Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దుర్యోధనా! జూదము మంచిది కాదు. జూదము వలన పాండవులతో విరోధము కలుగును. విరోధము వలన ప్రజలకు హాని కలుగును. పాండవులతో స్నేహము కలిగి ఉండుము. వారి రాజ్యలక్ష్మికి ఈర్ష్యపడకుము. నీవు పాండవులను వంచించదలచినావు. వారి సంపద హరించదలచినావు. అది పాపకార్యము. అందువలన సకల సంపదలు హరించును.
"విదురుడు సకల ధర్మములు తెలిసినవాడు. జూదము విదురునకు సమ్మతము కాదు. నీకు ధర్మరాజు కన్న అయిదురెట్లు సంపద ఉన్నది. ధర్మరాజు చేసిన రాజసూయము మించిన యజ్ఞము చేయుము. అందువలన సుఖము, శాంతి కలుగును.
ధృతరాష్ట్రుని మాటలు దుర్యోధనునకు నచ్చలేదు. "నాయనా! ధర్మరాజుతో జూదమాడుటయే నాకు ఇష్టమగు యజ్ఞము. జూదము నెపము. ధర్మరాజు సకల సంపదలు హరించుటకు ఉపాయము. ఉపాయము వలన సంపదలు సాధించగలిగిన రాజులకు అంతకుమించిన పురుషార్ధము లేదు. పూర్వము తపస్సు చేయుచున్న నముచి అను రాక్షసుని ఇంద్రుడు వధించినాడు. శత్రువును నిర్జించుటకు ఏ ఉపాయము అవలంభించినను దోషము లేదు. చెట్టు ఎంత పెద్దదయినను పురుగు తొలచిన నాశనమగును. శత్రువు ఎంత చిన్నవాడయినను బలవంతుని నాశనము చేయును. స్వల్ప వ్యాధిని అయినాను ఉపెక్షింపరాదు. ఉపేక్షించిన వ్యాధి ముదిరి శరీరమునకు హాని కలిగించును. పాండవులు మనకు శత్రువులు .వారిని ఉపేక్షించరాదు. వారి సంపద హరించకున్న నా మనస్తాపము దూరము కాదు. మనస్తాపము పోకున్న ఆ మంటలకు నేను బలి అగుదును.
"తండ్రీ! నీవు విదురుని మాట వినరాదు. విదురుడు పాండవపక్షపాతి. అతడు పాండవుల మేలుకే పాటుపడును గాని మన మేలును గురించి ఆలోచించడు. స్వకార్యమును పరుల ఆలోచన ప్రకారము చేయరాదు. ఏలనన తన తలంపు ఇతరుల తలంపు ఒక రీతిగా ఉండబోదు. కావున విదురుడు చెప్పినట్లు మనము వినరాదు. జూదము పురాణములందు ఉన్నది. స్నేహముగా జూదమాడిన దేవసాయుజ్యమును పొందుదురు. కావున నీవు వెనుక ముందాడరాదు. నీ కొడుకు ప్రాణములు దక్కవలెనన్న ధర్మరాజును రప్పింపుము. ధర్మరాజుతో జూదమాడుటకు శకుని మామకు అనుమతినిమ్ము. ఇంతకు మించి చెప్పను. నీకు నేను కావలెనో, విదురుడు కావాలేనో నిశ్చయించుకొనుము" అని శకునితో కలిసి లేచిపోయినాడు దుర్యోధనుడు.
ధృతరాష్ట్రుడు ఆలోచించినాడు. ఆలోచించినాడు. దుర్యోధనుని కోరిక తీర్చుటకే నిర్ణయించినాడు. విదురుని హితోపదేశము వినలేదు. విదురుని ఇంద్రప్రస్థమునకు వెళ్ళమన్నాడు. ధర్మరాజును తోడ్కొని రమ్మన్నాడు. విదురుడు మరొకసారి చెప్పినాడు. మాయాజూదము ఉభయులను నాశనము చేయును అని చెప్పినాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు. మానినాడు. దుర్యోధనుడు తండ్రిని బాలావంత పెట్టినాడు. ఇట్లు అనేక పర్యాయములు జరిగినది. తుదకు విదురుడు ధృతరాష్తుని మాట వినక తప్పలేదు. జూడమునకు సమ్మతించినాడు. ధర్మారాజాదులను తోడ్కొని వచ్చుటకు నిస్చయుంచినాడు. ఇంద్రప్రస్థమునకు పయనమయి వెళ్ళినాడు.
ఆలోచనామృతము
మానవుడు నాగరికతలో ముందుకు దూసుకొని పోవుచున్నాడు. శాస్త్ర ప్రగతి మనిషితో చంద్రుని తల తన్నించినది. మానవుడు ఎన్నో సాధించినాడు. భౌతికముగా మరెన్నో సాధించనున్నాడు. అతడు సూర్యుని సైతము గెలువవచ్చును కాని, తనను తాను గెలువ లేకున్నాడు.
ఆనంతమయిన మానవ చరిత్రలో మనిషి ఉపకరణములు మారిన కధలున్నవి. మనిషి మారిన కధ కనిపించదు. నాటి నుంచి నేటి వరకు మానవ మనస్తత్వమున వచ్చిన మార్పు అంతగా కనిపించదు. మనిషి తన బాహ్య ప్రపంచమును నమ్మరానంతటి సుందరముగా మలచుకున్నాడు. కాని తనలోని వికారమును ఇసుమంత తగ్గించుకొనలేక పోయినాడు.
ఈర్ష్యా ద్వేషములు మానవుని పాలిట శాపములు. అవి అన్ని యుగములందును ఉన్నవి. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు కృతయుగపునారు. రావణాదులు త్రేతాయుగపువారు. దుర్యోధనాదులు ద్వాపరయుగపు వారు, కలియుగమున అట్టివారు కొల్లలు. మానవ మనస్తత్వమున యుగములతో నిమిత్తమున్నట్లు కనిపించదు.
ఈర్ష్యా ద్వేషములు ఒకే కుటుంబము వారిలో ముఖ్యముగా అన్నదమ్ములతో కనిపించుచున్నది. ఇది నాటి నుంచి నేటివరకు ఉన్నవి. ఈర్ష్యా, ద్వేషములు వ్యక్తుల మధ్య ఉన్న కుటుంబములు, రాజ్యముల మధ్య ఉన్న రాజ్యములు నాశనములు అగుచున్నవి. నేడు ఈర్ష్యా ద్వేషములు అగ్రరాజ్యముల మధ్య కనిపించుచున్నవి. ఇవి ప్రపంచ నాశనమునకు కారణము అయినను కావచ్చును.
దుర్యోధనుడు పుట్టుకతోనే ఈర్హ్యా ద్వేషములతో పుట్టినాడు. అతడు ప్రమాదకారి కానున్నాడని భీష్మాదులు గ్రహించినారు. పుత్రుని విడిచి కులమును రక్షించమని ధృతరాష్ట్రునకు బోధించినారు. పుత్రేషణతో ధృతరాష్ట్రుడు వినలేదు. సగరునకు అసమంజసుడు అను దుర్మార్గుడైన కొడుకు ఉండేవాడు. రాజ్యమును, ప్రజలను రక్షించుటకు సగరుడు దుష్టపుత్రుని వదులుకున్నాడు.
దుర్యోధనునిది అకారణ వైరము. వాస్తవముగా పాండవులు అతనికి ఎట్టి అపకారమును చేయలేదు. వారిని నాశనము చేయవలెనని అతని పట్టు. తమ బలదర్పములతో తొలిసారి రాజ్యములను గెలిచినారు. పాండవులు, అప్పుడు వారిని లక్క ఇంటికి తోసినాడు. ఇప్పుడు మాయజూదమున వారిని నాశనము చేయవలెనని వలపన్నినాడు.
దుర్మార్గుని మార్పు ఉపాయము మానవుడు కనుగొనలేక పోవుచున్నాడు. దుర్యోధనునిది వ్యాసుని వంశము. మానవతకు మహా గ్రంధములు ప్రసాదించినాడు. భరత వంశమును రక్షించుటకు భీష్ముడు అనితర సాధ్యమున త్యాగము చేసిన మహా విద్వాంసుడు. వీరు కాక ద్రోణ కృపాదులున్నారు. ఇందరును దుర్యోధనుని మీద ప్రభావము వేయలేకపోయినారు. ఒక దుష్టుడు అనేక మంది మహాత్ములను దిక్కరించి తన పంతము నెగ్గించుకొనుచున్నాడు.
ఒక్క దుర్మార్గుడు నాశనము చేయుటకు చాలును. మానవతను ఉద్దరించుటకు వేలమంది మహాత్ములయినను చాలరు.
2. వ్యాస, వాల్మీక్యాదుల రచనా శిల్పము అత్యంత ఉన్నతము. ఆనాడే అంతటి ఔన్నత్యమును సాధించినారు. వారు సృష్టించిన పాత్రలు, సన్నివేశములు జీవితమునకు ఉదాహరణములు. అవి యుగములతో నిమిత్తము లేక ఊపిరిపోసుకుని జీవించుచున్నవి. వ్యతిరేకులతో శ్లాఘింపచేయుట వ్యాస, వాల్మీకులలోని ప్రత్యేకత. వాల్మీకి మారీచాదులతో రాముని గుణగుణములను కీర్తింపచేయును. ఇక్కడ వ్యాసుడును అట్లే చేసినాడు. పాండవుల సంపదను దుర్యోధనుడు పొగడినాడు. దుర్యోధనుడు పొగడిన తీరును బట్టి రాజసూయము ఎంత గొప్పగా జరిగినదో మనకు అర్ధమయినది.





