Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    6. శత్రువును హింసించ దలచినవాడు త్రైధాతవీయ యాగమును చేయవలెను. ఇది సర్వయాగ స్వరూపము. కావున ఇది శత్రువును హింసించును. యజమాని తన శత్రువును నిశ్చయముగ నాశనము చేయును.

    7. అభిచార హోమమునకు గురియైనవాడు ఈత్రైధాతవీ ఇష్టిని చేయవలెను. ఇది సర్వయజ్ఞ స్వరూపము. అందువలన యజమాని సర్వయజ్ఞ స్వరూపమగు ఈ ఇష్టిని అనుష్ఠించవలెను. ఇందువలన అభిచార హోమము యజమానిని హింసించదు.

    8. సహస్ర దక్షిణాక యాగము చేయ తలపెట్టినవాడు ఈ త్రైధాతవీయేష్టిని ఆచరించవలెను. అందువలన అతనికి సహస్ర దక్షిణలు ఇచ్చు శక్తి కలుగును.

    9. గో సహస్ర దక్షిణాక యాగము చేసిన వాని పశువులు నశించును. కావున ఆ యాగము చేయనున్నవాడు త్రైధాతవీయ యాగము చేయవలెను. ప్రజాపతి త్రైధాతవీయ యాగము చేసియే పశువులను సృజించినాడు. పశువులను కోరువాడు ఈ విషయము గ్రహించవలెను. త్రైధాతవీయ యాగము చేయవలెను. ప్రజాపతి ఈ యాగమున పశువులను సృజించిన రీతి యజమానికి పశువులు కలుగును.

    ఉత్తర క్రతువునందు ఇవ్వదగిన గో సహస్రము ఈ యజమానికి చెందును.

    10. యజ్ఞము చేయసంకల్పించి చేయనివాడు దేవతలకు ద్రోహము చేసినవాడగును. ఆ దోషపరిహారమునకుగాను సర్వయజ్ఞ స్వరూపమగు త్రైధాతవీయేష్టిని చేయవలెను. అప్పుడతడు దేవతలకు దోషము చేసినవాడు కాకుండును.

    11. ఈ యజ్ఞమునందు ద్వాదశ కపాల పురోడాశము కావలెను. అవి మూడు చతుష్క పాలములు అగును. మూడింతలు యజమానికి మూడింతల సమృద్ధి సమకూర్చును.

    12. లోకములు మూడు. మూడులోకముల ప్రాప్తికి మూడు పురోడాశములు అగుచున్నవి.

    13. ముందు చెప్పిన పురోడాశములందు తరువాత చెప్పినవి శ్రేష్ఠములు. ఏలననగా పృథివి, అంతరిక్ష, ద్యులోకము ఒకదాని కన్న మరొకటి శ్రేష్ఠము కదా!

    14. ఈ యాగము నందు పురోడాశము యవలది కావలెను. ఇది సమృద్ధి కొరకు అంతరిక్షలోక సదృశము.

    15. పురోడాశము లన్నింటిని వ్యర్థము కాకుండ అవదానము చేయవలెను.

    16. ఈ యాగము నందు యజమాని హిరణ్యమును దక్షిణగా ఇవ్వవలెను. అందువలన అతనికి తేజస్సు కలుగును. ఘృత్తాక వస్త్రమును దక్షిణగా ఇచ్చుట వలన పశువులు కలుగును. పాలిచ్చు ఆవును దక్షిణగా ఇచ్చుట వలన ఆశీస్సులు లభించును.

    హిరణ్యము సామవేద రూపము. ఘృత్తాక వస్త్రము యజుర్వేదరూపము. ధేనువ్వు ఋగ్వేదరూపము. మూడింటిని దక్షిణగా ఇచ్చినవారికి సర్వరూపములు కలుగుచున్నవి.

                                    పన్నెండవ అనువాకము

    1. ఇంద్రుడు త్వష్టపుత్రుని వధించినాడు. త్వష్టకోపించినాడు. సోమయాగము చేయుటకు ఉద్యమించినాడు. ఇంద్రుడు తనను యాగమునకు ఆహ్వానించుమని త్వష్టను అడిగినాడు. 'నీవు నా కొడుకును చంపినావు. నిన్ను పిలువను' అని త్వష్ట సోమయాగమునకు ఇంద్రుని ఆహ్వానించలేదు. అందుకు ఇంద్రుడు యజ్ఞమును విఘ్నము చేసినాడు. బలాత్కారముగా సోమరసము సేవించినాడు.

    (ఇది 5వ ప్రపాఠకపు మొదటి అనువాకమున వివరించబడినది.)

    2. ఇంద్రుడు బలాత్కారముగా పానము చేసిన సొంపు శేషభాగమును త్వష్ట అందుకున్నాడు. ఇంద్రుని వధించుటకు హోమము చేసి అగ్నిని కల్పించినాడు. "స్వాహేన్ద్రశత్రుర్వర్థస్వ" అను మంత్రమున వైర్యుత్పాదనకై అగ్నిని ప్రవృత్తుని చేసినాడు. అప్పుడు ఊర్థ్వ జ్వాలారూపుడై జ్వలించుచున్న అగ్నిజ్వాలలు క్రుంగి చల్లారి పోయినవి. ఇది మంత్రోచ్చారణలో లోపము వలన జరిగినది. అగ్నినుంచి మరొకడు జన్మించినాడు. అతడు హోమాధారమగు అగ్నిని, ఆహ్వానించబడిన సోమదేవుని ఆక్రమించినాడు.

    3. ఆ పుట్టినవాడు ఒక్కొక్క బాణము పడునంత మేరకు వ్యాపించినాడు. వృద్ధిచెందినాడు. ఈ లోకములను అన్నింటిని ఆక్రమించినాడు. ఇమాన్ లోకాన్ ఆవృణోత్ యత్ తత్ వృత్రస్య వృత్రత్వమ్ అభూత్ - ఈ లోకములను ఆవరించిన వాడు అగుటవలన అతనికి 'వృత్రుడు' అను పేరు కలిగినది. అదియే అతని వృత్రత్వము.

    4. ఆ వృత్రుని వలన ఇంద్రుడు భయపడినాడు. వృత్రుడు సర్వలోకములను ఆవరించినాడు. అందువలన ఇంద్రునివలె తనకు కూడ స్థానము లేదని త్వష్ట భయపడినాడు. అప్పుడు వృత్రుని వధించుటకు త్వష్ట ఇంద్రునితో స్నేహము చేసినాడు. అతడు వజ్రాయుధమును ప్రోక్షించి ఇంద్రునకు ఇచ్చినాడు. తపో వై స వజ్ర ఆసీత్. వజ్రమే తపస్సు అయినది.

    5. ఇంద్రునకు ఆ వజ్రము ప్రయోగించు సామర్థ్యము లేకపోయినది. అప్పుడు ఇంద్రుని ఎదుట విష్ణువు అను మరొక దేవత ప్రత్యక్షమైనాడు. 'విష్ణూ! వృత్రుని చూచి నేను భయపడుచున్నాను. వజ్రాయుధమును ఎత్తలేకున్నాను. వృత్రుడు ఏ బలమున విశ్వములను ఆవరించెనో ఆ బలమును తొలగింతము రమ్ము' అని ఇంద్రుడు ప్రార్థించినాడు.

    6. ఇంద్రుడు వృత్రుని రూపము చూచి భయపడినాడు. అతని భయమును తొలగించుటకు గాను విష్ణువు తన రూపమును మూడుగా విభజించినాడు. వానిలో ఒక రూపమును భూలోకమున రెండవ దానిని అంతరిక్షమున, మూడవ దానిని ద్యులోకమున స్థాపించినాడు.

    7. పృథివి మీద మూడవ భాగముగా ఉన్న విష్ణువు ఇంద్రుని ముందు నిలిచినాడు. వజ్రాయుధమును ఎత్తినాడు. అప్పుడు వృత్రుడు గడగడలాడినాడు. 'నన్ను వధించకుము. పృథివిని ఆక్రమించ తగిన నా సామర్ధ్ర్యమును నీకు ఇచ్చెదను' అన్నాడు. ఇంద్రునకు తన సామర్థ్యమును ఇచ్చినాడు. ఇంద్రుడు ఆ సామర్థ్యమును తీసికొన్నాడు. "నాకు ఈ సామర్థ్యము కలిగించుము" అని ఇంద్రుడు దానిని విష్ణువునకు అందించినాడు. మనలో ఇంద్రునకే ఈ సామర్థ్యము కలుగును గాత, అని విష్ణువు ఇంద్రుని కొరకు ఆ సామర్థ్యమును గ్రహించినాడు.

    8. విష్ణువు యొక్క మరొక మూడింట ఒకభాగము అంతరిక్షమున ఉంచినాడు కదా! ఇంద్రుడు ఆ భాగపు విష్ణువు వెనుక నిలిచి వజ్రాయుధమును ఎత్తినాడు. అప్పుడు వృత్రుడు గడగడలాడినాడు. 'నన్ను వధించకుము. అంతరిక్షము ఆక్రమించగల నా సామర్థ్యమును నీకిచ్చెదను' అన్నాడు. ఇచ్చినాడు. ఇంద్రుడు దానిని తీసికొన్నాడు. 'నాకు ఈ సామర్థ్యము కలిగించుము అని ఇంద్రుడు దానిని విష్ణువునకు ఇచ్చినాడు. మనలో ఇంద్రునకే ఈ సామర్థ్యము కలుగును గాత' అని ఇంద్రుని కొరకు విష్ణువు ఆ సామర్థ్యమును గ్రహించినాడు.

    9. విష్ణువు యొక్క మరొక మూడింట ఒకభాగము స్వర్గమున ఉంచినాడు కదా! ఇంద్రుడు ఆ భాగపు విష్ణువు వెనుక నిలిచి వజ్రాయుధమును ఎత్తినాడు. అప్పుడు వృత్రుడు గడగడలాడినాడు. నన్ను వధించకుము. ద్యులోకమును ఆక్రమించగల సామర్థ్యమును నీకు ఇచ్చెదను' అన్నాడు. ఇంద్రుడు అందుకు తన అంగీకారము తెలియపరచినాడు.

    10. 'ఇంద్రా! మనము ఒక సంధి చేసికొందము. దానిని అనుసరించి నేను నీలో ప్రవేశింతును.' అన్నాడు వృత్రుడు.

    ఇంద్రుడు :- వృత్రా! అట్లు ప్రవేశించి నీవు నన్ను తినివేయుదువా?

    వృత్రుడు :- నిన్ను భుజించను. నీ భోగము కొరకే నీ ఉదర పాటవమును దీపింప చేయుదును. అందుకొరకే నీయందు ప్రవేశింతును.

    అట్లని వృత్రుడు ఇంద్రుని యందు ప్రవేశించినాడు. అతడు ఉదరము అయినాడు.

    క్షుత్ఖలువై మనుష్యస్య భాతృవ్యో - ఆకలియే కదా మానవునకు శత్రువు!

    యః ఏవం వేద హన్తి క్షుధం భాతృవ్యం - ఈ విషయము తెలిసికొనిన వాడు ఆకలి అను శత్రువును గెలుచును.

    11. వృత్రుడు అట్లని తన ద్యులోకమును ఆక్రమించు సామర్థ్యమును ఇంద్రునకు ఇచ్చినాడు. మూడవసారి నాకు ఈ సామర్థ్యము కలిగించుము, అని దానిని విష్ణువునకు ఇచ్చినాడు. మనలో ఇంద్రునకే సామర్థ్యము కలుగును గాక అని ఇంద్రుని కొరకు విష్ణువు ఆ సామర్థ్యమును గ్రహించినాడు.

    12. వృత్రుడు మూడు మారులు ఇచ్చినాడు. ఇంద్రుడు మూడు మారులు తీసికొన్నాడు. అట్లగుట వలన త్రిధాతురూప పురోడాశ హవిస్సునకు త్రిధాతుత్వము ఏర్పడినది.

    13. విష్ణువు ఇంద్రునకు అనుకూలుడు అయినాడు. అందువలన ఇంద్రుడు విష్ణువునకు ఇచ్చినాడు. అందువలన ఈ పురోడాశము ఇంద్రావిష్ణుదేవతాకమైనది.

    14. వృత్రుడు ఇంద్రునకు మూడు పర్యాయములు ఇచ్చిన సామర్థ్యము ఋగ్యజుస్సామ సామర్థ్యము అగును.

    15. వృత్రుడు ఇంద్రునకు వేలరూపములను ఇచ్చినాడు. అందువల్ల ఈ క్రతువు సహస్రదక్షిణలు కలది అగుచున్నది.

    ఆలోచనామృతము

    1. ఒక వ్యక్తిని చూచినంత మనకు అతడు అర్థమగునా? అతనితో మాట్లాడినంత అర్థమగునా? స్నేహము చేసిన అర్థమగునా? దశాబ్దాలు కలసి కాపురము చేసి కలసి బాధ్యతలు నిర్వహించిన దంపతులు ఒకరిని ఒకరు అర్థము చేసికోలేకున్నారు. ఈ అర్థము చేసికొనుట దుస్తరాతి దుస్తరము. అసంభమని సహితము చెప్పవచ్చునేమో!

    ఎందుకు ఈ చిన్నప్రాణికి ఇంతక్లిష్టత? ఎందుకు అతనికి అంత దురవగాహ్యత? ఎందుకు ఎవడును తనకోటను భేదించనివ్వడు?

    ఇది దురవగాహ్యమైన అనంత ప్రకృతి సత్యము. సత్యము నిజము చెప్పుట మాత్రము కాదు. సత్యము వాస్తవము మాత్రము కాదు.

    అట్లయిన సత్యము ఏమి? అదియే అనంత రహస్యము. సత్యము భగవత్ స్వరూపము. భగవంతుడు ఎంతటి అందనివాడో సత్యము అంతటి అందనిది.

    సత్యము అందదు. అదొక సత్యము. ఆ సత్యము తెలిసిన వారే సత్యాన్వేషకులు! ఎంతటి విచిత్రము! అది అందదని తెలియును. అయినను అన్వేషణ! అదెందుకు? ప్రశ్న అతి సులభము. సమాధానము అసాధ్యము!!

    అన్వేషణమే జీవితము కదా! అన్వేషణ ఒక జీవితముతో ముగియదు. ఇది దేహాంతరములకు సహితము మారును. ఇదివట్టి విశ్వాసము కాదు. నిశ్చయము.

    2. ఇంతటి చర్చ ఏలనన ఒకవ్యక్తిని అర్థము చేసికొనుటకు ఈర్ష్యాద్వేషములకు అతీతమైన నిరంతర అన్వేషణము అవసరము. అయినను అర్థమగుట నిశ్చయము కాదు.

    ఇది వ్యక్తి విషయము. పరమ పవిత్రము, సనాతనము, అపౌరుషేయమైన వేదమును గురించి వివరించుట దుస్తరము.

    వేదము అక్షరము. స్వరము మాత్రము కాదు. దానికి ఒక ఆత్మ ఉన్నది. అందు పరమాత్మ ఉన్నాడు. కావున వేదపు బాహిర రూపమును చూచి అభిప్రాయము ఏర్పరచుకొనుట మూర్ఖత్వమునకు పరాకాష్ఠ!

    వేదము ఆవిర్భవించిన నాటినుంచి దానిని అర్థము చేసికొనుటకు నిరంతర అన్వేషణ, ప్రయత్నములు కొనసాగుతున్నవి. కొనసాగనున్నవి. కొనసాగవలెను.

    3. వేదము వైరాగ్యము అనుమాట అనంత అసత్యము. వేదము జీవించుటకు - సుఖజీవనమునకు సంబంధించినది మాత్రమే! మానవునికి సుఖశాంతులు కలిగించుటయే వేదపు పరమార్థమని నేను గ్రహించినాను!

    4. ఈ అనువాకమున చెప్పిన కథకు సామాన్య జీవితమునకు ఎంత సామ్యము ఉన్నది!

    i)  త్వష్ట కొడుకును ఇంద్రుడు చంపినాడు. కొడుకును చంపిన వానిమీద పగ అతిసాధారణము కదా! హంతకుని పరిమార్చ దలచుట సహితము మానవ సహజము కదా! ఏలనన ఈ సమాజము మానవ సంబంధాల మీదకదా నిలిచి ఉన్నది!

    ii)  పగసాధించదలచిన వానికి బుద్ధి సరిగా పని చేయదు. త్వష్ట విషయమున అదే జరిగినది. అందరి విషయమున అదే జరుగుచున్నది!

    iii)  పగతో మండి పడుతున్న తండ్రి మంత్రమున తప్పు చదివినాడు.

    "స్వాహేన్ద్రశత్రుర్వర్ధస్వ" ఇది మంత్రము. ఇందు స్వాహా అగ్నికి. కోరినది ఇంద్ర శత్రువు వర్థిల్లవలెనని, కాని స్వరము మారి "స్వాహాఇంద్ర" "శత్రువర్ధస్వ" అయినది. ఇంద్రునకు స్వాహా. శత్రువు వర్థిల్లునుగాక అయినది. అందువలన లోక శత్రువు జన్మించినాడు. 

    భాషకు యాస ప్రాణము. భాష పలుకు మీద ఆధారపడును. ఏ భాషకును పర్యాప్తములైన అక్షరములు లేవు. ఇందుకు ఆంగ్ల అక్షరమాల నిదర్శనము!

    "వచ్చావా!" అనే దానికి పలుకుబడిని అనుసరించి సామాన్యము, ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము అగుచున్నవి.

    త్వష్ట చేసినది స్వరదోషము. పలుకుటలో తప్పు. అది సాధారణము కదా!

    కాని కోపమున ఉన్నప్పుడు ఆచితూచి పలుకుట అవసరము. అట్లు చేయకున్న అనర్థము కలుగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.