Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
9. నా సత్యద్వయమా ! మేము ఉక్థలతో మిమ్ము తోడ్కొని వత్తుము. మంత్రములతో మేము మిమ్ము పిలుచుకొని వచ్చినరీతి కణ్వపుత్రుల స్తోత్రము వినుటకు విచ్చేయుము.
10. అశ్విద్వయమా ! కక్షీవంత ఋషి మిమ్ము పిలిచినాడు. వ్యశ్య దీర్ఘ తమ ఋషులు, వేనరాజు పుత్రుడు పృథి మిమ్ము యజ్ఞ గృహములకు పిలిచినారు. వారివలెనే నేను స్తుతించుచున్నాను. నా స్తోత్రములను గ్రహించుము.
11. అశ్విద్వయమా ! మీరు గృహపాలకులై విచ్చేయండి. మీరు గొప్ప పోషకులు. మీరులోకములను దేహములను పాలించువారు. పుత్ర, పౌత్రులున్న గృహమునకు విచ్చేయండి.
12. అశ్వినులారా ! మీరు ఇంద్రునితో ఒకే రథమున వెళ్లినవారయిన వాయువుతో ఒకేచోటు ఉన్నవారయిన అదితిపుత్రులు మిత్రాదులు, ఋతువుల సహితులయి ప్రసన్నులయిన విష్ణువు అడుగుల ముల్లోకములు తిరిగినవారయిన రండి రారండి. విచ్చేయండి.
13. నేను యుద్ధసమయమున అశ్వినులను ఆహ్వానింతును. అప్పుడు వారు రావలెను. శత్రువును దెబ్బతీయుటలో అశ్వినుల రక్షణ విజయ రక్షణ. అదే శ్రేష్ఠ రక్షణ.
14. అశ్వినులారా ! ఈ హవ్యములు మీ కొఱకు చేయబడినవి. మీరు తప్పక రావలెను. ఇవి యదు తుర్వశులందు నిలిచినవి. ఇప్పుడు మీ కొఱకు సంస్కరించబడినవి. కణ్వపుత్రులు మీకు అర్పించుచున్నారు.
15. నా సత్యద్వయమా ! మీరు ప్రకృష్ట జ్ఞానవంతులు. దూరముననో, దగ్గరనో ఔషధములుండును. వాటితో విచ్చేయండి. విమదునకు సమానముగా వత్సునకు గృహము ప్రదానము చేయండి.
16. నేను అశ్వద్వయ సంబంధిని. ప్రకాశమాన స్తోత్రసహితుడనై జాగృతుడనైనాను. ద్యుతిమతి ఉషా ! నా స్తుతి వినుము. అంధకారము దూరము చేయుము. మానవులకు ధనము ప్రసాదించుము.
17. దేవీ సుందర నేత్రీ ! మహతీ ఉషా ! అశ్విద్వయమును మేల్కొల్పుము. వారికి అభ్యుదయము కలిగించుము. దేవహోతా ! అశ్విద్వయమును ప్రబోధితులను చేయుము. వారి ఆనందమునకు బృహత్ సోమము వేచి ఉన్నది.
18. ఉషా ! నీవు వెలుగు వెంట సాగుదువు. అప్పుడు నీకు సూర్యసమాన కాంతి కలుగును. అప్పుడు అశ్వినుల రథము మానవులను పోషించు యజ్ఞగృహమునకు చేరును.
19. పసుపురంగు సోమలతను ఆవు చన్నువలె పితికినప్పుడు దేవాభిలాషులు స్తుతించినప్పుడు అప్పుడు అశ్వినులారా ! మీరు రక్షించండి.
20. ప్రకృష్ట జ్ఞానవంత అశ్విద్వయమా ! మీరు ధనమునకుగాను మమ్ము రక్షించండి. బలమునకుగాను మమ్ము రక్షించండి. మానవులు అనుభవించు సుఖములకుగాను మమ్ము రక్షించండి. సమృద్ధికిగాను మమ్ము రక్షించండి.
21. అశ్విద్వయమా ! మీరు పితృతుల్య ద్యులోకపు వడిలో కార్యతత్పరులై ఉన్నను ప్రశంసనీయులై సుఖించుచున్నను మావద్దకు విచ్చేయండి.
పదవ సూక్తము
ఋషి - కణ్వపుత్రుడు ప్రగాధుడు, దేవతలు - అశ్వినులు, ఛందస్సు - బృహతి, పంక్తి, త్రిష్టుప్.
1. అశ్విద్వయమా ! మీరు యజ్ఞగృహములు ఉన్న లోకమున ఉన్నారా ? ద్యులోకపు దీప్తమాన ప్రదేశమున ఉన్నారా ? అంతరిక్షమున నిర్మించుకున్న గృహమున ఉన్నారా? ఎక్కడ ఉన్నను ఇక్కడికి విచ్చేయండి.
2. అశ్విద్వయమా ! మీరు మనువు ప్రజాపతి యజమాని యజ్ఞమును సంసిక్తము చేసి ఉన్నారు. కణ్వపుత్రుల యజ్ఞము అట్టిదేయని తెలియండి. నేను బృహస్పతిని, సకల దేవతలను ఇంద్రుని విష్ణువును శీఘ్రగామి అశ్వములుగల అశ్వినులను ఆహ్వానించుచున్నాను.
3. అశ్వినులు శుభకర్ములు. వారు మా హవిని స్వీకరించుటకు అవతరించినారు. నేను వారిని ఆహ్వానించుచున్నాను. వారి స్నేహము దేవతలలో ఉత్కృష్టము సహజము.
4. అశ్వినీ కుమారులు జ్యోతిష్టోమాదులకు ప్రభువులు. వారికి స్తోత్రశూన్య దేశమున కూడ స్తోతలుందురు. వారు హింసారహిత యజ్ఞపు ప్రకృష్ట జ్ఞాతలు. వారు స్వధ - బలకారక స్తుతి. సహితులై సోమమయ మధుపానము చేయవలెను.
5. అశ్వినులారా ! మీరు అన్నవంతులు. ధనవంతులు. ఇప్పుడు మీరు పూర్వదిశ, పశ్చిమదిశ లేక ద్రుహ్య, అను, తుర్వశ, యదువుల వద్ద ఉన్నను నా పిలుపు వినండి. నావద్దకు రారండి.
6. బృహత్ హవిభక్షకులగు అశ్విద్వయమా ! మీరు అంతరిక్షమును కేగుచున్నను ద్యావాపృథ్వులకు అభిముఖముగా వెళ్లుచున్నను తేజోబలమున రథముపై కూర్చుండి, ఉన్నను, ఎక్కడినుంచైనను ఇక్కడికి విచ్చేయండి.
పదకొండవ సూక్తము
ఋషి - కణ్వపుత్రుడు వత్సస్యుడు దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి చివరిది త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు మానవుల కర్మ రక్షకుడవు. అందువలననే యజ్ఞములందు నిన్ను స్తుతింతురు.
2. శత్రుపరాజయకారి అగ్నీ ! నీవు యజ్ఞములందు కీర్తినీయుడవు. యజ్ఞములనేతవు.
3. జాతవేద అగ్నీ ! మా శత్రువులను వేరుచేయుము. దేవద్వేషులను శత్రువులను వేరు చేయుము.
4. జాతవేద అగ్నీ ! శత్రువు సమీపమున యజ్ఞము చేయుచున్నాను అటుతొక్కవు.
5. మేము విప్రులము. నీవు అమరజాతవేదవు. మేము నిన్ను విస్తృతముగా స్తుతింతుము.
6. మేము మానవ విప్రులము. అగ్నికి హవ్యము సమర్పింతుము. ప్రసన్నుని చేతుము. మా రక్ష కొఱకు అగ్నిని స్తుతింతుము. పిలుతుము.
7. అగ్నీ ! ఉత్తమ గృహము కన్నను వత్స ఋషి మమ్ము ఎక్కువగా ఆకర్షించును. అతని స్తుతి నిన్ను కోరును.
8. నీవు అనేక దేశములందు సమానముగా దర్శనమిస్తావు. అందుకే నీవు సకల ప్రజలకు స్వామివి. యుద్ధములందు మేము నిన్ను పిలుచుచుందుము.
9. మేము అన్నాభిలాషులము. మమ్ము రక్షించుమని యుద్ధమున అగ్నిని ఆహ్వానిస్తాము. యుద్ధములందు అగ్ని విచిత్ర ధనయుక్తడగును.
10. అగ్నీ ! నీవు యజ్ఞమున పూజ్యుడవు. ప్రాచీనుడవు. నీవు చిరకాలముగా హోతవు. స్తుతింపదగినవాడవు. యజ్ఞములందు ఆసీనుడవగుదువు. నిన్ను హవితో తృప్తిపరచుకుందువు.
11. అగ్నీ ! మాకు సౌభాగ్యము ప్రదానము చేయుము.
-: ఇయ్యది :-
శ్రీవత్సవ గోత్రోద్భవుండను, దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండను, విద్వాన్ వెంకటాచార్య వెంకటాం బలపుత్రుండను, ఆంధ్రదేశ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండను శ్రీ|| ల|| సౌ|| కమలానామ్మి ధర్మపత్నీ సమేతుండను. "చిల్లెర దేవుళ్లు - మోదుగుపూలు - పావని - చలనచిత్ర రచయితయు - శరతల్పం - కొత్తకాపురం - వింత సంసారం - తూరుపు తెల్లవారింది - రంతిదేవుడు - అఖండదీపం - దొంగసొమ్ము" దూరదర్శన సీరియల్ రచయితయు అగు దాశరథి రంగాచార్య రచించిన ఆంధ్రవచన ఋగ్వేద సంహిత యందలి అయిదవ అష్టకము సమాప్తము.
"యదింద్రత్యాతస్త్వమేతా దహమవేయ స్తోతారామిద్ది ధిషే యరదావసోన పాపత్వారాసయ"
-: ఇతిశమ్ :-





