Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
17. మరుద్గణములు రుద్రపుత్రులు వర్షకర్తలు నిత్యతరుణులు. ఈ స్తోత్రము మరుద్గణము అంతరిక్షము నుండి వచ్చి మమ్ము గురించి యోచించునట్లు చేయవలెను.
18. కొందరు భూరిదాతలు అగు యజమానులు మరుత్తులను పూజింతురు. కొందరు హవి అర్పించి అర్చింతురు. మేము వారిద్దరికి సమానులము కావలెను. మరుత్తులారా! మీరు అత్యంత ధనప్రద చిత్తమున విచ్చేయండి.
19. మరుత్తులు నిత్యతరుణులు మిక్కిలి వర్షదాతలు పాపకులు సోభరి! నీవు వారిని అతి అభినవ వాక్యముతో రైతు తన ఎద్దులను స్తుతించినట్లు స్తుతించుము.
20. సకల యుద్ధములందు జనులు మరుత్తులను ఆహ్వానింతురు. అప్పుడు వారు పరాభవకర్తలగుదురు మరుత్తులు ఆహ్వానించెదరు మల్లుల వంటివారు వర్షకులు యశస్వులు వారిని మధుర వాక్యములతో స్తుతించండి.
21. సమాన తేజస్కులగు మరుత్తులారా! ఒకే జాతివి అగుట వలన గోవులు నలుదిశలందు తమలో తాము కలుసుకొనును. మురిపించును.
22. మరుత్తులారా! మీరు నర్తకులు రొమ్మున ఆభరణములు కలవారు మానవులు మా బంధుత్వము ఆశింతురు. అందువలన మీరు మా పక్షము వహించండి నిత్యము చేయు యజ్ఞము వలన మీ బంధుత్వము నిలిచి ఉండును.
23. మంచి దానవంతులు, గమనశీలురు, మిత్రులగు మరుత్తులారా! మారుత్సంబంధి ఓషదులను తీసికొనిరండి.
24. మరుత్తులారా! మీరు సుఖములు కలిగించువారు. శత్రురహితులు. మీరు సముద్రమును రక్షించువారు. యజమాని శత్రువులను హింసించువారు. దప్పి గొన్న గోతమునకు బావినిచ్చినవారు. అట్టి అన్ని శుభంకర రక్షణలతో మా కొరకు సుఖములు కలిగించండి.
25. చక్కని యజ్ఞవంతులగు మరుత్తులారా! సింధునది. చినావు, సముద్రపు, పర్వతముల మీదా ఓషధులను.
26. గుర్తించి మా దేహచికిత్స కొరకు తీసికొని రండి మరుత్తులారా ! మా రోగములను ఉపశమింప చేయండి విరిగిన అవయవములను జోడించండి అతకండి.
(ఆంధ్రవచన ఋగ్వేదసంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకముణ మొదటిఆధ్యాయము మూడవ అనువాకము సమాప్తము.)
ఓం నతామినన్తిమాయనో వధీరావ్రతాదేవానాం ప్రథమాధ్రవాణి
నరోదసే అద్రుహావేద్యా భిర్న పర్వతానినమే స్దినాణసః
రెండవ అధ్యాయము నాలుగవ అనువాకము
ఇరువది ఒకటవ సూక్తము
ఋషి - కాణ్వసోభరి, దేవత - ఇంద్రుడు, చంధస్సు - బృహతి
1. అపూర్వ ఇంద్రా ! నీవు బహురూపధారివి. మేము నీకు గుణవంతుడగు మానవునితో సమానముగా సొమము అందింతుము. పోషింతుము నీ నుండి రక్షణ కోరికతో నిన్ను యుద్ధములకు ఆహ్వానింతుము.
2. ఇంద్రా! నీవు శుత్రువులను పరాజితులను చేయువాడవు తరుణుడవు. ఉగ్రుడవు అగ్ని స్టోమాది యజ్ఞములను రక్షించుటకు మేము నిన్ను అర్ధింతుము మేము నీసుఖము మా వద్దకుదెమ్ము నీవు కీర్తనీయుడవు రక్షకుడవు మేము నిన్ను కోరుచున్నాము.
3.అశ్వపతి, గోపతి, భూపతి, సోమపతి ఇంద్రా ! విచ్చేయుము. సోమపానము చేయుము.
4. మేము విపులము, బంధుహీనులము ఇంద్రా! నీవు బంధువంతుడవు. మేము నీతో బంధుత్వము ఏర్పరచు కొందుము నీవు కోరికలు తీర్చువాడవు. నీ దేహమున తేజస్సు ఉన్నది ఆ తేజస్సుతో సోమపానముకు విచ్చేయుము.
5. ఇంద్రా ! ఇది సోమము పాలు మున్నగునవి కలసినది మత్తు కలిగించునది స్వర్గకారకము. మేము పక్షులవలె కూడి నిన్ను స్తుతింతుము.
6. ఇంద్రా ! అప్పుడప్పుడు నీవు చింతించెదవేల? మేము నీముందు ఈ స్తోత్రముతోను మరిన్నిటితోనును నిన్ను స్తుతింతుము. ఇంద్రా! మాకు పుత్ర, పశ్వాదుల కోరిక కలిగినది. నీవు ధానాది దాతవు మా కర్మలు నీ వద్ద ఉన్నవి.
7. ఇంద్రా ! నీవు మమ్ము రక్షింపుడు మేము ఎల్లప్పుడు కొత్త వారలమగుదుము. నీవు సర్వత్రద్యాప్తుడవు అదిమాకు ఇంతకు ముందు తెలియలేదు ఇప్పుడు తెలిసినది.
8. ఇంద్రా! నీవు బలవంతుడవు మేము నీ స్నేహము ఎరుగుదుము భోజ్యము ఎరుగుదుము మేము నిన్ను నీ ఎల్లరకు నివాసప్రదుడవు శిర స్త్రాణము కలవాడవు గోవులు మున్నగు వానితో కూడిన ధనములందు మమ్ము మొనగాళ్లను చేయుము.
9. మిత్రులగు ఋత్విక్కులారా! యజమానులారా ! ఇంద్రుడు పూర్వము సమస్తధనములను మా కొరకే తేచ్చినాడు ఆ ఇంద్రుని మీ రక్షణల కొరకు నేను స్తుతింతుము.
10. ఇంద్రుడు పరితవర్ణ అశ్వవంతుడు సజ్జనుల స్వామి. శత్రుదమనుడు అతనిని తృప్తులైన మానవులు సుతింతురు. ఆ ఇంద్రుడు మాస్తోతల కొరకు నూరు ఆవులను, నూరు గుఱ్ఱములను తెచ్చినాడు.
11. కోరిన ఫలములిచ్చు ఇంద్రా! నీవు మాకు సాయముగా నిలువుము మేము గోయుక్త మానవులతో యుద్ధము చేయుదుము ఎంతటి మొనగాడయినను వాని తలవంచగలము.
12. అనేకులచే పిలువబడు ఇంద్రా! యుద్ధమున మేము హింసకులను గెలుతుము. పాపబుద్ధులను గెలుతుము. మరుత్తుల సాయమున వృత్రుని వధింతుము. మేము మా కార్యములను విస్తరింతుము. ఇంద్రా ! మా సకల కర్మలను రక్షింపుము.
(మానవుడగు తాను ఇంద్రుడు చేసిన పనులన్నియు చేయగలననుచున్నాడు! తాను ఇంద్రుడను కాగలనను చున్నాడు !! అన్నింటిని తాను సాధించగలననుచున్నాడు !!! కాని ఇంద్రుని దేవుని అనుగ్రహము కావలెనను చున్నాడు)
13.ఇంద్రా ! పట్టుకతోనే నీవు శత్రురహితుడవు చిరకాలము నుండి బంధు రహితుడవు. నీవు కోరిన మైత్రిని కేవలము యుద్ధముతోనే సాధింతువు.
14. ఇంద్రా! బంధుత్వము కొరకు అయాజ్ఞికుని ఎందుకు ఎన్నుకొనవు? అతడు సురత్రాగుననియా? ప్రమత్తుడగుననియా? నిన్ను బాధించుననియా? ఇంద్రా ! నీవు స్తోతమ నీవాడనుకున్నప్పుడు అతనికి ధనాదులు అందించినపుడు అప్పుడు స్తోతనిన్ను తండ్రిగా భావించి పిలుచును.
15. ఇంద్రా ! మేము నీ సమాన దేవత బంధుత్వరహితులముకారాదు. సోమాభిషవ శూన్యులము కారాదు. సోమాభిషవమికాగా మేము గుమికూడుదుము.
16. ఇంద్రా! నీవు గోదాతవు మేము మీవారలము మేము ధనశూన్యులము కాకుండవలెను. మేము ఇతరులనుండి ధనము అర్ధించకుండవలెను నీవు ప్రభువవు మాకు దృఢమగు ధనమునిమ్మ నీదానమును ఆటంకపరచగలవాడు లేడు.
17. నేను హవ్యదాతను సోభరివి ఇంద్రుడు నాకు ఈ ధనము దానము చేసినాడా? ధనవతి సరస్వతి దానము చేసినదా? చిత్రుడను రాజు చేసినాడా? లేక నీవే చేసినావా?
18. మేఘము వర్షించును భువిని ప్రసన్నము చేయును అట్లే 'చిత్తరరాజు' సరస్వతినదీ తీరపు అన్న రాజులకు వేల, పదివేల ధనములిచ్చి ప్రసన్నులను చేసినాడు.
ఇరువదిరెండవ సూక్తము
ఋషి - కాణ్వసోభరి, దేవత - ఇంద్రుడు - అశ్వనులు, ఛందస్సు -వివిధములు
1. అవినులారా! మీరు మేలైన ఆహ్వానవంతులు మీ మార్గములు ప్రశంసనీయములు. మీరు సూర్యపుత్రికను వరించుటకు ఏరథము మీద వెళ్లినారో ఆదర్శనీయ రథము మీదనే విచ్చేయవలసినదని అర్ధించుచున్నాను.
2.సోభరీ ! శుభంకర స్తుతులతో ఈ రథమును కీర్తించుము. ఈ రథము ప్రాచీన స్తోతలను పోషించినట్టిది. యుద్ధములకు ఆహ్వానించబడునది. అనేకులు కోరునది అందరిని రక్షించునది యుద్ధమందు అగ్రవించబడునది. అనేకులు కోరునది. అందరిని రక్షించునది. యుద్ధమందు అగ్రగామి అందరు భజించతగినది శత్రువులను ద్వేషించునది పాపరహితమైనది.
3. అస్విద్వయమా ! మీరు శత్రువిజేతలు ప్రకాశమనుడు, హవ్యదాతయగు యజమానికి గృహపతులు ఈ కర్మను రక్షించండి అందుకు నమస్కరించి మిమ్ము ఆహ్వానించుచున్నాము.
4. అశ్వినులారా! మీరు సకల కార్య ప్రేరకులు జలపతులు మీ రథపు ఒక చక్రము పైకిపోవును. ఒకటి మీ వెంట సాగును మీ బుద్ధి మంగళమయము ధేనుసమము అది మా వద్దకు చేరవలెను.
5. అశ్వినులారా ! మీ రథమునకు మూడు విధముల సారథిస్థానములున్నవి. దాని పగ్గములు బంగారపువి అవి ప్రఖ్యాతమైనవి. తన వెలుగుతో ద్యావాపృథ్వులను అలంకరించును మీరు ఆరథముననే విచ్చేయండి.
6. అశ్విద్వయమా ! ద్యులోకమున ఉండిన ప్రాచీన జలమును మారు మనువునకు అందించినారు నాగలితో దున్ని. పొలము పండించినారు. జలపాలకులారా! నేడు మేము మిమ్ము మధుర స్తుతులతో స్తుతింతుము.
7. నాసత్యయద్వయమా !మీరు ధనవంతులు దాతలు మీరు యజ్ఞమార్గమున మా వద్దకు విచ్చేయండి మీరు ఈ మార్గముననే 'త్రసదస్యు' ని పుత్రుడు 'త్రుక్షి' కి విశేషధనము ఇచ్చినారు. అతనిని తృప్తిపరచినారు.
8. అవినులారా! మీరు నేతలు విప్హప్రదాతలు. ధనవంతులు మీ కొరకు శిలలతో సోమము అభిషుతైనది సోమపానమునకు విచ్చేయుము. హవ్యదాత గృహమున సేవించుము.
9. వర్షధనముగల అశ్వినులారా! బంగారు కళ్లెములు గలదియు, ఆయుధకోశములు ఉన్నదియు, రమణీయమగు రథమును ఎక్కండి.
10. మీరు 'పృథిక్' రాజును రక్షించినారు 'అధ్రిగ్' రాజును రక్షించినారు 'వభ్రు' రాజును సోమపానము చేసిప్రసన్నుని చేసిప్రసన్నుని చేసినారు ఆరక్షణలతోనే అతి త్వరగా మా వద్దకు రండి మా వ్యాధులకు చికిత్సచేయండి.
11. మేము విప్రులము స్వకర్మలందు త్వరపడువారము అశ్విద్వయమా! మీరు శత్రువధకు త్వరపడువారు ఈ ప్రాతఃకాలమున స్తుతించి మిమ్ము ఆహ్వానించుచున్నాము.
12. అశ్వినులారా! మీరు వర్ణశీలురు నానారూపులు దేవతలకు వరణీయులు మా ఆహ్వానములు ఆలకించండి సకల రక్షణలతో మా వద్దకు విచ్చేయండి మీరు హవిని అభిలషించువారు. అత్యంత ధనవంతులు యుద్ధములందు శత్రువును పరాభవించువారు ఏ రక్షణలతో మీరు 'క్రివి' ని రక్షించినారో ఆరక్షణలతో విచ్చేయండి.
13. నేటి ఉదయమున అశ్వినులకు అభివాదనము చేయుదును వారిని స్తుతింతును వారినే ధనాదులు యాచింతుము.
14. అశ్వినులు జలపాలకులు యుద్ధములందు కీర్తనీయ మార్గము కలవారు వారిని ఉదయము పగలు రాత్రి ఆహ్వానింతుము. అన్న, ధనవంత అశ్వినులారా! మమ్ము శత్రువులకు వప్పగించకండి.
15. అశ్విద్వయమా! మీరు సేచన శీలురు నేను సుఖయోగ్యుడను, ప్రాతఃకాలమున నా కొరకు రథము మీద సుఖములను తెండు నేను సోభరిని మా తండ్రి వలెనె మిమ్ము ఆహ్వానింతుము.
16. అశ్వినులారా! మీరు మనోవేగముగలవారు. ధనవర్షకులు శత్రునాశకులు అనేకులకు రక్షకులు త్వరగా చేరువయగు వివిధములగు రక్షణలతో మా వద్దకు విచ్చేయండి.
17. అశ్వినులారా ! మీరు మరింత సోమపానము చేయువారు నాయకులు దర్శనీయులు మా యజ్ఞమార్గమును గొ, అశ్వ, సువర్ణ భరితము చేయుచు విచ్చేయండి.
18. ఎవని దానము సుందరమగునో, ఎవని శౌర్యము సుందరమగునో, ఎవని రూపము సుందరమగునో, ఎవడు వరణీయుడో, ఎవనిని బలవంతులకు బలవంతుడు సహితము ఓడించజాలడో అటువంటి వాని ధనము మాకు లభించవలెను. అశ్వినులారా! మీరు వచ్చినంత మాకు సకల ధనములు లభించును.
ఇరువది మూడవ సూక్తము
ఋషి - వ్యశ్వపుత్రుడు వివమానుడు, దేవత - అగ్ని, ఛందస్సు - ఉష్ణిక్
1. అగ్ని శుత్రువు మీదికి దూకువాడు అతని పొగలు నలువైపుల వ్యాపించును అతని దీప్తి ఎవడును పట్టజాలడు అతడు పుట్టుకతోనే ప్రజ్ఞావంతుడు అట్టి అగ్నిని స్తుతించండి పూజించండి.
2. విశ్వమన ఋషీ! మాత్సర్యరహితుడగు యజమాని కొరకు రథాదుల కొరకు సర్వార్శకుడుగు అగ్నిని వచనములతో స్తుతించును.
3. అగ్ని శత్రుబాధకుడు కిరణముల అర్చనీయుడు అతడు ఏయజమాని అన్నము సోమరసము స్వీకరించునో అట్టి యజమాని అనంత ధనమును పొందును.





