Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"అల్లుడా ! దుర్యోధనా! మనము పాండవుల రాజ్యలక్ష్మిని అపహరించవలె. అంతేకదా! అందుకు ఉపాయము నావద్ద ఉన్నది. నీవు విచారించకుము. నీ తండ్రి ధృతరాష్ట్రుని అనుమతి పొందుము. తదుపరి కార్యమును నేను నెరవేర్చగలను" అన్నాడు శకుని.
శకుని మాటలకు దుర్యోధనుడు ఎంతో సంతోషించినాడు. అతనికి ఏనుగును ఎక్కినట్లయినది. శకుని సలహాను అనుసరించినాడు. శకుని సహితముగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళినాడు.
"బావా! దుర్యోధనుడు చిక్కి శల్యమయినాడు. ప్రాణములు కన్నులలో ఉన్నవి. ఆలస్యము చేసితివా నీ కొడుకు నీకు దక్కడు" అన్నాడు శకుని.
ధృతరాష్ట్రుడు శకుని మాటలు విన్నాడు. అతని మనసు క్రుంగినది. దుర్యోధనుని దగ్గరికి తీసుకున్నాడు. తడిమి చూచినాడు "నాయనా! దుర్యోధనా! ఏమిటీ స్థితీ? నీకు ఏమి తక్కువయినది? ఎందుకిట్లు కృశించుచున్నావు? నాకు ఎందుకు మనఃక్షోభము కలిగించుచున్నావు?" అని డగ్గుత్తికతో అడిగినాడు.
శకుని ఎత్తు పారినది. దుర్యోధనుడు నమ్మకము కుదిరినది. చెప్పుట సాగించినాడు.
"తండ్రీ! పాండవుల వైభవము నా కనులతో చూడవలసి వచ్చినది. వారి విభవము, ఇంద్రుని విభవమును మించినది. స్నేహబంధమువలన శ్రీకృష్ణుడు , ద్రుపదుడు తప్ప ధరామండలమందలి రాజులందరు పాండవులకు వశులు అయినారు. రాజులందరు వారికీ కప్పములు కట్టుచున్నారు. అంతకన్న నాకు మనస్తాపము ఏమి కావలెను?
"రాజులు ఇచ్చు బహుమతులు గ్రహించుటకు ధర్మరాజు నన్ను నియమించినాడు. అతనికి రత్నరసులు వచ్చినవి. ముత్యములు, పగడములకు లెక్కలేదు. శ్రీకృష్ణుడు పదునాలుగు వేల ఏనుగులను, విరాటుడు రెండు వేల ఏనుగులను, ద్రుపదుడు వేయి ఏనుగులను, వేశ్యలను, స్త్ర్రీలను, గుఱ్ఱములను, సమర్పించినారు. ఇంకను అనేకమంది రాజులూ వివిధ వర్ణముల ఆశ్వములను అందించినారు. రత్నఖచితములయిన బంగారు పల్లకులు, ఏనుగు దంతపు పీటలు, రత్నకంబళములు లెక్కలెనన్ని వచ్చినవి. గడచిన రాజుల వద్ద అంత సంపద ఉన్నట్లు నేను విని ఉండలేదు. పుట్టబోవు రాజుల వద్ద ఉండునను నమ్మకము నాకు లేదు. అంతకన్న నాకు మనస్తాపము ఏమి కావలెను?
"తండ్రీ! ధర్మరాజు చేసిన రాజసూయమునకు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయము సహితము సాటిరాదని మునులు చెప్పుకొనగా విన్నాను. ఆ యాగమున ఒక శంకమును ఏర్పరచినాడు. లక్ష బ్రాహ్మణులు భుజించిన అది తనంతట తానే మ్రోగును. అట్టి శంఖము నిర్విరామముగా మ్రోగినదన్న ఎన్ని లక్షల మంది భుజించిరో లేక్కవేయిట దుర్లభము. అన్ని లక్షల మంది వెండి బంగారు ప్రాత్రలలో భుజించినారు! ధర్మరాజు ఎనిమిది వేల గృహములను నిర్మించినాడు. వాటి యందు ఎనుబదివేల బ్రాహ్మణులను ఉంచినాడు. పాండవులకు ఇంత సంపద సమకూరినది. అంతకన్న నాకు మనస్తాపము ఏమి కావలెను?
రాజసూయమున ద్రౌపది రాజ్యలక్ష్మీ వలె ప్రకాశించినది. ఆమె అన్నపూర్ణ అయినది. బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూద్రులు, బంధువులు, స్నేహితులు, మున్నగు వారికి ద్రౌపది స్వయంగా పరీక్షించి అన్నము పెట్టినది. వారందరు తృప్తులు అయిన తదుపరి అర్ధరాత్రి ఆమె భుజించినది. ఆ యజ్ఞమందు హీనాతిహీనుడు కూడ ఆదరింపబడినాడు. తృప్తి చెందినాడు. ద్రౌపది యుక్తముగా పాండవులను దీవించినారు. అంతకన్న నాకు మనస్తాపము ఏమి కావలెను?
"ధర్మరాజు ఆవభ్రుధ స్నానము చేసినాడు. అప్పుడు బ్రహ్మర్షులు, రాజర్షులు, అతనిని సేవించినారు. ధౌమ్య, పర్వత, నారద, వ్యాసాదులు అశేష పుణ్య జల తీర్ధములచే ధర్మరాజును అభిషేకించినారు. అప్పుడు సాత్యకి ముత్యముల గొడుగు పట్టినాడు. భీమార్జునులు చామరములు పట్టి ధర్మరాజునకు ఇరుపక్కల నిలిచినారు. ఆ దృశ్యము నా కనులలో జ్వాలలు రగిలించుచున్నది. మనసున మంటలు రేపుచున్నది. అంతకన్న నాకు మనస్తాపము ఏమి కావలెను?"
అప్పుడు శకుని దుర్యోధనునితో "అల్లుడా! ధర్మరాజు జూదప్రియుడు. నేను మాయా జూదమున విశారదుడు. ధర్మరాజును జూదమునకు పిలిపించుము, చాలు. మిగిలిన కార్యము నేను నిర్వహింతును. పాండవుల రాజ్యలక్ష్మిని యధాతధముగా నీకు అప్పగింతుము. దుఃఖము మానుము. మనస్తాపము వీడుము" అన్నాడు.
దుర్యోధనుని ఆశలు చిగిరించినవి. అతడు ధృతరాష్ట్రుని కాళ్ళ మీద పడినాడు. శకుని ప్రతిపాదనను అంగీకరించవలెనని ప్రార్ధించినాడు. ధృతరాష్ట్రుడు శకుని మాటలు విన్నాడు. దుర్యోధనుని ప్రార్ధన ఆలకించినాడు. అతడు సందిగ్ధమున పడినాడు. "విదురునితో అలోచించి నిర్ణయింతును" అన్నాడు.
దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. "విదురుడు పాండవ పక్షపాతి. అతడు సమ్మతించడు. నీవు శకుని మాట వినకున్న నా దేహమును అగ్నికి ఆహుతి చేతును. నా చావు తరువాత నీవు, విదురుడు సంబరములు చేసుకొనవచ్చును" అని మంటలు కక్కినాడు.
దుర్యోధనుని మాటలు విన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుని దుఃఖము మంపదలచినాడు. వేయిమంది శిల్పాచార్యులను పిలిపించినాడు. వేయి స్తంభములు కలిగి, విచిత్ర ద్వారములుండి, నానావిధ రత్న ప్రదేశములు గల సభాభవనమును నిర్మించవలసినదని ఆదేశించినాడు.
ఒకనాడు ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించినాడు. విషయము తెలియపరచినాడు. అది విన్నాడు విదురుడు. అతని మనసు పరితపించినది అన్నాడు:-
"మహారాజా! జూదము అనర్ధదాయకము. శాంతస్వభావులకయినను జూదము వలన కలహములు కలుగును. ఈ జూదము వలన కౌరవ పాండవులకు వైరము కలుగును. వారికీ స్నేహము కలిగించుట నీ కర్తవ్యము. కావున నేర్పుగా శకుని, దుర్యోధనుల దురభిప్రాయమును మాన్పింపుము. కురు వంశమును కాపాడుము" అన్నాడు విదురుడు.
ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విన్నాడు. "విదురా! నీవు, భీష్ముడు, నేను ఉండగా మన పుత్రులయిన కౌరవ పాండవులకు వైరము ఎట్లు కలుగును? నాకును నా పుత్రులకును కీడు కలుగుట అసంభవము. దేవతలు కౌరవ పాండవు లందు కృప కలిగి ఉందురు. కాబట్టి కౌరవ పాండవులకు విరోధము కలుగునను ఆలోచనము మానుము, జూదమును సంమ్మతింపుము. నీవు ఇంద్రప్రస్థమునకు వెళ్ళుము ధర్మరాజును తోడ్కొని రమ్ము" అన్నాడు.
విదురుని మనసు వికలము అయినది. అతడు భీష్ముని వద్దకు వెళ్ళినాడు. పరిస్థితిని వివరించినాడు. జూదము వలన పగలు పెరుగునని, ప్రజా క్షయము కలుగునని గ్రహించినాడు. భీష్ముని సంప్రదించినాడు. ఉభయులును జూదమును మాన్పించుటను గురించి ఆలోచించసాగినారు.
ధృతరాష్ట్రుడు విదురుని ఇంద్రప్రస్థమునకు వెళ్లవలసినది అన్నాడు అయినను "ధృతరాష్ట్రుని మనసు శంకించినది. జూదము మానవలసినదని దుర్యోధనునకు బోధించదలచినాడు.
ఇంతలో సభా గృహము సిద్దమయినది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని రప్పించినాడు. ఆతనికి సభా గృహము దాని వన్నె చిన్నెలు చూపించినాడు. దుర్యోధనుని మనసు వికసించినది. అప్పుడు దుర్యోధనునికి ఇట్లు ఉపదేశించినాడు :-





