Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"రా బాబూ. రా. ఈ నల్లగుడ్డ లోంచి చూడు. నీకేం కనిపిస్తుందో తర్వాత చెప్పు నువ్వేం చూశావో."
ఫోటో గ్రాఫర్ నిత్యాసంతోషి. అతడు ప్రతి విషయాన్ని అతి చులకనగా చూస్తాడు. పిరికి కుర్రాణ్ణి చూసేవరకూ అతనికి ముచ్చట అయింది.
అభిజిత్ సిగ్గుపడ్డాడు. అనుమతి కోసం లేఖ వైపు చూశాడు. "సరే చూడు" అన్నట్లుగా లేఖ తల ఊపింది.
"ఊ . చూడు. కెమెరా గ్లాసులోంచి చూడు. నేను కనిపిస్తున్నానెమో."
"ఒక్క నిముషం ఆగండి"
ఫోటో గ్రాఫర్ అప్రమత్తంగా ఉన్నాడు. అభిజిత్ కెమెరాలో లోంచి తన్ను చూడాలనే కౌత్సుక్యం ఆమెలో ఎక్కువైంది. లేఖ అభిజిత్ ను చూడ్డంలో మగ్నం అయిపొయింది. అభిజిత్ ఎంత మంచి కుర్రాడు! వాడు పెద్దవాడైతే ఒక కెమెరా కొనియ్యాలి అనుకుంది.
ఫోటో గ్రాఫర్ జేబులోంచి కెమెరా తీశాడు. కెమెరా 'క్లిక్' మంది.
"బావుంది, చాలా బావుంది" అన్నాడు. ఫోటోగ్రాఫర్ తన గెలుపుకు సంతోషిస్తూ.
లేఖ అదిరి పడింది."ఏమిటది?"
"కరుణరసం ముఖంలో తొణికిసలాడింది. నాక్కావాల్సిన తస్వీరు దొరికింది. రేపు ఈ చిత్రాన్ని మహానగరం యావత్తూ చూస్తుంది."
24
"అభిజిత్ , పేరు చాలా పొడుగ్గా ఉంది. "జిత్ " అంటే సరిపోదూ?" కాలూ ఆలోచించాడు.
"జిత్?" నాకు "అభి" అంటే ఇష్టం. 'అభి' ఎలా ఉందో ఆలోచించాడు. బావుంది అభి బావుంది. అంతే "అభి"
నేను మాత్రం జిత్ అనే పిలుస్తా. పోనీ రెండు పేర్లూ ఉంటాయి.
"నీవు జిత్ అని పిలువు. నేను 'అభి' అని పిలుస్తా. ఇతరులు అభిజిత్ పిలుస్తారు. ఏమంటావ్? ఆ పేరంటే మా అమ్మకు ఎంతో ఇష్టం. రెండు రోజులైనా సంతోషించకుండానే గతించింది.
పేర్ల కధ తల్చుకోవడం అతనికి ఆనందంగా ఉండేది. ఎన్నిసార్లు చెప్పుతున్నా విసుగుండేది కాదు. ఆ ఆలోచన వచ్చేవరకూ అతని ముఖంలో విచారం ఆవరించింది.
అభిజిత్ అది ఉబుసుపోకకు పెట్టిన పేరు కాదు. లాంచనంగా పెట్టింది. అంతకంటే కాదు ఆ పేరు అతనిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. అభిజిత్ క్షణం వరకూ కూడా లేఖను వదిలి ఉండేవాడు కాడు. దూరంగా ఉంటె చంద్రలేఖ సహితం భరించలేకపోయేది. ఎందుకీ కొత్త బరువు? చంద్రలేఖ చాలదూ? ఆమె సమస్యే అతన్ని సతమతం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు లేఖ మీద అభిజిత్ కు గల ఆప్యాయతను చూచి ఈర్ష్య పడేవాడు.
అభిజిత్, లేఖ దగ్గర అక్షరాలూ, పదాలు నేర్చుకుంటున్నాడు. పదాలు ఇట్టే పడేవి. కాని ఆక్షరాలు అంత తేలిగ్గా అంటేవి కావు. అతనికి తండ్రి తాతల పోలిక వచ్చి ఉండాలి. భారత దేశపు రైతులంతా అంతే. వారికి వ్రాయడమూ, చదవడమూ రావు. అయినా భారత, భాగవతాల్లోని పద్యాలు, నీతి కధలూ, సామెతలూ వందలకొద్దీ వారి నాలుకల మీద మసలుతుంటాయి. అభిజిత్తూ అంతే. విన్నదల్లా ఇట్టే పట్టేసేవాడు.
అభిజిత్ చదవు చెప్పడంతో కాలూకు సంతృప్తి కలుగలేదు. తనకు తండ్రి తాతల్నుంచి వచ్చిన వారసత్వం ఏం కావాలి? తరతరాల నుంచి వారి చేతుల్లో మెరుగులు దిద్దుకున్న ఇనుపపని తనతో అంతరించాల్సిందేనా? కాదు . ఆలా కావడానికి వీల్లేదు. అభిజిత్ ఉన్నాడు. వాడికి కమ్మరిపని నేర్పాలి. అతని వంశ వృక్షం కాలూ గుండెలో వేళ్ళు తన్నుకుంది. దాని వేళ్ళు కాలం అనే నేలలో లోతుగా పాతుకొని పోయాయి.
కాలూ తన తొందరపాటును చూచి నవ్వుకున్నాడు. అభిజిత్ ఇంకా చిన్నవాడే. పని నేర్చుకునేంత వయస్సు రానేలేదు. ఎందుకింత తొందర? గుడికి దూరంగా ఉండేట్లు ఒక గది తీసుకొని కమ్మరి కొలిమి ఏర్పాటు చేస్తే సరిపోతుంది. వాణ్ణి అక్కడికి తీసికెళ్ళడం, పని నేర్పడం ఎంత బావుటుంది! వాడు ఈ విషయం లేఖతో తప్ప మరేవ్వరితోనూ చెప్పడు.
"ఆలోచన ఎలా ఉంది?" అని అడిగాడు అదృశ్యంగా ఉన్న భార్యను.
ఆమె అంగీకరించింది. వింత విషయాలంటే ఆమెకు అపరిమితమైన ఆసక్తి. అభిజిత్ కావాలనీ తరతరాలుగా వస్తున్నా కుల విద్య నేర్చుకునే మగమొలక ఉండాలనీ అభిలాషగా ఉండేది.
నిర్ణయం జరిగిపోయింది. అభిజిత్ గబగబా పెరిగిపోవడమే ఆలస్యం. అప్పుడు ఎంత బావుంటుంది! ఇంతట్లోనే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది. అభి పసిపాప అవుతే ఎంత బావుండేది? వాణ్ణి భుజం మీద పడుకోబెట్టు కొని అటూ ఇటూ తిరిగేవాడు. హృదయం లోంచి పెల్లుబికిన ఆ భావన చేతుల్లోకి పాకి బాధ పెట్టింది. విశాలమైన అతని భుజ స్కందం రిక్టంగా ఉంది.
ఈలోగా లేఖకు మరో సమస్య ఎదురైంది. ఈ విషయంలో తండ్రిని బాధించదలచలేదు. స్వయంగా పరిష్కరించాలనుకుంది. వంటమనిషి ఒకనాడు ఆమె దగ్గరికి వచ్చి ఏదో రహస్యం చెప్పనున్నట్లు "కాస్త ఇలా రండి" అని పిలిచింది.
బామ్నీ లేఖను పడకగదిలోకి తీసికెళ్ళింది. అభిజిత్ మంచం దగ్గరికి వెళ్ళి పరుపు ఎత్తింది.
"చూడండి"
లేఖకు ఒక కాగితపు పొట్లం కనిపించింది. దాన్ని మెల్లగా విప్పి చూసింది. అందులో రెండు తెల్లటి రొట్టెలు ఉన్నాయి. లేఖ భావనలను పరీక్షిస్తూ బామ్నీ నుంచుంది.
"చూశారా?"
క్షణం లేఖకు ఏమీ అర్ధం కాలేదు. జిత్ రొట్టేల్ను పాత వార్తా పత్రికలో కట్టి పరుపు క్రింద దాచుకున్నాడు. రొట్టెలు కట్టే దరచిపోయినాయి. అవి చాలా వారాల క్రింద అక్కడ ఉంచినట్లుంది. అభిజిత్ ఎముకను దాచుకున్న కుక్కపిల్లలా అగుపించాడు.
"ఏం చేస్తాడో చూతాం" రొట్టేల్ను మళ్ళీ కాగితంలో చుట్టి యధాప్రకారం పెట్టేసింది.
రోజులు గడిచిపోయాయి. రొట్టె యధాతధంగా ఉంది. అభిజిత్ దాన్ని అంటలేదు. లేఖ దాన్ని తీసి పారేసింది.
మర్నాడు మళ్ళీ రొట్టె పడక కిందికి వచ్చింది. అది తాజా రొట్టె. లేఖ అభిజిత్ ను గదికి పిలిపించింది.
జిత్ అడిరిపోయాడు. అదేపనిగా రొట్టె వైపు చూశాడు. జవాబు తోచలేదు.
"జిత్ మళ్ళీ అలా చేయవు కదూ. అవసరం అయినప్పుడల్లా తిండి అడుగు. దాయడం ఎందుకూ ? రోజూ నీకు కావలసినంత తిండి దొరకడం లేదా?"
రొట్టెల పొట్లం పారేసింది.
ఒకటి రెండు రోజుల తర్వాతా మళ్ళీ పరుపు కిందికి రొట్టెలు వచ్చాయి.
ఈ తడవ లేఖ గట్టిగా కోపం చేసింది. జిత్ తల వంచుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"రోజూ నీ పడక దగ్గరి టేబుల్ మీద "సందేశ్" ఉంచుతాను."
ఉపయోగం లేకపోయింది. మళ్ళీ పరుపు క్రిందికి రొట్టెలు వచ్చాయి. లేఖకు బాగా కోపం వచ్చింది. జిత్ ఏడ్చాడు. ఆ కుర్రాడి దుఃఖం , దిక్కు జీవితం ఆమెను కరిగించాయి. కాని అది చెడ్డ అలవాటు . మాన్పించాలి.
అభిజిత్ కు ఇంకా గతం మరుపుకు రాలేదని లేఖకు అర్ధం అయింది. వాడికి తెల్లని గోధుమ పిండితో చేసి కమ్మని నేతితో కాల్చిన రొట్టెలు అవసరం లేదు. ముదుగు గోధుమలతో చేసిన ముడి రొట్టెలు కావాలి. అతడి కింకా నవ్య జీవనానికీ , సంపదకూ అలవడలేదు. నిన్నటి దాకా ఉన్న మండే ఆకలినీ చెత్త కుండీలల్లోని మురిగిపోయిన ఆహారాన్ని అతడింకా మరిచిపోలేదు. ఆ అంధకారమయం అయిన గతం నుంచి అతణ్ణి బైటికి లాగడానికి ఒకే ఒక మార్గముంది. అది తిండి. అది అడక్కుండా సమృద్ధంగా దొరకాలి.
లేఖకు అదొక సమస్య అయింది. వంటమనిషి రోజూ రొట్టెల పొట్లం తీసి పారేస్తుండేది. మళ్ళీ రోజూ రొట్టె ప్రత్యక్షం అవుతూ ఉండేది. రొట్టె దొరక్కుండా చేసినా, ఈపని వద్దని చెప్పినా ప్రయోజనం లేదు. ఇదొక గుడ్డి సమస్యగా పరిణమించింది.
ఒకనాడు వంటమనిషి ఆవేదనతో పరుగెత్తు కొని వచ్చింది.
"ఏమిటీ పాడు అలవాటు? వాడు ఎలా మన్తాడు. ఎలా మానిపిస్తావు? వాడు ఈ ఇంటి బిడ్డ కాడా?"
మళ్ళీ ఏదో అవాంతరం వచ్చిందని లేఖ గ్రహించింది. దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్దం అవుతూ ",మళ్ళీ ఏమైంది?" అన్నది.
తన కర్మకు గాను ఏడుస్తున్నట్లు అరచేతిలో నుదురు బాదుకొని "వాడు అంటరానివాడా?" అని అడిగింది.





