Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
ఈ అశ్వము గమనకారి. జయశీలము. వేగవంతము. దీని పవిత్రతకాని మేము అశ్లీల భాషణచేసినాము. ఇప్పుడు మనోళ్లు పవిత్రములగును గాత. మా ఆయువు వృద్ధి చెందును గాత.
33. (ముగ్గురు భార్యలు రాగి, వెండి, బంగారు సూదులచే గుర్రపు చర్మమును ఛేదింతురు)
అశ్వమా! గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్, కకుప్ ఛందములు ఈ సూదులచే అశ్వమును సంస్కరించును గాత.
34. ద్విపద, త్రిపద, చతుష్పద, షట్పద ఛందములును ఛందోభావ, ఛందములును ఛందోభావ, ఛందలక్షణ ఛందములును ఈ సూదులచే అశ్వమును సంస్కరించును గాత.
35. మహానామ్ని శక్వరి ఋచలు, రైవత్సామపు రేవతీఋచ, సమర్థములగు అన్నిదిశలు, మేఘపు వైద్యుతవాణి అశ్వమును ఈసూదులచే సంస్కరించును గాత.
36. అశ్వమా! రాజపత్నులు, అన్యశుభలక్షణ మహిళలు నీ రోమములు పీకుదురు గాత. దేవపత్నులు, దిశలు నిన్ను సూదులచే సంస్కరింతురు గాత.
37. వెండి, బంగారము, రాగి సూదులకట్టలు అశ్వము యొక్క శరీరమును ఛేదించును అశ్వశరీరముతో సంగతులు అగుదురు గాత. వేగవంతమగు అశ్వపు చర్మము ఛేదించుచు సూదులు సంస్కరించును గాత.
38. రైతులు ధాన్యమును గడ్డి నుండి వేరుచేసి కోయుదురు. అట్లే దర్భాసనముల మీద ఆసీనులై స్తుతులచే దేవతలను యజించు వారి కొరకు ఈ లోకమున భోజనాదులు ఏర్పాటు చేయండి.
39. అశ్వమా! ఎవడు నిన్ను నరుకును? ఎవడు నీ తోలు వలుచును? ఎవడు నీ అవయవములను కోయును? విద్వాంసుడే వీనినన్నింటిని చేయును. మరొకడు కాడు.
40. అశ్వమా! సంవత్సరపు తేజమున ఋతువులను అనుసరించి ఋతువులే ఆస్థి గంధులను కోయును గాత. అవి తమ కర్మములచే నీకు హవిభావము ప్రాప్తింప చేయుదురు గాత.
41. అశ్వమా! మాసములు, అర్ధమాసములు సంస్కరించుచు నీ గ్రంథులను కోయుదురు గాత. దివారాత్రులు మరుత్తులు నీ లఘు అంగములను విడదీయుదురు గాత.
42. దైవీ అధ్వర్యులగు అశ్వినులు నిన్ను కోయవలెను. హవి రూపమున ప్రదానము చేయవలెను. దేవతలు నీ దేహమున సీమా రేఖలు ఏర్పరచవలెను.
43. అశ్వమా! ద్యులోక, భూలోక, అంతరిక్షములు, వాయువు నీ యొక్క ఛిద్రములను పూడ్చవలెను. నక్షత్ర సహిత సూర్యుడు నీకు స్వర్గము ప్రసాదించును గాత.
44. అశ్వమా! నీ శరీరమునందలి శిరము మున్నగు ఉత్తమాంగములు శాంతించును గాత. ఇతర చిన్న అవయవములు శాంతించును గాత. ఎముకలు మూలుగు శాంతించును గాత. సమస్త శరీరము శాంతించును గాత.
45. వంటరిగా భ్రమించువాడెవడు? ఎవడు మరల జన్మించును? మంచుకు మందేది? మహదావ పనమెవరిది?
46. సూర్యః ఏకాకీ చరతి | చన్ద్రమా జాయతే పునః| అగ్నిర్హి మస్య భేషజం| భూమిరావపనం మహత్||
47. సూర్య సమ జ్యోతి ఏది? సముద్ర సమమైన సరస్సు ఏది? పృథ్విని మించినదెవరు? పరిమాణము లేనిదేమి?
48. బ్రహ్మ సూర్య సమజ్యోతి యగును. ద్యులోకము సముద్ర సమాన సరోవరమగును. ఇంద్రుడు పృథ్విని మించిన చిరంజీవి. పరిమాణము లేనిది గోవు.
(గవాహి యజ్ఞోధార్యతే. గోవు యజ్ఞమును ధరించునది అయినందున దీనికి పరిమాణము లేదు)
49. దేవమిత్ర ఉద్గాతా! నా జ్ఞానమునకు నిన్ను అడుగుచున్నాను. విష్ణువు మూడు పదములందు అశ్వవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులందు యజనము చేయగా సమస్త జగము వానిలోనే చేరినవి. ఈ విషయము నీవు ఎన్నడైన ఆలోచించినావా?
50. (ఉద్గాతా ప్రత్యాహ - ఉద్గాతబదులు చెప్పినాడు)
ఈ లోకములన్నియు చేరిన మూడు స్థానములందు నేను సహితము ఉందును. తక్షణమే భూలోకము తిరిగి వత్తును. ద్యులోకము తిరిగి వత్తును. ఒకే అంగము - మనసున - నేను స్వర్గపు ఉత్తమ స్థానమును ఎరుంగగలను.
51. బ్రహ్మ! నేను స్పర్థచే నిన్ను ఈ ప్రశ్న అడుగుచున్నాను. ఈ విషయమున నాకు ఎట్టి సమాధానము ఇవ్వగలవు?
పురుషుడు వేని యందు ప్రవేశించి ఉన్నాడు? పురుషుని యందు ఏవి ప్రవేశించి ఉన్నవి?
52. (బ్రహ్మ ప్రత్యాహ)
పంచభూతములందు పురుషుడు ప్రవేశించి ఉన్నాడు. పురుషిని యందు పంచభూతములు ప్రవేశించి ఉన్నవి. నిన్ను నాకు ప్రతిద్వంద్వగా భావించి వివరించినాను. బుద్ధియందు నీవు నన్ను మించిన వాడవుకావు.
53. పూర్వచిత్త ఏమి? పెద్దదియు భారమగు పక్షి ఏది? పిలిప్పిల ఏది? పిశంగిల ఏది?
54. వర్షము పూర్వచిత్తి అయినది. అశ్వము పెద్దదియు భారమగు పక్షి అయినది. పృథ్వి పిలిప్పిల అగును. రాత్రి పిషంగిల అగును.
55. (అధ్వర్యుర్హో తారం పృచ్ఛతి)
పిశింగిల ఎవరు? కురుపిశంగిల ఏది? దుముకుచు నడుచునది ఏది? పాకుచు సాగునది ఏది?
56. (ప్రత్యాహ)
అధ్వర్యూ! రాత్రి పిశంగిల యగును. శ్వావిత్ కురుపిశింగిల యగును. దుమికి నడుచునది కుందేలు. పాకి సాగునది సర్పము.
(పిశం రూపం గిలితి భక్షయతి పిశంగిల. తన రూపమును తాను తినునది పిశంగిల. శ్వావిత్ ఏదుపంది వంద మూలములను తినునది అని అర్థము.)
57. (బ్రహ్మ ఉద్గాతను అడుగుచున్నాడు)
ఉద్గాతా! ఈ యజ్ఞమున అన్నములెన్ని? దీనికి అక్షరములెన్ని? హూమము లెన్ని? సమిధలెన్ని? ఎందరు హోతలు ఋతువులనసరించి యజింతురు?
నీవు యజ్ఞజ్ఞాతవని అడుగుచున్నాను.
58. (ప్రత్యాహ)
బ్రాహ్మన్! ఈ యజ్ఞమున ఆరు అన్నములున్నవి. వంద అక్షరములు. ఎనుబది హోమములు, మూడు సమిధలు కలవు. ఏడుగురు హోతలు ఋతువులననుసరించి యజింతురు. యజ్ఞము నెరిగిన నేను నీకు ఈ విషయములు చెప్పుచున్నాను.
(ఆరురుచులు, ఆరుఅన్నములు, ఛందమునందలి అక్షరములు వంద. ఉష్టిక్ 28+ ధృతిః 72=100. యూపమునకు 20 చొప్పున నాలుగు యూపములు 20 X 4 = 80.1. మృగములు 2. ప్రజాపతులు 3. పశువులు, సమిధలు)
59. (ఉద్గాతా బ్రహ్మాణం పృచ్ఛతి)
బ్రహ్మా! ఎవనికి ఈ భువనపు నాభి తెలియును? ద్యావాపృథ్వి అంతరిక్షములను ఎవడు తెలియును? సూర్యుని ఉత్పత్తి స్థానము తెలిసినవాడెవడు? చంద్రుడు పుట్టిన స్థలము తెలిసినవాడెవ్వడు?
60. (ప్రత్యాహ)
వేదాహమస్య భువనస్య నాభిం. నేను భువనపు నాభిని ఎరుంగుదును. ద్యావాపృథ్వి అంతరిక్షములను ఎరుంగుదు. సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరంగుదును. చంద్రుడు పుట్టిన స్థలమును ఎరుంగుదును.
61. (అద్వర్యుం యజమానః పృచ్ఛతి)
అధ్వర్యులారా! మిమ్ము నేను పృథ్వియొక్క పరమ అంతము అడుగుచున్నాను. భువనముల నాభిని అడుగుచున్నాను. సేచక అశ్వపు వీర్యము అడుగుచున్నాను. వాణి యొక్క పరమ వ్యోమమును గురించి అడుగుచున్నాను.
62. (ప్రత్యాహ)
యజమానీ! ఈ వేదియే పృథ్వికి పరమ అంతము. ఈ యజ్ఞమే భువనమునకు నాభి. ఈ సోమమే సేచక అశ్వపు వీర్యము. ఈ బ్రహ్మాయే వాణి యొక్క పరమ వ్యోమము.
63. విశ్వమును సృష్టించినవాడు - స్వయముగనే బ్రహ్మాండ శరీరమును దాల్చినవాడగు అనాదినిధన పరమ పురుషుడే సృష్టి మహార్ణవమున కాలప్రాప్త గర్భమును ధరించినాడు. ఆ గర్భము నుండియే ప్రజాపతి ఆవిర్భవించినాడు. యతో జాతః ప్రజాపతిః
64. దైవీ హోత సోమ మహిమవ ప్రజాపతిని యజించినాడు. యజించబడు ప్రజాపతి మహిమాన్విత సోమమును పానము చేయును గాత. మానవహోతా! యజింపుము.
65. ప్రజాపతీ! ఈ భూతజాతము నీకన్న వేరు కాదు. సకల చరాచర ప్రాణులున్నవి. వాణి అన్నింటిపైన నీవే ప్రజపతివి.
ప్రజాపతీ! మేము ఏ కోరికలతో నీ హోమము చేయుచున్నామో అవి మాకు లభించును గాత. మేము ధనపతులమగుదుము గాత.
ఆలోచనామృతము
1. యజ్ఞము ఒక్కడు చేయగలది కాదు. అందుకు అనేకుల సహకార సద్భావములు అవసరము. కలిసి పనిచేసినచో యజ్ఞమగును. ఇందరు ఒకచోట కూడుటయే మహాయజ్ఞము. యజ్ఞఫలము ఇంత మాత్రము చాలదా?
ఈ జీవితము ఒక మహా యజ్ఞము. ఎందరి సహకారమున మన జీవనము సాగుచున్నది. పంట పండుటకు అది మన వద్దకు వచ్చుట మహా యజ్ఞమగును. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమగును. దానిని పూజించవలెను. వృథా చేయరాదు.
2. వేదమునకు సకల ప్రాణుల సమములు. పూజ్యములు. ముఖ్యములు. మనకు పనికి వచ్చు చెట్టు, పుట్ట, గుట్ట మున్నగువానిని పూజించుట - ఎంతటి పడమటి గాలి తగిలినను మన ఆచారము సంప్రదాయము, జీవన విధానము.
ఇది మహోన్నతము, ఇందుకు సాటి వచ్చునది ఈనాటికి లేదు. నేడు ఈ విషనాగరికతను దాటుటకు ఇంతకు మించిన దారి లేదు.
ఈ దారి వేనవేల యేండ్లక్రింద వేదములు పరచినది!
3. మానవుల వలెనే అశ్వములకు సహితము కుటుంబము ఉన్నట్లు భావించబడినది.
భార్యలు ఆలస్యముగా వచ్చినారు. అతడు ఆ అశ్వము మరొక సుభద్రతో కులుకుచున్నాడు - 18
భర్త చావమన్నాడు, అతని రూపమున భార్యకు సంతానము కావలెను. ఆమె కామమున ఎగబడినది! - 19.
మనష్యుల కాపురము వంటివే జంతువుల కాపురములు|
4. అశ్వము వద్ద రాణి శయనించినదని ఒక అపోహ ఏర్పడిఉన్నది. 'మహిషే అశ్వము పసంవిశతి' అనగా అశ్వ మహిషి అగును. రాజ మహిషి కాదు. తరువాతి మంత్రములందు అశ్వ భార్యలే కనిపింతురు. 32 మంత్రమున 'మహిషే ముత్థాప్య' మహిషిని లేవదీసి అని అర్థము.
ఇది స్వార్థ పరులు కల్పించిన అపార్థము.
5. మైధునము సకల ప్రాణి సహజము. ఆహార నిద్రా భయ మైధునాని ఎతైహిరేకం పశుభిః నారాణాం. ఇందును గురించి వివరించుటలో దోషము లేదు. నేడు లైంగిక విద్య అవసరమనుచున్నారు గదా! అది ఆనాడే గుర్తించినారు కదా!
6. యజ్ఞమున యాగము, హోమము మాత్రమే కాదు. చెట్టు నీడనో, పందిరి కిందనో కూర్చుని జరుపు తాత్విక చర్చ కూడా అగును. ఇచట - భౌతిక విషయములకు అతీతముగా తాత్విక గంభీర విషయముల చర్చ జరిగినది.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
అశ్వమేధాహుతి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
సర్వేభస్తు సుఖినః





