Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    అసలు విషయం బామ్నీకి తెలియకపోలేదు. డాక్టరు ఫీజు చెల్లించుకోలేకనే ఆ తల్లి జగన్మాతను శరణు వేడింది. నిస్సహాయ స్థితిలో సహాయపడేది విశ్వాసం ఒక్కటే.
    "బామ్నీ నువ్వెళ్ళు."
    కిటికీ లోంచి సుళ్ళు సుళ్లుగా వస్తున్నా ఏడుపు విని లేఖ మంత్ర ముగ్ధం అయిపొయింది. ఆమెలో ఒక శీతతరంగం పరిగెత్తింది. వణికి పోయింది.
    "నాకు ఇదే తగు. నేను ఒక బిడ్డను చంపాను. నన్ను ఉడికంభం ఎక్కించాలి."
    వీధిలో కూడిన జనం తల్లి ఏడుపులోని అర్ధం గ్రహించారు. కొందరు వ్యాఖ్యానించారు. కొందరు విమర్శించారు. తనకు వ్యాధులు కుదిర్చే శక్తి ఉందని జగన్మాత ఎప్పుడూ చెప్పుకోలేదన్నారు కొందరు. తప్పంతా ఆడదాని మీదే తోశారు. మరికొందరు . జిత్తులమారి వాళ్ళంతా చేరి అమాయకుల అంధవిశ్వాసాల్తో ఆటలాడుతున్నారన్నారు అన్యులు. మిగతావారు దేశం మోసాల పుట్ట అయిందనీ, ఎటు చూసినా కుట్ర మోసమే  కనిపిస్తున్నాయనీ వాటిని పారద్రోలాలని వ్యాఖ్యానించారు.
    చివరకు కర్ర అనించుకుంటూ ఒక ముసల్ది వణుకుతూ ఏడుస్తున్న తల్లి దగ్గరికి వచ్చింది.
    "బిడ్డా రా. ఇంటికి వెళ్దాం. మీ ఇల్లెక్కడా . చాలు. ఇంతటితో చాలు" అన్నది.

                                    26

    పాతకాలపు శిక్షల్ను గురించి చరిత్ర పుస్తకాల్లో చదివింది లేఖ. నేరస్తుణ్ణి పచ్చి ఎద్దు చర్మంలో వేసి కుట్టేసేవారు. ఎండు తున్న కొద్దీ ముడుచుకొని పోవడాన నేరస్తుడు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. జగన్మాత పాత్రదారి అయిన లేఖ స్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. ఆమె తనకేదో ఉపశమనమూ, విముక్తీ లభించయనుకుంది. కాని అది ఆ రెంటిలో ఏదీ కాదు. ఆమె అనుభవిస్తున్నది శిక్ష. కఠినశిక్ష, ఆమె పీల్చే గాలి బోగం కొంప గాలిలా వెధవ కంపు కొడుతుంది.
    గుడి గాలి లంజయింటి గాలిలా తోస్తుంది. ఎందుకు? బోగం కొంప ఆమె శరీరాన్ని అపవిత్రం చేసి భ్రష్టం చేయడల్చుకుంది. దేవాలయం? అది అంతరాత్మలో చేరి దుర్నీ తినీ , దుర్మార్గాన్ని వ్యాపింపజేస్తుంది.
    ఆమెకు దైవత్వం ఆపాదించబడింది. అందువల్ల ఆమెకు ఏమాత్రం అనందం కలుగలేదు. పైగా మనో వ్యాకులం ఎక్కువైంది. పాపం, అమాయక స్త్రీలు నిండు గుండెల్తోనూ, సంపూర్ణ విశ్వాసంతోనూ ఆమెను పూజించారు. వారి అమాయక హృదయాల నుండి ఆమెకు విముక్తి ఎక్కడిది? అసలు ఆమె ఎవరు? ఆమె మరొకరి చేతి కీలుబొమ్మ. ఆ చేతులు బూటకపు జగన్మాతని. వాటిని ఆడించేవారు వేరు.
    లేక జగన్మాతను నాశనం చేయాలి.
    ఆమెలో అలాంటి భావాలు ఉప్పెనలా పొర్లుతున్నాయి. వంటమనిషి ఏదో గుసగుస చెప్పింది.
    'అయిదువందల రూపాయిలు ఇస్తానన్నాట్ట."
    ముచ్చట తెంపి తెంపి చెప్పడం బామ్నీ స్వభావం.
    "సంబంధాల బాపడికి 500 రూపాయలు ఇస్తానన్నాట్ట."
    "సంబంధాల బాపడా?"
    మోతీచంద్ బాపడికి చెప్పిన మాటలన్నీ బామ్నీ ఏకరపు పెట్టింది.
    "మంగల్ కూతురు సంబంధం నిశ్చయించు. అతడు అంగీకరించకుంటే .... తండ్రీ కూతుళ్ళు దిక్కులేని పోరని మీద మనసు నిలిపి ఉన్నారు. ఆ కుర్రాడు ప్రస్తుతం చదరంగపు పావు. వాడు అదృష్టం నా చేతిలో ఉంది. వాడి ద్వారా తండ్రీ కూతుళ్ళ అదృష్టం కూడా. ..... ..... ....."
    "అయితే జగన్మాత ? ఆమె ప్రతిష్ట? ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఇంకో వారం రోజుల్లో యజ్ఞగుండంలో నిప్పు పడాలి" అన్నాడు బ్రాహ్మడు.
    'అదొక దురదృష్టం. ముహూర్తం నిశ్చయం అయింది. ఆపడం సాధ్యపడదు. ఇదంతా 'స్వదేశ్ ' నాటకం . వారు కధ కల్పించారు. మనం నమ్మాం. అంతే , చంద్రలేఖ అందరిలా అతి సామాన్య స్త్రీ."
    జగన్మాత ప్రతిష్ట జరుగుతే గుడి శోభ పెరుగుతుంది" అన్నాడు బాపడు దుఃఖం దిగమింగుతూ.
    "అదీ నిజమే."
    "బాగ్ బజారు పాతగుడి పూజర్లంతా తిట్టేస్తున్నారు. వారు "అసలు స్వదేశ్ ఎవరిది? అని అడుగుతున్నారు. 'అది సర్ ఆబాలబంధుది," అని వారే జవాబు చెప్పుకుంటున్నారు."
    మోతీచంద్ తల ఊపాడు. 'సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది. మనం మోసపోయాం. దారం చిక్క్య పడింది. దాన్ని తెంపాలి. ఉపాయం చక్కనిది దొరికింది. కాని రహస్యంగా ఉంచాలి. ఏమంటావ్? ఉంచుతావు కదూ?"
    "ఆ అలాగే ."
    "తాడులా మంగల్ అధికారిని తెంపేయాగలనని అతనికి తెలుసు ."
    బామ్నీ కధంతా చెప్పింది. ఇదంతా నీకు ఎలా తెలిసిందని లేఖ అడిగింది.
    వంటమనిషికి నామోషి అయింది. గుళ్ళో జరిగేది తనకు తెలియకుండా ఉంటుందా?
    "ఈ విధంగా తన పంతం నెరవేరకుంటే కుర్రాడు చండాలుడనే పుకారు లేవతీస్తాడు. వాడికి దయా ధర్మాల్లేవు."
    లేఖ తెల్లబోయింది. జిత్ ను గురించిన భయంతో ఆమె గుండె దడదడాకొట్టుకుంది. తన సర్వస్వం జిత్. అంతకంటే తనకు ఉన్నదేమిటి ?
    పడకగదిలోకి వెళ్ళి లేఖ మంచం మీద పడి పోయింది. కళ్ళు మూసుకుంది. కన్నీరు కాలువలు కట్టింది.
    గదిలోకి వచ్చిన జిత్ లేఖను చూదాడు. నిలువునా నీరైపోయాడు. తన తల్లి అలా ఏడ్వడం అతడు చాలాసార్లు చూశాడు. అన్నం పెట్ట లేనప్పుడల్లా ఆమె అలా ఏడ్చేది. జిత్ ఆమెను ఊరడించేవాడు. 'ఆకలి లేదమ్మా ఏడవకమ్మా....." అనేవాడు. తల్లి దగ్గరికీ తీసుకొని కావిలించుకునేది. ఆమె ఏడ్పు మాన్పించి జిత్ వీధుల మీద పడేవాడు. చెత్త కుండీల్లో ఇతరులు ఏరుకోగా మిగిలినవన్నీ ఏరి తెచ్చేవాడు. దొరికిన వాటిల్లో తల్లికి ఇవ్వకుండా తినేవాడు కాడు. కాదూ మరి. ఆమె ఆకలి మాత్రం తన ఆకలి లాంటిది కాదూ!
    జిత్ మంచం దగ్గరికి చేరాడు. దిండులో కూరుకొని ఉన్న లేఖ ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు.
    'ఆకల్లెదమ్మా"
    లేఖ దిండు లోంచి తల తీసింది. జిత్ ను కిందికీ మీదికీ చూసింది. అతడన్నది ఆమెకేమీ అర్ధం కాలేదు. ఇంతకు ముందెన్నడూ జిత్ లేఖను అమ్మా అని పిలువలేదు. తల్లిలా దగ్గరికి లాక్కొని తలను రొమ్ముకు అడుముకుంది.
    అంతట్లోకే ఆమెకు ఇంకో ఆలోచన వచ్చింది. భయంతో వణికిపోయింది. ఊపిరి సహితం పీల్చలేక పోయింది.
    జిత్ జారుకున్నాడు. ఒక మామిడి పండు తీసుకొని మళ్ళీ కొద్ది సేపటికి గదిలో ప్రవేశించాడు.
    "తినమ్మా"
    ఆమె మాట్లాడలేదు. అతనికి అవమానం అనిపించింది.
    తాను మోతీచంద్ ను పెళ్ళాడితే? జిత్ క్షేమంగా ఉంటాడు . అతన్ని తన దగ్గర నుంచి లాక్కుపోయి అనాధ శరణాలయం లో పారేయడం జరుగదు. ఈ జగన్మాత బంధం నుంచి తనకు విముక్తి లభిస్తుంది. తండ్రి తన గుడితో ప్రశాంతంగా కాలం గడుపుతాడు.
    అందును గురించి పెద్దగా భయపడాల్సింది మాత్రం ఏమిటి?
    మోతీచంద్ ను పెళ్ళాడ్డం! గొర్రె లాంటి అతని పొడవైన ముఖమూ, ముక్కు కింది మీసాలూ ఆమె మనో లోకంలో కనిపించాయి. అతనికి తానంటే ఇంత అభిలాష ఎందుకూ? మోతీచంద్ డబ్బుతో అనేకమంది పెళ్ళాల ముఖాన బురద కొట్టాడు. ఇప్పటికీ కావలసినంత మంది పెళ్ళాలను కొనుక్కునే శక్తి ఉంది.
    అతని చూపు తల్చుకుంటే అతని కరస్పర్శ కంటే అసహ్యం అనిపించింది. వైరాగ్యం ఆమె నరాల్లో పరుగులు తీసింది. పక్కనే ఉన్న జిత్ ఆమె వైరాగ్యానికి చెలియకట్ట కట్టాడు.
    "తినమ్మా .......... ' పసిబిడ్డ కంఠం ఆమెను కరిగించింది.
    లేఖ పెదవులు నొక్కి పట్టింది. అంతకంటే ఆమె ఆశించతగిందేమిటి? మనసు దేవింది. మళ్ళీ ఝూర్నా కమ్మరి జీవితం సాధ్యపడదు. ఆమె దుఖం బాధలూ అనుభవించిన మాట వాస్తవం. అయితే అది వంగదేశం మొత్తంలోనూ వ్యాపించిన దుఃఖం, బాధలో భాగం మాత్రమే. అది తన మీద మాత్రం విరుచుకొని పడ్డ ఆపద మాత్రం కాదు. అంతే కాదు. ఆమె అందరి కంటే మేలు. అదృష్టం ఆమెను అట్టడుగుకు మునగనివ్వలేదు. సమయానికి తండ్రి ప్రత్యక్షం అయినాడు. అలా కాకుండా ఉంటే? ఆత్మహత్యే . అంతకంటే గత్యంతరం ఏముంది?" ఆమె నరకం నుండి రక్షింపబడింది. జేలు నుంచి వచ్చిన వ్యక్తిని చూసే దాకా ఆమెలో ఎలాంటి మార్పూ లేదు. అతడు ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసి జారుకున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.