Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
వాటి తన ఉన్మాదాన్ని బిటేన్ మన్నించేనా? జీవితాన్ని గురించి అర్ధం చేయడానికి తనకు అతడు ఎందుకు సహాకరించలేదు? బిటేన్ మళ్ళీ వచ్చి లేఖ చేయి పట్టుకొని "చంద్రలేఖ ?" అంటే?
తక్షణమే ఆమె శరీరంలోని ప్రతి అవయవంలోనూ అతని ధ్వని ప్రతిధ్వనించింది. ఆమె ఆశ అంచులు నిండింది. కళ్ళు మూసుకొని వణికిపోయింది.
"తినమ్మా...."
ఆమె కుర్రాణ్ణి దగ్గరికి లాక్కుంటూ "జిత్ ఎందుకు అలా ఉన్నావు? ఏదీ మామిడి పండు తిను చూతాం. నేను చెక్కు తీసి పెడ్తా . ఏం?"
లేఖ ఒక్క ముక్క కొరికింది. మిగతా దంతా జిత్ కి తినిపించింది. జిత్ తృప్తి చెంది గది నుంచి నిర్గమించాడు.
బిటేన్ తన్ను మన్నించడు. తిరిగి రాదు. తనకు అన్య పురుషునితో సౌఖ్యం లభించదు.
ఇంక ఎవన్నైనా మెడకు తగిలించుకోవాల్సిందే. అందుకు మోతీచంద్ బాగా పనికి వస్తాడు.
మోతీచంద్ ఇతర భార్యల్లాగే తననూ వెళ్ళకొట్టేస్తాడు. అందరికంటే త్వరగా కూడా వెళ్ళగొట్టవచ్చు. అన్నటితో తన గుది బండ తెగిపోతుంది.
ఆ మాట తలచుకునే వరకూ ఆమె వళ్ళు వణికి పోయింది. గదిలో ఒక రాక్షసునితో ఉంచి బైట తాళం వేసినట్లు అనిపించింది.
తరువాత బామ్నీని మోతీచంద్ కు గురించి అతని పెళ్ళాలను గురించి అడిగింది.
'అతడి ఇప్పటి పెళ్ళాం అచ్చం పుత్తడి బొమ్మ. మగడితో గడ్డి కరిపిస్తుంది. ఆమె స్వయంగా నే కొత్త పెళ్ళాన్ని తెచ్చుకొమ్మని మగణ్ణి ఆజ్ఞాపించింది."
"అదేమిటి ? విచిత్రంగా ఉందే?"
బామ్నీ కధ మొదలుపెట్టింది.
"అ బంగారు బొమ్మ పేరు రాధ. ఆమె ఒకనాడు కాళీ దేవాలయంలోకి వచ్చిన యోగి దగ్గరికి వెళ్ళింది . మనిషి ముఖాన్ని చూసి జరిగింది. జరుగుతున్నది, జరగబోయేది అన్నీ చెపుతాట్ట ఆ యోగి ."
'ఆ యోగి ఏం చెప్పాడు?"
"ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఆమె ఆరునెలల్లో విధన అవుతుందని."
"రాధ నమ్మిందా మరి?"
"రాధకు ఆత్మశక్తి ఉంది. ఆమె వంచకులకు మోసపోయే బాపతు కాదు. యోగితో కరుకుగా మాట్లాడింది. గోముఖవ్యాఘ్రమనీ, వయోముఖ విషకుంభం అనీ తిట్టింది. ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది."
"ఎట్లా !"
కధ ముక్కలు ముక్కలుగా చెప్పి కధలో ఆసక్తి పెంచడం బామ్నీ స్వభావం.
"యోగశక్తి అంటే అదేమరి. అలాంటి యోగులు సామాన్యంగా ఈ పాప భూమి మీద అడుగు పెట్టరు. వారు హిమాలయాల్లో ఉంటారు. అరచేతి గుంటలో పట్టేంత మంచు తిని జీవిస్తారు. మహాకాళి దర్శనాని గ్గాను ఆ యోగి ఈ మహానగరానికి వచ్చాట్ట. అప్పుడే వెళ్ళిపోయాట్ట కూడా."
"రాధను ఎలా ఎద్పించాడు?"
"యోగి కళ్ళల్లో జ్యోతులు వెలిగాయి. ఆ జ్యోతులు రాధ ముఖాన్ని చూశాయి. అంతరంగిక విషయాలన్నీ చెప్పాడు."
"నిజంగానా?"
'అంతేకాదు. ఆమె అపవిత్రంగా తన దగ్గరికి వచ్చిందని మండిపోయాడట. నాటికి ఆమె బహిష్ట అయి మూడు రోజులు. చూడండి. ఎలా తెలుసుకున్నాడో!"
కాస్త ఆగింది. తరువాత యోగి ప్రభావాన్ని గురించి చెప్పింది. "రాధ కాళ్ళు పట్టుకుంది. పతిబిక్ష పెట్టమని బ్రతిమాలాడింది. యోగికి ఆమె మీద కోపం తగ్గిపోయింది. దయ కలిగింది. "ఒకే ఒక మార్గం ఉంది. అది చాల కఠినం. బిడ్డా, అది వింటే నీ గుండె పగిలిపోతుంది." అన్నాడు"
"బాబా భర్త ప్రాణం నాకు అన్నింటి కంటే ఎక్కువది. శలవియ్యండి. తప్పక ఆచరిస్తాను అన్నది."
"యోగి ఉపాయం చెప్పాడు. ఆమె నిర్జీవ ప్రతిమ అయిపొయింది. దుఃఖం కట్టలు తెంచుకొని కళ్ళల్లోంచి ప్రవహించింది. తేరుకున్నాక చేతులు జోడించి , 'బాబా వేరే ఉపాయం లేదా" అన్నది డగ్గుత్తికతో."
"యోగి ఆమె నెత్తిన చేయి ఉంచి" బిడ్డా మరే ఉపాయమూ లేదు. గుండె నక్కలయ్యే ఈ పని చేయడానికి శక్తి ప్రసాదించవలసిందిగా భగవంతుని ప్రార్దిస్త్తాను. ఇంకొక భార్య మొఖాన వ్రాసి ఉన్న ముత్తిదవ అతనికి ప్రాణం పోస్తుంది. అతనికి మళ్ళీ పెళ్ళి చేయి. అలా కాకుంటే నీ కుంకుమ ఒలకపోసుకున్న దానవు అవుతావు. బాగా ఆలోచించు. జాగ్రత్తగా ప్రవర్తించు."
"రాధ ఇంటికి వెళ్ళింది. వారం రోజులు ఆలోచించింది. చివరకు ఒక నిశ్చయానికి వచ్చి భర్తతో చెప్పేసింది. కొత్త పెళ్ళాన్ని తెచ్చుకొమ్మని ఆమె భర్తను కోరింది. అతడు నవ్వాడు. ఆమె ఏడ్చింది. అతడూ ఏడ్చాడు. కాళ్ళు కన్నీటితో కడుగుతూ ఆమె భర్తను ప్రాధేయపడింది. అయినా అయిష్టంగా తల ఊపాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఆ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. మోతీచంద్ లొంగిపోవాల్సి వచ్చింది. లొంగిపోయాడు. పవిత్రమైన గంగ నీటిలో చేతులు ముంచి కొత్త పెళ్ళానికై చూస్తానని ప్రమాణం చేశాడు."
లేఖ ఆసక్తితో వింటుంది. తన చుట్టూ కమ్ముకున్న కటిక చీకటిలో గోరంత వెలుగు కనిపించింది. తాను అమ్ముకోవాల్సింది . తన నుదుట ఉన్న సౌమంగల్యాన్ని మాత్రమే. ఆ తరువాత తనకు స్వేచ్చ లభిస్తుంది. రాధను గేన్తివేయడం కూడా జరుగదు.
రాధ మోతీచంద్ కు ఏమైనా హాని చేయలేదు కదా? ఆ జాడలు అతని మొఖాన కనిపించలేదు.
అదీ విషయం. పిచ్చి పిచ్చి ఊహలన్నీ కళ్ళను భ్రమింపజేశాయి.
రోజంతా ఆమె తన నెత్తి బరువు దించుకున్నట్లు అనిపించింది. పసుపు, పారాణితో పెళ్లి కూతురు అయ్యే తనకు బిటేన్ లాంటి స్వేచ్చ లభిస్తుంది.
"ప్రజాసేవలో బిటేన్ కు అనందం కలగాలనీ, అతని జీవితాశయం ఫలించాలనీ, అతడు యోధుడు కావాలనీ ' చేతులు జోడించి అనేకసార్లు ప్రార్ధించింది.
ఆ ప్రార్దిన ఆమె దుఃఖాన్ని అడుగంటించింది. ఆమెకు శాంతినీ, శక్తిని ప్రసాదించింది. ఈ మూడు రోజులుగా ఆమె గుడి చాయలకు వెళ్ళలేదు. నాటి సాయంకాలం పూజా సమయానికి వెళ్ళి నిశ్చలంగా, నిశ్చింతగానూ కూర్చోవాలని నిశ్చయించింది. మోతీచంద్ అక్కడే ఉంటాడు. వాడి చూపులు విసరి వ్యవహారం తేల్చుకోవాలని నిశ్చయించుకుంది.
పూజ ప్రారంభం అయింది. మోతీచంద్ రాలేదు. చూట్టూ కలయ చూసింది. ఆలోచలన్నింటినీ నెమరు వేసుకుంది. దేవాలయం తనకు అనూహ్యమైన అసమాన కాంతిని ప్రసాదించింది. ఆ కాంతి తనలో రగలుతున్నఅగ్ని కంటే ఉజ్జ్వలంగా ఉంది. తాను దేవాలయాన్ని వదిలి వేయబోతుంది. అలాంటప్పుడు దేవాలయాన్ని నిర్వ్యజంగా పరిశీలించాలి.
ఇతరుల్ను ఇట్టే నమ్మించగల గుడిని వాడుకొని ఎంతైనా చేయవచ్చు. దాన్ని స్వార్ధానికి వినియోగించుకోవచ్చు. తనమీద దైవత్వం విసరబడింది. కళ్ళు దయారసభరితాలు కాగా, ఆమె ఉన్నతాసనం అలంకరించింది.
కాని లేఖ దేవుళ్ళలా అభినయించలేదు. ఆమెలో మానవత మూర్తిబావించి ఉంది.
అప్రయత్నంగా ఆమె భక్తుల వైపు చూసింది. మోతీచంద్ మామూలు స్థానంలో కూర్చొని ఉన్నాడు. లేఖ తల తిప్పుకుంది. అతడంటే ఆమెకు మళ్ళీ అసహ్యం కలిగింది. ఈ నడిమిటి విష్కంభంలో ఆమె తన ఊహతో ఒక మోతీచంద్ ను నిర్మించుకుంది. నిజమైన మోతీచంద్ ను చూచి ఆ మూర్తి విరిగిపోయింది. వక్కలు చెక్కలైంది.
లేఖ అపజయాన్ని అంగీకరించలేదు. తాను ఒక నిశ్చయానికి వచ్చింది. దాన్ని మార్చడానికి వీల్లేదు. హృదయం గట్టి పడేసుకుంది. అంతకంటే మంచి తాడు తనకు ఎక్కడ దొరుకుతుంది. ఉరి పోసుకోవడమే! ఎందుకూ? ఉరి ఎందుకు?





