Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
పిడుగుపాటు లేకుండ, తడుపు చప్పుడు చేయుచు, మెరుపులతో కురియుచు, పోలములను ప్రకాశింప చేయుచు మరలునుగాక. స్వాహా.
రాత్రింబవళ్లు కురియుచు, భూములను అన్నింటిని నింపుచు మరలును గాత స్వాహా.
ఈ వర్షము ఎంతో కురిసినదని జనులు చెప్పుకొనునట్లు కురిసి మరలును గాత. స్వాహా.
ఎండావానలు కలసి వెలుగులు చూపి మరలును గాక స్వాహా.
ఉరుముచు, మెరయుచు వర్షించు పురోవాతము మరలి వచ్చునుగాక. స్వాహా.
4. జలములారా! మీరు వర్షహేతువులు. వానపడినపుడు చప్పుడు చేయువారు. ప్రవహించి సాగువారు. తెల్లని వారు. సూర్యుని కప్పివేయువారు. భూమిని తడుపువారు. నురుగు గలవారు. జగన్మిత్రులగు ఓషధులను పోషించువారు. రాజులను పోషించువారు. దేశమున పంటలు పండించువారు. మీరు నన్ను ఈ యజ్ఞమునందు రక్షించండి.
5. కృష్ణాజినము సేచన సమర్థమగు అశ్వము వంటిది. రజ్జువా! నీవు దానిని బంధించుదానవు అగుచున్నావు.
(కృష్ణాజినమును త్రాటితో కట్టవలెను.)
ఎనిమిదవ అనువాకము
1. అగ్ని, సోమ, సూర్యులారా! మీరు జనులకు నివాసము కలిగించువారు. మాకు జలము ప్రసాదించండి. దివి, భువి, అంతరిక్షముల వలన కలిగిన మేఘములను భేదించండి. మేఘము నుండి వర్షము కలిగించండి. మమ్ము రక్షించండి.
మిత్ర, వరుణ, ఆర్యములారా! మాకు జలమును ప్రసాదించండి. దివి, భువి, అంతరిక్షము వలన కలిగిన మేఘములను భేదించండి. మబ్బులను కురిపించండి. మమ్ము రక్షించండి.
సమాన సోమపానము గల అపాంనపాత్, అశు హేమ దేవతలారా! మాకు ఉదకములు ప్రసాదించండి. దివి, భువి, అంతరిక్షము వలన కలిగిన మేఘములను భేదించండి. మబ్బులను కురిపించండి. మమ్ము రక్షించండి.
2. వర్షము నేలను తడిపి వేయుచున్నది. మబ్బులు పగటిపూటనే చీకట్లు ముసిరించుచున్నవి. రాత్రుల విషయము చెప్పపనిలేదు కదా!
3. ఋత్విజులు చక్కని హవిస్సును అర్పించుచున్నారు. యజమాని కొరకు జలధరములను దివినుండి దించుచున్నారు. అవి బహు మేఘములై దివిని, భువిని ముంచు వర్షము కలిగించుచున్నవి. ఇవి నీరులేని మరుభూమి మీద సహితము కురియుచున్నవి.
4. మరుత్తులారా! మీరు సముద్రమంతటి మబ్బునుంచి వానను పుట్టించండి. పాంసు యుక్తములగు నేలలను తడపండి. మీరు భూమి తాపమును చల్లార్చువారు. మేఘములు లోకోపకారములు. మంగళ కరములు. ధేను సదృశములు. ఇవి మీకు సంబంధించినవి. క్షీణించుటయే లేదు. ఇతర దేవతల రథములు మిమ్ము అనుసరించి వచ్చును గాత.
5. మరుత్సంఘమా! ద్యులోకము నుండి వర్షము కలిగించండి. ఈ కుండ సముద్ర సదృశము. దీనిని నీటితో నింపండి.
6. గొర్రె గారూ! మీరు జలమునుండి పుట్టినారు. మొదట పుట్టినారు. సముద్రమంతటి మేఘము నుండి వర్షము కలిగించగలవారు.
7. పునర్నవమా - గలిజేరుమొక్కా ! నేలను పూర్తిగా తడుపుము. దివినుండి పుట్టిన ఆకాశమంతటి మేఘమును భేదించుము. మాకు వర్షము కలిగించుము. ఈశానుడవై నీరు నిండిన మేఘద్వారములను తెరువుము.
8. ద్యులోకము నందలి దేవతలును, అంతరిక్షలోకపు దేవతలును, భూలోకపు దేవతలును ఈ యజ్ఞమును రక్షింతురు గాక. వారు ఈ క్షేత్రమును ఆవేశింతురు గాక. ప్రవేశింతురు గాక.
తొమ్మిదవ అనువాకము
1. కారీరీష్టి కర్త "మారుతమసి మరుతామోజః" అను మంత్రముల చేత నల్లని అంచుగల నల్లని వస్త్రమును ధరించవలెను. ఇదియే వర్షరూపమగును. అందువలన అతడు వర్షముతో సమాన రూపుడు అగును. మేఘమును వర్షింపచేయును.
2. "రమయత మరుతః" అను మంత్రమున యజమాని పడమటి గాలిని ప్రతిబంధించుచున్నాడు. వర్షము కలిగించుటకు తూరుపుగాలి వీచునట్లు చేయుచున్నాడు.
3. ఏడవ అనువాకపు మూడవ మంత్రముచే హోమము చేయవలెను. వాయువ్యై వృష్ట్యాఈశే వాయువే వర్షమునకు ప్రభువు అగుచున్నాడు. కావున యజమాని వాయుమేవ స్వేన భాగధేయేనో పధావతి. ఆ వాయువే అతని కొరకు వర్షము కురిపించును.
4. ఏడవ అనువాకము నందలి 'పురోవాతో' మున్నగు ఎనిమిది మంత్రములచే యజమాని హోమము చేయవలెను. దిక్కులు నాలుగు. అవాంతర అగ్నేయాది దిక్కులు నాలుగు. కావున ఈ ఎనిమిది మంత్రములు ఎనిమిది దిక్కులందు ఎంతో వర్షము కురిపించును.
5. కృష్ణాజినమునందు ఎదురు బియ్యపు పిండిని నల్లని తేనెచే కలుపవలెను. అది హవిస్సు అగును.
6. హవిస్సునకు సిద్ధి కలుగుటకు గాను వేది మధ్యమునందు సక్తు మిశ్రణము చేయవలెను.
7. యతులను సాలవృకాదులు భక్షించినవి. అప్పుడు రాలిపడిన వారి తలలు ఖర్జూర వృక్షములు అయినవి. ఆ ఖర్జూర రసము పైనుండి పడినది. అవియే కరీరములు అయినవి. అవి సోమ లతాంకుర సదృశములు అయినవి. కరీర శబ్దవాచ్యములగు ఆహుతులు సోమసదృశ ద్యులోకము నుండి వర్షము కురిపించుచున్నవి.
(యతులను సాలవృకాదులు భక్షించుట ఏమి అనుసంశయము కలుగకమానదు. పారమహంస్యరూపం చతుర్థాశ్రమం ప్రాప్తానాం యతీనాం ముఖే బ్రహ్మాత్మ ప్రతిపాదకో వేదాన్త శబ్దో నాస్తి తాన్యతీంద్రా నింద్రో ఆరణ్యేభ్యః శ్వభ్యః ప్రాయచ్చత్' అని సాయణభాష్యము. పరమహంసరూపమగు నాలుగవ ఆశ్రమము అవలంబించిన యతులనోట బ్రహ్మాత్మప్రతిపాదితమగు వేదాంత శబ్దము వెడలని వారిని ఇంద్రుడు ఆరణ్యక పశు పక్షులకు వేసినాడు.
"నిత్య కర్మ పరిత్యజ్య వేదాంత శ్రవణం వినా వర్తమానస్తుసన్యాసీ పతత్యేవ న సంశయః" అని స్మృతి వాక్యము.
సాయణాచార్యులను కాదనునంత వారము కాము. కాని ఇంతవరకు 'వేదాంత' మను పదము వేదమున రాలేదు. బ్రహ్మ ఉపనిషత్తులందు ప్రతిపాదించబడినవాడు. సాయణుడు ఇచ్చిన ఉదాహరణము కౌషీతకి బ్రాహ్మణ ఉపనిషత్తు నందలిది.
'యతీనామ్ శీర్షాణామ్' అను దానికి వేద పరమగు మరొక అర్థము ఉండవచ్చును.
సాయణాచార్యులు ఋగ్వేదము 10వ మండలము 73వ సూక్తము నందలి 7వ మంత్రపు భాష్యమున "యతయో మేఘాః" అని అర్థము చెప్పినాడు.
"యద్దేవా యతయో యథా భువనాన్య పిన్వంత" దేవతలు మేఘముల వలె లోకములందు వ్యాపించినారు అనునది మంత్రార్థముగా చెప్పినాడు.
ఇచట సహితము తలలు రాల్చినది మేఘములవి కావచ్చును.
యతుల తలలు నక్కలకు, తోడేళ్లకు వేయుట అసభ్యము, అనాగరకము, అత్యాచారము అగును. ఇది ఆలోచనామృతము. మీరు ఆలోచించుటకే.)
8. కరీరసక్తువు హవిస్సు కావలెను. అది సోమసదృశ ఆహుతి అగును. అందువలన ద్యులోకము నుండి వర్షము కురియును.
9. కరీరసక్తును తేనెతో కలుపవలెను. నీరు ఓషధుల రసమే మధువు అగును. వర్షము, నీరు ఓషధులనుండియే కదా కలుగునది! కావున జలము ఓషధుల వర్షము కలిగించుచున్నది.
10. 'మాన్దావాశా' మున్నగు మంత్రముల చేత సక్తుతేనె కలుపవలెను. ఇవి జలములకు పేర్లు. జలములు తమ పేరు విని దిగివచ్చుచున్నవి.
యజమాని జలములను పేర్లతో పిలిచి రమ్మన్నంత జలములు ఆ పేర్లు గలవిగనే వర్షము కురిపించుచున్నవి.
11. అశ్వము సేచన సమర్థము. మేఘమును అట్లే అగును. నీరు త్రాగిన మబ్బు నల్లని కారు మబ్బై వర్షించును. రూపము నల్లనిదైనందున మేఘము మరింత వృష్టి కలిగించుచున్నది.
పదవ అనువాకము
1. "దేవా వసవ్యాః, దేవా శర్మణ్యాః, దేవా సపీతయః" అను మూడు మంత్రభాగములచే కలిపిన సక్తును ముద్దలు చేయవలెను. ఆ విధముగా చేయుటవలన ఆ మంత్రమునందలి దేవతలు నిత్యము వర్షము కలిగింతురు.
2. ముద్దలు చేసినంత వర్షము కురిసిన హోమము చేయవలెను. కురువనిచో మరుసటి రోజు హవి పురోడాశమును నిర్వాపము చేయవలెను.
3. మిత్రావరుణులు రేయింబవళ్ల ప్రతీకలు. మేఘము పగలును, రాత్రియు వర్షించునదే కదా!
యజమాని స్వభాగధేయమున మిత్రావరుణులను సేవించవలెను. ఆ మిత్రావరుణులే అతని కొరకు అహోరాత్రులచే వర్షము కలిగింతురు.
4. (2వ మంత్రమున వర్షము కురియకున్న మరునాడు పురోడాశము నిర్వాపము చేయవలెను అన్నాడు. దానిని వివరించుచున్నాడు.)
దామశబ్దఘటిత ప్రతిపాద్యుడైన అగ్నయే పురోడాశ మష్టాకపాలం నిర్వపేత్. మారుతగం సప్తకపాలగం సౌర్యమేక కపాలం నిర్వపేత్.
అగ్ని ఈ భూలోకము నుండి వర్షము కలిగించును. మరుత్తులు వర్షమును వివిధ ప్రదేశములకు చేర్చెదరు. సూర్యుడు తన కిరణముల చేత తాపము కలిగించునపుడు వర్షించును. లోకములను కప్పివేయుచు మబ్బులను చేర్చుకొని వర్షించును.
ఈ అగ్ని, మరుత్తులు, ఆదిత్యులే వర్షము కలిగించు శక్తులు కలిగి ఉన్నారు. యజమాని స్వభాగధేయమున ఆ దేవతలనే యజించవలెను. వారే యజమాని కొరకు మేఘములచే వర్షింపచేయుదురు. అవర్షిష్య స్వర్షతేవ - అంతకు వర్షించని దైనను మేఘము వర్షించును.
5. మరుత్సంఘములారా! దివి నుండి వర్షమును తెండి. సముద్రము వంటి కుండను నింపండి అని చెప్పబడినది. (8వ అనువాకము 5వ మంత్రము.)
అందు భూలోక, స్వర్గలోకజలముల వర్షమును గురించి చెప్పబడినది. ఇంక ఏమి అనగా భూలోక జలములే స్వర్గలోకమునకు చేరుచున్నవి.
6. 'అబ్జాసి ప్రథమజా బలమసి సముద్రి యమి త్యాహ' (ఇది 8వ అనువాకపు 6వ మంత్రము.) దీనిని యజుర్వేద మంత్రముగా గ్రహించవలెను.
7. 'ఉన్నమ్భయ పృథివీం' అను మంత్రము చేత గలిజేరు మొక్కకు హోమము చేయవలెను. ఈ గలిజేరు ఓషధులన్నింటిలో వర్షము కలిగించునది. అదియే సర్వత్ర వర్షము కలిగించును.
8. 'యేదేవా దివిభాగా' అణు మంత్రమున కృష్ణాజినమును విదిలించ వలెను. అందువలన పృథివ్యంతరిక్ష ద్యులోకములు ప్రీతులగును. యజమాని కోరికలను తీర్చును.
అథ సప్తమారభ్య దశమాం తైశ్చతుర్భిరనువాకైః కారీరిష్టిః ప్రతిపాద్యతే. ఏడు నుంచి పదవ అనువాకము వరకు కారీర ఇష్టి చెప్పబడినది.
పదకొండవ అనువాకము
1. ఇది త్రైధాతవీ ఇష్టి. ఇందు సర్వఛందస్సులు అనుసరించబడినవని చెప్పుదురు.
కకుచ్చందస్సు త్రిష్టుప్ ఛందస్సు సారమగును. ఉష్ణిక్కు జగతికి సారమగును. ఉష్ణిక్కకుచ్చందము లందు సర్వ ఛందస్సులు చేరి ఉన్నవి.
2. ఉష్ణిక్చందస్సు గాయత్రి ఛందస్సు అగుచున్నది. మిగిలిన నాలుగు అక్షరములు చతుష్పాద పశుస్వరూపములు. ఈ త్రైధాతవీ ఇష్టియందు పురోడాశము మీద మరొక పురోడాశము ఉంచబడును. అట్టివే ఉష్ణక్చందస్సు నందలి అధిక అక్షరములు.
(ఉష్ణిక్చందమునకు 28 అక్షరములు. గాయత్రికి 24. 28 - 24 = ఎక్కువయిన నాలుగు చతుష్పాదస్వరూపములని చెప్పినాడు.)
3. జగతీ ఛందస్సుచే సామిధేని ఋక్కును పూర్తి చేసినచో యజమాని యజ్ఞమును నాశనము చేసినవాడగును. కావున త్రిష్టుప్చందముచే సామిధేని ఋక్కును సమాప్తము చేయవలెను. త్రిష్టుప్చందస్సు ఇంద్రియ సామర్థ్యము కలిగించునది యగును. అందువలన యజమాని యజ్ఞమునకు సామర్థ్యము కలిగించినవాడు అగును. యజ్ఞము నశింపకుండును.
4. "అగ్నేత్రీ" అనుటచే అగ్ని త్రిశబ్దవాచ్యుడు. కావున అగ్ని త్రిష్టుప్ కు సారూప్యమగును. అందువల్ల త్రిష్టుప్చందస్క ఋక్కుచే పరిసమాప్తి చేయవలెను.
5. త్రైధాతవీ యజ్ఞము సర్వయజ్ఞస్వరూపము అగుచున్నది. కోరికలకు కోరికలే ఈ యజ్ఞమున ప్రతిపాదించబడును. కావున ఈ యజ్ఞము సమస్త కోరికలు తీర్చునది అగును.





