Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. మరుద్గణములు సూర్యగమనమునకు కిరణయుక్త మార్గమును కల్పింతురు. వారు సూర్య తేజమున ప్రకాశింతురు.
9. మరుత్తులారా ! నా వచనమును స్వీకరించండి. ఈ స్తోత్రమును స్వీకరించండి. ఈ ఆహ్వానమును అందుకొనండి.
10. పృశ్నులు వజ్రధరుడగు ఇంద్రుని కొఱకు మధుర సోమరసమును ఉత్స, కబంధ, అద్రి, అను మూడు స్థానములందు ఏర్పరచినవి.
11. మరుత్తులారా ! మేము సుఖాభిలాషులము. స్వర్గము నుండి మిమ్ము పిలిచెదము. అప్పుడు మీరు త్వరగా మా వద్దకు రావలెను.
12. రుద్రపుత్రులారా ! మీరు దానపరాయణులు. మహాతేజస్వులు. మీరు యజ్ఞగృహమున మాదక సోమము సేవింతురు. ఉత్తమ జ్ఞానవంతులగుదురు.
13. మరుత్తులారా ! స్వర్గము నుండి మా కొఱకు ధనము తెండు. ఆ ధనము మదస్రావి. బహునివాసదాత. అందరిని పోషించు శక్తిగలది కావలెను.
14. శుభ్రమరుత్తులారా ! మీరు పర్వతములమీద ప్రయాణము సాగింతురు. అభిషుత సోమబలమున ప్రమత్తులు అగుదురు.
15. మరుత్తులు అహింసనీయులు. స్తోతలు స్తోత్రములతో వారిని స్తుతింతురు. సుఖములు యాచింతురు.
16. మరుత్తులు అక్షయ మేఘమును పితుకుదురు. వర్షము కలిగింతురు. జలబిందువులవలె ద్యావాపృథ్వులందు వ్యాపింతురు.
17. మరుత్తులు పృశ్నిపుత్రులు, వారు శబ్దము చేయుచు పైకి పోవుదురు. రథముమీద పైకి పోవుదురు. వాయువుద్వారా పైకి పోవుదురు. మంత్రములద్వారా పైకి పోవుదురు.
18. మీరు యదు తుర్వశులను రక్షించినారు. ధనాభిలాషియగు కణ్వుని రక్షించినారు. ధనము కొఱకు మేము వారిని తలచుచుందుము.
19. మరుత్తులారా ! మీరు ఉత్తమ దాతలు. ఘృతము శరీరమునకు పుష్టినిచ్చును. ఈ అన్నము అటువంటిదే దీనిని కణ్వగోత్రజులు కల్పించిన స్తోత్రముతో సమానముగా వర్థిల్లచేయండి.
20. మరుత్తులారా ! మీరు దాన పరాయణులు. మీ కొఱకు కుశలు త్రెంచ బడినవి. మీరు ఇప్పుడు ఎక్కడ మత్తులో ఉన్నారు? ఏ స్తోత మిమ్ము సేవించు చున్నాడు?
21. మరుత్తులారా ! ఎంతో పూర్వమే మిమ్ము ఇతరులు స్తుతించి ఉన్నారు. ఆ యజ్ఞ సంబంధ స్తోత్రములతో మీ బలములను ప్రసన్నము చేసి ఉన్నారు. అదిసరికాదు.
(పాత స్తోత్రములకు మాత్రమే ప్రసన్నులగుట అంత మంచిదికాదని కొత్త స్తోత్రములకు గూడ ప్రసన్నులు కావలెనని)
22. మరుత్తులు ఓషధులను జలములతో కలిపినారు. ద్యావాపృథ్వులను వాటి స్థానములందు నిలిపినారు. సూర్యుని స్థాపించినారు. వృత్రుని ప్రత్యేక అవయమును ఖండించుటకు వజ్రము ధరించినారు.
23. మరుత్తులు ఏ రాచరికపు క్రిందివారుకారు స్వతంత్రులు. వీరుల సమమగా బలము పెంచుకొనువారు. వారు పర్వతమునువలె వృత్రుని ముక్కలు ముక్కలు చేసినారు.
24. మరుద్గణములు యోద్ధ త్రితుని బలములను రక్షించినారు. త్రిత కార్యములను రక్షించినారు. వృత్ర వధ సమయమున ఇంద్రుని రక్షించినారు.
25. మరుత్తులు ఆయుథపాణులు దీప్తిమంతులు. శుభంకరులు. తమ తలలకు బంగారు కిరీటములు ధరింతురు.
26. మరుత్తులారా ! మీరు స్తోతలను కోరినారు. అభీష్టవర్షి రథము ఎక్కినారు. దూరదేశము నుండి విచ్చేసినారు.
అప్పుడు ద్యులోకవాసులవలె భూలోకవాసులు సహితము కంపించినారు.
27. దేవతలు యజ్ఞదానమునకుగాను బంగారుకాళ్ల గుఱ్ఱములపై రావలెను.
28. మరుత్తుల రథముమీద తెల్లచుక్కల మృగియు, వడిగల రోహిత మృగము చేరినపుడు మరుద్గణములు దిగిపోవుదురు. జలము ప్రవహించసాగును.
29. మరుత్తులు శోభన సోమవంతులు, యజ్ఞగృహ సంయుక్తులు, వారు ఋజి, దేశమునగల శర్యణ, సరోవరమున రథచక్రమును వంచి సాగిపోవుదురు.
30. మరుత్తులారా ! విప్రులు మిమ్ము ఆహ్వానించుచున్నారు. యాచించుచున్నారు. సుఖ హేతువగు ధనముతో ఎప్పుడు వారివద్దకు వచ్చెదరు?
31. మీరు స్తుతికి ప్రసన్నులగుదురు. మీరు ఇంద్రుని ఎప్పుడు త్యజించినారు. మీ మైత్రికొఱకు ఎవరు ప్రార్థించినారు.
32. కణ్వగణమా ! మరుత్తులు వజ్రహస్తులు. ఆయుధములను పదునుపెట్టు బంగారు యంత్రముగలవారు. అట్టి మరుత్తుల సహితముగా అగ్నిని స్తుతించండి.
33. మరుత్తుల వర్షకులు. యజనీయులు. విచిత్ర బలవంతులు. నేను సుఖలభ్యధనము కొఱకు వారిని అర్థింతును.
34. మరుత్తుల వేగమునకు రాతిగుట్టలు పీడింపబడును. బాధింపబడును. అయినను అవి తమ స్థానముల నుండి కదలవు. పర్వతములు సహితము నిలిచియే ఉండును.
35. బహుదూరము వ్యాపించి గమనము సాగించు అశ్వములు ఆకాశమార్గమున వెళ్లుచు మరుత్తులను తీసికొని వచ్చును. అవి స్తోతలకు అన్నము కలుగుచేయును.
36. అగ్ని తన తేజోబలమున స్తవనీయ సూర్యునివలె అందరికి ముఖ్యుడై జన్మించినాడు. మరుద్గణములు దీప్తిబలమున అనేకచోట్ల ఉందురు.
ఎనిమిదవ సూక్తము
ఋషి - కాణ్వసధ్వంసుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - అనుష్టుప్.
1. అశ్విద్వయమా ! మీరు దర్శనీయులు. మీ రథము బంగారపుది. సకల రక్షణలతో విచ్చేయండి. సోమపానము చేయండి.
2. అశ్వినులారా ! మీరు భోక్తలు. హిరణ్మయ శరీరము గలవారు. క్రాంతకర్మలు. ప్రశస్త జ్ఞానవంతులు. మీరు సూర్యునివలె వెలుగు రథముమీద తప్పక మావద్దకు రావలెను.
3. అశ్వినులారా ! నహుషుని అంతరిక్షము నుండి మానవ లోకమునకు రండి. కణ్వవంశీయుల యజ్ఞమున సోమపానము చేయండి.
4. అశ్వినులారా ! కణ్వ ఋషి పుత్రులు యజ్ఞము చేయుచున్నారు. మీ కొఱకు సోమమయ మధువు అభిషవించుచున్నారు. ద్యులోక, అంతరిక్షముల నుండి విచ్చేయండి.
5. అశ్వినులారా ! మీరు వర్ధకులు. కవులు. నేతలు. ఈ యజ్ఞమున మీ స్తుతి జరుగుచున్నది. సోమపానమునకు విచ్చేయండి. మీ బుద్ధి కర్మతో స్తోతలకు సుబుద్ధి ప్రసాదించండి.
6. అశ్వినులారా ! మీరు నేతలు. ప్రాచీన కాలపు ఋషులు రక్ష కోరి మిమ్ము పిలిచినారు. మీరు వచ్చినారు. ఇప్పుడు నా సుందర స్తుతి వినుటకు నావద్దకు రండి.
7. అశ్విద్వయమా ! మీరు సూర్యజ్ఞానము కలవారు. ద్యులోక అంతరిక్షములనుండి మావద్దకు రండి. స్తోతలపై అనుగ్రహించి బుద్ధి సహితులై రండి. ఆహ్వానము వినండి. స్తోతలతో రండి.
8. నేను కాక మరెవ్వడు స్తోత్రములతో అశ్వినులను ఉపాసించగలడు? కణ్వపుత్రుడు వత్స ఋషి. అతడు స్తుతుల ద్వారా మిమ్ము వర్థిల్ల చేయును.
9. అశ్వినులారా ! మీరు పాపరహితులు. శత్రుఘాతుకులలో శ్రేష్ఠులు. ఇక్కడ యజ్ఞము జరుగుచున్నది. విప్రులు స్తుతించుచున్నారు. రక్షణలకొరకు ఆహ్వానించుచున్నారు. మీరు మాకు సుఖములు కలిగించండి.
10. అశ్వినులారా ! మీరు అన్న, ధన సంపన్నులు. సూర్యపుత్రి మీ రథము ఎక్కినది. మీరు సమస్త అభిలషిత పదార్థములు కలిగియుండండి.
11. అశ్వినులారా ! మీరు ఏలోకముల ఉన్నారో ! అక్కడి నుంచి బహురూప రథముమీద విచ్చేయండి. కవిపుత్రుడు, కవి వత్స ఋషి మధుమయ వాక్యములు ఉచ్ఛరించును.
12. అశ్విద్వయమా ! మీరు ధనదాతలు. లోకములు వహించువారు. బహుమదయుక్తులు. ఈ నా స్తోత్రమును ప్రశంసించండి.
13. అశ్వినులారా ! లజ్జ కలిగించని ధనమునంతను మాకు ఇవ్వండి. మమ్ము ప్రజోత్పాదక కర్మ వంతులను చేయండి. మమ్ము నిందకులకు వశపరచకండి.
14. సత్య స్వభావ అశ్వినులారా ! మీరు దూరమున ఉన్నను, దగ్గర ఉన్నను, ఎచట ఉన్నను సహస్రరూపరథముపై విచ్చేయండి.
15. నా సత్యద్వయమా ! వత్స ఋషి స్తుతులతో మిమ్ము వర్థిల్లచేయును. అతనికి సహస్రరూపుయు, ఘృతయుక్తమగు అన్నము ప్రసాదించండి.
16. అశ్వినులారా ! ఆ స్తోతలకు నేతిధారలతోకూడిన బలిష్ఠ అన్నము నివ్వండి. వీరు మీ సుఖమునకు స్తుతించినారు. వారు తమ కొఱకు ధనము కోరుచున్నారు.
17. అశ్వినులారా ! మీరు రిపు భక్షకులు. అధిక హవిని ఆరగించువారు. మీరు మా స్తుతివైపునకు రండి. మాకు శుభసంపదను, పార్థివ ధనమును అందించండి.
18. ప్రియమేధనామక ఋషులు దేవతలను ఆహ్వానించినారు. అప్పుడు మిమ్ము సకల సంరక్షణలతో ఆహ్వానించినారు. మీరు యజ్ఞశోభ పొందండి.
19. అశ్విద్వయమా ! మీరు సుఖదాతలు. ఆరోగ్యప్రదులు. స్తుతియోగ్యులు. వత్స ఋషి స్తుతులతో మిమ్ము వర్థిల్ల చేసినాడు. అతనివద్దకు రండి.
20. నేతలగు అశ్వినులారా ! మీరు కణ్వుని, మేధాతిథిని వశ్యుని, దశవ్రతుని, గోశర్యుని రక్షించినారు. వారివలెనే మమ్ము రక్షించండి.
21. నేతలగు అశ్విద్వయమా ! ఏ రక్షణలతో లభించగల ధనము కొరకు త్రసదస్యుని రక్షించినారో, అట్లే అన్నలాభము కొఱకు మమ్ము రక్షించండి.
22. అశ్వినులారా ! మీరు బహురక్షణలవారు శత్రునాశకులందు శ్రేష్ఠులు. మంచి స్తుతియు, వాక్యమును మిమ్ము వర్థిల్లచేయవలెను. మా కొఱకు మీరు బహువిధ అభిలషణీయులు కండి.
23. అశ్విద్వయపు మూడు చక్రముల రథము అదృశ్యముగా ఉండి తదుపరి వెల్లడి అగును. క్రాంతదర్శి అశ్విదయమా ! యజ్ఞ, కారణభూత రథమున మావద్దకు రండి.
తొమ్మిదవ సూక్తము
ఋషి - శశకర్ణుడు దేవత - అశ్వినులు, ఛందస్సు - వేరు వేరు
1. అశ్విద్వయమా ! వత్స ఋషిని రక్షించుటకు మీరు వాస్తవముగా వెళ్లినారు. ఈ ఋషికి బాధలులేని, విశాల గృహమును ప్రదానము చేయండి. అతని శత్రువులను దూరము చేయండి.
2. అశ్విద్వయమా ! అంతరిక్షమునందు, స్వర్గమునందున్నదియు పంచశ్రేణులవద్ద ఉన్నటువంటి ధనమును ప్రసాదించండి.
3. అశ్విద్వయమా ! మీరు చేసిన ఘనకార్యములను విప్రులు అనేకమార్లు స్తుతించినారు. అది గ్రహించండి. కణ్వపుత్రుల కార్యములను కూడ గ్రహించండి.
4. అశ్వినులారా ! మీ అలసటను స్తోత్రములద్వారా తీర్చబడును. అన్నధనశాలులారా ! మీరు ఏ సోమము వలన వృత్రుని కనుగొన్నారో, ఇది అదే మధుమంత సోమము !
5. బహుకర్మ అశ్విద్వయమా ! జలములు, వనస్పతులు, లతలకు మీరు చికిత్స చేసినారు. వాటిద్వారానే మమ్ము రక్షించండి.
(చికిత్స మానవులకు మాత్రమే కాక ఇతరులకు ఉండెను. జలచికిత్స వాటర్ ట్రీట్ మెంట్ నీరు బాగుచేయు పద్ధతి ఆనాడు ఉన్నట్లున్నది.)
6. సత్యభావ అశ్వినులారా ! మీరు జగములను పోషించినారు. అందరిని రోగరహితులను చేసినారు. స్తుతుల వలన మాత్రమే వత్స ఋషి మిమ్ము పొందలేదు. మీరు హవివంతుల వద్దకు వెళ్లుదురు.
7. ఋషి ఉత్తమ బుద్ధితో అశ్విద్వయపు స్తోత్రమును తెలిసికున్నాడు. నేను అత్యంత మధురసోమము మరియు ఘర్మమను హవివిశేషమును అధర్వమును మథించి అగ్నికి సమర్పించినాను.
8. అశ్విద్వయమా ! మీరు వేగముగల రథమున ఎక్కండి. ఈ నా స్తోత్రములు సూర్యునివలె తేజస్వులై మీముందుకు వచ్చును.





