Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
iv) అపస్వర దోషము వలన ఇంద్రునకు త్వష్టకు, లోకమునకు అపకారము కలిగించు వృత్రుడు పుట్టినాడు.
అన్యుని వధించబూనిన త్వష్టకు తన ఉనికికి హాని వచ్చినది. తనతోటిదే కదా లోకము! తాను లేకున్న లోకము లేదు కదా! తన ఉనికి కొరకు పుత్ర హంతకునితో సఖ్యము చేసినాడు!
జీవితము ఎంత విచిత్రమండీ! నిన్న కొడుకును చంపినాడని కసిగలవాడు తన ఉనికి కోసము వానితోనే స్నేహము చేసినాడు!
v) ఇంద్రుడు ఒకబాలుని హతమార్చిన పాపము చేసి ఉన్నాడు. పాపము అతని బలమును తిని వేసినది. త్వష్ట వజ్రము ఇచ్చినాడు. ఇంద్రుడు దానిని లేప లేక పోయినాడు. నిర్వీర్యుడైనాడు.
ధర్మమునకు వివక్షతలేదు. అది అందరకు సమానమే!
vi) త్వష్ట బలవంతుడే. పగబూని నిర్వీర్యుడు అయినాడు. ఇంద్రుడు బలవంతుడే. పాపము చేసి నిర్వీర్యుడు అయినాడు. వజ్రము బలము కలదే! వాడగలవాడు లేడు.
vii) వృత్రుడు పగకు పుట్టినవాడు. ముల్లోకములను ఆవరించినాడు. ప్రజాశ్రేయస్సు కొరకు వృత్రుడు పోవలసి ఉన్నది. అందుకు ఒక మహాత్ముడు విష్ణువు అవతరించినాడు.
విష్ణువు ఇంద్రుడు కలసి శత్రుత్వరూప ఇంద్రుని వధించలేదు. శత్రుత్వము వధించరానిది. వృత్రుని సామర్థ్యమును సహించలేనంతటి దుర్భలుడైనాడు ఇంద్రుడు. కల్మష రహితుడైన విష్ణువు దానిని ధరించినాడు!
ఇది జీవితమునకు సంబంధించిన కథ కాదా! మానవ తత్త్వమును పరిశీలించినది వేదము. ఏనాటి - ఈనాటి - రేపటి మానవుడు ఇంతకు మించి ప్రవర్తించునా?
ఇచట ఒక రామాయణ వృత్తాంతము. భరతుడు మంధర కుటిలబుద్ధిని చంపతలచినాడు. చంపలేదు - లేడు!
ఇది వాస్తవ మానవ మనస్తత్వ చిత్రణ!
5. ఒక కథ చెప్పి నీతి బోధించుట ప్రచారము చేయుట వేదము నేర్పినది. ఇది మౌలికము.
ఎంతో ప్రగతి సాధించినామనుకొనుచున్న నేడు సాహిత్యము, సినీమాలు, టి.వీలు, పత్రికలు మున్నగునవి అన్నియు అదేపని చేయుచున్నవి కదా!
పదమూడవ అనువాకము
1. దేవతలు క్షత్రియుల వలన భయపడినారు. కావున గర్భము నందున్నప్పుడే క్షత్రియుని శక్తిని బంధించినారు కావున క్షత్రియుడు బలహీనుడై పుట్టుచున్నాడు. శక్తి కోల్పోక పుట్టిన క్షత్రియుడు శత్రువులను సంహరించుచు లోకమున సంచరించినాడు.
2. క్షత్రియుడు అప్రతిరుద్ధక శక్తి కలిగి జన్మించి శత్రువులను సంహరించుచు సంచరించవలెనన్న యజమాని ఇంద్ర బృహస్పతి దేవతాకమగు చరును నిర్వాపము చేయవలెను. క్షత్రియుడు ఇంద్రుని అంశము వాడు కాగా బ్రాహ్మణుడు బృహస్పతి అంశమువాడు అగును. ఆ చరు నిర్వాపము వలన బృహస్పతి సామర్థ్యమున ఇంద్రాంశ గల క్షత్రియుడు దేవతాప్రతి బంధమునుండి విముక్తుడు అగును.
3. ఈ యాగమునందు బంగారు త్రాడు దక్షిణ అగును. అందువలన దేవతా ప్రతిబంధము నుండి విముక్తుడు అగును.
పదునాలుగవ అనువాకము
1. ఆదిత్యుడు చంద్రుని వృద్ధి క్షయములకు కారకుడు. అతడు నిత్యము నవనవోన్మేషముగ వెలుగుచున్నాడు. ఆదిత్యుడు పగటికి గుర్తు. అతడు ఉషః కాలమున తూర్పున ఉదయించుచున్నాడు. దేవతలకు హవిర్భాగములు కల్పించుచున్నాడు. ఆదిత్యుడు దీర్ఘాయుష్షును ఇచ్చును గాత.
2. ఆదిత్యుడు చంద్రునకు రోజుకు ఒకకళను చేర్చుచు వృద్ధిచెందించుచున్నారు. పున్నమినాటి చంద్రుని - స్వయముఆ క్షీణరహితులగు ఆదిత్యాది దేవతలు రోజుకు ఒక కళచొప్పున తగ్గించుచున్నారు. ఆ చంద్రుడును, ఆదిత్యులును, బృహస్పతియు, దేవతలును మాకు అభ్యుదయము కలిగింతురు గాక.
3. ఇంద్రుడా! నీవు తూర్పుదిశకు అధిపతివి. ఉత్తర దిక్కున శత్రుఘాతకుడవు. నదులు ప్రవహించు ప్రదేశములను అన్నింటిని జయించిన వాడవు. కోరికలను తీర్చువాడవు. హోమార్హుడవు. ఆహవనీయమునకు దక్షిణమున ఋత్విక్కులు నీకు హవిస్సును ఇచ్చుచుందురు. కావున అచట నిలుపుము.
4. ఇంద్రుడు సర్వత్ర జయించుచున్నాడు. పరాజయము ఎరుగడు. అతడు రాజులందరిలో అధికుడు. రాజ్యము లేని రాజులకు రాజ్యము సంపాదించి ఇచ్చువాడు.
ఇంద్రా! నీవు రాజులందరకు శరణ్యుడవు. నమస్కరించ తగినవాడవు. పరకీయ సేనలన్నింటిని ఓడించుటకు సిద్ధపడుము.
5. ఇంద్రుడు మహిమాన్వితుడు. అతని మహిమ పృథివి, అంతరిక్షము, ద్యులోకములందు వ్యాపించి ఉన్నది. ఇంద్రుడు యుద్ధములందు తన సేనను అభిముఖముగా నడిపించును. అతడు స్వతంత్ర ప్రభువు. ఎంతటివానికిని పరతంత్రుడు కాడు. యుద్ధమునకు సత్వరమే బయలుదేరుటకు ఇంటియందే ఆయుధములు కలవాడు. శత్రుసేన మీద దూకు స్వభావము ఉన్నవాడు.
6. ఇంద్రా! నీవు శూరుడవు. స్థావర, జంగమాత్మక విశ్వమునకు ప్రభువువు. స్వర్గమును చూపగలవాడవు. పాలు చేసిన ఆవు వలె నిన్ను మాటిమాటికి పిలుచుచున్నాము.
7. ఇంద్రా! మేము కర్తలము. అయినను అన్నములను ఇమ్మని నిన్ను పిలుచుచున్నాము. మేము మానవులము. శత్రుసేనల ఆశ్వములను చూచి నిన్ను పిలుచుచున్నాము. మాకు తగిన శక్తి నిమ్ము. మమ్ము కాపాడుము.
8. ఇంద్రా! ద్యులోకములు వందలు అగుగాక. భూలోకములు వందలు అగునుగాక. అయినను నీకు సరిరావు. నీవు ద్యావాపృథ్వులకు అల్లుడవు. అయినను నిన్ను వారు అనుకరించజాలరు. సూర్యులు సహస్ర సంఖ్యాకులైనను వజ్రివగు నీకు సరికాలేరు.
9. హర్యశ్వములు గల ఇంద్రా! ఋత్విజుల బాహువులచే అభిషవము చేయబడినదియు కల్మషరహితమును నీ కొరకు రాళ్లచే అభిషుతమగు సోమమును సేవించుము. ఆనందించుము.
10. జలములు ధనము కలవి. మమ్ము కలసి మురిసి పోవునవి. ఎన్నో అన్నములు కలవి. అవి మాస్వామియగు ఇంద్రుని యందు చేరును గాత. ఆ జలములు, మాస్తుతులు ధ్వనులందు మేము ఆనందింతుము గాత.
11. "ఉదగ్రే శుచయస్తవశుక్రాః" ఇత్యాది పురోనువాక్యకు ఇదిప్రతీక. ప్రథమకాండపు ప్రపాఠకమున వివరించబడినది. "విజ్యోతిషాబృహతా భాత్నగ్నిః" ఇత్యాది యాజ్యకిది ప్రతీక. మొదటికాండపు రెండవ ప్రపాఠకమున వివరించబడినది.
12. 'ఉద్యుతం జాతవేదం' ఇత్యాది పురోనువాక్యకు ఇది ప్రతీక. 1 వ కాండము 4వ ప్రపాఠకమున వ్యాఖ్యాతము.
13. సూర్యదేవా! నీవు గొప్పగా పలుకువాడవు. నీవు కిరణ కేశివి. నిన్ను సప్తాశ్వరథము వహించుచున్నది.
14. ఆ మండలము మిత్ర, వరుణ, అగ్నుల ఉపలక్షితము. సకల ప్రాణిజాలమునకు నేత్రప్రాయము. నానా వర్ణములది. అది కిరణ సేనా యుక్తమై ఉదయించుచున్నది. ఆ మండల స్థితుడగు సూర్యుడు సకల స్థావరజంగములకు ఆత్మ అయినవాడు. అతడు ద్యావాపృథివ్యంతరిక్షములందు వ్యాపించినాడు.
15. విశ్వేదేవతలు సత్యమును వర్థిల్లచేయువారు. ఋతువులను అనుసరించి చేయు కర్మలకు ఆహ్వానించబడువారు. వారు క్షీరసారమగు హవిస్సును సేవింతురు గాక.
16. విశ్వేదేవతలారా! మీరు మా ఆహ్వానములను వినండి. మీరు అంతరిక్షమున ఉన్నారు. పృథివియందు ఉన్నారు. ద్యులోకమున ఉన్నారు. అగ్ని జిహ్వులై ఉన్నారు. యాగ ఉద్దేశ భూతులయి ఉన్నారు. మీరందరు ఈ యజ్ఞమున ఆసీనులు కండి. ఆనందించండి.
శ్రీమాదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
రెండవ కాండమునందలి నాలుగవ ప్రపాఠకము సమాప్తము.





