Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
20. విశిష్ఠ జ్ఞానవంతులు. ఎవరి స్తోత్రములు ఉచ్చరింతురు అట్టి రుద్రపుత్ర మరుద్గణములు వారి స్థానములందు ఉన్నారు.
21. ఇంద్రా ! నీవు నాకు నీ మైత్రిని అందించినట్లయిన. ఈ సోమరూప అన్నమును పానము చేసినట్లయిన మనము సకల శత్రువులను అతిక్రమించగలము.
22. స్తుతిస్తోత్ర ఇంద్రా! నీ స్తోతలు ఎన్నడు అత్యంత సుఖవంతులగుదురు? నీవు ఎప్పుడు మాకు గోవులు, అశ్వములు, నివాసయోగ్య ధనము ఇచ్చెదవు.
23. ఇంద్రా! నీవు వార్థక్యము నెరుగవు నీ హరినామక అశ్వములు స్తోతవ్యయములు కోరికలు తీర్చునవి. అవి నిన్ను రథమున నా వద్దకు కొనితేవలెను. నీవు మంచి మత్తు పొందుము. మేము నిన్ను యాచించుచున్నాము.
24. ఇంద్రుడు ఎంతో గొప్పవాడు. ఎందరి చేతనో స్తుతించబడువాడు. అట్టి ఇంద్రుని తృప్తికరములగు ఆహుతులతో మేము యాచించుచున్నాము. అతడు సుఖదాయకి కుశలమీద కూర్చుండవలెను. తరువాత సోమ, పురో శవ్వివిధ హవ్యమును స్వీకరించవలెను.
25. ఇంద్రా! నిన్ను అనేకులు స్తుతింతురు ఋషులు స్తుతింతురు. నీవు మాకు రక్షణ నొసంగుము. మమ్ము వర్థిల్ల చేయుము. మాకు వృద్ధినొందు అన్నమును దానము చేయుము.
26. వజ్రధర ఇంద్రా! ఆ విధముగా స్తోతల రక్షకుడవు. సత్యభూతా! నేను నిన్ను స్తుతింతును. నీకు సంతసము కలిగించు పనులను చేసెదను.
27. ఇంద్రా! నీరెండు అశ్వములు ప్రసిద్ధములు. విశాల ధనవంతములు. వాటిని రథమునకు కట్టుము. సోమపానమునకు ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
28. నీ మరుద్గణములున్నారే ఆరుద్రత్రులు ఆశ్రయ యోగ్యమగు ఈ యజ్ఞమునకు రావలెను. మరుద్యుక్త ప్రజలు కూడ ఈ హవ్యయమును చేరవలెను.
29. ఇంద్రుని యొక్క ఈ మరుత్తులు మున్నగు ప్రజలు వారు నిలిచినా స్థానములను ఆశ్రయింతురు సేవింతురు మాకు ధనము లభించునట్లుగా వారు ఉత్తరవేదిక వసింతురు.
30. ఇది ప్రాచీన యజ్ఞగృహము. ఇచట యజ్ఞము ఆరంభమైనది. ఇంద్రుడు దానిని చూచినాడు ఇది క్రమబద్ధ యజ్ఞమని గ్రహించినాడు. మారపు చూపును ప్రసాదించినాడు.
31. ఇంద్రా! నీ రథము మనోరథపూరకము నీ ఉభయ అశ్వములు కోరికలు తీర్చునవి. నీవు అభీపూవర్షివి. నిన్ను ఆహ్వానించుట ఈప్సిత ఫలప్రదాయకమగును.
32. అభిషవశిల అభీష్టవర్ణి మత్త, మనోరథదాయని. ఈ అభిషుత సొమము కూడ కోరికలు తీర్చునది. నీవు అందుకున్న యజ్ఞము సహితము వరప్రదాయని నిన్ను ఆహ్వానించుట ఈప్సిత ఫలప్రదాయకము అగును.
33. వజ్రధరా! నీవు అభీష్టవర్షకుడవు. నేను హవి సేవన కర్తను నిన్ను అనేకస్తుతులతో ఆహ్వానింతును. నిన్ను గురించి నేను చేసిన స్తుతులను స్వీకరింతువు. అందువలన నిన్ను ఆహ్వానించుటయే అభీష్టదాయకమగును.
పదునాలుగవ సూక్తము
ఋషి - కణ్వగోత్రజులు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి
1. ఇంద్రా ! నీవు మాత్రమే ధనాధిపతివి. నేను సహితము నీవలె ఐశ్వర్యవంతుడనైనచో నిన్ను స్తుతించువాడు సహితము గోయుక్తుడు కావలెను.
2. శక్తిమంతుడవగు ఇంద్రా! నీ కృపవలన నేను గోపతిని కావలెను.అట్లయినచో ఆస్తోతకు దానము చేయవలెను కొందును. అతనికి కోరిన ధనము ఇచ్చెదను.
3. ఇంద్రా! సత్యప్రియము, వర్ధకమగు నీయొక్క స్తుతిరూపధేనువు సోమాభిషక కర్తకు గోవులను, అశ్వములను ప్రదానము చేయును.
4. ఇంద్రా ! నీవు స్తుతుడవగుదువు. స్తోతకు ధనము దానము చేయ తలతువు. అప్పుడు నీ ధనమును నివారించగల దేవతగాని, మానవుడు కాని లేడు.
5. ఇంద్రుడు ద్యులోకమందలి మేఘమును మేల్కొల్పినాడు. భూమండలమునకు వృష్టిదానము చేసినాడు స్థిరపరచినాడు. అందుకే యజ్ఞము ఇంద్రుని వర్ధిల్ల చేసినది.
6. ఇంద్రా! నీవు ప్రవర్ధమానవుడవు. శత్రువుల సమస్త ధనముల విజేతవు. మేము నీరక్షణ పొందగలము.
7. సోమము వలన కలిగిన మత్తుతో ఇంద్రుడు దీప్తిమంతమగు అంతరిక్షమును వృద్ధిచెందినాడు. ఏలననగా అతడు బలముగు మేఘమును భిన్నముచేసినాడు.
8. ఇంద్రుడు గుహలో దాచిన గోవులను విడిపించినాడు. వానిని అంగిరులకు ప్రదానము చేసినాడు. గోవులను దొంగిలించిన పణుల నేత బలాసురుని తలవంచినాడు.
9. ఇంద్రుడు ద్యులోకమునందలి నక్షత్రములకు బలము కల్పించినాడు. వాటిని దృఢముచేసినాడు. ఇప్పుడు ఆ నక్షత్రములను వాటిస్థానమునునుండి పడవేయగలవాడు లేడు.
10. ఇంద్రా ! నీ స్తుతులు సముద్రతరంగసమాన వేగము కలవగును. నీమత్తు విశేషరూపమగు దీప్తిపొందును.
11. ఇంద్రా ! నీవు స్తోత్రముల వలన వర్థిల్లుదువు ఉక్థల వలన కూడ వర్థిల్లుదువు. నీవు స్తోతలకు శుభంకరుడవు.
12. హర్యశ్వద్వయము కేశవంతము. అవి శోభన దానవంతుడగు ఇంద్రుని సోమపానమునకు గాను యజ్ఞమునకు తీసికొని వచ్చును.
13. ఇంద్రా! నీవు సకల అసురశత్రువులను గెలిచినావు. అప్పుడు నీటిమరుగుతో నముచి, తల నరికినావు.
(పాప్మావైనముచిః అని శాస్త్రము పాపమే నముచి యని అశ్వినులు, సరస్వతి నముచి పగలుగాని, రాత్రిగాని, దండమునగాని, ధనుస్సునగాని, మట్టితోగాని, ముష్టితోగాని, తడిదానితోగాని, ఎండినదానితోగాని చంపబడుకుండునట్లు వరము ఇచ్చినాడు. అందువలన ఇంద్రుడు నీటినురగతో వధించినాడు. ఇంద్రుడు నీటి నురుగుతో సహితము వధించగల శక్తివంతుడు)
14. నీవు మాయతో సర్వత్ర వ్యాపించుగలవాడవు. నీవు ద్యులోకమునకు ఎక్కదలచిన దస్యశత్రువుల ముఖములనునేలకు వాల్చినావు.
15. ఇంద్రా! నీవు సోమపానము చేయువారిలో ఉత్కృష్టుడవు సోమాభిషవహీన సముదాయమును పరస్పరము విరోధులను చేసి నష్టపరచినావు.
పదిహేనవ సూక్తము
ఋషి - కాణ్వహరింభిలి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి
1. ఇంద్రుడు మానవుల సామ్రాట్టు. స్తోత్రవ్యుడు నేత, శత్రుపరాభకర్త. అందరిని మించిన దాత. అట్టి ఇంద్రుని స్తుతించండి.
2. అలలు సంద్రమున శోభిల్లును. అట్లే శ్రావ్యములగు ఉక్థలు, హవిష్మంతమగు అన్నము ఇంద్రునిలో శోభిల్లును.
3. నేను శోభిల్లు స్తుతులతో ధనప్రాప్తి కొరకు. అట్టి ఇంద్రుని స్తుతింతును. ఇంద్రుడు ప్రశంసనీయ దేవతల శోభను గ్రహించును. అతడు సంగ్రామమున మహాకార్యములు చేయును. అతడు బలశాలి.
4. ఇంద్రుని శౌర్యము గొప్పది. గంభీరము. విస్తీర్ణము శత్రుతారకము. శూరుల యుద్ధమున ప్రసన్నతాయుక్తమగును.
5. ఇంద్రుని వలన స్తోతలకు ధనలాభము కలుగును. అప్పుడు తమ పక్షము వహించవలెనని వారు ఇంద్రుని స్తుతింతురు. ఇంద్రుని వారు గెలుచువారగుదురు.
6. బలకరమగు స్తోత్రములతో ఇంద్రుని ఈశ్వరుని చేయబడును. కర్మలతో మానవులు ఇంద్రుని ఈశ్వరుని చేయుదురు. ఇంద్రుడే ధనములకు కర్త అగును.
7. ఇంద్రుడు అందరికన్న ఎక్కువగా ఋషులచే ఆహ్వనించ బడువాడు. అతడు మహాకార్యములు చేసి మహాఘనుడు అయినాడు.
8. ఇంద్రుడు స్తోత్రయోగ్యుడు. ఆహ్వానయోగ్యుడు. అతడు సాధువులకు సాత్వికుడు. శత్రువులకు భయంకరుడు అతడు అనేక కార్యములు చేసినవాడు. సహాయము లేకున్నను వంటిరిగా శత్రువును గెలువగలవాడు.
9. ద్రష్టలగు మానవులు ఇంద్రుని యజుర్వేద మంత్రములతో వర్ధిల్ల చేయుదురు. సమావేద మంత్రములతో వర్థిల్ల చేయుదురు. గాయత్రిమున్నగు ఛందేబుద్ధ ఋగ్వేద మంత్రములతో వర్ధిల్ల చేయుదురు.
10. ఇంద్రుడు ప్రశంసనీయ ధనశాలి యద్దమున జ్యోతివలె వెలుగొందువాడు. ఆయుధము పత్తి శత్రువును మట్టి కరిపించువాడు.
11. ఇంద్రుడు పూరయత బహుజన ఆహ్వాత. అతడు మమ్ము శత్రు సముద్రము నుండి నావమీద పదిలముగా దాటించవలెను.
12. ఇంద్రా ! నీవు బలము ద్వారా మాకు ధనము ప్రదానము చేయము దారిచూపుము. సుఖముల నందించుము.
పదిహేడవ సూక్తము
ఋషి - కాణ్వహరింభిఠి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి చివరి రెండు బృహతి
1. ఇంద్రా! రారమ్ము. నీకొరకు సోమము అభిషవమై ఉన్నది. ఈ కుశసనమున కూర్చుండుము. సోమమును సేవించుము.
2. ఇంద్రా! నీ హర్యశ్వములు మంత్రములచే జోడించే బడునవి. కేశవంతములు అవి నిన్ను యజ్ఞమునకు తీసికోని రావలెను. నీవు ఈ యజ్ఞమునకు రమ్ము మా స్తోత్రములు వినుము.
3. ఇంద్రా! మేము బ్రహ్మణులము. నిన్ను యోగ్యములగు స్తోత్రముల ద్వారా పిలుచువారము. మేము సోమయుక్త ఇంద్రుని పిలుచు చున్నాము.
4. ఇంద్రా! మేము అభిషుత సోమవంతులము. మా ముందుకు రమ్ము. మాస్తుతులను వినుము. శోభన శిరస్త్రాణము గల ఇంద్రా ! సోమపానము చేయుము.
5. ఇంద్రా ! నీ కుడి, ఎడమల కలుపులను నేను సోమముతో నింపుదుము. అది నీ గాత్రములందు వ్యాపించవలెను. మధుర సోమమును నాలుకతో చప్పరించుము.
6. ఇంద్రా! నీవు మంచిదాతవు. ఈ మధురసోమము నీకు రుచికరము కావలెను. ఇది నీ చిత్తమునకు సుఖప్రదము కావలెను.
7. ఇంద్రా ! నీవు విశేష ద్రష్టవు. ఈ సోమము యువత వలె ముసుగువేసికొని నీ వద్దకు వచ్చును.
8. ఇంద్రుడు విస్తృతస్కందములవాడు. స్థూల ఉదరుడు. సుందరభుజములవాడు. అతనికి అన్నరూప సోమపు మత్తు కలిగినపుడు వృత్రాది శత్రువులను నాశము చేయును.
9. ఇంద్రా! నీ బలము మూలమున ఈ జగములకు స్వామిని అయినావు. నీవు మావద్దకు విచ్చేయుము. వృత్రఘ్న ఇంద్రా! నీవు శత్రువులను వధించుము.
10. నీ కొరకు సోమమును అభిషవించు యజమానికి ధనము నిచ్చునట్టి శూలము సుదీర్ఘము కావలెను.
11. ఇంద్రా! నీ కొరకు సోమము వేచి ఉన్నది.... వేదిక మీద కుశాసనము పరచి ఉన్నది. నీవు సోమము కొరకు రమ్ము. దానిని చేరుము. త్రావుము.
12. ఇంద్రా! నీవు శక్తిశాలివి. గోపతివి. ప్రసిద్ధ పూజావంతుడవు నీ సుఖమునకే సోమము అభిషుతమైనది ఉత్కృషు స్తుతులచే నీవు ఆహ్వానించ బడుదువు.
13. ఇంద్రా! నీవు శృంగవృషపుత్రుడవు 'కుండపాయ' యజ్ఞము నీ ఉత్తమ రక్షకము. ఋషులు దానిమీద మనసులు లగ్నము చేసినారు. ("శృంగవృషోనామ కశ్చిదృహిః" అన్నాడు శాయణుడు శృంగవృషుడు ఋషిపేరు అన్నాడు. శృంగములనగా కిరణములు. కిరణములతో వర్షించువాడు ఆదిత్యుడనియు శాయుణుడే. "కుండైః పీయతే అస్మాక సోమితి కుండ పామ్యాః" కుండముతో కుండలతో కూడ కావచ్చునేమో ! సోమము త్రావునది కుండపామ యజ్ఞము )
14. ఇంద్రా !నీవు గృహపతివి గృహమునకు ఆధారమగు స్తంభము గట్టిది కావలెను. మేము సోమ సంపాదకులము. మాశుజములకు రక్షణ సామర్ద్యముగల బలము కలుగవలెను. తరిగిపోవు సోమము కలవాడును, శత్రుపుర ధ్వంసకుడగు ఇంద్రుడు ఋషులకు మిత్రుడు కావలెను.
15.ఇంద్రుడు పాము పడగ వంటి ఉన్నత పిరమువాడు.యాగయోగ్యడు.గోవులు గలవాడు.అతడు వంటరిగనే శత్రువులను పరాజితులను చేయును.వేగవంతములగు ఆశ్వములు సోమపానమునకుగాను ఇంద్రుని మీ వద్దకు చేర్చును.
పద్దెనిమిదవ సూక్తము
ఋషి -కాణ్వ హరింబిరి, దేవత -వేరు వేరు,ఛందస్సు ఉష్టిక్
1.ఇప్పుడు మానవులు ఆదిత్యులను అపూర్వసుఖములు యాచింతురు.
2.ఈ ఆదిత్యుల మార్గములు ఇతరులు ఏర్పరచినవాకావు.అవి అహింసితములు.కావున వారు పాలించు మార్గములు శుభప్రదములు.
3.మేము అనేక సుఖములను యాచించు చున్నాము.వాటిని సవిత,మిత్ర,వరుణ,ఆర్యమ మాకు కలిగించ వలెను.
4.బాధించని పోషకురాలు, అనేకులకు ప్రీతి పాత్రురాలగు అతిథి సుఖములు కలిగించు దేవతల సహితమై సుందరరూపమున విచ్చేయవలెను.
5.అదితిపుత్రులు మిత్రాదులు విద్వేషులను వేరు చేయుట ఎరుగుదురు. బహుకర్మకర్తలు,రక్షకులగువారు మమ్ము పాపములనుండి వేరు చేయుట ఎరుంగుదురు.
6.అదితి పగలు మా పశువులను కాపాడవలెను. మార్పుఎరుగని అదితి రాత్రిళ్లు సహితము మా పశువులను రక్షించవలెను. నిత్యము వర్ధిల్లు రక్షణలతో మమ్ము పాపముల నుండి కాపాడవలెను.
7. స్తుతియోగ్య అదితి మమ్ము రక్షంచుటకు పగలు మా వద్దకు రావలెను. శాంతిమయ సుఖమును ప్రసాదించవలెను. బాధించువారిని దూరము చేయవలెను.
8. అశ్వినుల ప్రఖ్యాత దేవవైద్యులు వారు మాకు సుఖములు కలిగించవలెను. మా పాపములు తొలగించవలెను శత్రువులను దూరము చేయవలెను.
9. గర్హపత్యాది రూపములతో అగ్ని మా వ్యాధులను శాంతింప చేయవలెను. సూర్యుడు సుఖదాతయై వెలుగవలెను. పాపతాప శూన్యమై వాయువు వీచవలెను. శత్రువులను దూరము చేయవలెను.
10. ఆదిత్య గణములారా! మా వ్యాధులను దూరము చేయండి. శత్రువులను దూరము చేయండి దుర్గతిని దూరము చేయండి. పాపములను దూరము చేయండి.
11. అదిత్యులారా! మా నుండి హింసకులను వేరు చేయండి దుర్భుద్ధిని వేరు చేయండి. శత్రువులను వేరు చేయండి.
12. శుభప్రదాతలగు ఆదిత్యులారా! మీరు ప్రదానము చేసిన సంభమువలన పాపియగు స్తోత సహితము పాపమునుండి విముక్తుడు అగును. అట్టి సుఖమును మాకు ప్రసాదించండి.
13. మమ్ము రాక్షసభావమును బాధించదలచినవాడు తన కార్యములచే తానే బాధితుడు కావలెను. అతడు దూరము కావలెను.
14. దుష్కీర్తికలిగి మమ్ము బాధించ దలచిన కపతిని పాపములు దాహించవలెను.
15. ఆదిత్యులారా ! మీరు నివాసదాతలు. పరిపక్వజ్ఞానవంతులు. అందువలన మానవులందలి కపటిని కపటములేని వారిని కనిపెట్టగలరు.
16. మేము పర్వత, జలసంబంధ సుఖములను కోరుచున్నాము. ద్యావా పృధ్వులు పాపములను దూరదేశములకు పంపవలెను.





