Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    అది మధ్య నుండి మేద తీయబడిన మాంసము. రాక్షసాది శత్రువులు భక్షించక మున్నే, మాంసాహార మానవులు ఎగబడక మున్నే సరస్వతి దానిని భక్షించవలెను.

    ఈ మేక పచ్చని గడ్డిమీద సంచరించినది. యవల తొలి మొక్కలు మేసినది. అది స్వయముగా కరిగినది. వందల స్తుతులచే స్తుత్యమగు అగ్నిచే పచనము చేయవబడినది. ప్రతి అంగమును బయటకు తీసి ఒక్కొక్క దానినికోసి చేసిన మాంసవపా ఖండములను సరస్వతి ఆస్వాదించవలెను. ఆనందించవలెను. హూతా! యజింపుము.

    45. దైవీ హోత ఇంద్రుని యజించును గాత. ఇంద్రుడు వృషభ మాంసమును భక్షించవలెను.

    అది మధ్య నుండి మేద తీయబడిన మాంసము. రాక్షసాది శత్రువులు భక్షించక మున్నే మాంసాహార మానవులు ఎగబడక మున్నే ఇంద్రుడు దానిని భక్షించవలెను.

    ఈ ఎద్దు పచ్చని గడ్డిమీద సంచరించింది. యవల తొలి మొక్కలు మేసినది. అది స్వయముగా కరిగినది. వందల స్తుతులచే స్తుత్యుడగు అగ్ని దానిని పచనము చేసినాడు. ప్రతి అమ్గామును బయటికి తీసి ఒక్కొక్క దానిని కోసి చేసిన మాంస వపా ఖండములను ఇంద్రుడు ఆస్వాదించవలెను. ఆనందించవలెను. హోతా! యజింపుము.

    46. దైవీహోత యూపమును యజించును గాత. ఈ యూపము గట్టి త్రాళ్ళతో పశువులను హనకు కట్టి ఉంచునది. ఈ యూపము దేవతలకు ఉపకారము చేయునది. ఈ యూపమే అశ్వినుల ఛాగ హవి లభ్యస్థానము. సరస్వతి మేషహవి లభ్యస్థానము. ఇంద్రుని వృషభ హవి లభ్య స్థానము.

    ఈ యూపము అగ్ని యొక్క హవికి ప్రియస్థానము. సోమపు,  సుత్రాత ఇంద్రుని, సవిత యొక్క, వరుణుని హవికి ప్రియ స్థానము. ఇది యూపమునకు అన్న స్థానము. ఘృత పాయి దేవతలకు - హోత అగ్నికి ప్రియస్థానము.

    వనస్పతి రూపయూపమా! పశువులను అత్యంత విక్షుబ్ధము చేసి - స్తుతి, ఉపస్తుతులచే వానిని ఆయా స్థానములందు స్థాపించుము. వనస్పతి దేవత హవిని ఆరగించును గాత. హోతా! యజింపుము.

    47. దైవీహోత కళ్యాణకారి అగ్నిని యజించును గాత. అగ్ని అశ్వినుల ఛాగ మాంసపు ప్రియ స్థానమును యజించినాడు. అగ్ని - సరస్వతి మేష మాంసపు ప్రియస్థానమును యజించినాడు. అగ్ని - ఇంద్రుని వృషభమాంసపు ప్రియస్థానమును యజించి నాడు.

    అగ్ని తన ప్రియ స్థానములను యజించినాడు. సోమపు ప్రియస్థానములను యజించినాడు. సవిత ప్రియస్థానములను యజించినాడు, సుత్రాత ఇంద్రుని ప్రియ స్థానములను యజించినాడు. వరుణుని ప్రియ స్థానములను యజించినాడు. వనస్పతి యూపపు ప్రియ అన్న స్థానములను యజించినాడు. ఘృతపాయి దేవతల ప్రియ స్థానమును యజించినాడు. స్వయముగా తన మహిమను యజించినాడు.

    అగ్ని యజ్ఞములను సేవించును గాథ. హోతా! యజింపుము.

    48. దర్భయే దేవత. అశ్వినులు, సరస్వతి, ఆ దర్భచేతనే ఇంద్రుని కనులకు వెలుగును, చూపును కలిగించినారు. ధనము సమకూర్చుటగాను అశ్వినులు, సరస్వతి, ఇంద్రుడు హవిని ఆరగించవలెను. హోతా! యజింపుము.

    49. యజ్ఞశాలకు ద్వారా దేవేరున్నారు. వారితో కలసి వైద్య అశ్వినులు, సరస్వతియు, ఇంద్రునకు బలము సమకూర్చినారు. ఇంద్రుని నాసిక యందు ఘ్రాణేంద్రియమును, ప్రాణమును ఏర్పరచినారు. ఇంద్రునకు ధనము కలుగుటకు గాను అతనికి శక్తి కలిగించినారు. ఇంద్రాదులు హవిని గ్రహించవలెను. హోతా! యజింపుము.

    50. ఉషాయు రాత్రియు యుగళ దేవతలు, అశ్వినులు, సరస్వతి ఉషారాత్రులతో కలసి ఇంద్రునకు బలము కలిగించినారు. వారు ఇంద్రుని నోట వాగింద్రియమును కూర్చినారు. ఇంద్రునకు ధనము కలుగుటకు గాను  అతనికి శక్తి, స్తోమతలు కలిగించినారు. హోతా యజింపుము.

    51. ద్యావాపృథ్వులతో కలసి అశ్వినులు, సరస్వతి ఇంద్రుని అభివర్దితుని చేసినారు. ఇంద్రుని కర్ణమున శ్రోత్రేంద్రియమును ఏర్పచినారు. అతనికి కీర్తి కలిగించినారు. ఇంద్రునకు ధనలాభము కలిగించుటకు అతనికి శక్తి స్తోమతలు కలిగించినారు. ఆ ఇంద్రాదులు హవిని ఆరగింతురు గాథ. హోతా! యజింపుము.

    52. శక్తి, ఆహుతి అను దేవేరులు దుధ, సుదధలగుదురు. వారితో కూడి అశ్వినులు- సరస్వతి ఇంద్రునకు రక్షణలు కలిగించినారు. ఇంద్రునిలో తేజము, హృదయ బలము  కలిగించినారు. ధనలాభము కలిగించుటకు ఇంద్రునకు శక్తి స్తోమతలు కలిగించినారు. ఇంద్రాదులు హవిని ఆరగింతురు గాత. హోతా! యజింపుము.

    53. దేవతల ఇద్దరు దేవహోతలు అగ్ని - వాయువులు. వారితో కూడి అశ్వినులు సరస్వతి, వషట్కారములు ఇంద్రుని యందు తేజస్సు ప్రవేశపెట్టినారు. హృదయమున మతిని కలిగించినారు. ధనలాభము కలిగించురకు ఇంద్రునకు శక్తి స్తోమతలు కలిగించినారు. ఇంద్రాదులు హవిని ఆరగింతురు గాత. హోతా! యజింపుము.

    54. ఇడ, భారతి, సరస్వతిలో కూడి అశ్వినులు, సరస్వతి బలమును కలిగించినారు. నాభియందు అగ్నిని స్థాపించినారు. ధనలాభము కలిగించుటకు ఇంద్రునకు శక్తి స్తోమతలు కలిగించినారు. ఇంద్రాదులు హవిని ఆరగింతురు గాత. హోతా! యజింపుము.

    55. ఇది ఋత్విజులు చేయు ప్రశంసనీయ యజ్ఞము. ఇది సత్ హవిర్ధానము గలది. ఇది అగ్నీధ్రనామక యజ్ఞము. దీని రథమును అశ్వినులు, సరస్వతి లాగుదురు. ఈ యజ్ఞము ఇంద్రుని యందు వీర్యము, అందము, అమృతము, ఉత్తమ జన్మము కలిగించును గాత. ఈ యజ్ఞమే జగత్ స్రష్టయగు త్వష్ట అగుచున్నది. హోతలారా! ఇంద్రాదులు హవిభక్షణ చేయునట్లు యజించండి.

    56. దేవతలు బంగారు పత్రముల వృక్షమునుకు అశ్వినులును, సరస్వతి సుందర ఫలములగుదురు. వారును, వనస్పతి యూప దేవతయు ఇంద్రునకు సోమాది హవి ఫలములను ఇచ్చినారు. వారు మాకు తేజము, ఓజము, వేగము, సామర్థ్యము కలిగింతురు గాత.

    ఆ దేవతలు ధనలాభము కొరకు శక్తి స్తోమతలు కలిగించుటకు ఇంద్రాదులు హవిని  భక్షింతురు గాత. హోతా! యజింపుము.

    57. దర్భ ఓషధ సంబంధి ఉన్ని వలె కోమలము, సుఖకరము - అశ్వినులును, సరస్వతి దర్భాసనము పరచినారు. ఇంద్రా! యజ్ఞమున ఇది నీకు సుఖకరమగును గాత. అశ్వినులు, సరస్వతి దర్భతో కూడి సంపద, దీప్యమానమన్యు, శక్తిని కలిగించుటకు ఇంద్ర సహితులై హవిని భక్షింతురుగాక. హోతా! యజింపుము.

    58. శుభయాగ కుశల అగ్ని - దైవీ హోత అగ్ని, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు సరస్వతి మరియు సోమమును యథాక్రమము యజించినారు. వారు వాణిని వాణిచే పూజించినారు. సుత్రాత ఇంద్రుడు చక్కగా పూజింపబడినాడు. సవిత, వరుణుడు, వనస్పతి యూపదేవుడు సహితము చక్కగా పూజించబడినారు. దైవీ అగ్ని భౌతిక అగ్నిచే చక్కగా పూజించబడినది. మంచి పూజలందుకొను దేవహోత మానవ హోతకు కీర్తి, శక్తి, బలము, పూజ, పితరులకు అన్నము ప్రసాదింతురు గాత. ఇంద్రునకు ధనము కలిగించుటకు ఈ దేవతలందరు హవిని భక్షింతురు గాత. హోతా! యజింపుము.

    59. యజమాని - పక్వయోగ్య హవిస్సులను పచనము చేయుచు పురోడాశమును వండుచు అశ్వినుల కొరకు భాగమును, సరస్వతి కొరకు మేషమును, ఇంద్రుని కొరకు వృషభయమును యూపమునకు బంధించుచు అశ్వినులు, సరస్వతి, ఇంద్రుని కొరకు సోమము అభిషుతము చేయుచు నేడు వాస్తవముగా అగ్నిని పూజించుచున్నాడు.

    60. అశ్వినులు కొరకు ఛాగము, సరస్వతి కొరకు మేషము, ఇంద్రుని కొరకు వృషభములను ధరించి వాస్తవయూపముగ వనస్పతి దేవత యజ్ఞమునకు ఉపస్థితుడు అగుచున్నాడు. అశ్వినులు మున్నగు దేవతలు పశువుల మేదచే ప్రారంభించి శేషాంగములను భక్షించినారు. వండిన పశు శరీర భాగములను కూడా వారు స్వీకరించినారు. అశ్వినులు, సరస్వతి, సుత్రాత ఇంద్రుడు వానిని భక్షించి వర్ధిల్లినారు. వారు సురా, సోమములను సహితము పాణము చేసినారు.

    61. ఋషిపుత్రా! ఋత్విజ అగ్నీ! నేడు ఈ యజమాని ఇందరు ఋత్విజులు ఉండగా నిన్నేల వరించినాడు? ఏలననగా ఈ అగ్ని దేవతలు అందించు వరణీయ ధనమును యజమానికి అందించును, యజమాని సమర్పించు హవిస్సులను దేవతలకు అందించును.

    ద్యోతమాన అగ్నీ! దేవతలు యజమానికి దానములు  ఇచ్చునట్లు ప్రయత్నించుము. దేవతలు ఇచ్చిన దానములను పలుకుటకు మానవహోత కూడ పంపబడినాడు. హోతా! నీవు సూక్తములు పలుకుము. "సూక్తాబ్రూహి"


       
                        దాశరథి రంగాచార్య విరచిత
            శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
                    యాజ్యాది ప్రేషణమంత్ర యుక్తమగు
                 ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.
                                  సర్వేభస్తు సుఖినః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.