Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    శ్రీకృష్ణుని మాటలు విన్నాడు శిశుపాలుడు. మరింత మందిపదినాడు. "శ్రీకృష్ణా! నీ స్నేహ కోపములతో నాకు నిమిత్తము లేదు. నీవు దుర్మార్గుడవు. నాకిచ్చిన రుక్మిణిని అపహరించినావు. నీవు దొంగవు. దొంగవయి సిగ్గులేక నీతులు వల్లించుచున్నావు." అని మరెన్నో దుర్బాషలాడినాడు.
    అని శిశుపాలుండోండోకట నప్రియముల్ వెస బల్కు చున్నచో
    ననల శిఖాలి దూల దనుజంతక చక్రము రాజ చక్రమె
    ల్లను భయమంద మూర్ధవికలంబుగ నప్పుడు సేసె జేదినం
    దను తనువున్ బృహద్రుధీరధారలు బోరన మీది కొల్కగాన్
    శ్రీకృష్ణుడు చక్రమునకు కూలిన శిశుపాలుడు వజ్రాయుధపు తాకిడికి కూలిన పర్వత రాజము వలె ఉన్నాడు. శిశుపాలుని మహా కాయము నుంచి ఒక తేజస్సు వెడలినది. ఆ తేజస్సునకు సభసాంతము వెలుగొందినది. ఆకాశము తేజరిల్లినది. సభవారి కనులు మిరుమిట్లు గొలుపినవి. అ తేజస్సు శిశుపాలుని కాయము నుండి బయల్వేడి ప్రశాంతముగా, ప్రకాశవంతంగా శ్రీకృష్ణుని చేరినది. తల వంచినది. శ్రీకృష్ణునిలో కలిసిపోయినది.
    శిశుపాలుడు చచ్చినాడు.
    ఉరుములు మెరుపులతో పిడుగుల వాన కురిసినది.
    సముద్రము పొంగినది. భూమి అదిరినది.
    లోకము శ్రీకృష్ణునకు జయము పలికినది.
    జయజయ ధ్వానములతో దిక్కులు పిక్కటిల్లినవి.
    శిశుపాలుని దేహమునకు అగ్ని సంస్కారము జరిగినది.
    శ్రీకృష్ణుడు శిశుపాలుని కొడుకునకు చేది రాజ్యపు పట్టము కట్టినాడు.
    అ విధముగా రాజసూయము శ్రీకృష్ణునిచే రక్షింపబడినది. నిర్విఘ్నముగా, సుప్రయోగముగా సమాప్తమయినది. సకల దేవా, గురు, బ్రాహ్మణులు తృప్తిచెందినారు. ధర్మరాజు అవభ్రుధ స్నానము చేసినాడు. సభా మధ్యమున తేజోవంతుడయి ప్రకాశించినాడు. అతనిని చూచి శ్రీకృష్ణుడు మున్నగు పాండవ మిత్రులు ఎంతో సంతోషించినారు. దుర్యోధనాదులగు ఆమిత్రులు ఈర్ష్యపడి క్రోధవంతులైనారు.
    రాజసూయమునకు వచ్చిన రాజులందరు ధర్మరాజును కీర్తించినారు. అతని సెలవు పొందినారు. తమ తమ దేశములకు మరలినారు. భీష్మ, దృతరాష్ట్రుదులను భీముడు పంపినాడు. ద్రుపదుని అర్జునుడు పంపినాడు. కృపాచార్య, ద్రోణచార్య, అశ్వత్ధామలను సహదేవుడు పంపినాడు. కర్ణ, శల్య , సుబలులను నకులుడు పంపినాడు. విరాట, రాజ, భగదత్తాదులను అభిమన్యుడు పంపినాడు. పార్వతేయ, సౌరాష్ట్ర రాజులను ద్రౌపదీ పుత్రులు పంపినారు. బ్రాహ్మణులను , విధ్వాంసులు , ధర్మరాజు చేత పూజింపబడినారు. ధనధాన్యములు పొందినారు. పాండవులను ఆశీర్వదించినారు. వెళ్ళినారు.
    రాజసూయము విజయవంతముగా జరిపించి శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమయినాడు. "ధర్మరాజా! సకల భూతములు పర్జన్యుని ఆశ్రయించి జీవిన్చుచున్నవి. పక్షులు, ఫలవృక్షములను ఆశ్రయించి జీవించుచున్నవి. దేవతలు ఇంద్రుని ఆశ్రయించి కీవించుచున్నారు. నీ బంధు జనులు నిన్ను ఆశ్రయించి ఉన్నారు. వారిని చక్కగా పోషించుము. అప్రమత్తుడవై ప్రజాపాలనము చేయుము. జాగరూకూడవయి ప్రవర్తించుచుండుము" అని ఉపదేశించినాడు.
    శ్రీకృష్ణుడు ప్రయాణము కాగా ధర్మరాజు కనులు చెమ్మగిల్లినవి. గొంతు జీరవోయినది. "శ్రీకృష్ణా! నీ అనుగ్రహము వలన రాజసూయము పరిసమాప్తమయినది. నేను కీర్తివంతుడను అయినాను. నీవు ద్వారకలో ఉన్నను మమ్ము కనిపెట్టుచుండవలెను. దూరమున ఉన్నను దగ్గర ఉన్నట్లు మమ్ము కాపాదవలెను. నిన్ను విడిచి మేము నిముషమైనను నిలువజాలము" అని వీడ్కోలు ఇచ్చినాడు. శ్రీకృష్ణుడు దివ్యరధమున ఎక్కినాడు. రధము సాగినది. వేగమున ఏగినది. రధము కంటికి కనిపించి నంతవరకు పాండవులు చూచినారు. మరలి రాజ్యానికి మరలి వచ్చినారు.

                                                        ఆలోచనామృతము
    
1. మహాభారతము మానవ ఇతిహాసము. అంతేకాదు. అది మానవ జీవిత సర్వస్వము. వ్యక్తీ జీవితము సంపూర్ణముగా సకల్యముగ వివరించబడుటే కాక సమాజ జీవితమూ, రాజకీయ జీవితమును కూడ అనితర సాధ్యముగ వివరించినాడు వ్యాస మహర్షి. అతడు మానవజాతికి అందించిన గొప్పదనము మహాభారతము. మనము దానిని అధ్యయనము చేసి అర్ధము చేసుకోన లేకపోవుచున్నాము.
    పాండవులు బలపరాక్రమములు కలవారు. వారికి భీష్మాదుల ఆశీస్సులు ఉన్నవి. అయినను దుర్యోధనుని కుట్రలకు గురి అయినారు. లక్క ఇంటికి నెట్టబడినారు. కష్టములను ఎదుర్కోనుటకు దేహబలము మాత్రము చాలదు. అక్కడ పాండవులకు విదురుడు సాయపదినాడు. అతడు లక్క ఇంటి నుండి బయట పడుటకు తోడ్పడినాడు. తదుపరి వ్యాస మహర్షి పాండవులకు నీడవలె తోడయినాడు. ఆ నీడ ద్రౌపది పెళ్ళి వరకు సాగినది. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకు తోడూ నీడ అయినాడు.
    మంచి కార్యములకు మహాత్ముల సాయము ఎల్లప్పుడూ లభించుచుండును. దుష్టుల కార్యములు ఫలించినట్లు కనిపించి పతనమగుచుండును. దుర్యోధనుని ప్రయత్నములు ఇందుకు నిదర్శనము.
    పాండవులకు ఖాండవప్రస్తపు అడవులకు ద్రోసి వారిని నాశనము చెయవలెను అనుకున్నాడు దుర్యోధనుడు. పాండవులకు శ్రీకృష్ణుని సాయము లభించినది. అతని అండన జరాసంధుని వధించ గలిగినారు. మానవ చరిత్రలో జరాసంధవధ ఒక ప్రముఖ ఘట్టము. రాజులను, స్త్రీలను చెరపట్టు దుర్మార్గుడు నశించినాడు. జరాసంధ వధ తరువాత పాండవులు నాలుగు దిక్కుల రాజులను వశపరుచుకొనుట సులభమయినది.
    ధర్మరాజుతో రాజసూయ యాగము చేయించి శ్రీకృష్ణుడు చాల సాధించినాడు.
    i) నాలుగు దిక్కుల రాజులు ఒకచోట కూడినారు. అందరును ధర్మరాజు ఆధిపత్యమును అంగీకరించినారు.
    ii) దుర్యోధనాదులు ధర్మరాజు అధికార సంపదను చూచియు ఏమీ చేయలేనంతటి నిర్వీర్యులని నిరూపింపబడినారు.
    iii) ధర్మరాజు ఇంద్రప్రస్థము నుండి కదలలేదు. రాజసూయము వలన అతనికి సకల రాజుల పరిచయము ఏర్పడినది.
    iv) శ్రీకృష్ణుని మేధా సంపత్తి, రాజకీయపు ఔన్నత్యము నిర్ధ్వంద్వ ముగా నిరూపించబడినది.
    v) నిర్నిమిత్త కలహాకారుడు శిశుపాలుడు హతుడు అయినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.