Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                   జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                   ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                             ఇరువది నాలుగవ అధ్యాయము
1.    అశ్వస్తూపరో గోమృగస్తే ప్రాజాపత్యాః కృష్ణగ్రీవ ఆగ్నేయా రరాటే పురస్తాత్సారాస్వతీ మేష్య దస్తాద్ధాన్వో రాశ్వినా వధో రామౌ బహ్వూఃసౌమా పౌష్ణః శ్యామో నాభ్యాం సౌర్య యామోశ్వేతశ్చ కృష్ణశ్చ పార్శ్వ యో స్త్వాష్ట్రౌ లోమసక్దౌ సక్థ్యోర్వాయవ్యః శ్వేతః పుచ్ఛఇన్ద్రాయ స్వపస్యాయ వేహ ద్వైష్ణవో వామనః||

    (అశ్వమేధమున ఇరువది యొక్క యూపములుండును. మధ్య యూపమును 'అగిష్ఠము' అందురు.  దానికి పదిహేడు పశువులు కట్టబడును.)

    అశ్వము, కొమ్ములు లేని మేక, గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. వానిని మధ్యయూపమునకు కట్టుచున్నాను. నలుపుగొంతు మేక అగ్ని సంబంధము. దానిని అశ్వపు ముఖము వద్ద కట్టుచున్నాను. మేక సరస్వతి సంబంధి దానిని ముందు కట్టుచున్నాను. తెలుపు, నలుపు, తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమ ప్రక్కల కట్టుచున్నాను. త్వష్ట యొక్క రెండు పశువులను గుర్రపు వెనుక కాళ్ళకు ఒక్కొక్కటి చొప్పున కట్టుచున్నాను. వాయుసంబంధి పశువును గుర్రపు తోకకు కట్టుచున్నాను. సుకర్మ ఇంద్రుని కొరకు కడుపుతోనున్న ఆవును - విష్ణువునకు పొట్టి పశువును గుర్రపు తోకకు కట్టుచున్నాను.

    (ఇవి పదిహేను పశువులు. వీనిని 'పర్యంగ్య' అందురు. మిగత యూపములందు పదహారేసి పశువులు కట్టుదురు.)

    2. లోహితము, ధూమ్ర లోహితము, రేగుపండు ఎరుపు ఇవి సోమదేవతా సంబంధములు. పసుపు పచ్చనిది, చిలక పచ్చనిది, అరుణ బభ్రు వరుణ దేవతాకములు. కృష్ణ ఛిద్రము - శితి ఛిద్రము, సర్వశితి ఛిద్రము, సవితా దేవతాకములు. నల్ల కాళ్ళది, శితి బాహువు, సర్వ శితి బాహువు బృహస్పతి దేవతాకము.

    (వీనిని మధ్య యూపమున కట్టవలెను.)

    విచిత్ర వర్ణ బిందు, లఘు బిందు, స్థూల బిందు గోవులు మిత్రా వరుణ దేవతాకములు.

    (వీనిని రెండవ యూపమున కట్టవలెను.)

    3. శుద్ధ వాలము, సర్వ శుద్ధ వాలము, మణి శుద్ధ వాల పశువుల అశ్వినీ దేవతాకములు శ్వేత, శ్వేత చక్షు అరుణ వర్ణ పశువులు పశుపతి రుద్ర దేవతాకములు. తెలుపు చెవులవి యమ సంబంధులు. గర్వయుక్త పశువులు రుద్ర సంబంధములు. నభోరూపలు పర్జన్య సంబంధులు.

    (పశవః తృతీయ నియోజ్యాః)

    4. విచిత్ర వర్ణలు, వంకర గీతలవి. ఎదురు గీతలు పశువులు మరుద్దేవతాకములు. చిక్కిన దేహములవి, రక్త రోమములవి, తెల్లని ఆడ పశువులు సరస్వతీ దేవతాకములు. ప్లీహ కర్ణలు, హ్రస్వ కర్ణలు, రక్త కర్ణ పశువులు త్వష్ట దేవతాకములు. నల్లని మెడ గల తెల్లని చంక గల, పుండ్ర జంఘ పశువులు, ఇంద్రాగ్ని దేవతాకములు. కృష్ణపుండ్ర, అల్పాపుండ్ర, అల్పాంజి, మహాంజి పశువులు ఉషా దేవతాకములు.

    (చతుర్థే యూపే నియోజ్యాః)

    5. విచిత్ర వర్ణలగు మూడు స్త్రీ పశువులు విశ్వే దేవతలవి. రెండున్నర ఏండ్ల ఎర్రని పశువులు వాగ్దేవతవి. విశేష చిహ్నములు లేని మూడు పశువులు అదితి దేవివి. సమాన వర్ణలగు మూడు పశువులు దాతా దేవతని. చిన్న మేకలు దేవ పత్నులవి.

    (పంచమే)

    6. నలుపు మెడ గల మూడు పశువులు అగ్ని దేవతవి. శ్వభ్రు వర్ణలు మూడు వసువులవి. ఎరుపు రంగు మూడు పశువులు రుద్రులవి. శ్వేత వర్ణ, అధోచ్ఛిద్రములు మూడు ఆదిత్యులవి. నభో రూపములు మూడు పర్జన్యునివి.

    (షష్ఠే)

    7. ఎత్తువియు, పొట్టివగు మూడు పశువులు ఇంద్ర, విష్ణువులవి. పూర్ణ శ్వేత బాహు, శ్వేత పుష్టములు ఇంద్ర - బృహస్పతులవి. చిలక పచ్చనివి మూడు అశ్వ దేవతవి. మట్టి రంగువి మూడు అగ్ని, మరుత్తులవి. నలుపు వర్ణపు మూడు పూష దేవతవి.

    (సప్తమే)

    8. కుర్వర వర్ణములగు మూడు పశువులు ఇంద్రాగ్నులవి. రెండు రంగుల మూడు అగ్ని - సోములవి. పొట్టి ఎద్దులు మూడు అగ్ని - విష్ణువులవి. వంధ్య మేషములు మూడు మిత్రా వరుణులవి. మట్టి రంగుని మూడు - వేరుగా- మిత్ర దేవతవి.

    (అష్టమే)

    9. నలుపు మెడల మూడు పశువులు అగ్ని సంబంధులు. పసుపు పచ్చని మూడు సోమ సంబంధులు. తెలుపు రంగువి మూడు వాయు సంబంధులు. చిహ్న రహితలు మూడు అదితి సంబంధులు. సమాన వర్ణలు మూడు ధాత సంబంధులు. మూడు చిన్న మేకలు దేవపత్ని సంబంధలు.

    (తొమ్మిదవ యూపమున కట్టవలెను.)

    10. మూడు నల్లని పశువులు భూమి దేవతాకములు. మూడు ధూమ్ర వర్ణలు అంతరిక్ష దేవతాకములు. మూడు పెద్ద పశువులు ద్యుదేవతాకములు. మూడు వివిధ వర్ణలు విద్యుద్దేవ తాకములు. మూడు సిధ్మరోగ పశువులు నక్షత్ర దేవతాకములు.

    (పదవ యూపమునకు కట్టవలెను.)

    11. ధూమ్ర మేషములు మూడింటిని వసంతమునకు బలిఇత్తుము. తెలుపు మేకలు మూడింటిణి గ్రీష్మ ఋతువునకు బలి ఇత్తుము. నలుపు మేకలు మూడింటిణి వర్ష ఋతువునకు బలి ఇత్తుము. ఎరుపు మేకలు మూడింటిని శరదృతువునకు బలి ఇత్తుము. మచ్చల మూడు మేకలను హేమంతమునకు బలి ఇత్తుము. పసుపు రంగు మూడు మేకలను శిశిరమునకు బలి సమర్పింతుము.

    12. ఒకటిన్నర సంవత్సరముల మూడింటిని గాయత్రికి, రెండున్నర సంవత్సరముల మూడింటిని త్రిష్టుప్ నకు, రెండేళ్ళ మూడింటిని జగతికి, మూడేళ్ళ మూడింటిని అనుష్టుప్ నకు, మూడున్నర ఏండ్ల మూడింటిని ఉష్ణిక్ ఛందముల కొరకు బలి సమర్పింతుము.

    13. నాలుగేండ్ల మూడింటిని  విరాట్ ఛందమునకు, మూడేండ్ల మూడు ఎద్దులను బృహతీ ఛందమునకు, మూడు వృషభములను కకుప్ ఛందమునకు, మూడు ఎద్దులను పంక్తి ఛందమునకు, మూడు గోవులను అతిచ్ఛందమునకు బలి అర్పింతుము.

    14. మూడు నల్లని మెడ పశువులు అగ్ని దేవతాకములు. మూడు బభ్రు వర్ణలు సోమ దేవతాకములు. మూడు ధ్వస్త వర్ణలు సవితృ దేవతాకములు. మూడు వత్సతరములు సరస్వతీ దేవతాకములు. మూడు కృష్ణ వర్ణలు పూష దేవతాకములు. మూడు పృశ్ని వర్ణలు మరుద్దేవతాకములు. మూడు అనేక రూపాలు విశ్వే దేవతాకములు. మూడు గొడ్డు ఆవులు ద్యావాపృథ్వీ దేవతాకములు.

    15. వరుణ ప్రఘాస పర్వపు పదిహేను పశువులు చెప్పబడినవి. మూడు కర్వర పశువులు ఇంద్రాగ్ని దేవతాకములు. మూడు కృష్ణ వర్ణ పశువులు వరుణ దేవతాకములు. మూడు చారల పశువులు మరుద్దేవతాకములు. మూడు కొమ్ములు లేని పశువులు ప్రజాపతి దేవతాకములు.

    16.  (అథ సాకమేధ పశవః)
   
    తొలి చూపు మూడు పశువులను సేనావాన్ అగ్ని కొరకు వధించవలెను. వాత్య పశువులను మూడింటిని సాంతపాన మరుత్తుల కొరకు, మూడు అప్పుడే పుట్టిన పశువులను గృహమేధి మరుత్తుల కొరకు, మూడు సంకల్పిత పశువులను క్రీడి మరుత్తుల కొరకు, మూడు విడి పశువులను స్తవవాన్ మరుత్తుల కొరకు వధించవలెను.

    17.  పద్ధెనిమిదవ యూపపు హవియను పదిహేను పశువులు చెప్పబడినవి. పందొమ్మిదవ యూపమునకు మూడు కుర్వర వర్ణలు ఇంద్రాగ్నుల కొరకును, మూడు పెద్ద కొమ్మలవి మహేంద్ర దేవత కొరకును, అనేక వర్ణ పశువులు విశ్వ కర్మ కొరకును కట్టవలెను.

    18. (పితరుల ఇష్టదేవతా పశువులు)

    మూడు కృష్ణవర్ణ ధూమ్రములు సోమపాయి పితరులవి. మూడు పసుపు ధూమ్రములు దర్భాసన పితరులవి.

    (ఇరువదవయూపమున)

    కృష్ణ బభ్రువర్ణలు అగ్ని ష్వాత్త పితరులవి. మూడు నల్లని పృష్టము - చుక్కలు గలవి త్ర్యంబాకా దేవతాకములు.

    19. (శునాసీరీయ పశవః)

    అగ్ని మున్నగు వారికి సంబంధించిన పదిహేను పశువులు చెప్పబడినవి. మూడు కుర్వరపశువులు శునాసరీయములు.

    (ఇరువది ఒకటవ యూపమున)

    మూడు తెల్లని పశువులు వాయు దేవతాకములు. మూడు తెల్లనిచే సూర్యదేవతాకములు.

    (ఏవం సమప్తాః యూపాః)

    20.  (అథారణ్యాః పశవః ఉచ్యన్తే)

    వసంతము కపింజలమును, గ్రీష్మమునకు కలర్వికమును, వర్షమునకు తిత్తిరులను, శరత్తుకు వర్తికమును, హేమంతమునకు కకరమును, శిశిరమునకు వికికిరములను బలి ఇవ్వవలెను.

    21. సముద్రమునకు శింశుమారమును, పర్జన్యునకు మండూకమును, జలములకు  మత్స్యములను, మిత్రునకు కులీపయ మత్స్యములను, నాక్రాస్తజలచరములను వరుణునకు బలి ఇవ్వవలెను.

    22. సోమమునకు హంసలను, వాయువునకు కొంగలను, ఇంద్రాగ్నులకు సారసములను, మిత్రునకు మద్గులను, వరుణునకు చక్రవాకములను బలి ఇవ్వవలెను.

    23. అగ్నికి కుక్కుటములను, వనస్పతులకు ఉలూకమును, అగ్నిసోములకు చాషలను, అశ్వినులకు మయూరములను, మిత్రావరుణులకు కపోతములను బలి ఇవ్వవలెను.

    24. సోమునకు లవపక్షులను, త్వష్టకు కులీకులను, గోపాదులను దేవపత్నులకు, దేవజాతులు మరియు గృహస్పతి అగ్నికి పారుష్ణములను బలి ఇవ్వవలెను.

    25. దినములకు కపోతమును, రాత్రికి సీచాపును, రాత్రింబవళ్ల సంధులకు జతూపాత్రమును, మాసములకు జాత్యౌహమును, సంవత్సరమునకు గరుడమును బలి ఇవ్వవలెను.

    26. భూమికి మూషికమును, అంతరిక్షమునకు పాంకమూషికములను, ద్యులోకమునకు కశమూషిములను, దిశలకు నేవలములను, అవాంతర దిశలకు బభ్రుకులను ఆలంబనము చేయవలెను.

    27. వసువులకు బుశ్యలను, రుద్రులకు రురువులను, ఆదిత్యులకు న్యకువులను, విశ్వేదేవులకు పృషతులను, సంధ్యలకు కులుంకులను వధించవలెను.

    28. ఈశానునకు పరస్వత మృగమును, మిత్రునకు గౌరమును, వరుణునకు మహిషమును బృహస్పతికి గవయులను బలి ఇవ్వవలెను.

    29. ప్రజాపతికి మగ ఏనుగును, వాణికి వక్రతుండమును, నేత్రములకు మశకములను, కర్ణములకు భ్రమరములను బలి ఇవ్వవలెను.

    30. ప్రజాపతి, వాయువులకు గౌరమృగమును, వరుణునకు అరణ్యమేషమును, యమునకు కృష్ణ మేషమును, మనుష్యరాజాయ మర్కటః సింహమునకు ఋష్యమును, ఋషభమునకు, గవయిని, క్షిప్రశ్యేనమునకు వర్తికను, నీలింగమునకు కీటమును, సముద్రమునకు శింశుమారమును, హిమాలయమునకు గజమును ఆలంబనము చేయవలెను.

    31. ప్రజాపతికి తురంగవదన కిన్నరము, ఉవమృగము, హలక్షణ సింహములగును. వృషదేవతది బిడాలము, ధాతకు కొంగ, దిశలకు కాకి, అగ్నిదేవతకు చటకము, త్వష్టకు రక్తసర్పము. పుష్కర సాదము. వాక్కునకు సారసమగును.

    32. కులంగ, అరణ్యఅజ, నేవలా మయూరి సోమదేవతవి. పూషదేవతది కోష్ఠము. మాయుది నక్క. ఇంద్రునిది గౌరమృగము. పిద్వునిది న్యంగుకము. అనుమతి కక్కటము. ప్రతిశ్రుతిది చక్రవాకము.

    33. వలాహక, శార్గములు సూర్యదేవతాకములు. సృజయ, శాయండకములు మిత్రదేవతాకములు. పురుషవాక్కుశారిక సరస్వతీ దేవతాకము. శ్వావిత్ భూమి దేవతాకము. వ్యాఘ్ర, వృక, చిరుత, సర్పములు మన్యు దేవతాకములు - శ్వావిత్ భూమి దేవతాకము. వ్యాఘ్ర, వృక, చిరుత, సర్పములు మన్యు దేవతాకములు - చిలక సముద్ర దేవతాకము.

    34. గరుడుడు పర్జన్య దేవతాకుడు. అతిర్వాహస, దర్వాదులు వాయుదేవతాకములు. పైంగరాజ పక్షి వాక్పాలక బృహస్పతి దేవతాకము. అలజము అంతరిక్షదేవతాకము. ప్లవ, మత్స్య, మద్గు నదీపతి సాగర దేవతాకము. కూర్మము ద్యావాపృథ్వీ దేవతాకము.

    35. పురుష మృగము చంద్రదేవతాకము. దార్వాఘటములు వనస్పతి దేవతాకములు. తామ్రచూడము సవితృదేవతాకము. హంస వాయుదేవతాకము. నాక్ర, మకర, కులీప,మత్స్యములు సాగరదేవతాకములు. "హ్రియైశాల్యకః".

    36. మృగి దిన దేవతాకము. మండూక, మూషక, తిత్తురులు సర్పదేవతాకములు. లోపాశ అశ్వినులది. కృష్ణమృగము రాత్రిదేవతది. ఎలుగు, జతు. సుషీలిక అన్య జనులవి. "జహకావైష్ణవీ".

    37. కోకిల అర్ధమాసములది. ఋష్యమృగ, మయూర, సుపర్ణలు గంధర్వులవి. ఉద్రము జనులది. తాబేలు మాసములది. రోహిత్పుణ్ణ్రుణాచీ గోలత్తికా త్కేప్సరసాం మృత్యువే అసితః మృత్యువుది నల్లని మృగము.

    38. భేకి ఋతుసంబంధి. మూషిక, కశ, మంధాలములు పితృసంబంధులు. అజగరము బలసంబంధి. కపింజలము వసుసంబంధి. కపోత, ఉలూక, శశికము నిరృతి సంబంధలు. "వరుణాయ అరణ్యో మేషః".

    39. శ్వేత ఆదిత్యానాం - ఉష్ణో, ఘృణీవాన్, వాఘ్రీనస్, మత్యా - మతికొరకు, సృమరో అరణ్యాయ రురురౌద్రః - క్వయి, కుటరు, దాత్యైహ వాజినాం. కామాయ పికః.

    40. ఖడ్గోమృగః వైశ్వదేవః శ్వాకృష్ణః, కర్ణోగర్దభః, అక్షుః రక్షసా. ఇంద్రాయ సూకరః. సింహోమారుతః కృకలాసః, పిప్పకా, శకునిస్తే శరవ్యాయై. విశ్వేషాం దేవానాం పృషతః.

    ఆలోచనామృతము

    1. ఇది వేదము. ఇందు విశ్వమంతయు ఇముడును. నేటివంటి వర్గీకృత శాస్త్రములు నాడులేవు. నేటి వర్గీకృతముల వలన శాస్త్రజ్ఞులు ఇబ్బంది పడుచున్నారు. కుడి కన్ను తెలిసినవానికి ఎడమకన్ను తెలియకున్నది. నేటి శాస్త్రజ్ఞులు WHOLISTIC సంపూర్ణ శాస్త్రమును గురించి ఆలోచించుచున్నారు. ఇది మనిషికి అక్కరకు వచ్చునది. వర్గీకరణ డబ్బుకు అక్కర వచ్చునది.

    2. ఈ అధ్యాయమున పశు, పక్ష్యాదులను గురించి చెప్పబడినది. వీనిలో ఎన్ని నేడున్నవో, ఎన్ని మృగ్యమైనవో పరిశీలించవలసి ఉన్నది. దేవతల సంబంధ విషయము కూడ పరిశోధించవలెను.

    నాకు తెలిసినంతలో భూమికి ఎలుకలను, కంటికి దోమలను, చెవులకు తుమ్మెదలను బలి ఇమ్మన్నాడు. ఇవి వాటి వాటికి నష్టము కలిగించునవి. ప్లవో మద్గుర్మత్స్యస్తే నదీపతమే. ప్లవ, మద్గుర, మత్స్యములు సాగరమునకు ఉపకరించునవి. పరిశీలనలో సర్వము విదితమగును.

   
                                  దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
        దేవతా పశువాచకమగు ఇరువది నాలువఅధ్యాయము ముగిసినది.
                                    అధనాస్సధనాస్సంతు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.