Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
పూజారి భార్య అన్నదాంట్లో అసత్యం ఏముంది ? కుర్రాడు చెత్త కుండిల్లో రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. అంటరాని వాడు కావడానికి అది చాలదు? కుర్రాడు రైతుల కంటే మెరుగైన వాడు కాదని చూసిన ప్రతివాడికీ తెలిసి పోతుంది. పూజారి పెళ్ళాం మాటలు ఆనోటా ఆనోటా పడి జనానికి పాకిపోయాయి. "కారణం లేకుండా వాగడానికి నాకేమైనా నోటిగులా? నేతి రొట్టెలు పెట్టి, మంచి మంచి దుస్తులు వేసిన వాడు రైతుల కంటే హీనంగా కనిపిస్తున్నాడు. వాడు నీచాతి నీచుడు. ఏ చండాలుడో , చెప్పులు కుట్టేవాడో అయి ఉండాలి." ఇలా అర్చకుని భార్య గుట్టు కాస్తా రట్టు చేసింది.
విన్నవాళ్ళంతా "శివా శివా" అని చెవులు మూసుకున్నారు.
ప్రతి రాత్రీ పూజా సమయానికి మోతీ చంద్ తప్పకుండా వస్తున్నాడు. అతనికి దేవుని మీద భక్తి శ్రద్దలు పెరిగాయి. పూజ జరిగేప్పుడు కనీసం ఒక్క గంటైనా భగవద్ధర్శనం చేసుకోకుండా ఉండలేకపోతున్నాడు. అయితే వ్యాపారం. అదీ అతని ధర్మమే. అంతసేపు వ్యాపారాన్ని వదిలి ఉండడం ఎలా సాధ్యం? గర్బగుడి ప్రక్కనే ఒక టెలిఫోను ఏర్పాటు చేయించుకొని ఆ సమస్య పరిష్కరించాడు.
"ఇంటీరియల్ రాగి, రెండు .....మూడు, సన్ భీమ్ కాగితం, పదిహేను ..... తొమ్మిది రుద్రనాద్ కెమికల్స్ 207" ఇవీ అతనికి టెలిఫోన్ చెప్పే మాటలు.
మోతీ చంద్ మార్కెటు రేట్లను మనసులోనే వ్రాసుకుంటున్నాడు. అతని ప్రతీ ఉచ్చ్వాస విశ్వాసమూ మార్కెటు గాలి ఎటు తోలుతుందో గ్రహిస్తుంది. అతడు యంత్రంలా పని చేస్తున్నాడు. అంటే అతడు పూజ మంత్రాలు వినడం లేదని అర్ధం కాదు. మోతీ చంద్ కు రెండు పనుల్లోనూ ఆసక్తి ఉండేది. అందువల్ల అతనికి కాలం పొడుపు అవుతూ ఉండేది. అతని చెవులు మంత్రాలు వింటుండేవి. బుర్రను మార్కెటు విషయాల మీద కేంద్రీకరిస్తున్నాడు. అభ్యాసం వల్ల అతనికి శక్తి పెరిగింది.
కండ్లకు మాత్రం పని లేకుండా ఉంది? వాటికీ ఒక ప్రత్యెక కార్యం కేటాయించాడు. లేఖను చూడ్డానికి వీలుగా అతడు చలువరాతి నేల మీద కూర్చుంటున్నాడు. ఆమె అందం అతనికి ఆనందాన్నిస్తుంది. ఆమె తనది కాబోయే రోజు అట్టే దూరం లేదని అతడు మురిసిపోతున్నాడు.
ఒకనాటి సాయంకాలం పూజ ముగిసింది. మోతీచంద్ మంగల్ అధికారిని ప్రక్కకు తీసికెళ్ళి "ఆ కుర్రాణ్ణి గురించి నాకు భయంగా ఉంది. "వెళ్ళ గొట్టరాదూ?" అన్నాడు.
కాలూ బిత్తర పోయి "అభిజిత్తా?" అన్నాడు.
"అవును, నేను ధర్మకర్తగా మాట్లాడ్డం లేదు. ప్రజాసేవకునిగా మాట్లాడుతున్నాను. సదా ప్రజాభిప్రాయానికే తలవంచాను. వంచుతాను. లోకులు వెర్రిగా మాట్లాడేస్తున్నారు. వాడు కులం తక్కువ వాడు."
కాలూ మనసు స్వాధీనం లేకుండా పోతుంది. అభిజిత్తు ను గురించి చెడ్డ మాట విని భరించలేకపోతున్నాడు. కులం తక్కువా? అతనికి పెద్దగా నవ్వు వచ్చింది. ఆపుకున్నాడు. కులమదాందుల్ను తాను ఎలా మోసపుచ్చాడు!
"వాడు నా కొడుకు లాంటివాడు "
మోతీచంద్ విచారంగా తల ఊపాడు.
"ఇది ప్రజాయుగం. అంతా ప్రజల ఇష్టప్రకారమే నడుస్తుంది. మీరు, నేను అంతా ప్రజాసేవకులమే, స్వంత భావాలు ఇక్కడ లెక్కకు రావు. ప్రజాభిప్రాయం ముందు లోంగిపోవాల్సిందే."
కాలూ మౌనంతోనే జవాబు చెప్పాడు.
"ఆ కుర్రాణ్ణి వీధుల నుంచి తెచ్చారు. చెత్త కుండిల్లో ఏరుకుని తింటూ ఉండగా వాణ్ణి జనులంతా చూశారు. వాడు చండాలుడై ఉండాలి. ఇంకేదైనా అంటరాని కులం వాడై ఉండాలి." మోతీచంద్ మంగల్ అధికారిని చూపుల్తో కొలిచాడు.
"కడుపు మండే బాపని కుర్రాడు కూడా చెత్త కుండీలలో ఏరుకొని తింటాడు."
మోతీచంద్ మళ్ళీ విచారంగా తల ఊపాడు.
"అదే అసలు చిక్కు. మీరు విశాల హృదయులు. నేనూ అంతే. ,మానవులంతా సమానులే అన్న మోకాలే మాటలు బాగా ఇంకా గుర్తున్నాయి.' తన మేధస్సు లో పాతుకోనిపోయిన పదాలను పెకలించడానికి ప్రయత్నించాడు. కాని అవి తప్పుకున్నాయి. "జనం- ప్రజలు సదా చీకట్లోనే ఉంటారు. కాని ఏం చేస్తాం. మన అభిప్రాయాలు వారి చేతిలో ఉన్న దారాలు."
"కుర్రాడి బతుకు బండలు చేయాలని ఎవరు అనుకుంటారు?"
మంగల్ అధికారి మందబుద్దిని మోతీచంద్ కనిపెట్టాడు. కీలు పట్టే సమయం వచ్చిందనుకున్నాడు.
"మనం సత్యమే మాట్లాడుకుందాం. నగ్న వాస్తవాన్ని గురించి ఆలోచిద్దాం. గుడికి వచ్చే వందల వేల మంది భక్తుల్ను మోసగిస్తామా? ఏదో ప్రత్యేక విషయం అయితే తప్ప అమాయకులైన జనులను జాగ్రత్తగా నడిపించాలి. లోకం నోరు మూయిస్తాను. లేఖకు ఆ కుర్రాదంటే ప్రాణం. ఆమె వాణ్నివాణ్ణి తమ్మునివలె చూసుకుంటుంది. నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. లేఖకు వాడంటే ఇష్టం. ఆమె లేతమనస్సు నొప్పించ కూడదు."
మోతీచంద్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కాలూ బోమలి ముడి వేసి అటు వైపు చూశాడు. చంద్రలేఖ లేతమనసు గురించి అతడు మాట్లాడ్డం, గుడ్లగూబ లాంటి అతని కళ్ళు ప్రతిరోజూ ఆమెను తినివేయడానికి పొంచి కూర్చోవడం అతనికి గుర్తుకు వచ్చాయి. ఆమెకు అపకారం తలపెట్టిన వాణ్ణి ఎవరినీ అతడు సహించడు. వాడి గొంతు నులిమేస్తాడు. అంతే.
పెళ్ళి సంబంధాల బాపనితో మాట్లాడినప్పుడే మోతీచంద్ నిజస్వరూపం బైట పడింది.
"చెవులు కరుచుకోవడం ఆగిపోయింది. ఇంకెప్పుడూ కూతురుకు సంబంధాన్ని గురించి ఆలోచించేది?" అన్నాడు సంబంధాల బాపడు.
"అవును, ఆలోచించాలి."
"కొత్త సంబంధం వచ్చింది. అది అన్నింటా ఉత్తమోత్తమమైంది. ఈ నగరపు గొప్ప ధనికుడు నీ కూతుర్ను అడుగుతున్నాడు."
కాలూ మౌనంగా కూర్చున్నాడు. అతని బొమలు ముడి పడిపోతున్నాయి.
"అయన ఎవరో కాదు. మన మోతీచందే? అతడు వధువుకు జీవితాంతం వరకూ సరిపోయే డబ్బు , బ్యాంక్ పూర్ లో మూడంతస్తుల మేడా వ్రాసి ఇస్తానన్నాడు.'
"అయితే అతనికి అయిదో పెళ్ళాం కావాలన్నమాట!"
"ఆ బాధ నీకెందుకూ? ఇప్పుడున్న పెళ్ళాం మిగతావారి దారే పోతుంది. నీ కూతురు ఇంటికి రాణీ అవుతుంది. రాణీ ."
"నా కూతురు అంత పెద్దవాడికి తగుతుందా?"
"ఎందుకు అలా అనుకుంటావు. ఆమె అప్సరస......అప్స....."
యజమాని ముఖం మీద పిడుగులు కనిపించేవరకు ఆగిపోయాడు.
తనను స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ "నా కుతుర్నేమిటీ, అంత పెద్దవాడికి ఇవ్వడం ఏమిటి?" అన్నాడు కాలూ.
"ఈ మాటే చెప్పేదా?"
"చెప్పు. నీకు చేతనైనవన్నీ కల్పించి , అవి కూడా కలిపి మరీ చెప్పు."
25
కొత్తదనం లేఖకు కాశీ మజిలీ కధలా అనిపించింది. సంవత్సరం క్రితం ఆమె కమ్మరిపిల్ల. తన చుట్టూ ఒక నత్త గుల్లకట్టుకుంది. అది కాస్తా ఒక భూతపు కాలు క్రిందపడి పగిలిపోయింది. ఆమె భైట పడిపోయింది. తరువాత మళ్ళీ ఒక నత్త గుల్లలో ఇరికి తన రిక్తతను దాచుకుంటూ ఉండింది. బిటేన్ దాన్ని బద్దలు కొట్టి ఆమె జీవితంలో అడుగుపెట్టాడు. మళ్ళీ ఏదో విచిత్రం జరుగుతుంది.
ఆమె ముఖంలో ఏదో మహత్తర దైవ కాంతి వెలుగుతూన్నట్లు ఆమెను ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి గాను గుంపులు గుంపులుగా జనం కూడె దేవాలయం ప్రస్తుతం ఆమె స్థానం. తనలో వెలుగుతున్న జ్యోతిని చూసుకోవడాని గ్గాను అద్దం ముందు నుంచుంది. ముక్కు మీద అక్కడక్కడా పుట్టు మచ్చలు తప్ప ఆమెకు ఎలాంటి మార్పూ కనిపించలేదు. తన్ను చూసి తానే నవ్వుకుంది. అయినా తాను నిర్వహిస్తున్న పాత్ర సంతోషకరంగానే ఉంది. ఇక తానూ కోరాల్సినది ఆకాశంలో మెరిసే నక్షత్రాలే. వాటి కోసం చేతులు చాచి ఎత్తింది. గతంలో ఆమెకు లభించిన అపజయాలకు ఇది నష్ట పరిహారం. చంద్రలేఖ జగన్మాత అయింది. అది ఆమెకు కాస్త ఉపశమనం కలిగించింది.
అయినా ఆమెకు తన పాత్ర నిర్వహణలో బాధ గోచరించింది. రాతి బొమ్మలా అందరి ప్రార్ధనలూ , బాధలూ వింటూ ఉండే జగన్మాత లక్షణం ఆమెకు నచ్చలేదు. అమెది సహజంగా ఆర్ద్ర హృదయం. భాధల గాధలు విన్నప్పుడు గుండె నీరై కన్నుల ద్వారా ప్రవహించేది. కన్నీరు దాచుకోవడానికి ముఖం తిప్పుకోనేది. అది భక్తుల ఆశల్ను అడియాశలు చేసేది.





