Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
3. అన్నీ వేదములందే గలవనుట చాదస్తమే అయినను వేదములందున్న వన్నియు మిధ్యమే అనుట పరమ చాదస్తము. పరిశోధించిన గోచరించు మహత్తర విషయములను సానుభూతితో పరిశీలించుట వివేక లక్షణము. రాజసూయము సందర్భమున ఏర్పరచిన శంఖము లక్షమంది భోజనములు చేసిన తరువాత మ్రోగును. అని చెప్పబడినది. మానవులకు లెక్కించుట సాధ్యపడదని శంఖమును నెలకొల్పినారు. అది లెక్కించు యంత్రము కావచ్చును. నేడు మనము లెక్కించు యంత్రములను విరివిగా ఉపయోగించుచున్నాము. కంప్యూటర్లూ, క్యాలిక్యులేటర్ల వంటిదే ఆ శంఖము కావచ్చును. అందును గురించి పరిశోధనలు జరిపి సత్యమును వెలికి తీయవలసి ఉన్నది.
మాయజూదము
విదురుడు ఇంద్ర ప్రస్థమునకు చేరినాడు. ధర్మరాజాదులు విదురునకు ఎదురేగినారు. తోడ్కొని వచ్చినారు. పూజించినారు. ఆదరమున ఆసనము చూపినారు. విదురుడు అసీనుడు అయినాడు. పాండవులు కూర్చున్నారు. ధర్మరాజు కుశలమడిగినాడు. విదురుడు వచ్చిన కార్యమును గురించి వినుటకు వేచియున్నారు.
"ధర్మజా!" విదురుడు చెప్పినాడు. "ధృతరాష్ట్రుడు నన్ను పంపినాడు. నేను వచ్చినాను. అతడు ఒక సభాగృహమును నిర్మించినాడు. అది చూచుటకు, అందు స్నేహరీతిగా జూదమాడుటకు నిన్ను రమ్మన్నాడు. అందుకు నన్ను పంపినాడు. నిన్ను తీసుకొని వెళ్ళుటకు నేను వచ్చినాను."
ధర్మరాజు విదురుని మాటలు విన్నాడు వినయముగా అన్నాడు:-
"మహాత్మా! ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యము గలవాడు. అతడు సభాగృహము నిర్మించినాడు. అది చూచుటకు , అందు జూదమాడుటకు మమ్ము కొనితెమ్మని నిన్ను పంపినాడు. ద్రుతరాష్ట్రుని మాటను నీవు అతిక్రమించలేక వచ్చినావు. జూదము వలన భేదములు కలుగును. జూదము అడవచ్చునో లేదో నీవు మాకు చెప్పుము. నీమాట మాకు శిరోదార్యము. హస్తినకు వత్తుము" అనుచు విధి నియుక్తుడయి విదురునితో వెళ్ళుటకు నిశ్చయించినాడు.
ధర్మరాజు వెంట తమ్ములు, ద్రౌపది, ధౌమ్యుడు , పరిచారకులు విద్వాంసులు బయలుదేరినారు. వారు హస్తినకు చేరినారు. "అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్రశతంబుతో భీష్మ, శల్య , శకుని , సైంధవ, కర్ణ, గౌతమ, ద్రోణ, అశ్వత్ధామ, సోమదత్త, సమేతుండయి యున్న ధృతరాష్ట్రునకు , భానుమతీ ప్రభ్రుతి స్నుషా పరివృత్తయయి, తారకా పరివృతయయియున్న రోహిణియుంబోలేనున్న గాంధారీదేవికి, గురువృద్దులకు నతి వినయంబున ననుజ సహితుండయి ధర్మతనయుండు మ్రొక్కెనంత ద్రుపదరాజ నందనయు గాంధారికి మ్రొక్కిన, నక్కోమలింజూచి గాంధారి కోడండ్రేల్లరు విస్మితులయి"నారు.
బ్రహ్మ లోకములందలి లావణ్యములన్నింటిని చేర్చి ద్రౌపదిని సృష్టించినట్లున్నాడు. లోకమున ఇంత అందము మరొక కాంతలో కాంచము అని ఈర్ష్యా చెందినారు గాంధారి కోడండ్లు.
ఆ విధముగా పాండవులు, కౌరవులు అతి ప్రణయ గౌరవమున ఆ రోజు గడిపినారు. మరునాడు దుర్యోధనుడు సభా గృహమును ధర్మరాజునకు చూపినాడు. సభావిభవమునకు ధర్మరాజు ఆశ్చర్యపడినాడు. మెచ్చుకున్నాడు. సంతోషించినాడు. అందరును సభా గృహమున కూర్చున్నారు. సంభాషించి వినోధించినారు. అప్పుడు వారు ఇట్లు మాట్లాడినారు:-
దుర్యోధనుడు:- ధర్మజా! జూదమనిన నీకు ఇష్టము. జూదమందు సమర్దుడవు. ఈ సభాగృహమున ప్రొద్దుపుచ్చుటకు స్నేహముగా జూదమాడుదము. సిద్దము కమ్ము.
ధర్మరాజు:- దుర్యోధనా! మోసము చేయుట, జూదమాడుట రాజనీతికి విరుద్దములు. ధర్మనిరతులకు తగినవి కావు. జూదమాడుట వలన రాజులకు పాపము కలుగును.
జూదము పాపము. కుత్సితులతో జూదము మరింత హేయము. అతిపాపకారణము. మాయాజూదమున జయించుట మహాపాతకము. ధర్మజూదమందు జయించుట ధర్మయుద్దమందు జయించినంత పుణ్యము కలుగునని అసితుడైన దేవలుడు చెప్పినాడు.
శకుని:- "ధర్మజా! పిరికివానివలె పలుకుచున్నావు. జూద విద్యను ఎరిగినవాడవు. లోకములను ఎరిగినవాడు అగును. నీవు రాజనీతిని ఎరిగిన వాడవు. అట్టి జూదమును నిందించుట తగదు. బలహీనులు బలవంతులను గెలుచుటకు యుద్దమందును, జూదమందును మాయలు చేతురు. అందు దోషము లేదు. శాస్త్రముల కేమి గాని నీవు పిరికివాని వలె ప్రవర్తించుచున్నావు. జూదమందు ఓడిపోదునని భయపడుచున్నావు. పోనిమ్ము పాపము! జూదము అడకుము.
శకుని మాటలు ధర్మరాజునకు సూదులవలె గుచ్చుకున్నవి. "శకునీ! జూదము ఆడుటకు పిలువబడి మరలి పోరాడు. నేను దుర్యోధనునితో జూదము అడేదను" అని తన సంసిద్ధతను వ్యక్తపరచినాడు.
ఇట్లు జూదంబున నయ్యెడు దోసంబేరింగియు దైవామశాసనంబున ధర్మజుండు గంధ పుష్పార్చితంబులయిన యభిమతాక్షంబులమర్చికొని యున్న సౌబల, వివింశతి, చిత్రసేన, వికర్ణలం జూచి వీరిలో నెవ్వడు నాతొ జూదంబాడెడు వాడనిన నాతనికి దుర్యోధనుమండిట్లనియే."
"ధర్మజా! మా మామయగు శకుని నా నిమిత్తము నీతో జూదమాడును. శకుని పందెము వేసిన ధనరాసులన్నింటిని నీవు గెలిచిన ఎడల నిరభ్యంతరముగా నేను నీకు ఇత్తును. నీవు కాదనకుము."
అన్యుల కొఱకు అన్యులు జూదమాడుట తగదని చెప్పిన ధర్మరాజు జూదమాడుటకు సంసిద్ధుడు అయినాడు. జూదము ఆడినాడు. దుర్యోధనుడు రత్నఖచితమయిన కడియమును జూదమందు ఆడినాడు. వారు ఆడుచున్న జూదమును చూచుటకు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, అశ్వత్ధామ , కృపాచార్యుడు, ద్రోణచార్యుడు వచ్చినారు. వారు ప్రత్యేకమయిన ఉన్నత ఆసనముల మీద కూర్చున్నారు.
ధర్మరాజు శ్రేష్ఠములయిన అనేక మణిహారములను పందెము వేసినాడు. శకుని మాయావి. అతనికి ఇష్టమయిన సొగటాల కాయలతో జూదమాడినాడు. ధర్మరాజును జయించసాగినాడు. ధర్మరాజునకు పౌరుషము పెరిగినది. శకునికి ఓడరాదనుకున్నాడు. తాను గెలువవలె ననుకున్నాడు. బంగారు నాణెములు గల భండారమును పందెమున ఉంచినాడు. ఆడినాడు, మరకత, మౌక్తిక, ప్రవాళ పద్మరాగాది రత్నముల భండారమును పందెమున ఉంచినాడు. ఒడినాడు. ద్రోణ, సువర్ణ భండారములను పందెమున ఉంచినాడు. ఒడినాడు. ఏనుగులను పందెమున ఉంచినాడు. ఓడినాడు. శ్రేష్టములయిన గుఱ్ఱములను పందెమున ఉంచినాడు, ఓడినాడు. స్త్రీ సహస్రములను, పరిచారకులను , గొర్రెల మందలను, మేకల మందలను , బర్రెల గుంపులను, గోసమూహములను, ఒంటెలను, గాడిదలను, సకల జంతువులను పందెమున ఉంచినాడు. ఓడినాడు. ధర్మరాజు తనకున్న సమస్త సంపదలను జూదమునందు ఓడినాడు.
సకల సంపదలు పోగొట్టుకొని వివర్నుడయి ఉన్న ధర్మరాజును చూచినాడు విదురుడు. అతని మనసు వికలము అయినది. ఇకనైన జూదము మానిపించమని ధృతరాష్ట్రుని కోరినాడు. పుత్రేషణచే ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు. అప్పుడు విదురుడు కల్పించుకున్నాడు. "దుర్యోధనా! న్యాయమును విడిచినావు. శకునిని ఆశ్రయించినావు. మాయాజూదమును ఆడించినావు. పాండవుల లక్ష్మిని అపవహించినావు. ఇది నీకు తగదు. ప్రజలు దీనిని సహించరు. నిన్ను "ఛీ ఛీ' అందురు. పాండవుల సంపద హరించినావు. వారి శౌర్య ధైర్యములను నీవు హరించలేవు. సంపద లేకున్నను వారు సంపన్నులే అగుదురు" అన్నాడు.





