ళుము.

    7. అగ్ని మానవుల హొమసంపాదకుడు పురాతనుడు ఆ అగ్నిని నేను పిలుచుచున్నాను  ఈ  సూక్తిరూపవచనమున అగ్నిని ప్రశంసించుచున్నాను. మన మంచి కొరకు అగ్నిని స్తుతించు చున్నాను.

    8. అగ్ని బహువిధ ప్రజ్ఞావంతుడు మిత్రుడు తృప్తుడు అగ్ని కృప, యజ్ఞకృప మరియు అతని సామర్థ్యమున యజమాని మనోకామన పూర్తిఅగును.

    9. యజ్ఞాభిలాషులారా ! యజ్ఞసాధనము, యజ్ఞవంతమగు అగ్నిని యజ్ఞమందు స్తుతులతో సేవించండి.

    10. మా యజ్ఞము అంగిరవంతమగు అగ్ని ముందుకు చేరవలెను అగ్ని మానవులలో హొమ నిష్పారకుడు అత్యంతయశస్వి.

    11. అగ్నీ ! నీవు జరారహితుడవు నీ దేదీప్యమాన కిరణములు కోరికలు తీర్చునవి అశ్వము వలె బలము ప్రకటించునవి.

    12. అన్నపతీ ! అగ్నీ! మాకు నీవు శుభంకరము, బల ప్రదమగు ధనమునిమ్ము. మా  పుత్ర, పౌత్రుల ధనమును యుద్ధకాలమున రక్షించుము.

    13. అగ్ని మానవ రక్షకుడు తీక్ష్ణడు అతడు ప్రసన్నుడై మానవ  గృహమున ప్రవేశించినపుడు సకల రాక్షసులు నశింతురు.

    14. అగ్నీ! నీవు వీరుడవు మానవ స్తోత్రములను వినుము మాయావి రాక్షసులను నీమంటలలో కాల్చుము.

    15. మానవ హవ్యదాత ఋత్విక్కులద్వారా అగ్నికి హవ్యము సమర్పించిన వానిని మానవ శత్రువులు తమ మాయతో సహితము వశపరచుకొన జాలరు.

    16. వ్యయయశ్వృషి తాను ధనవర్షకుడు కావలెననుకున్నాడు అగ్ని ధనదుడని ఎరిగినాడు అగ్నిని ప్రసన్నుని చేసినాడు మేము సహితము మహాదనము కొరకు అగ్నిని జ్వలింప చేయుదుము.

    17. అగ్నీ! కావ్య పుత్రుడు ఉశన ఋషి అతడు యజ్ఞశీలి జాత ప్రజ్ఞుడు అతడు నిన్ను హొత రూపమున మనువు ఇంట ఆసీనుని చేసినాడు.

    18. అగ్నీ ! సమస్తదేవతలు కలిసి నిన్ను దేవదూతగా నియమించినారు నీవు దేవతలందు ముఖ్యుడవు అప్పుడే నీవు  యజ్ఞయోగ్యుడవు అయినావు.

    19. అగ్ని అమరుడు  పవిత్రుడు  ధూమ్రమార్గుడు తేజస్వి సమర్థులగు మానవులు అగ్నిని దూతను చేసినారు.

    20. చక్కని దీప్తివంతుడు, శుభ్రవర్ణుడు తేజస్వి, మానవులకు  స్తవనీయుడు, అజరుడు అగు అగ్నిని మేము పిలుచుచున్నాము.

    21. ఒక మనుష్యుడు హవ్యదాత అగును ఋత్విక్కులతో అగ్నికి ఆహుతులు ఇప్పించును అట్టివాడు విశేష పోషకుడు వీరపుత్ర పౌత్రీదియుక్తుడు అగును.

    22. దేవతాముఖ్యుడు, జాతప్రజ్ఞుడు, ప్రాచీనుడు అగ్ని అతని వద్దకు హవ్యయుక్త స్రుక్కు నమస్కార యుక్తముగ చేరును.

    23. వ్యయశ్వ ఋషితో సమాన స్తుతితో స్తోతవ్యుడు, పూజతనముడు, శుభ్రదీప్తుడు అగ్నిని మేము సేవింతుము.

    24. 'వ్యశ్వ' పుత్రుడు 'విశ్వమనుడు' 'స్థూలయూపు' డను ఋషితో సమముగా యజమాని గృహమున పుట్టిన అగ్నిని స్తుతులతో పూజింపుము.

    25. అగ్ని మానవులకు అతిథి వనస్పతులకు వృక్షములకు - పుత్రుడు ప్రాచీనుడు విర్పయజమానులు - తమ రక్షణ కొరకు - అగ్నిని స్తుతిస్తారు.

    26. అగ్నీ! సమస్త ప్రధాన స్తోతల ముందు నీవు కుశాసనము మీద కూర్చుండుము. నీవు స్తుతియోగ్యుడవు మానవుడు అర్పించు హవ్యము స్వీకరించుము.

    27. అగ్నీ! అందరు ఆశించు ధనము మాకు ప్రసాదించుము అందరు అభిలషించువారును. చక్కని  పౌరుషముగల పుత్రులను ఇమ్ము కీర్తియుక్తమగు ధనమును అందించుము.

    28. అగ్నీ! నీవు వరణీయుడవు నివాసప్రదుడవు నిత్యయువకుడవు. నిన్ను చక్కని సోమగానముతో స్తుతించువానికి సదా ధనమునంపుము.

    29. అగ్నీ! నీవు భూరిదాతవు పశుయుక్త అన్నము మహాధనములలో దానయోగ్య ధనమును మాకు ప్రసాదించుము.

    30. అగ్నీ! నీవు దేవతలందు యశస్వివి. కావున సత్యవంతులు చక్కని వరాజితులు, పవిత్ర బలయుక్తలగు మిత్రా వరుణులను ఈ యజ్ఞమునకు తోడ్కొనిరమ్ము.


                                 ఇరువది నాలుగవ సూక్తము
                   ఋషి - వ్యశ్వపుత్రుడు వైయశ్వుడు, దేవత - ఇంద్రుడు,
                            ఛందస్సు - ఉష్ణక్ - అంత్సా అనుష్టుప్

    1. మిత్ర ఋత్విక్కులారా ! వజ్రధర ఇంద్రుని కొరకు మేము ఈ స్తోత్రము చేయుదుము. ఇంద్రుడు యుద్ధములందు ఆయుధముల నేత శత్రు సంహారకుడు మీ కొరకు నేను ఇంద్రుని స్తుతింతును.

    2. ఇంద్రా ! నీవు నీబలము వలన ప్రఖ్యాతుడవు వృత్రుని వధించినావు. వృత్రహంతవైనావు. నీవు శూరుడవు ధనవంతునకు సహితము అధికధనము ఇచ్చెదవు.

    3. ఇంద్రా ! మేము నిన్ను స్తుతింతుము నీవు మాకు నానా విధ అన్నయుక్తధనమును ప్రసాదింతువు. నీనిర్గమనమునందు సహితము శత్రువులు పలాయనము చిత్తగింతురు కాని హవిర్ధనులకు దాతవగుదువు.

    4. ఇంద్రా! మా కొరకు నీవు ధనమును వెల్లడించుము శత్రునాశకుడవు, స్తూయమానుడవై, ఉదారహృదయమున ఆధనము మాకు అందించుము.

    5. అశ్వవంత ఇంద్రా ! నీవు గోవులను వెతుకునపుడు యోద్ధలగువారు నీ  కుడిచేతినిగాని ఎడమ చేతినిగాని కదిలించలేక పోయినారు. ప్రతిరొధకులగు వృత్రాదులు సహితము నీ చేతిని కదిలించలేదు నిన్ను బాధించువాడులేడు.

    6. వజ్రధరా! స్తుతివచనములతో నిన్ను నేను పొందగలను. అట్లే గోవులుగలవారు గోష్ఠములను పొందుదురు.

    7. ఇంద్రా ! నీవు ఉగ్రుడవు నివాస ప్రదుడవు నాయకుడవు వృత్రాదుల సర్వశ్రేష్ఠ వినాశకుడవు 'విశ్వమన' ఋషి సకల స్తోత్రములందు నీవు నిలువుము.

    8. వృత్రఘ్న, శూర, బహుజన ఆహ్వాత ఇంద్రా! నవీనము, సృహణీయము, సుఖసాధకమగు ధనము మాకు అందవలెను.

    9. అందరిని ఆటలాడించగల ఇంద్రా ! నీ బలమున శత్రువులు నిలువజాలరు. నీవు అనేకుల చేత ఆహ్వానించ బడువాడవు. నీవు హవ్యదాతకు చేయుదానమును ఎంతటి వాడును నష్టపరచ జాలడు.

    10. అత్యంత పూజనీయడవు, నేతలలో శ్రేష్ఠుడవగు ఇంద్రా! మహా ధనలాభమునకు నీ కడుపు సోమముతో నింపుము ధనము సాధించుటకుగాను సుదృఢ శత్రుపురములను విధ్వంసము చేయుము.

    11. ఇంద్రా! నీవు వజ్రిని ధనికుడవు, నీ కన్నా ముందు అన్యదేవతలకు మా ఆశలు నివేదించినాము. ఇప్పుడు నీవు మాకు ధనము, రక్షణలు ప్రసాదించుము.

    12. ఇంద్రా! నీవు ఆడించువాడవు స్తోత్రపాత్రుడవు అన్న ప్రకాశయశము, బలము కొరకు నిన్ను వినా అన్యుని ఎరుగమ.

    13. ఇంద్రుని కొరకే నీవు సోమము ఏర్పరచుము ఇంద్రుడు సోమమయ మధువును పానము చేయవలెను అతడు తన  మహత్వమున అన్నముతో ధనాదులను ఉంచును.

    14. అశ్వాధిపుడు ఇంద్రుని నేను స్తుతించుచున్నాను. అతడు తాను అభివృద్ధిచేసిన  ఆయుధములను ఇతరులకు ఇచ్చును, స్తోతయగు 'వ్యశ్వపుత్రు' ని స్తుతులు వినును.

    15. ఇంద్రా ! ప్రాచీన కాలమున నిన్ను మించిన ధనికుడు సమర్థుడు ఆశ్రయదాత, స్తుతియుక్తుడు పుట్టలేదు.

    16. ఋత్విక్కులారా ! మదకరమగు సోమరూప అన్నమునందలి అత్యంతమదకర అంశమును ఇంద్రుని కొరకు సిద్ధపరచుడు. ఇంద్రుడు వీరుడు సదా వృద్ధిశీలుడు అందుకే జనులు ఇంద్రుని స్తుతింతురు.

    17. హర్యశ్వస్వామీ! ఇంద్రా ! పూర్వము నిన్ను గురించి చేసిన స్తుతులను ఎంతటి బలముగాని ధనముగాని అతిక్రమించ జాలవు.

    18. మేము అన్నభిలాషులము ఋత్విక్కులు ప్రసుత్తులు కాని యజ్ఞములకే దర్శనీయుడు, అన్నపతి - ఇంద్రుని ఆహ్వానింతుము.

    19. మిత్రులగు ఋత్విక్కులారా! రండి త్వరత్వరగా రండి మనము స్తుతియోగ్యనేత ఇంద్రుని స్తుతింతము ఈ ఇంద్రుడు ఒక్కడే సమస్త శత్రుసేనను పరాజితము చేయును.

    20. ఋత్విక్కులారా ! ఇంద్రుడు స్తుతులను ఆపడు - అభిలషించును అతని కొరకు నేతి కన్నను, తేనె కన్నను రుచికరమగు పలుకులు పలుకుడు.

    21. ఇంద్రుని వీరకృత్యములు హద్దులు ఎరుగవు అతని ధనమును శత్రువులు సాధించలేరు అతని దానము ఆకాశమంతటిది అది సమస్త స్తోతలకు అందునట్టిది.

    22. ఆ ఇంద్రుడే అవధ్యుడు బలవంతుడు భక్తి పరాధీనుడు అతనిని వ్యశ్వ్పషితో సమముగా స్తుతించండి ఇంద్రస్వామి హవ్యదాతకు ప్రశస్తమగు గృహము ఇచ్చెను.

    23. వ్యశ్వపుత్ర విశ్వమానా ! ఇంద్రుడు నరుల పదవప్రాణము. క్వున అభినవ్యుడు విద్వాంసుడు, సదానమస్కారయోగ్యుడగు ఇంద్రుని స్తుతించండి.

    (నవవైపురు షేప్రాణాః నరునకు  తొమ్మిది ప్రాణములు కాగా ఇంద్రుడు పదవప్రాణము ఇప్పుడు ప్రాణములు అయిదు అనుచున్నాడు అత్యంతప్రియుడు ఆరవ ప్రాణమన బడుచున్నాడు లేక చున్నది.)

    24. ఆదిత్యుడు నిత్యము పక్షుల ఎగురుటను గమనించును. అట్లే వజ్రపాణి ఇంద్రుడు రాక్షసుల కదలికలను గమనించును.

    25. అత్యంత దర్శనీయుడవగు ఇంద్రా! కర్మనిష్ఠయజమానికి ఆశ్రయము ప్రసాదించుము 'కుత్స' రాజు విషయమున నీవు రెండు విధముల శత్రువులను వధించినావు మమ్ము కూడ అట్లే రక్షింపుము.

    26. అత్యంత దర్శనీయ ఇంద్రా ! నీవు స్తుతియోగ్యుడవు ఇచ్చుటకుగాను మేము నీనుండి ధనము యాచించున్నాము నీవు మా సకల శత్రుసేనలను పరాజితము చేసినావు.

    27. ఇంద్రుడు రాక్షసవిహిత పాపములనుండి విముక్తి ప్రసాదించువాడు ఏడు సింధునదుల వడ్డున అను యజమానులనుదనుపువాడు అట్టివాడవగు ఇంద్రా! అసుర శత్రువులను వధించుటకు ఆయుధమునెత్తును.

    28. 'వరు'రాజా ! నీ తండ్రి 'సుషామ' రాజు కొరకు పూర్వకాలమున యాచకులకు ధనము దానము చేసినావు.

    అదే విధముగా ఇప్పుడు 'వ్యశ్యులమగు' మాకు ఇమ్ము శోభన ధనవతి అన్నవతివగు ఉషా ! నీవును ధనమ్ము ఇమ్ము.

    29. మానవ హితైహి, సోమవంతుడగు 'వరు' ని దక్షిణ - సోమయుక్త వ్యశ్వపుత్రుల వద్దకు - చేరవలెను వందల వేల 'స్థూల' ధనము మా వద్దకు రావలెను.

    30. ఉషోదేవి ! నిన్ను ఎవరయిన 'వర' రాజు ఎక్కడ ఉండును? అని అడిగిన జిజ్ఞాసువుల వద్ద అని చెప్పుము. అది ఎక్కడ? అని అడిగినచో ఆశ్రయస్థలమనియు శత్రువారక 'వరడు' గోమతి తీరమున ఉండుననియు చెప్పుము.

   
                                 ఇరువది అయిదవ సూక్తము
            ఋషి - వ్యశ్వపుత్రుడు, వైయశ్వుడు, దేవత - మిత్రావరుణులు -
                            విశ్వదేవతలు, ఛందస్సు - ఉష్ణిక్

    1. మిత్రావరుణులారా ! మీరు జగద్రక్షకులు దేవతలకు పూజనీయులు హవిఅర్పించుటకు యజమానులు మిమ్ము అరపింతురు వ్యశ్వా ! విశుద్ధులు, బలవంతులగు మిత్రావరుణుల యజ్ఞము చేయండి.

    2. మిత్రావరుణులు సుకృతులు ధనవంతులు రథవంతులు సుజన్ములు అదితి పుత్రులు ధృతవ్రలులు.

    3. అదితి మహతి సత్యవతి ఆమె సర్వధనశాలురు, తేజస్వులగు మిత్రావరుణులను అసురబలముగల వారిని కన్నది.

    4. మహానులు, సామ్రాట్టులు, బలవంతులు, సత్యవంతులగు మిత్రావరుణులు మహాయజ్ఞమును ప్రకాశింప చేయుదురు.

    5. మిత్రావరుణులు మహాబలపుత్రులు, వేగపుత్రులుమ్ సుకర్ములు విశేషధనదాతలు. వారు అన్నపు నివాసస్థానమున వసింతురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.