Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
'వైమృదాయ ఇంద్రాయ' అను మంత్రమున ఇంద్రుని కొరకు ఏకాదశ కపాల పురోడాశము నిర్వాపము చేయవలెను. యజమానితో సమానుడైన శత్రువు అతనికి మించినవాడైనను, శత్రువు లేని వాడైనను యజమాని శత్రువుచే తిరస్కరించ బడుచున్నాడని అర్థము. శత్రుఘాతుకమగు ఇంద్రరూపమునకు ఏకాదశ కపాల పురోడాశ నిర్వాపనము చేసినందున యజమాని శత్రుఘాతి అగుచున్నాడు. అతడు శత్రువును తొలగించుచున్నాడు.
'ఇంద్రియావతే ఇంద్రాయ' అను మంత్రమున ఇంద్రుని కొరకు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అత్యంత సామర్థ్యము గల ఇంద్రరూపముకు ఏకాదశ కపాల పురోడాశము నిర్వాపము చేసినందున యజమానికి సామర్థ్యము కలుగుచున్నది.
దేవతలు ముప్పది ముగ్గురు. పురోడాశ కపాలములు ముప్పది మూడు. అందువలన యజమానికి సంపద కలిగించుటకు ముప్పది ముగ్గురు దేవతలు యజమాని యందు ప్రవేశించుచున్నారు.
3. ఇది విజితి నామక ఇష్టి. ఈ ఇష్టిని గ్రహించిన యజమాని శత్రువులతో యుద్ధము చేసి పాప విముక్తుడై విజయము సాధించును.
మూడవ అనువాకము
1. దేవాసురులు యుద్ధమునకు సన్నద్ధులు అయినారు. గాయత్రీదేవి దేవాసురులు - ఉభయుల - ఓజస్సును, బలమును, ఇంద్రియ పాటవమును, వీరత్వము, సంతానాదులను పశువులను తీసికొని వెళ్లిపోయినది.
దేవాసురులు ఆ విషయము గ్రహించినారు. గాయత్రిని ప్రసన్నము చేసికొనిన వారికి సంపదలు కలుగునని వారు గ్రహించినారు. దేవతలు 'విశ్వకర్మా' అనియు అసురులు 'దాభీ' అనియు సగౌరవముగా గాయత్రిని ఆహ్వానించినారు. కాని గాయత్రి ఉభయులలో ఏ ఒక్కరిని అనుగ్రహించలేదు.
అప్పుడు దేవతలు ఈ యజుమంత్రమును కనుగొన్నారు.
2. "ఓజోసి సహూసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయు రభిభూః"
నీవే ఓజస్సువు. సాహసమవు. బలమవు. దీప్తివి. దేవతలకు స్థానమగు స్వర్గమవు. విశ్వమనవు. విశ్వాయువవు. సర్వాయువవు. సమస్తవు. నీవే శత్రువులను పరాభవించు దానవు.
3. ఈ మంత్ర ఉపాసన చేత దేవతలు గాయత్రిని ప్రసన్నము చేసికొన్నారు. అసురుల ఓజో బలమిన్ద్రియం ప్రజాం పశూన్ దేవతలు వశపరచుకున్నారు.
4. గాయత్రి తొలగిపోయినందున దీని 'గాయత్రి ఇష్టి' అన్నారు.
సంవత్సరోవై గాయత్రీ - గాయత్రియే సంవత్సరము కదా! సంవత్సరమే గాయత్రి రూపమున తొలగిపోయినది. దేవతలు ఈ ఇష్టిని చేసి అసురుల బలాదులను తీసుకున్నారు. అందువలన దీనిని "సంవర్గఇష్టి" అన్నారు.
5. ఎవనికి శత్రువులు ఉందురో మరియు ఎవడు శత్రువులను ఓడించదలచునో అతడు శత్రువుల ఓజోబలములను తొలగించునట్టి సంవర్గఇష్టిని అనుష్ఠించ వలెను. అగ్నయే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్.
6. అష్టా కపాల పురోడాశమును ఆరిన వేదిక మీద ఉంచవలెను. ఓజోసి అనుమంత్రమున దానిని తాకవలెను. అందువలన శత్రువు యొక్క ఓజస్సు, బలము, ఇన్ద్రియము, వీర్యము, ప్రజలు పశువులు తొలగి యజమాని యందు చేరుదురు. అతడు తన శత్రువులను పరాభూతులను చేయును.
నాలుగవ అనువాకము
1. ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు. ప్రజలు ప్రజాపతిని విడిచివెళ్లిపోయినారు. ఆ విధముగ వెళ్లివారు నివసించిన చోట 'గర్ముత్' అణు అరణ్యధాన్యము మొలచినది.
బృహస్పతియు, ప్రజాపతియు ప్రజలను అనుసరించినారు. 'ప్రజాపతీ! నిన్ను గర్ముత ధాన్య సంపదయందు ప్రతిష్ఠితుని చేయుదును. అందువలన ప్రజలు నిన్ను చేరుదురు' అని బృహస్పతి ప్రజాపతిని ధాన్యవంతుని చేసినాడు. అందువలన ప్రజలు తిరిగి ప్రజాపతిని చేరుకున్నారు.
2. సంతానము కోరువాడు సంతానఫలప్రాప్తి కొరకు ప్రజాపతి దేవతాకమగు గర్ముత్ ధాన్య చరును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ప్రజాపతిని సేవించవలెను. అందువలన ప్రజాపతి యజమానికి సమృద్ధ సంతానము కలిగించును.
3. ప్రజాపతి పశువులను సృష్టించినాడు. పశువులు ప్రజాపతిని విడిచివెళ్లి పోయినవి. ఆ విధముగా వెళ్లి పశువులు నివసించిన చోట 'గర్ముత్' అను అరణ్యధాన్యము మొలచినది.
పూషదేవతయు ప్రజాపతియు ఆ పశువులను అనుసరించినారు. 'ఈ గర్ముద్ధాన్యమున నన్ను ప్రతిష్ఠించుము. పశువులు నిన్ను చేరగలవు' అని పూష అన్నాడు. 'నన్ను ప్రతిష్ఠించుము. గర్ముద్ధాన్యము నాకు సంబంధించినది అగును' అని సోమదేవత అన్నాడు.
ప్రజాపతి 'మీ ఉభయులను ప్రతిష్ఠింతును' అన్నాడు. ప్రతిష్ఠించినాడు. అందువలన పశువులు తిరిగి ప్రజాపతిని చేరినవి.
4. పశువులు కావలెనను కొనువాడు సోమపూష దేవతాకమగు గార్ముత చరును నిర్వాపము చేయవలెను. అతడు స్వభాగధేయమున సోమపూషదేవతలను అర్పించవలెను. అప్పుడు ఆ దేవతలే అతనికి పశువులను కలిగింతురు. సోమదేవత రేతస్సు కలిగించును. పూష దేవత పశువులను కలిగించును.
అయిదవ అనువాకము
1. అగ్నీ! గోవులను తీసికొని మావద్దకు విచ్చేయుము. చంద్రుడా! పశువులకు పుష్టి కలిగించుము. మమ్ము సంతుష్టులను చేయుము. ఇంద్రుడు మా ఇండ్లలో పశువులను చేర్చును గాత.
2. సూర్యుడు పశుసహస్రములు కలవాడు. అతడు మా ఇంట ఆనందించును గాత. పూష పశుపోషకుడు. అతడు ధనము చేతబట్టి మా ఇంటికి వచ్చును గాక.
3. విధాతయుం జగత్పతియు, ఈశానుడును అగువాడు మాకు ధనములను ఇచ్చును గాత. అతడు మాకు పరిపూర్ణ రక్షణలను కలిగించును గాత.
4. ప్రజాపతి శ్రేష్ఠుడు. కోరికలు తీర్చువాడు. అతడు మా ఇండ్లలో వేల, పదుల వేల పశువులతో విహరించును గాక.
5. ధనపోషక దేవా! దేవతలు నీచేత అమృతమును, అనంత కీర్తిని స్వర్గమునందు స్థాపింపచేసినారు. మా జీవనమునకు గాను నీవు ఆలమందలను తెచ్చిఇమ్ము.
6. అగ్ని గృహపతి. చంద్రుడు జగత్పాలకుడు. సూర్యుడు మేధాశక్తి కలవాడు. వారికి స్వాహా.
7. గృహపతివగు అగ్నీ! నీ ఘృతభాగము ఉన్నది. దానితో కూడిన ఓజస్సు ఉన్నది. యజమాని నిన్ను అనుసరించి ఉన్నాడు. వానిని అతనికి సమకూర్చుము.
నేను గొప్పవారు ఏర్పరచిన మార్గమునుండి తొలగను. యజమానులందు తలమానికమును అగుదురు గాక. స్వాహా.
ఆరవ అనువాకము
1. పశువు కావలెననుకొనువాడు 'చిత్రాయాగము' చేయవలెను. ఇయంవై చిత్రా - ఈ భూమియే చిత్ర కదా! అదికాక ఈ భూమి మీద సర్వభూతములు పుట్టుచున్నవి. అందువలన ఈ ధరిత్రియే 'చిత్ర' అయినది.
ఈ విషయమును గ్రహించి పశువులను కోరువాడు చిత్రాయాగము చేయవలెను. అందువలన అతనికి పశుసమృద్ధి, సంతాన సమృద్ధి, మిథునములును కలుగుచున్నవి.
2. చిత్రాయాగము నందు సప్తహవిస్సులు కలవు. తొలి హవిస్సు అగ్నిదేవతాకము. ఆ హవిస్సుచే పశూత్పత్తి బీజమును ఉంచినట్లగును. రెండవది సోమదేవతాకము. ఈ హవిస్సుచే రేతస్సు చేర్చినట్లుగును. మూడవది త్వష్టదేవతాకము. ఈ హవిస్సున చేర్చిన రేతస్సు నానా రూపములు దాల్చును. నాల్గవది సరస్వతీ దేవతాకము. ఈ హవిస్సున చేర్చిన రేతస్సు నానా రూపములు దాల్చును. నాల్గవది సరస్వతీ దేవతాకము. అయిదవది సరస్వద్దేవతాకము. వీరిరువురు స్త్రీ పురుష దేవతలు. ఇది సప్తమిథునములందు మధ్యమము. దీనివలన యజమాని గృహము నందు దైవ్య మిథునము చేరినట్లగును. అందువలన పుట్టిన బిడ్డలకు, పశువులకు పుష్టి కలుగును.
ఆరవది సినీవాలి దేవతాకము. సినీవాలి వాక్ స్వరూపము కలది. ఆ దేవతాకమగు హవిస్సు వలన మాటకు పుష్టి కలుగును. ఏడవది ఇంద్ర దేవతాకమగును. ఇంద్ర దేవతాక చరు ఉత్తమ చరు అగును. సినీవాలి స్త్రీ ఇంద్రుడు పురుషుడు అయినందున ఇది మిథునము అగుచున్నది.
3. ఈ హవిస్సులు, సప్తసంఖ్యాకములు. గ్రామ్య పశువులు సప్తసంఖ్యాకములు. అరణ్య పశువులు సప్త సంఖ్యాకములు. ఛందస్సులు సప్తసంఖ్యాకములు. కావున ఈ సప్తసంఖ్యాక హవిస్సు వలన పశువులు, ఛందస్సులు లభించుచున్నవి.
4. కావున యజమాని సప్తహవిస్సుల హోమము చేయవలెను. అందలి దేవతలు పుష్టికి అధిదేవతలు. వారు యజమానికి పుష్టి కలిగింతురు. అతడు 'పుష్యతి ప్రజయా పశుభిః' అతనికి సంతానపుష్టి, పశుపుష్టి కలుగును. ఈ ఆహుతులు కీర్తి ప్రతిష్ఠలు కలిగించును.
ఏడవ అనువాకము
1. నల్లని వస్త్రమా! నీవు మరుత్సంబంధివి. నీవే మరుత్తులకు బలము అగుచున్నావు. జలధరము నందలి జలధారను భేదించుము.
(యజమాని అగ్న్యన్వాదానము చేసి, ఆహవనీయాగ్నిని దక్షిణ దిశన అతిక్రమించి నల్లని వస్త్రము ధరించవలెను.)
2. మరుత్తులారా! రండి. మనోవేగమున రండి. వర్షము కలిగించు పడమటి గాలిని వెంట తీసికొనిరండి. డేగవలె వేగముగ రండి. ఆనందించండి.
అశ్వినులారా! మేఘము సాగినది. వానకురిపించినది. అది ధారలుగా కురియుచున్నది. దాని వలన క్షేమము - శుభము - కలుగునట్లు చేయండి.
3. ఎదురుగాలి వానకురిపించి జనులను మురిపించును గాత. తస్మై స్వాహా.
పెనుగాలితో కూడి, వర్షము కలిగించుచు, తీవ్ర ధారాపాతమై మరలును గాక. స్వాహా.
ఉరుముచు, కురియుచు, భయము కలిగించుచు మరలును గాత. స్వాహా.





