Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్|
యుయో ధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాతే నమ ఉక్తిం విధేమ||
నాలుగవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. దేవతలకు రాక్షసులకు యుద్ధము జరిగినది. ఒకవైపు దేవతలు, మానవులు, పితృదేవతలు ఉన్నారు. మరొక పక్షమున అసురులు, రాక్షసులు, పిశాచములు ఉన్నారు. యుద్ధమున దేవతలకు చిన్న చిన్న గాయములు తగిలినవి. రాత్రులు రాక్షసులు గాయములు తగిలిన దేవతలకు విషప్రయోగము చేసినారు. తెల్లవారు వరకు గాయపడిన దేవతలు మరణించుచున్నారు.
దేవతలు ఈ విషయము ఆలోచించినారు. ఇది రాక్షస కృత్యమని గ్రహించినారు. దేవతలు రాక్షసులతో రాయబారము సాగించినారు. ఉభయులు కలిసి అసురులతో యుద్ధము చేయునట్లును - గెలిచినంత రాక్షసులకు భాగము ఇచ్చునట్లు ఒప్పందము కుదిరినది. ఉభయులు కలసి అసురులను ఓడించినారు. దేవతలు రాక్షసులకు భాగము ఇవ్వలేదు. పైగా రాక్షసులను పారద్రోలినారు.
దేవతలు అసత్యమాడినారని రాక్షసులు కోపించినారు. దేవతలను సంహరించుటకు రాక్షసులు నలువైపుల నుండి ముట్టడించినారు.
అప్పుడు దేవతలు అగ్నిని యాచించినారు. త్రిహవిష్క ఇష్టిని అనుష్ఠించినారు. అందు అష్టాకపాల పురోడాశ రూప ప్రథమ హవిస్సును 'ప్ర' శబ్ద ఘటిత మంత్రవాదుడగు అగ్ని కొరకు నిర్వాపము చేసినారు. అందువలన తమను తూర్పు నుండి ముట్టడి చేసిన రాక్షసులను పారద్రోలినారు.
ద్వితీయ హవిస్సును 'విబాధ' శబ్ద ఘటిత మంత్ర ప్రతి పాద్యుడగు అగ్ని కొరకు నిర్వాపము చేసినారు. అందువలన దక్షిణ, ఉత్తర దిక్కుల నుండి ముట్టడించిన రాక్షసులను తరిమి వేసినారు.
మూడవ హవిస్సును 'ప్రతీక' శబ్ద ఘటిత మంత్రప్రతిపాద్యుడగు అగ్ని కొరకు నిర్వాపము చేసినారు. అందువలన పడమటి దిక్కునుండి ముట్టడించిన రాక్షసులను తరిమి కొట్టినారు.
అప్పుడు దేవతలకు విజయము - రాక్షసులకు పరాజయము కలిగినది.
2. శత్రువులను ఓడించ దలచిన వాడు ఈ త్రిహవిష్క ఇష్టిని అనుష్ఠించవలెను.
'అగ్నయే ప్రవతే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్' ఇది ప్రథమ హవిస్సు మంత్రము. ఇందువలన యజమాని కన్న బలము గల శత్రువు తొలగిపోవును.
'అగ్నయే విబాధవతే అష్టాకపాలం పురోడాశం నిర్వపేత్' ఇది రెండవ హవిస్సు మంత్రము. ఇందువలన యజమాని సమాన బలము గల శత్రువు తొలగిపోవును.
'అగ్నయే ప్రతీకవతే అష్టా కపాలం పురోడాశమ్ నిర్వపేత్' ఇది మూడవ హవిస్సు మంత్రము. ఇందు వలన యజమాని కన్న దుర్బల శత్రువు తొలగిపోవును.
3. త్రిహవిష్య ఇష్టిని గ్రహించి, అనుష్ఠించిన యజమాని తన ప్రబల శత్రువును ప్రకర్షముగ తొలగించును. సమబల శత్రువును అతిక్రమించును. అల్పబల శత్రువు అతని దాపులకే రాడు.
ఆలోచనామృతము
1. విధించిన ప్రతికర్మకు కారణము చూపుచున్నాడు. ఫలితము లభించు విషయమున సాదృశ్యములు చూపుచున్నాడు. శాసనముగా విధించుట లేదు. నచ్చచెప్పి చేయమని చెప్పుచున్నాడు.
ఒకహేతువును తప్పక చెప్పుచున్నాడు. ఈ హేతువు అందరకు ఆమోదయోగ్యమగునా? అని. అది విశ్వాసము మీద ఆధారపడి యుండును. నిర్దిష్టములైన హేతువులు నేటికి కనిపించుట లేదు.
హేతువాదము మరొక వాదమును వ్యతిరేకించుటకు వచ్చినదే కాని అది మూలవాదము కాదు.
హేతువాదము నిలువజాలదు. ఏలనన ప్రకృతి హేతుబద్ధము కాదు.
2. రాక్షసులు, అసురులు, పిశాచములు ఒకే జాతికాదు. వారిని వేరువేరు జాతులు. రావణుడు అసురుడు కాడు. రాక్షసుడు. మనము రావణాసురుడు అనుట సరికాదు.
దేవ, మానవ పితరులు ఒకరిని గెలుచుటకు ఏకమైనారు. అట్లే అసుర, రాక్షస, పిశాచులు.
ఎదుటి వాని బలము ఎక్కువైనపుడు భేదనీతి ప్రయోగించుట నేటికి యుద్ధనీతియే. నేటి రాజకీయములందు ఈ నీతియే ప్రబలముగా ఉన్నది.
బలహీనులు అగుచున్న దేవతలకు భేదనీతి ఉపకరించినది. అసురులను రాక్షస, పిశాచముల నుండి విడదీసినారు.
శత్రువునకు శత్రువు మన మిత్రుడు అన్నట్లు రాక్షసులు దేవతలతో కలసినారు. అసురుల ఓటమితో రాక్షసులధ్యేయము నెరవేరినది.
గెలుపు కొరకు మాత్రమే రాక్షసులతో కలసిన దేవతలు విజయము లభించగనే వారిని కాదన్నారు.
ఇటువంటి ఉదాహరణలు చరిత్రలో కో కొల్లలు.
చంద్రుని జయించినామను ఈ రోజులలో కూడ నాటినీతినే అనుసరించుచున్నాము! నేటి ప్రగతి దృశ్యమే కాని మౌలికము కాదు.
వేదనీతి మౌలికము. అది మానవ సంక్షేమమును గురించి ఆలోచించినది!
రెండవ అనువాకము
1. దేవాసురులు యుద్ధమునకు సిద్ధపడినారు. దేవతలు తమలో బలవంతుని నాయకునిగా చేసికొని యుద్ధము చేయదలచినారు. వారందరు ఇంద్రుని తమలో అత్యధిక బలవంతుడని నిర్ణయించినారు.
ఇంద్రుడు తనకు మూడు రూపములు ఉన్నవి అన్నాడు. దేవతలు ఇంద్రుని ఒక్కొక్క్ రూపమున ఏకాదశ కపాలహవిస్సు చొప్పున ముప్పదిమూడు కపాల పురోడాశ నిర్వాపమున ఇంద్రుని సంతృప్తుని చేసినారు.
ఇంద్రుని ఒక రూపము పాప విమోచకము. వారు దానికి నిర్వాపము చేసినారు. పాప విమోచకులు అయినారు.
రెండవ రూపము శత్రుఘాతకము. దేవతలు దానికి నిర్వాపన చేసినారు. శత్రు ఘాతకులు అయినారు.
మూడవది అత్యంత్ సామర్థ్యము కలది. దేవతలు దానికి నిర్వాపము చేసి అత్యంత సమర్థులు అయినారు.
మొత్తము హవిస్సుల సంఖ్య 33. దేవతలు ముప్పది ముగ్గురు. అందువలన ఈ హవిస్సులు అందుకున్న ఇంద్రుని యందు దేవతలందరు చేరినారు.
ఆ విధముగా దేవతలు 1. పాపవిమోచనులై 2. శత్రుఘాతకులై 3. అత్యంత సామర్థ్యము కలవారై అసురులతో యుద్ధమునకు వెడలినారు.
(ఏ కార్యమునకు పూనుకున్నను ముందు పాప విమోచనము చేసికొనవలెనని చెప్పుచున్నాడు. మలిన మనస్సు ఏదిచేయజాలదు. నిర్మల మనస్సు అన్నింటిని సాధించగలదు. ఇది సందేశము.)
2. శత్రువులు కలిగి, శత్రువును జయించ వలెనను కోరిక గలవాడు ఈ ఇష్టిని యజించవలెను.
ఇంద్రాయ అంహోముచే' అను మంత్రమున ఇంద్రుని కొరకు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. యజమాని కన్న శత్రువు బలవంతుడైనచో యజమానిని పాపము గ్రహించినదని అర్థము. పాపవిమోచకమగు ఇంద్రరూపము కొరకు నిర్వాపము చేసినందున అతనికి పాపవిముక్తి కలుగును. అందువలన అతడు శత్రువున కన్న బలవంతుడగును.
(బలమునకు పాపాగ్రహణము పట్టినది. అది తొలగినంత అతడు బలవంతుడు అయినాడని అర్థము.)





