Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

2. రాజసూయము నేడు మనము చూచుచున్న ప్రభుత్వాధి నేతల సభల వంటిది. ఈ యాగమునకు జరిగిన ఏర్పాట్లు ఈ మధ్య డిల్లీలో ఆసియా క్రీడలకు జరుగుచున్న ఏర్పాట్ల వలె ఉన్నవి. అంత పెద్దఎత్తున రాజసూయము నిర్వహించుట అంతకు ముందు జరిగినట్లు కనిపించదు.
    రాజసూయ నిర్వహణ విషయమున పాండవులలో పరస్పర స్పర్ధలున్నట్లు నాకు తోచినది. అందుకు కారణములు:-
    i) రాజసూయము నిర్వహాయించుటకు ధర్మరాజు శ్రీకృష్ణుని సంప్రదించినాడు. సోదరుల అనుమతి గ్రహించినాడని చెప్పబడినను అందు భీమార్జునుల ప్రసక్తి లేదు.
    ii) రాజసూయము ఏర్పాట్లను నకుల సహదేవులకు అప్పగించుట జరిగినది. బీమార్జునులు కనిపించరు. శిశుపాలవధ సందర్భమున ఒకసారి మెరుపువలె భీముడు కనిపించును. అది శిశుపాలుని పూర్వ వృత్తాంతము చెప్పుటకు పనికి వచ్చినదే. కాని అతని ప్రాధాన్యత కనిపించలేదు.
    iii) అర్జునుడు అసలు కనిపించడు
    iv) శ్రీకృష్ణుని పూజించుటకు పూజాద్రవ్యములు అందించినవాడు సహదేవుడు. భీమార్జునుల ప్రసక్తి లేదు.
3. "భద్రత" మానవ జీవితమున ప్రధాన పాత్ర వహించుచున్నది. భద్రత లేనపుడు ఉమ్మడిగా ప్రయత్నించుట, గట్టి భద్రత ఏర్పడినప్పుడు అభిప్రాయ భేదములు ఏర్పడుట జరుగుచున్నది. ఇల్లు కూలానున్నప్పుడు దానిని కాపాడుటకు ఇంటిలోని వారందరు  ఐక్యతగా ప్రయత్నింతురు. ఇల్లు నిలిచిన తరువాత అందులోని భాగముల కొఱకు మరి దేని కొరకో పోట్లాటలు జరుగుచున్నవి.
    పాండవుల విషయమున అదియే జరిగి ఉండవచ్చును. లక్క ఇంటి కధ నుండి రాజసూయమునకు ముందు వరకు "ఒక్కమాట" మీద ఉన్న పాండవులలో సంపద గలిగి స్థిరపడగనే అభిప్రాయ భేధములు వచ్చి ఉండవచ్చును.
4. ఒక కార్యము సిద్దించుటకు మానవ ప్రయత్నము, దైవ సహాయము అవసరము. దీనిని గురించి భాగవతమున ఒక ఉదాహరణ ఉన్నది. మానవుడు పొలము దున్ని, విత్తనములు వేయును. వర్షము లేకున్న అది ఫలించదు. వర్షము దైవ సహాయము. రామాయణమున శ్రీరాముడు మరొక ఉదాహరణ చెప్పినాడు. ప్రయత్నము చేసిన వారందరికి ఫలితము లభించుట లేదు. ఫలితము లభించినవానికి దైవసాయమున్నదని గమనించవలెను.
    దైవము ఏరూపమున సాయము చేయునో చెప్పలేము.
    లక్క ఇంటి కధలో పాండవులకు విదురుడు దైవ స్వరూపమున సాయపడినాడు. హిడింబ, బకాసుర వధల సమయమున, ద్రౌపది వివాహమప్పుడు వ్యాస మహర్షి దైవరూపమున సాయపదినాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దైవమై సాయపడినాడు.
    ఆపదలలో దేవుని తలచుట, సంపదలలో తామే సమర్ధులమను కొనుట మానవ స్వభావము. భీమార్జునులకు తమ బలపరాక్రమముల వలననే రాజులను గెలిచినామను గర్వము కలిగి ఉండవచ్చును. శ్రీకృష్ణుడు సాయము వలననే అది సాధ్యపడినదని ధర్మరాజు అభిప్రాయము.
    అట్లు బేదాభిప్రాయములు వచ్చి ఉండవచ్చును.
5. హిడింబ, బకాసురవధలప్పుడు , ద్రౌపది వివాహ సందర్భమున కుంతి ప్రధాన పాత్ర వహించినది. ఆ తరువాత కుంతి కనిపించదు. తల్లి స్థానమును అన్నయగు ధర్మరాజు గ్రహించినాడు. సంపదలో భీమార్జునులు అగ్రజుని మాటలు పూర్తిగా వినలేదు. కొంత స్వతంత్రించినారు.
    కష్టములు మనుషులను కూర్చును - సుఖ సంపదలు మనుషులను చీల్చును.

                                       మయసభ - మనసు మంట
    
    రాజసూయమునకు వచ్చిన రాజులందరు మరలినారు. ధర్మరాజు సభావిభవము చూచుటకు దుర్యోధనుడు, శకుని ఇంద్రప్రస్థముననే ఉండిపొయినారు.
    ఒకనాడు దుర్యోధనుడు సభా గృహమున ప్రవేశించినాడు. అతనికి అంతయు వింతగా తోచినది. తెరువబడిన ద్వారము మూయబడినట్లు కనిపించినది. మూయబడిన ద్వారము తెరువబడినట్లు కనిపించినది. అందు ప్రవేశించబోయినాడు. ద్వారము తలకు తగిలి బొప్పికట్టినది. ఆ బాధకు ఓర్చుకున్నాడు. మరొక చోటుకు వెళ్ళినాడు. అక్కడ సమప్రదేశము దిబ్బవలె కనిపించినది. నీల మణులు తాపిన స్థల ప్రదేశమును జలప్రదేశమని భ్రమించినాడు. బట్టలు తొడలవరకు ఎత్తుకొని నడచినాడు. జల ప్రదేశము స్థల ప్రదేశము అనుకున్నాడు. అందు ప్రవేశించినాడు. నీటిలో పడినాడు. బట్టలు తడుపుకున్నాడు. అవమానమున అటు ఇటు చూచినాడు.
    పాండవులు ద్రౌపది అక్కడనే ఉన్నారు.
    దుర్యోధనుని పాట్లు చూచినారు.
    వారికి నవ్వు వచ్చినది నవ్వినారు.
    దుర్యోధనుడు క్రుంగిపోయినాడు. తలవంచుకున్నాడు.
    ధర్మరాజు దుర్యోధనుని బాధను గురించి తెలుసుకున్నాడు. భీమునిచే దివ్యవస్త్రములు పంపినాడు. దుర్యోధనుడు భీముడు అందించిన వస్త్ర భూషణములు ధరించినాడు. దుర్యోధనునకు తలకొట్టినట్లనిపించినది. ఇంద్రప్రస్థమున ఉండలేకపొయినాడు. పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు ఇంద్ర ప్రస్టము వీడినాడు. హస్తినకు చేరినాడు.
    హస్తిన చేరిన దుర్యోధనునిలో అసూయ అంటుకున్నది. ధర్మరాజు రాజ్యలక్ష్మిని చూచి అతని కనులలో మంటలు మందినవి. అతని మనసులో ఈర్ష్యా జ్వాలలు రగిలినవి. ఆ మంటలు అతనిని కాల్చినవి. వేసవికాలపు నదివలె శుష్కించినాడు. వన్నె తరిగిన బంగారము వలె వివర్నుడు అయినాడు. సుఖభోగములను విడిచినాడు. రాజ్యవ్యాపారమును పట్టించుకోనలేదు. మిత్రులను కలియుట మానినాడు. సుఖము లేనివాడయినాడు. దుఖభాజనుడు అయినాడు.
    శకుని దుర్యోధనుని చూచినాడు. "అల్లుడా! దుర్యోధనా! నేనుండగా నీవు ఇట్లు విచారపడుట తగదు. నీ దుఃఖమునకు కారణము చెప్పుము. నా వద్ద సకల ఉపాయములు ఉన్నవి. ఉపాయమున సాధ్యము కాని పని లేదు" అన్నాడు.
    దుర్యోధనుడు శకుని మాటలు విన్నాడు. అతనిలో దుఃఖము పొంగినది. దుఃఖము దిగమింగినాడు. "మామా! పాండవులు సకల ఐశ్వర్యము లందు తులతూగుచున్నారు. రాజ్యలక్ష్మీ వారిని వరించినది. మానవంతుడయిన రాజు శత్రు సంపదను చూచి ఒర్వలేడు. నా మనసున మంటలు రగులుచున్నవి. ఆ మంటలు అర్పుటకు ఉపాయము చెప్పుము" అని బెలవలె అర్ధించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.