Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
17. నివాసదాతలగు ఆదిత్యులారా! సుందరము, సుఖకరమగు మీ నావలో మమ్ము సకల పాపములనుండి దాటించవలెను.
18. ఆదిత్యులారా ! మీరు శోభన తేజోవంతులు మాకు, మా పుత్ర, పౌత్రులకు దీర్ఘాయువు ప్రసాదించండి.
19. ఆదిత్యులారా ! మా యజ్ఞము మీవలన చేరును. మీరు మమ్ము సుఖవంతులను చేయండి. మాకు మీ బాంధవ్యము లభించవలెను. మేము సదామీవారమై ఉందుము.
20. మరుత్తుల పాలకుడు ఇంద్రుని, అశ్వినులను, మిత్రావరుణులను బలిష్ఠము, శీతాతప నివారకమగు గృహమును వేడుచున్నాము.
21. మిత్ర, ఆర్యమ, వరుణ, మరుద్గమలారా! మీరు హింసాశూన్యులు. పుత్రాదియుక్తులు. స్తోతవ్యులు. శీతాతప వర్షనివారకమగు గృహమును ప్రసాదించండి.
22.ఆదిత్యులారా! మృత్యువు దరి చేరిన మానవునకు జీవించుటకుగాను ఆయువును పెంచండి.
పందొమ్మిదవ సూక్తము
ఋషి - కాణ్వసౌభరి, దేవత - అగ్ని, చందస్సు -వివిధములు
1. స్తోతలారా! అగ్ని ప్రఖ్యాతుడు. అతనిని స్తుతించండి. అగ్ని స్వర్గమునకు హవిచేర్చువాడు. ఋత్విక్కులు అగ్ని వద్దకు వెళ్ళుదురు. దేవతలకు పురోడాశాదులు సమర్పింతురు.
2. అగ్ని అనంతదాత. విచిత్ర తేజస్వి. సోమసాథ్యుడు. ఈ యజ్ఞపు నియంత పురాతనుడు విప్రసౌభరీ ! యజ్ఞము కొరకు అగ్నిని స్తుతించుము.
3. అగ్నీ! నీవు యాజ్ఞకులందు శ్రేష్ఠుడవు. దేవతలందు అత్యంత దానగుణయుక్తుడవు. హొతవు. అమరుడవు. ఈ యజ్ఞమునకు కర్తవు. మేము నిన్ను ఆరాధింతుము.
4. అగ్ని అన్నప్రదాత సుధనుడు ప్రకాశకుడు ప్రశస్త తేజోవంతుడు. అట్టి అగ్నిని స్తుతింతును. అగ్నిని స్తుతింతును. అగ్ని మేము చేయు దేవయజ్ఞమున, మిత్ర వరుణల సుఖము కొరకును, జలదేవత సుఖము కొరకును యజ్ఞము చేయవలెను.
5. సమిధలతో అగ్నిని సేవించువారున్నారు. అహుతులతో అగ్నికి పరిచర్యలు చేయువారున్నారు. వేదాధ్యయనమున ఆరాధించు వారున్నారు. జ్యోతిష్టోమాది యజ్ఞయుక్తులై నమస్కరించి యాచించువారున్నారు.
6. అట్టివారల అశ్వములు వృద్ధిచెందును. అవివేగవంతములగును. వారి కీర్తి అందరిని మించినదగును. దేవకృత, మాననవిహిత పాపములు వారిని తాకవు.
7. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. హవిష్పతివి. నీయొక్క గార్హపత్యాదుల ద్వారా మేము చక్కని అగ్నివంతులమగుదుము. మంచి వీరుల యుక్తడవై నీవు మమ్ము గుర్తుంచుకొనుము.
8. అగ్ని ఉత్తమ అతిథిసముడు, స్తోతల హితము కోరువాడు. రథము వంటి ఫలప్రదాత. అగ్నీ! నీలో అనేక రక్షణలు ఉన్నవి. నీవు ధనములకు రాజువు.
9. సుభగ అగ్నీ! యజ్ఞవంతుడు సత్యఫలవంతుడు కావలెను. శ్లాఘనీయుడు కావలెను. స్తోత్రములతో ఆరాధించువాడు కావలెను.
10. అగ్నీ! ఏ యజమాని యజ్ఞముకొరకు నీవు పైకితెచ్చెదవో అతడు పుత్రాదియుక్తుడగును. సమస్త కార్యములను సాధించును. అశ్వములు సాధించిన విజయమును అనుభవించును అతనిని మేధావులు, శూరులు, పరిచారకులు సేవింతురు.
11. విశ్వములు వరించువాడును అందగాడయన అగ్ని స్తోత్రములు, అన్నము స్వీకరించిన ఇంటి యజమాని హవ్యములు దేవతలు అందుకుందురు.
12. అగ్నీ! నీవు బలపుత్రుడవు. నివాసప్రదుడవు. విప్రుడగు స్తోతహవిర్దానమునకు తొందరపడును. అట్టి అభిజ్ఞుని వచనము దేవతలకిందను, మనుష్యుల మీదను ఉండవలెను.
13. హవ్యదానము, నమస్కారములతో అగ్నిని సేవించు యజమాని సమృద్ధుడగును.
14. గార్హపత్యీది అఖండ అగ్నికి సమిధలర్చించి సేవించువాడు తన పనులవలన సౌభాగ్యవంతుడగును. ద్యుతిమంతుడగును కీర్తిలో నీటివలె మానవులందరిని దాటిపోవును.
15. అగ్నీ! ఇంటిలోని రక్కసులను పరాభవించుధనము పాపవృద్ధినిమ్ మానవక్రోధమును అణచివేయుధనము అట్టి ధనమును మాకు అందించుము.
16. వరుణుడు, మిత్రుడు, అర్యమ, అగ్నితేజముననే జ్యోతిని ప్రదానము చేయుదురు, భగ, అశ్వినులు అగ్ని తేజముననే ప్రకాశము అందింతురు మేము బలముతో అందరిని మించిన స్తోత్రజ్ఞులమై ఇంద్రుని రక్షణలు పొంది అగ్ని యొక్క ఆతేజస్సునే ఆరాధింతుము.
17. అగ్నీ! నీవు విప్రుడవు. ద్యుతిమంతుడవు. మానవులకు స్వరూపుడవు. సుకర్ముడవు. నిన్ను అర్ధించు ఋత్విక్కు ఉత్తమ ధ్యానవంతుడగును.
18. సుధన అగ్నీ! అట్టి యజమానియె నీకు వేడి ఏర్పరచును. ఆహుతులు అర్పించును, ద్యుతిమంతదినమున సోమాభిషవమునకు ఉద్యమించును. అతడు తన బలములతో కోరినధనము సాధించును. అతడే నిన్ను అభిలషించును ఆరాధించును.
19. ఆహుతాగ్ని మాకు శుభములు కలిగించ వలెను. సుధన అగ్నీ! నీవు ఇచ్చుదానము మాకు శుభావహము కావలెను. శుభప్రదము కావలెను. స్తుతలు కళ్యాణమయములు కావలెను.
20. సంగ్రామమున నీ మనసు భద్రము కావలెను. ఆ మనసుతోనే శత్రువులను పరాజితులను చేయుము. సమర్థలైన శత్రువుల స్థిరము, ప్రభూతమగు బలమును చిత్తుచేయుము. మేము అభిగమన సాధన స్తోత్రములతో నిన్ను భజింతుము.
21. ప్రజాపతి స్థాపించిన అగ్నిని నేను పూజింతును. ఆ అగ్ని అందరినిమించి యజ్ఞము చేయువాడు. హవ్యవాహకుడు ఈశ్వరుడు. దేవతలచే దూతను చేసి పంపబడినవాడు దేవతలు అగ్నిని తమ దూతను చేసినారు.
22. అగ్ని ప్రజ్వలిజ్వాలలవాడు. నిత్య తరుణుడు. శోభిల్లువాడు. అట్టి అగ్నిని గురించి హవిరూప అన్నపు పాటపాడండి. అగ్ని ప్రియ సత్యవచనములచే స్తుతుడై, ఘృతములతో ఆహూతుడై, స్తోతకు మంచి బలమును ప్రసాదించును.
23. అగ్ని ఘృతములతో ఆహూతడై పైనను, దిగువను ధ్వనులు చేయును. అప్పుడు అగ్ని సూర్యసమాన తేజస్కుడై ప్రకాశించును.
24. అగ్నిని మనుప్రజాపతి స్థాపించినాడు. ప్రకాశకుడగు అగ్ని తన సుగంధి ముఖముతో దేవతలకు హవ్యములంపును. అగ్ని సుయజ్ఞవంతుడు. దేవతల ఆహ్వత దీప్తిమంతుడు అమరుడు. అగ్ని వరణేయ ధనమును సేవించును.
25. అగ్నీ ! నీవు బలపుత్రుడవు ఘృతహుతుడవు. అనుకూల దీప్త వంతుడవు. నేను మర్త్యుడను. నిన్ను ఉపాసింతును. నీవలె మరణశూన్యుడను అగుదును.
26. పసిడి అగ్నీ! అపవాదములు విని నిన్ను తిరస్కరించను. పాపము కొరకు నిన్ను తిరస్కరించను నా స్తోతలు అనరాని మాటలని నిన్ను అవమానించరు. ఆరాధనీయ అగ్నీ! నా దుర్బద్ధి నాకు శత్రువుకారాదు. అది పాపము పెంచి నన్ను బాధించరాదు.
27. కొడుకు తండ్రికి అందించినట్లు పోషణకర్త అగ్ని యజ్ఞగృహమున మా హవ్యములు దేవతలకు అందించును.
28. ధనవంత అగ్నీ! నేను మానవుడను. నీరక్షణ పొందినవాడను. సదా నీ ప్రసన్నతను సేవింతును.
29. అగ్నీ! నేను నీకు పరిచర్యలు చేయుదును. భజింతును. హవ్యదానముచేతును. ప్రశంసింతును. భజింతును. నీవు ధనశాలివి. నీ బుద్ధివాచాలము జనులు నిన్ను నారక్షకుడు అనుచున్నారు. నాకు ప్రదానము చేయుటకు ప్రసన్నుడవగుము.
30. అగ్నీ! నీవు స్నేహము చేసిన యజమాని - నీ యొక్క బలపూర్ణము, అన్నపూర్ణమగు రక్షణలతో ప్రవృద్ధుడగును.
31. అగ్నీ ! నీవు సోమమున తడిసినవాడవు. ద్రవశీలివి. ధ్వనించువాడవు వసంతాది ఋతువులతో పుట్టినవాడవు. దీప్తిశాలివి. నీకొరకు సోమము సిద్దమైనది. నీవు విశాల ఉపస్సుల మిత్రుడవు. రాత్రులందు సకల వస్తువులను కనిపింపచేతువు.
32. అగ్ని బహుతేజస్వి అందగాడు సామ్రాట్టు 'త్రసదస్సు' ద్వారా స్తుతించ బడినవాడు. మేము సోభరులము రక్షణ కొరకు అగ్నిని ఆశ్రయించినాము.
33. అగ్నీ! ఇతర అగ్నులు చెట్టుకొమ్మల వలె నిన్ను అంటుకొని ఉండును. మానవులందు నేను నీబలమును స్తుతులద్వారా పెంచువాడను. నేను సైతము ఇతరస్తోతలతో సమానముగా కీర్తిని పొందుదును.
34. ద్రోపరహితి, ఉత్తమ దాతలగు ఆదిత్యులారా! హవివంతులందరిలో - మీరు దరి చేర్చిన వాడే ఫలవంతుడగును.
35. ఆదిత్యులారా! మీరు విరాజమానులు. శత్రుపరాభవ కర్తలు. మీరు మానవ హూతుక శత్రువులను పరాజితులను చేయండి వరుణ, మిత్ర ఆర్యమ వీరే మీ యజ్ఞములకు సారథులగుదురు.
36. పురుకుత్యపుత్రుడు త్రసదస్యుడు మాకు ఏబదిమంది వధువులను ఇచ్చినాడు. అతడు గొప్పదాత స్వామీ స్తోతల పోషకుడు.
37. అందమగు 'సువాస్తు' నదీ తీరమున ఉన్నవాడును నల్లని ఎద్దుల నాయకుడును. పూజ్యధనవంతుడును దానయోగ్యములగు రెండు వందల పది గోవుల స్వామియు అగు త్రసదస్యుడు ధనము వస్త్రములు మున్నగువానిని ఇచ్చినాడు.
ఇరువదవ సూక్తము
ఋషి - కాణ్వసౌభరి, దేవత - మరుత్తులు, ఛందస్సు - మొదటి దికికిభ - మిగిలినవి బృహతి
1. ప్రస్థానముగల మరుద్గణములారా! విచ్చేయండి మమ్ము బాధించ వద్దు మీరు సమాన తేజస్కులు. పర్వతములను సహితము వదకించగలరు. మమ్ము విడువకండి వేరుచోటుకు వెళ్లకండి.
2. మరుత్తులారా! మీరు రుద్రపుత్రులు మీనివాసములు ప్రకాశమానములు. మీరు అందరి అభిలషణీయులు. చక్కని ఇరుసుగల రథమున విచ్చేయండి. ఈ సోభరిని గుర్తుంచుకోండి అన్న సహితులై నేడు మా యజ్ఞమునకు రండి.
3. విష్ణువు కర్మవంతుడు మరుత్తులు రుద్రపుత్రులు. అందరికి అవసరమగు జలములను ఇచ్చువారు. మేము ఆ ఉభయుల ఉగ్రబలమును ఎరుగుదుము.
4. మరుత్తులారా! మీరుమంచి ఆయుధములు గలవారు. దీప్తివంతులు మీరు కోపించినపుడు సమస్త ద్వీపములు కూలును. స్థావరములు దుఃఖంచును. ద్యావాపృథ్వులు గడగడలాడును గమనశీల జలము పొంగి పోర్లును.
5. మరుత్తులారా! మీరు యుద్ధమునకు వెడలినపుడు వాలనిమబ్బులు , రాలనిచెట్లు రొపెట్టును భూమి గ్రక్కదలుసు.
6. మరత్తులారా! మీరు విశేషబలవంతులు నాయకులు మీకు దారి ఇచ్చుటకు ద్యులోకము విశాల అంతరిక్షమువీడి పారిపోయినది. మీరు మీదేహములందు వెలుగుల చిమ్ము ఆభరణములు ధరింతురు.
7. మరుత్తులు ప్రదీప్తులు బలవంతులు అకుటులులు నేతలు హవిరూప అన్నమునకుగాను వారు శోభిల్లుదురు.
8. సోభరి మున్నగు ఋషుల సుస్వరముల మధ్య రథమధ్యమందలి మరుత్తుల వీణమ్రోగగును. మరుత్తులు గోమాతృకలు శోభన జన్ములు మహానుభావులు వారు మా అన్నము భోగము, ప్రీతి కొరకు అవతరించ వలెను.
9. సోమమునుచేయు అధ్వర్యులారా! వర్షదాతలగు మరుత్తుల కొరకు హవ్యము తెండి. వారు హవ్యబలమున నీరు అందించువారు ఉత్తమ నడకకలవారలగుదురు.
10. మరుద్గణములు నేతలు సేచనసమర్ధులు అశ్వయుక్తులు వారు వర్షరూపముదాల్చి, వర్షకనాభిగల రథముమీద హవ్యము వద్దకు శ్యేనమువలె వేగముగ విచ్చేయ వలెను.
11. మరుత్తులను అలంకరించు ఆభరణములు ఒకేతీరువి. వెలుగుచిమ్ము బంగారు నగలు వారి రొమ్ములందు విరాజిల్లును వారి చేతులందు గల ఆయుధములు తళ తళ మెరయును.
12. మరుత్తులు ఉగ్రవర్ధకులు భయంకర బాహువులు గలవారు. వారికి తమదేహములను రక్షించు కొనవలసిన పని ఉండదు. మరుత్తులారా! మీ రథమునందలి ఆయుధములు, ధనస్సులు సుదృఢములు. అందువలననే రణరంగమున, సేనాముఖమున మీకే విజయము కలుగును.
13. మరుత్తులు జలమువలె సర్వత్ర వ్యాపించినవారు. వారు అనేకులు అయినను ఒకే పేరుగలవారు. అట్లయు వారి పేర్లు పైతృకములు సుదీర్ఘములు అన్నమువలె స్థిరములు భోగయోగ్యములు.
14. మరుత్తులకు ప్రణమిల్లండి వారిని స్తుతించండి ఆర్యస్వామి యొక్క హీన సేవకునివలె మేము గడగడలాడించు మరుత్తులు హీన సేవకులమగుదుము. వారి దానము మహిమాన్వితము.
15. మరుత్తులారా! మీ రక్షణ పొందిన గతమందు కూడా సుధనుడైనాడు. మిమ్ము స్తుతించువాడు మీవాడగుట తథ్యము.
16. మరుత్తులారా! మీరునేతలు కంపకులు మీరు హవ్యము కొరకు హవిష్మంతుడగు యజమాని ఇంటికి వెళ్లుదురు. అట్లు మీరు వెళ్లిన యజమాని మీరు అందించిన ద్యుతిమంతమగు అన్నమును అనుభవించును. శుభములను నలువైపుల వ్యాపింపచేయును.





