Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    ఒకనాటికి ఆమెకు ఆ బాధలన్నీ విని సహించే శక్తి రావచ్చు. గుండె బండగా మారొచ్చు. అసలు ఈ జన్మలో అనుభవించే దుఖాలకు పురాకృత పాపాలే కారణం! కరుణా సాగరుని దగ్గరికి వెళ్తున్న కొద్దీ అని కడిగి వేయబడ్తాయి. వైద్యుడు డబ్బు పుచ్చుకొని శారీరక బాధల్ను మాన్పుతాడు. కాని మాతృధర్మం అలాంటిది కాదు. ఆమె తొలగ దీసే బాధ మానసిక బాధ కంటే కూడా అతీతం అయింది. ఆమె స్పర్శించేది. అత్యుత్తమైన ఆత్మజ్యోతిని. ఆమె తాకిడికి ఆ జ్యోతి తన వెలుగును పెంచుకుంటుంది. ఆమె సర్వ భూతాల్లోనూ ప్రాణం లాంటిది. ఆమెయే వారి ఆత్మానందానికీ , మోక్షానికీ కారకురాలు. జగన్మాత శారీరక బాధల్ను కానీ, మానసిక వ్యాదుల్ను గాని కుదిరించడం లేదనే విషయం ఆనోటా, ఆనోటా అందరికీ పాకిపోయింది.
    అయినా ఆడవారికి ఆ మాటల్లో నమ్మకం కుదరలేదు. ప్రత్యేకమైన కోరికలు గల నారీమణులు వస్తూ ఉండేవారు. ఒక సంపన్నుని పత్ని వచ్చింది. ఆమెకు సంపద ఉంది. సంతానం లేదు. "ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం? అనుభవించే మొలక లేకపోయిం తర్వాత" అని వాపోయింది. ఇంకో ఆవిడ - రైల్వే క్లార్కు పెళ్ళాం వచ్చింది. ఆమెకు నలబై ఏళ్ళు నిండినట్లుగా లేదు. తొమ్మిది మంది పిల్లలు. పిల్లలు కలుగకుండా ఉండాలని ఆమె కోర్కె. ప్రతి సంవత్సరం ఒకడు అవతరిస్తున్నానని బెదిరిస్తాడు. ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చినప్పుడు గర్బ స్రావాలు అవుతూ ఉండేవి. అమెచేతులు జోడించి కష్టాలు చెప్పుకునేప్పుడు, కళ్ళలో నీరు కనిపించింది. "తిండి పెట్టడానికి శక్తి లేని వారికి బిడ్డల్ను ఎందుకిస్తావు" అని ఏడ్చింది.
    సిగ్గుతో లేఖ తల తిప్పుకుంది. అంతే అదే ఆమె జవాబు. బీటలు వారిన గుండెతో ఆమె తరలి పోయింది.
    అలాంటి గాధలన్నీ లేఖను కలిచి వేసేవి. ఆమె తండ్రితో పాటు పులిని ఎక్కింది. కాని ఆమె అతనిలా దృడ నిశ్చయంతోనూ నిశ్చితంగానూ కూర్చోలేక పోతుంది. ఆమెకు ఇదొక గడ్డు సమస్య అయింది. ఆమె బాధ పెరుగుతుంది.
    ఈ ప్రయాణం ఎక్కడికి? ఎంత దూరం ? తరువాత ? ఆ ...... తరువాత ?
    ఇప్పటికీ తండ్రి పోరాటంలో పాలు పంచుకోవడానికీ ఆమె సిద్దంగా లేదు. అతడు బ్రాహ్మణత్వం అపాదించుకొని, సమాజంలో అత్యున్నత స్థానం అధిరోహించి సాంఘికాచారాల్ను అవకతవక చేశాడు. అయినా అతనికి ఆ ఆచారాల్లో విశ్వాసం ఉంది. సాంఘికచారాల్ను అణగదొక్కే బదులు తాను స్వయంగా వాటిలో ఒక భాగం అయిపోతున్నాడు. అలాంటి శక్తిని వినియోగించుకొని తన పని నెగ్గించు కొంటున్నాడు. అతడు పుట్టి, పెరిగి పద్దవాడైంది ఒక అవస్థ. తెచ్చి పెట్టుకున్నది వేరొక అవస్థ. ఈ రెంటికీ బేధం ఏమిటి? గత కొద్ది మాసల్నుంచి ఆమె తండ్రిని ఏమాత్రం అర్ధం చేసుకోలేకపోతుంది. మంగల్ అధికారితో తిరుగుబాటు సుడిగాలిగా లేస్తున్నప్పుడు అతడు మాత్రం పులి మీద నిశ్చింతగా కూర్చున్నాడని ఎలా అనగలం? లేఖ తండ్రితో పాలు   పంచుకోవడం లేదు. ఆమెకు అతని పోరాటపు రూపురేఖలు సహితం తెలియదు.
    తుదకు ఆమెకొక ఊహ చటుక్కున తట్టింది. అంతటితో ఆమె ఉబ్బిపోయింది. పరీక్ష దగ్గరికి వస్తుంది. అతణ్ణి ఉద్రిక్తుడిని చేసిన బూటకపు పోరాటం వాస్తవ రూపం దరించ బోతుంది. ఒక అనాధబాలుడు దేవాలయానికి భారతవాక్యం పలుకబోతున్నాడు.
    లేఖ ఒక్క అంగుళం సహితం తలోగ్గదు. ఆమె గట్టిగా నుంచుంటుంది. సామాన్యుల్లా తన ఇష్టప్రకారం నడుచుకునే హక్కు సహితం జగన్మాతకు ఉండదా? ఆమె పెదవులు గట్టిగా నొక్కి పట్టింది. జిత్ కోసం గట్టిగా పోరాడుతుంది. ఏమైనప్పటికీ జిత్ ను వదులుకోదు.
    కాని తన తండ్రి? అతడు ఎలా వ్యవహరిస్తాడో, అతడు గుడి పెద్ద. సామన్యుని లాంటివాడు కాదు. స్వయంగా సాంఘిక నియమాల్ను ఏర్పరచేవాడు వాటిని ధిక్కరిస్తాడా? తన గొంతు తానె కోసుకుంటాడా?
    అతనికి ఎదురైనా సమస్య ఒక్క జిత్ ది మాత్రమే కాదు. మోతీచంద్ పెళ్లి ప్రతిపాదన విని ఉగ్రుడైపోయాడు. ఆ మాట లేఖ గుండెలో చిచ్చు పెట్టింది. నాలుగు పెళ్ళాల నాగన్న, గుణాల కుప్పట! అతని గుణాలన్నీ చెమట రూపం ధరించి అతని ముక్కు మీద శాశ్వతంగా కాపురం చేస్తుంటాయి. నీతి నియమాలే అతని ఊపిరి అనేట్లు ఉంచాడు. అలాంటి వారితో శత్రుత్వం కోరి తెచ్చుకోవడం అంటే పాముతో చేలగటమే.
    మోతీచంద్ లాంటి సంపన్నుడు భర్త కావాలని పదివేల మంది బెంగాలీ కన్యలు ప్రార్ధిస్తారు. కాని లేఖ మాత్రం వారిలోది కాదు. ఆమె ప్రవ్రుర్తీ అవసరాలూ వేరు. ఆమెకు వెండి బంగారాలు అవసరం లేదు. ఆమె ఒకటి రెండు ఆభరణాలు మాత్రమే ధరించేది. సాదా నూలు చీర కట్టుకునేది. మిగతావన్నీ వద్దంటే నెత్తిన రుద్దినవే.
    చంద్రలేఖ స్వభావం అది. ఆమె దైవత్వకాంతి పంచుకున్న నాయిక కానే కాదు. అప్పుడప్పుడూ అది భిక్షువు ఆమెను ఆవేశిస్తూ ఉండేవాడు.
    ఒకనాడు ఒక తల్లి బిడ్డను తీసుకొని  వచ్చింది. ఎడుపుతోనే ప్రార్ధిస్తూ ఆమె వచ్చింది. ఎప్పటిలాగే లేఖ ముఖం తిప్పెసుకుంది. కాని ఆమెలో ఏదో అనుభూతి పరువులేత్తింది. కుర్రాడి వైపు చూసింది. వాడికి సంవత్సరం వయసుంది. కుర్రాణ్ణి చూసేవరకు ఆమె కనుపాపలు ఉబ్బాయి. పెదవి మీద చిరునవ్వు తొణికిసలాడింది. వరం ప్రసాదించడానిగ్గాను జగన్మాత హస్తం లేవనెత్తింది. లత లాంటి చేతికి గల ఎర్రని గాజులు జిగేలు మన్నాయి.
    బిడ్డ తల్లి సంతోషంతో ఊపిరి పీల్చలేకపోయింది. జగన్మాత తన మీద దయ దాల్చింది. తన బిడ్డ దక్కింది అనుకుంది.
    "నీ పాద ధూళి సకల రోగాలనూ నివారిస్తుంది. " అని బిడ్డను నేల మీద మెల్లగా పడుకోబెట్టింది. లేఖ కాలి బొటనవేలు , జ్వరంతో మండిపోతున్న బిడ్డ భ్రూమద్యం తాకింది. తల్లి కళ్ళలో ఏదో అగాధమైన నిగూడ శక్తి తొంగిచూసింది. పరమానంద భరితమైన ఆమె మోమున చిరునవ్వు చిందులాడింది.
    మర్నాటి మధ్యాహ్నం లేఖ పడుకుంది. ఇంకా నిద్రపట్టలేదు. వీధిలో ఏడుపులూ పెడ బొబ్బలు వినిపించాయి. కళ్ళు తెరచి విన్నది. తలుపు తెరచుకొని బామ్నీ లేఖ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది.
    బామ్నీ కలవరంతో తలక్రిందు లౌతు "వింటున్నారా?" అది మీరు వినాల్సింది కాదు" అన్నది.
    "ఏమిటది ?" లేఖ దిగ్గున లేచింది. "జిత్ .....జిత్ ..... జిత్ ఎక్కడ ?"
    "క్షేమంగా ఉన్నాడు. వంటింట్లో పాలు త్రాగుతున్నాడు."
    "మరేమిటి?"
    బామ్నీ జవాబు కోసం తడబడ్డది.
    "అదే ......ఆ తల్లి.... నిన్న జబ్బు బిడ్డను తేలేదా? ఆమె."
    "ఆ , ఆమెకు ఏమైంది? నేను దీవించాను కదూ? ఆ కుర్రాడేనా?"
    "అవును. వాళ్ళకు విశ్వాసం లేదు. వాళ్ళ ప్రార్ధనలు వట్టి నోటి ప్రార్ధన. గుండెలోంచి రావు. అలాంటి వాళ్ళకు మేలు ఎలా కలుగుతుంది? నమ్మకం లేని వాళ్ళు గుడి కెందుకు రావాలి ? పట్నంలో డాక్టర్లు కరువు బోయారు ?"
    "ఆ ......ఆ.......బి....డ్డ " లేఖ ఊపిరి బిగపట్టి అడిగింది.
    "అవును ఆ బిడ్డే, రాత్రి పోయింది."
    లేఖ మంచం మీంచి దూకి బాల్కనీ కి పరిగెత్తింది. "నువ్వు చూడొద్దమ్మా! నువ్వు చూ........." అని బామ్నీ అరుస్తున్నా లెక్క చేయకుండా లేఖ పరిగెత్తింది.
    ఇంటిముందు జనం కూడారు. తల్లి గుండె బాదుకుంటూ ఏడుస్తుంది" మా నాయనా, నా రత్నం, ఉన్న ఒక్కడిని పోయావురా నాయనా, నా బైజూ ...." ఆమె ముఖంలో ఏడుపు కంటే ఎక్కువ దుఃఖం తాండవిస్తుంది. తలెత్తి బాల్కనీ వైపు చూసింది. క్రౌర్యం నిండి ఉన్న ఆమె చూపు లేఖను గట్టిగా పట్టేసింది. లేఖ కనిపించే వరకు ఆమెలో ఉన్న దుఖమూ, కోపమూ తరంగాలు తరంగాలుగా బైట పడ్డాయి.
    "ఓసీ రాక్షసీ , నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావే - ఓసీ మంత్రాల మహామారీ! ఇలా ఎంతమందిని మోసగిస్తావే. నీ కళ్ళు ఊడిపోనూ, నీ కడుపు కాలిపోనూ , నీకు చావురానూ, నా కొడుకును తిన్న రాక్షసీ! ఇదిగో శపిస్తున్నా."
    ఆమె చేతులు రెక్కల్లా గాలిలో ఎగిరాయి. గద్దగా మారి గాలిలో ఎగిరి తన ముక్కుతోనూ, గోళ్ళతోనూ రక్కి, చీల్చి లేఖ మీద తన కోపం తీర్చుకుంటుందా అన్నట్లు ఆమె చేతుల్ను గాలిలో ఎగురవేస్తుంది.
    లేఖ గబగబా వణికింది. గదిలోకి పరిగెత్తింది. ఆమె చెవుల్లో ఏడుపు ఇంకా రింగు మంటూనే ఉంది.
    బామ్నీ లేఖ ను ఓదార్చింది. "దుఃఖం దాన్ని పిచ్చిదాన్ని చేసింది. తప్పంతా దాందే. నిజమైన విశ్వాసం లేకుండా పైపైన పెదవుల్తో ప్రార్ధిస్తే ఫలితం లభిస్తుందా?"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.