Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
లేఖ కరకుగా "బామ్మీ" అంది.
వంటమనిషి జరిగిందంతా చెప్పింది. అభిజిత్ క్రిందికి వెళ్ళి పూజారి వంటింట్లోకి చూశాడు. అక్కడ పూజారి పెళ్ళాం వంట చేస్తుంది. పోయి మీద ఉన్న అన్నం కలుపుతూ తలెత్తకుండా కుర్రాడు చూస్తున్నాడని పసికట్టింది. పులికండ్ల ఆడది. దానికి కనిపించకుండా ఎలా ఉంటుంది?"
"ఓరి కులం తక్కువ వెధవా! పెంట కుప్పల పోరాడా ! బ్రాహ్మణ వంటింట్లోకి చూసేంత ధైర్యమూ వచ్చిందీ! నీ గాలి సోకితే వండుకున్న వంటంతా మైలపడిపోతుంది. అన్నం అంతా కుక్కలకు వేయాల్సి వస్తుంది. ఓరి చందాలుడా! బ్రాహ్మలం అని తెలీదా ?" అని అరచింది.
అభిజిత్ అదిరిపోయి పారిపోయి వచ్చాడు. మెట్లు కడుగుతున్న బామ్నీ అంతా చూసింది. ఆ తిట్లు ఆమెకు చెవుల్లో సీసం కరిగిపోసినట్లు అయింది.
లేఖ అంతా విన్నది. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మర్నాడు లేఖ వంటింట్లో ఉంది. జిత్ ప్రక్కనే పీట మీద కూర్చొని ఉన్నాడు. లేఖ వంటమనిషిని పిలిచి "పూజారి పెళ్ళాన్ని ఒక్క నిముషం వచ్చి పొమ్మని చెప్పు" అన్నది.
బామ్నీ సంతోషంతో పొంగిపోయింది. దాని రోగం కుదరాలి. లేకపోతే ఏమిటి? అభిజిత్ ను కులం లేనివాడనీ, అంటరాని వాడనీ అంటుందీ? గుడి పెద్ద పెంచుకుంటున్నాడు. అది చాలదూ? అయన జ్ఞానాన్నే శంకిస్తుంది? వెక్కిరిస్తుంది? పొగరెక్కి హద్దూ పద్దూ లేకుండా మాట్లాడింది.
పూజారి పెళ్ళాం వచ్చింది. లేఖ మిత్రత్వం ఉట్టిపడుతున్న చిరునవ్వు నవ్వింది.
"ఇవ్వాళ కూర కొత్తరకంగా వండాను. ఇదిగో మీకోసం ఒక గిన్నెడు తీసి పెట్టాను." అంటూ లేఖ ఆ గిన్నె అభిజిత్ కు అందించి "జిత్, ఒక పని చేసి పెట్టు "ఈ గిన్నె పిన్నిగారి వంటింట్లో పెట్టిరా, గిన్నె పడేయకేం" అని చెప్పింది.
పూజారి పెళ్ళాం తెల్లబోయింది. "కూర చక్కగా వండాను. వాసనా అదీ ఎలా ఉందో చెప్పాలి. మరిచిపోవద్దు సుమా" అంది లేఖ పూజారి పెళ్ళాంతో.
అభిజిత్ నడక సాగించాడు. అతని వెనక పూజారి పెళ్ళామూ, ఆమె వెనక బామ్నీ నడిచారు. అభిజిత్ మెట్లు దిగాడు. పూజారి పెళ్ళాం ఉరికినట్లు నడిచింది.
"చాల దూరం తెచ్చావు. చాలు నాయనా. ఏదీ ఇలా ఇవ్వు నేను తీసికేల్తా " అని పిలిచింది.
అతడు ఆమె వైపన్నా చూడకుండా అగనన్నట్టు తల ఊపాడు. "పిన్ని గారి వంటింట్లో గిన్నె పెట్టిరా" అన్నది లేఖ అజ్ఞా. ఆమె స్పష్టంగా చెప్పింది. ఇక్కడే ఆగిపోతే అతని పని ఎలా పూర్తవుతుంది? సాగిపోయాడు.
చేయగలిగిందేమీ లేక చూస్తూ ఉండిపోయింది. బామ్నీ ఛాయా అట్టే దూరం లేదని ఆమె పులికండ్లు కనిపెట్టేశాయి. కులం లేని కుర్రాడు వంటింట్లో అడుగు పెట్టాడు. వంటిల్లు అపవిత్రం అయిపొయింది.
ఏం చేయాలి? వండిన వన్నీ పారేయాలి. కుండలూ, చట్లూ బద్దలు కొట్టాలి. నేలనూ, పోయ్యినీ పేడ నీళ్ళతో శుద్ది చేయాలి. అదీ అసలు చేయాల్సిన పని. అలా చేస్తే ఈ విషయం తప్పకుండా లేఖకు తెలుస్తుంది. ఏదో గందరగోళం అవుతుంది . పూజారి ఉద్యోగం ఊడినా ఊడొచ్చు.
జరిగినదంతా బామ్నీ లేఖకు చెప్పేసింది.
"పిన్నీ వంటింటికి ఇంకేమైనా తీసి కెళ్ళాలా ?" అని అడిగాడు జిత్ ఆనాటి సాయంకాలం.
లేఖ ఆశ్చర్యంగా అతన్ని చూసింది.
"ఇవ్వాళ కాదు "
"ఇంకో రోజూ?"
"అవును ఇంకో రోజు "
"ఆమె కర్రతో బాదదు.'
"నిన్నే, బాదడమే! ఎన్ని గుండెలు కావాలి!"
"మురికి వెధవా, వెళ్ళిపో అనదూ."
"నిన్నూ మురికి వెధవ అనేంత ధైర్యమే!"
"వంటింట్లోకి వెళ్ళినా ?"
"ఆ వంటింట్లోకి వెళ్ళినా. నువ్వెక్కడి కైనా వెళ్ళొచ్చు ."
జిత్ మౌనంగా ఈ వింతలన్నీ గ్రహించాడు.
మర్నాడు ఉదయం మళ్ళీ బామ్నీ లేఖ దగ్గరికి వచ్చింది.
"కాస్త ఇలా రండి ."
మళ్ళీ ఏదో మీద పడిందని లేఖ నిట్టురుస్తూ వంట మనిషి వెంట పడక గదిలోకి నడిచింది.
బామ్నీ పరుపు లేవనెత్తుతూ "చూడండి" అని చూపింది.
లేఖకు ఏమీ కనిపించలేదు.
"ఏమిటి?"
"రొట్టె ...... లేదు"
"రొట్టె లేదూ?" లేఖ ప్రశ్నలో పెద్ద ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు. "మరి రేపో?"
తరువాత మళ్ళీ పరుపు క్రింద రొట్టె కనిపించలేదు.
లేఖకు ఆశ్చర్యం అయింది. బరువు దింపినట్లు కూడా అయింది. కుర్రాడు మారడానికి కారణం? ఎలా మారాడు? పూజారి వంటింట్లోకి వెళ్ళడానికీ , ఈ అలవాటు మానదానికీ ఏమైనా సంబంధం ఉందా?
లేఖ ఏదీ నిశ్చయించలేకపోయింది. జిత్ చెడు మార్గంలో చరించాడు. అయినా దుష్పరిణామాలేమీ రాకుండానే పాత అలవాట్లనూ, ఆచారాలనూ వదులుకున్నాడు. అందువల్ల అతన్ని వెన్నాడుతున్న ఆకలి భయం అంతరించింది. అతడు మామూలు కుర్రాడు అయిపోయాడు. అతడు ఇక దేన్నీ లక్ష్య చేయదు. పెంకె తనాని గ్గూడా అలవడుతున్నాడు. కొద్ది రోజుల్లో శారీరకంగా కూడా అతడు బాగుపడొచ్చు.
* * *
అభిజిత్ వల్ల తండ్రీ కూతుళ్ళ దుఃఖం దూరం అయింది.
బిటేన్ మళ్ళీ కనిపించలేదు. అతని జాడ తెలియలేదు.
ఊరేగింపు వచ్చినప్పుడల్లా బాల్కనీ కి పరిగెత్తి చెమ్మగిల్లిన కళ్ళతో ముందున్న వరుసను బాగా పరికించేది. బిటేన్ ఊరేగింపులకు సారధ్యం వహిస్తాడని ఆమెకు తెలుసు. అందుకే ముందు వరసల్ను ఆదుర్దాగా చూసేది.
"అతడెక్కడ ఉండి ఉంటాడు?"
నగరం విడిచి వెళ్ళిపోలేదు కదా? మళ్ళీ జేలుకే వేళ్ళాడేమో? అతడు లేఖను ద్వేషిస్తున్నడా? ఎన్నటికీ అతని జాడ తెలియజేయడా?"
లేఖ బాధ కాలూకు తెలుసు. అతడు ఒకటే ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. ముసలితనం మీద పడ్డట్లుంది.
ఒకనాడు పేరడైజ్ లాజ్ మేనేజరు బికాష్ ముఖర్జీ పెరట ఉత్తరం తెచ్చాడు. మనిషి వెళ్ళిపోయాడు. ఉత్తరాలు పంపాల్సిన చిరునామా సహితం తెలియ పర్చలేదు. మంగల్ అధికారికి చిరునామా తెలుస్తుందేమోనని ఉత్తరం తెచ్చాడు.
అదీ బిటేన్ నిజమైన పేరు. ఉత్తరం మీద తాతా నగర్ ముద్ర ఉంది. ఉత్తరం తండ్రి దగ్గరి నుంచే వచ్చి ఉండాలి. వారికే తన చిరునామా తెలియజేసి ఉంటాడు.
ముఖర్జీ , బిటేన్ నిజంగా బ్రాహ్మడు!
కాలూ వాస్తవాల్ను గ్రహించడానికి ప్రయత్నించాడు. జందెం బిటేన్ కు జన్మ హక్కు, అయినా అతడు దాన్ని ధరించడానికి నిరాకరించాడు. ప్రేమించిన యువతినైనా వదులుకున్నాడు కాని అందుకు అంగీకరించలేదు.
కమ్మరి బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. వాడు కూతురు ప్రేమించిన యువకుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి కులం మార్చుకోవాలనే షరతు పెట్టాడు.
బిటేన్ - బికాష్ ముఖర్జీ - ఎన్నటికైనా తిరిగి రావడం సంభవిస్తే ఇంత శక్తి అతనికి ఎలా వచ్చిందో అడగాలి.
సరిగ్గా సమయానికి అభిజిత్ వారి జీవితాల్లో ప్రవేశించాడు. వారి జీవితం కాస్త తేలిక అయింది. అభిజిత్ ఒక సమస్య. అది కాలూ స్వంత విషయం కావడానికి వీల్లేదు. గుడినీడకు చేరిన ప్రతివాణ్ణి గురించి అది పట్టించు కుంటుంది. ఇది సాంఘిక నియమ నిబంధనలకు సంబంధించిన సమస్య.





