Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
ఇరువది రెండవ అధ్యాయము
1. తేజ్కోసి శుక్రమమృతమాయుష్పా ఆయుర్మేపాహి|
దేవస్య త్వా సవితుః ప్రసవ్కేశ్వినో ర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే||
(అథాశ్వామేధశ్చతుర్భిరాధ్యాయైః తస్యఫాల్గుణశుక్లష్ట మ్యామారమ్భః నిష్కం ప్రతి ముంచన్వాచయతి. ఈనాలుగు అశ్వమేధ అధ్యాయములు ఇది ఫాల్గుణశుక్ల అష్టమినాడు ఆరంభమగును. నాలుగు బంగారునాణెముల హారము నిష్కమగును. అధర్యు దానిని యజమాని మెడలో వేయును.)
నిష్కమా! నీవు తేజస్సువు. పరిశుద్ధమవు. అమృతమవు. ఆయువును. రక్షించుదానవు. ఆయుర్మేపాహి - నాఆయువును రక్షింపుము.
(అశ్వమును కట్టు త్రాడు తీసికొనవలెను)
రజ్జువా! సవితాదేవుని అనుజ్ఞలో వర్తిల్లు నేను అశ్వినుల బాహువులతోను పూషహస్తములతోను నిన్ను అందుకొనుచున్నాను.
2. యజ్ఞముల చరిత్రలో పూర్వకాలమందలి యజ్ఞములందు కూడ ఈరజ్జువునే అందుకున్నారు. యజ్ఞము ప్రారంభమై సోమము అభిషుతమై యజ్ఞము ముందునకు సాగినపుడు మేము ఈత్రాటిని అందుకున్నాము.
3. (గుర్రమునకు కట్టమని బ్రహ్మ ఆదేశించును. అధ్వర్యు ఆ త్రాటిని గుర్రమునకు కట్టును.)
అశ్వమా! నీవు 'స్తుత్య' నామకవు. నీవు అందరకు ఆశ్రయమవు. అందరను నియంత్రించు దానవు. భరించుదానవు. స్వాహా అన్నంత నీవు సర్వహితకారియు విస్తరించు వాడగు - అగ్నిని చేరుకోనుము
4. అశ్వమా! నేను దేవతలు మరియు ప్రజాపతి కొరకు నిన్ను తెచ్చినాను. నిన్ను స్వయముగా దేవతలు, ప్రజాపతి వద్దకు చేరునట్లు చేయుదును.
(అధ్వర్యు అనుచున్నాడు) బ్రహ్మా! నేను దేవతలు మరియు ప్రజాపతి కొరకు ఈ అశ్వమును బంధింతును.
(బ్రహ్మ అనుచున్నాడు) నీవు అశ్వమును దేవతల కొరకును ప్రజాపతికొరకును బంధించుము. యజ్ఞసిద్ధిని పొందుము.
5.(ప్రోక్షత్యశ్వమ్. అశ్వమును ప్రోక్షించవలెను)
అశ్వమా! నీవు ప్రజాపతికి ప్రియమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను. నీవు వాయువునాకు ప్రియమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను. నీవు ఇంద్రాగ్నులకు ప్రియమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను. నీవు విశ్వేదేవతలకు ప్రియమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను. నీవు సకల దేవతలకు ప్రియమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను.
(అధ్వర్యు ఆదేశమున శూద్రునకు వేశ్య వలన పుట్టినవాడు, నాలుగు కనుల కుక్కను చంపవలెను. అప్పుడు అధ్వర్యు యజమానిచే అనిపించవలసినది)
'యో అర్వన్తం జిఘాంసతి తమభ్యమీతి వరుణః' అశ్వమును చంపదలచిన వానిని వరుణుడు వధించును.
(చచ్చిన కుక్కను ఎదురు చాపమీద పెట్టి గుర్రపు క్రింది నీటిలో తేల్చవలెను)
చంపువాడు దూరమైనాడు. కుక్క దూరమైనది - "పరోమర్తః - పరాశ్వ"
(యస్య శునశ్చక్షుషోసమీపే పుణ్డ్రేస్తః సచతురక్ష ఉచ్యతే. కనుల వద్ద నామమున్న కుక్కను నాలుగు కనులది అందురు.)
6. (గుర్రమును నీటినుండి తెచ్చి స్తోకీయమను పదిలేక వేయి ఘృతాహుతులు ఇవ్వవలెను)
అగ్నయే స్వాహా, సోమాయ స్వాహా. అపాంమోదాయ - జలములముదమునకు స్వాహా. సవిత్రే స్వాహా. వాయువే స్వాహా. విష్ణువే స్వాహా. ఇంద్రాయ స్వాహా. బృహస్పతయే స్వాహా. మిత్రాయస్వాహా. వరుణాయ స్వాహా.
7. హింకారాయ స్వాహా. హింకృతాయస్వాహా. క్రన్దనే స్వాహా. అవక్రందాయ స్వాహా. ప్రొథతే స్వాహా. ప్రప్రోథాయ స్వాహా. గంధాయ స్వాహా. ధాత్తాయ స్వాహా. నివిష్ఠాయ స్వాహా. ఉపవిష్ఠాయ స్వాహా. సందితాయ స్వాహా. వల్గతే స్వాహా. ఆసీనాయ స్వాహా. శయనాయ స్వాహా. స్వపతే స్వాహా. జాగ్రతే స్వాహా. కూజతే స్వాహా. ప్రబుద్ఘాయ స్వాహా. విజృంభమాణాయ స్వాహా. విచృతాయ స్వాహా. సంహానాయ స్వాహా. స్వాహూపస్థితాయ స్వాహా. స్వాహాయనాయ స్వాహా ప్రాయణాయ స్వాహా.
8. పరిగెత్తు వారికి స్వాహా. వేగవంతునకు స్వాహా. క్షిప్రగతికి స్వాహా. కూర్చున్నవారికి స్వాహా. లేచినవారికి స్వాహా. తిరుగువారికి స్వాహా. తిరుగని వారికి స్వాహా. బలమునకు స్వాహా. వేగమునకు స్వాహా. కుండ కదిలించువానికి స్వాహా. వాడకువానికి స్వాహా. సేవితునకు స్వాహా. వినువానికి స్వాహా. చూచువానికి స్వాహా. చూడబడువానికి స్వాహా. రెప్పవేయువానికి స్వాహా. తిన్నదానికి స్వాహా. త్రాగినదానికి స్వాహా. మూత్రించుటకు స్వాహా. కర్మకారికి స్వాహా. కర్మ చేసినవానికి స్వాహా.
9. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి|
ధియోయోనః ప్రచోదయాత్ ||
సవితృ దేవత పాపభర్జనకారి. వరణీయుడు. మేము అతని తేజమును దాల్తుము. ఆ తేజము మా బుద్ధులను సత్కర్మలకు ప్రేరేపించును గాత.
10. హిరణ్యసవితను నన్ను రక్షింపుమని ఆహ్వానించుచున్నాను. అతడు జ్ఞానియగు దేవత. స్వర్గాది ఉత్తమ పదములు అతనికే తెలియును.
11. సవిత సర్వజ్ఞుడు. అతని చిత్తము మహత్తము, సత్యసాధకము. మేము సవిత మంచి మనసును యాచించుచున్నాము.
12. సవిత సుమతిని పెంచువాడు. అందరి చిత్తములను ఎరిగినవాడు. మేము అతనిని చక్కగా స్తుతింతుము. అతని దానమును యాచింతుము.
13. సవిత శ్రేష్ఠజనుల పాలకుడు. శుభకర్మ ప్రేరకుడు. దేవతల తర్పణకు గాను సవిత దానమును యాచించుచున్నాము.
14. సకల దేవతల తర్పణకుగాను ప్రేరక సవితా దేవుని సంపదను సద్భుద్దిచే యాచించుచున్నాము.
15. అధ్వర్యులారా! అమర అగ్నికి సమిధలు అర్పించండి. ప్రబుద్ధుని చేయండి. జాగృతుడగు అగ్ని మాహవిస్సులను దేవతలకు చేర్చును గాత.
16. అగ్ని హవ్యవాహనుడు. అమరుడు. కోరదగినవాడు. దూత. హితుడు. స్తుతులు అందుకొనును. దేవతల వద్దకు చేర్చును.
17. అగ్నిదూత. అతనిని ణా ముందు స్థాపించుచున్నాను. ఈ యజ్ఞమును దేవతలను తెమ్మని హవ్యవాహుని ప్రార్థించుచున్నాను.
18. పవిత్రకారి సోమమా! నీవు శక్తిమంతుడవు. సూర్యుని వెల్లడించినావు. ధారాగతిగల నీవు గోవులు మున్నగు పశువులకు జీవనమునిచ్చు వర్షము కలిగింతువు.
19. అశ్వమా! నీవు భూమాత సంబంధమున ఎంతో సమర్థుడవు. ద్యుపిత సంబంధమున ఎంతో ప్రభుతవంతుడవు. అశ్వ, హయ, అర్వ, సప్తి, వాజి, వృష, యాజమాన, యయు, శిశు నామములు గలదానవు. నీవు దేవ మార్గము చేరుకోనుము.
దిక్పాలదేవతలారా! ఇది అశ్వము. దేవతల నిముత్తము జలముచే పవిత్రము చేయబడినది. దీనిని మీరు ఎల్లవేళల రక్షించండి.
అశ్వమా! ఇది నీవు ఆనందించుచోటు. ఇచట ఆనందించుము. ఇది నీవు నిలుచు స్థలము. ఇచట నిలుపుము. సుఖంపుము - స్వాహా.
20. ప్రజాపతయే స్వాహా. కస్మైస్వాహా. కతమస్మైస్వాహా. స్వాహాధిమాధీతాయస్వాహా. మనః ప్రజాపతయేస్వాహా. చిత్తం విజ్ఞాతాదిత్యై స్వాహా. ఆదిత్యైమహ్యై స్వాహా. ఆదిత్యైసుమృడీకాయైస్వాహా. సరస్వత్యై స్వాహా. సరస్వత్యై పావకాయై స్వాహా. సరస్వత్యై బృహత్యై స్వాహా. పూష్ణేస్వాహా. పూష్ణేప్రపథ్యాయ స్వాహా. పూష్ణే నరధిశాయస్వాహా. త్వష్ణేస్వాహా. త్వష్ణే తురీపాయస్వాహా. త్వష్ణే పురురూపాయస్వాహా. విష్ణవేస్వాహా. విష్ణవే నిభూయపాయస్వాహా. విష్ణవే శిపివిష్టాయ స్వాహా.
(ఇవి ఔద్గ్రాభణ మంత్రములు)
21. మానవనేతలందరు సవితాదేవుని మైత్రి కోరుకుందురు. అందరు ధనము కోరుకుందరు. సంతానాదుల పోషణకు అన్నాదులు కోరుకుందురు. సవితాయస్వాహా.
22. బ్రహ్మా! మాదేశమున యజ్ఞమును అధ్యయనశీల బ్రాహ్మణులును జన్మింతురు గాత. శూరులు, లక్ష్యభేదులు, ధరుర్ధారులు మహారథులగు క్షత్రియులు జన్మింతురు గాత. పాడియావులు, బరువులు మోయు ఎద్దులు, వ్యాపనశీల అశ్వములు, మనోహరస్త్రీలు, ఈయజమానికి జయశీల, రాథారోహి, సభాకుశల, సేచన సమర్థపుత్రులు జన్మింతురు గాత. నికామే నిజామే నః పర్జన్యోవర్షతు. కోరినంత పర్జన్యుడు వర్షము కలిగించును గాత. ఓషధులు ఫలించును గాత. యోగక్షేమో నః కల్పతామ్ - మాకు యోగక్షేమములు కలుగును గాత.
(యోగక్షేమం వహామ్యహమ్ అన్నాడు శ్రీ కృష్ణభగవానుడు శ్రీ మద్భగవద్గీతలో)
23. ప్రాణాయ స్వాహా. అపానాయ స్వాహా. వ్యానాయస్వాహా. చక్షుషేస్వాహా. శ్రోత్రాయస్వాహా. వాచే స్వాహా. మనసే స్వాహా.
24. ప్రాచ్య దిశకు స్వాహా. అర్వాచిదిశకు స్వాహా. దక్షిణ దిశకు స్వాహా. ఆర్యాచ్య దిశకు స్వాహా. ప్రతీచ్యదిశకు స్వాహా. అర్యాచ్యదిశకు స్వాహా. ఉదీచిదిశకు స్వాహా. అర్వాచిదిశకు స్వాహా. ఊర్ధ్వదిశకు స్వాహా. అర్వాచ్యదిశకు స్వాహా. అర్వాచ్యదిశకు స్వాహా. ఆర్యాచ్యదిశకు స్వాహా.
25.అద్భ్యః స్వాహా. వాభ్యః స్వాహా. స్వాహూదకాయ స్వాహా. తిష్టన్తీ భ్యః స్వాహా. స్రవన్తీభ్యః స్వాహా. స్యన్దమానేభ్యః స్వాహా. కూప్యాభ్యః స్వాహా. సూద్యాభ్యః స్వాహా. ధార్యాభ్యః స్వాహా. అర్ణవాయస్వాహా. సముద్రయస్వాహా. సరిరాయ స్వాహా.
26. వాతమునకు స్వాహా. ధూమమునకుస్వాహా. స్వాహాభ్రాయస్వాహా. మేధకు స్వాహా. విద్యోతమానమునకు స్వాహా. స్తనయతమునకు స్వాహా. స్ఫూర్జితమునకు స్వాహా. వర్షమునకు స్వాహా. వవర్షమునకు స్వాహా. అగ్రవర్షమునకు స్వాహా. శీఘ్రవర్షమునకు స్వాహా. ఉద్గ్రహణమునకు స్వాహా. ప్రుష్ణతమునకు స్వాహా. శీకాయతమునకు స్వాహా. పుష్పములకు స్వాహా. హ్లాదునిలకు స్వాహా. నీహారాయ స్వాహా.
27. అగ్నయే స్వాహా. సోమాయస్వాహా. ఇంద్రాయస్వాహా. పృథివ్యై స్వాహా. అంతరిక్షయస్వాహా. దివేస్వాహా. దిగ్భ్యాం స్వాహా. ఆశాభ్యః స్వాహా. ఉర్వ్యై స్వాహా. దిశే స్వాహా. అర్యాచ్యైదిశే స్వాహా.
28. నక్షత్రేభ్యః స్వాహా. నక్షత్రిభ్యః స్వాహా. అహూరాత్రే భ్యః స్వాహా. అర్ధమాసేభ్యః స్వాహా. మాసేభ్యః స్వాహా. ఋతుభ్యః స్వాహా. అర్తవేభ్యః స్వాహా. సంవత్సరాయ స్వాహా. ద్యావాపృథివీభ్యాం స్వాహా. చంద్రయస్వాహా. సూర్యాయస్వాహా. రశ్మిభ్యః స్వాహా. వసుభ్యః స్వాహా. రుద్రేభ్యః స్వాహా. ఆదిత్యైభ్యః స్వాహా. మరుద్భ్యః స్వాహా. విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా. మూలేభ్యః స్వాహా. శాఖాభ్యః స్వాహా. మనస్పతిభ్యః స్వాహా. పుష్పేభ్యః స్వాహా. ఫలేభ్యః స్వాహా. ఓషధీభ్యః స్వాహా. పుష్పేభ్యః స్వాహా, ఫలేభ్యః స్వాహా ఓషధీభ్యః స్వాహా.
29. పృథివ్యై స్వాహా. అంతరిక్షాయ స్వాహా. దివేస్వాహా. సూర్యాయ స్వాహా. చన్ద్రాయస్వాహా. నక్షత్రేభ్యః స్వాహా. అద్భ్యః స్వాహా. ఓషధీభ్యః స్వాహా. వనస్పతీభ్యః స్వాహా. పరిప్లవేభ్యః స్వాహా. చరాచరేభ్యః స్వాహా. సరీసృపేభ్యః స్వాహా.
30. అసవేస్వాహా, వసవేస్వాహా, విభువేస్వాహా. వివస్వతేస్వాహా. గణశ్రయేస్వాహా, గణపతయేస్వాహా, అభిభువేస్వాహా. అధిపతయేస్వాహా, సూషాయస్వాహా. సంసర్ఫాయస్వాహా. చన్ద్రాయస్వాహా. జ్యోతిషేస్వాహా. మలిమ్లుచాయస్వాహా. దివాపతయేస్వాహా.
31. మఘవేస్వాహా. మాధవాయస్వాహా, శుక్రాయస్వాహా. శుచయేస్వాహా. నభసేస్వాహా. నభస్యాయస్వాహా. ఉషాయస్వాహా. ఊర్జాయస్వాహా. సహసేస్వాహా. సహస్యాయస్వాహా. తపసేస్వాహా. తపస్యాయస్వాహా. అ హసస్పతయే స్వాహా.
32. వాజాయ స్వాహా. ప్రసవాయ స్వాహా. ప్రసవాయ స్వాహా. అపిజాయిస్వాహా. క్షతవే స్వాహా. స్వః స్వాహా. మూర్ధ్నే స్వాహా, వ్యశ్నువనే స్వాహా. అన్త్యాయ స్వాహా. భౌవనాయస్వాహా. భవనస్యపతయే స్వాహా. అధిపతయే స్వాహా. ప్రజాపతయే స్వాహా.
33. యజ్ఞము వలన ఆయువు లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన ప్రాణము లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన అపానము లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన వ్యానము లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన ఉదానము లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన సమానము లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన నేత్రము లభించును గాత. స్వాహా యజ్ఞము వలన శ్రోత్రములు లభించును గాత. స్వాహా యజ్ఞము వలన వాక్కు లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన మనసు లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన జ్యోతి లభించును గాత. స్వాహా. యజ్ఞము వలన పృష్టము లభించును గాత. స్వాహా.
34. ఒకటికి స్వాహా. రెండటికి స్వాహా. నూటికి స్వాహా. నూటొక్కటికి స్వాహా. దివారాత్రములకు స్వాహా. స్వర్గమునకు స్వాహా.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
అశ్వమేథాహుతియను ఇరువది రెండవ అధ్యాయం సమాప్తము.
సర్వేభస్తు సుఖినః





