Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ధర్మరాజా! ధర్మమార్గము దుర్గమము. అది నీవు ఎరుగవు భీష్ముని అడిగినావు. అతడు ముదివగ్గు. వృద్దుల బుద్దులు సంచలించును. శ్రీకృష్ణుడు నీకు అనుకూలుడు కావచ్చును. కానిమ్ము. అతనికి ధనములిమ్ము. ధాన్యము'లిమ్ము. వర్ద్దనము. కాని ఈ సభామర్యాద చేసి నీవు అధర్మము చేసినావు. ఏమి చూచి శ్రీకృష్ణుని పూజించినావు? వృద్దుడంటివా అతని తండ్రి వసుదేవుడున్నాడు. ఋత్విజువంటివా వ్యాసుడున్నాడు. అచార్యుడంటివా ద్రోణ కృపులున్నారు. రాజనుకుంటివా యాదవులు రాజులు కారు ఏమని శ్రీకృష్ణుని పూజించినావు. భీష్ముని మాటలు విని చెడినావు."
"నీవు ధర్ముడవు. పూజ్యుడవు. అని రాజులందరు సభకు వచ్చినారు. నీవు కృష్ణుని పూజించినావు. రాజులుందరను కించపరచినావు. అవమానించినావు." "నీవు ముసలివాని మాట విన్నావు పో. పూజించినావు పో. ఆ కృష్ణునకు సిగ్గు ఎగ్గు ఉండవలె కదా. తానె అర్హుడను అన్నట్లు పూజలు అందుకున్నాడు. నపుంసకునకు రూపవతి, అందునకు సుస్వరూపము, బధిరునకు శ్రావ్య సంగీతము వలె ఉన్నది నీవు శ్రీకృష్ణుని పూజించుట. ఛీ! నీవు ధర్మరాజువు కావు. నీ పేరు వ్యర్ధము. ఈ సభలో ఉండుట అవమానము" అని తన పుత్ర బలముతో సభ విడిచి వెళ్ళినాడు. ధర్మరాజు అది చూచినాడు. శిశుపాలుని వారించినాడు. మంచి మాటల చేత మరలింప చూచినాడు. భీష్ముడు అది చూచినాడు. "శిశుపాలుడు కలహాకారకుడు. వానిని విడిచి రమ్ము" అని శిశుపాలునికి బుద్ది చెప్పినాడు.
"ఓరీ! శిశుపాలా! నీవు అవివేకివి. మూర్ఖుడవు. ఈ సభలో నున్న రాజులందరను ఎవడురా చెర నుండి విడిపించినాడు? ఈ రాజులందరను ఎవడు ర ఓడించినాడు? వీరందరు శ్రీకృష్ణుని ఆశ్రయించి జీవించుచున్నారు. ఎవడురా శ్రీకృష్ణుని ఆశ్రయింపనివాడు!"
"బ్రాహ్మణులందు బాలుడయినను జ్ఞానవంతుడు పూజ్యుడు. క్షత్రియులలో బాలుడయినను బల పరాక్రమవంతుడు పూజ్యుడు. శ్రీకృష్ణుడునియందు రెండును ఉన్నవి. అందువలన పూజించినాము. నీవన్నట్లు వృద్దులు అనేకులున్నారు. ఎవరును శ్రీకృష్ణునకు సములు కారు. రాజులు అనేకులున్నారు. శ్రీకృష్ణుని వలె గుణాధికులు లేరు. అందువలన శ్రీకృష్ణుని పూజించినాము."
"శ్రీకృష్ణుని పూజించినందున లోకమందలి పూజ్యులు అందరు తృప్తులు అగుదురు. శ్రీకృష్ణుని పూజించిన ముల్లోకములను పూజించిన ఫలము కలిగినది."
"మనసు - బుద్ది, పురుషుడు - ప్రకృతి, భూమి- ఆకాశము, సూర్యుడు-చంద్రుడు, వాయువు- కాలము, దిక్కులు- సకల చరాచర ప్రపంచమును తన దివ్యశక్తితో దాల్చిన పరమాత్మ స్వరూపుని పరమయోగులు మాత్రము గ్రహించగలరు. నీవు అల్పుడవు. అహంకారివి. నీకెట్లు తెలియును?"
అప్పుడు సహదేవుడు లేచినాడు. అతని కనులు ఎర్రవడినవి. అధరము అదర సాగినది. రోషమున "రాజులారా! మేము శ్రీకృష్ణుని పూజించినాము. అందుకు అసమ్మతి తెలుపువారున్నారా? అధిక్షేపించువారున్నారా? ఆ దుర్మార్గుని తల మీద నా కుడికాలు పెట్టెదను" అని కుడికాలు ఎత్తినాడు.
అది విన్నాడు శిశుపాలుని సేనాపతి సువీధుడు. మండిపడినాడు. బలములను కూర్చుకున్నాడు. యుద్దమునకు సిద్దపడినాడు. యదువృష్టి అంధక భోజులు యుద్దమునకు తలపడినారు. సభయందు సంక్షోభము చేలరెగినది. సభ కల్లోల సాగరము వలె ఉన్నది.
భీముడు శిశుపాలుని చూచినాడు. అతని మదాంధతము కన్నాడు. ఉగ్రుడు అయినాడు. అతని కనులు జ్వాలలు అయినవి. యమ ధర్మరాజు వలె ఉన్నాడు. పండ్లు పటపట కొరికినాడు. శిశుపాలుని వధింతునన్నాడు. ఉరుకుటకు ఉద్యమించినాడు. భీష్ముడు భీముని వారించినాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చేత చావవలెనన్నాడు. శిశుపాలుని వృత్తాంతము వినిపించినాడు.
చేది దేశమున దమఘోషుడు ఉండినాడు. అతని భార్య సాత్వతి. శిశుపాలుడు వారికి కలిగిన పుత్రుడు. పుట్టినపుడు నాలుగు చేతులు, రెండు కండ్లు కాక నొసట మూడవ కన్ను ఉండినది. వాడు పుట్టగనే గాడిద వలె ఏడ్చినాడు. వానిని చూచి తలిదండ్రులకు ఆశ్చర్యము, భయము కలిగినవి. అప్పుడు అశరీరవాణి ఇట్లు పలికినది. "వీనిని ఏ పురుషుడు ఎత్తుకోనిన అదనపు చేతులు, కన్ను మాయమగునో అట్టివాని చేత వీడు చచ్చును." తలిదండ్రులు అది విన్నారు. భయపడినారు. వచ్చిన వారికెల్ల ఎత్తుకోనుటకు శిశుపాలుని ఇచ్చినారు.
సాత్వతి బలరామకృష్ణులకు మేనత్తయగును. సాత్వతికి విచిత్ర పుత్రుడు కలిగినాడని తెలిసినది. బలరామకృష్ణులు శిశువును చూచుటకు చేది దేశమునకు వెళ్ళినారు. సాత్వతి యధా ప్రకారము శిశుపాలుని బలరామునకు ఇచ్చినది. బలరాముడు ఎత్తుకున్నాడు. ముద్దాడినాడు. మరల సాత్వతికి ఇచ్చినాడు. సాత్వతి శ్రీకృష్ణునకు శిశుపాలుని ఇచ్చినది.
శ్రీకృష్ణుడు శిశుపాలుని ఎత్తుకున్నాడు.
శిశుపాలుని అదనపు చేతులు, కన్ను మాయమయినవి.
అచ్చట కూడిన వారు ఆశ్చర్యపడినారు.
సాత్వతి గుండె దడదడలాడినది ఆమె కన్నీటితో శ్రీకృష్ణుని ప్రార్ధించినది:-
"కృష్ణా! నీవు నాకు మేనల్లుడవు. శిశుపాలుడు నీకు మరిది. ఇప్పటి ఉదంతము వలన నీ చేత నాకొడుకునకు మరణము కలుగునని వెల్లడి అయినది. నా కొడుకు శిశుపాలుడు ఎంత దుర్మార్గుడయినను వీని నూరు అపరాధములను నీవు సహించవలెను."
శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించినాడు. అట్లు సాత్వతికి వరము ఇచ్చినాడు.
అట్లని భీష్ముడు భీమునకు శిశుపాలుని వృత్తాంతము చెప్పినాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చేత చావవలసి ఉన్నదని భీముని శాంతింపచేసినాడు భీష్ముడు.
అప్పుడు శిశుపాలుడు మంటను మింగబోవు శలభము వలె ముందుకు ఉరికినాడు. శ్రీకృష్ణుని తూలనాడినాడు. "శ్రీకృష్ణా! నీవు నీచుడవు. అవమానమునకు అర్హుడవు. ముసలి భీష్ముడు నిన్ను సన్మానింపచేసినాడు. వీరుడనయితినని వీర్ర వీగుచున్నావు. సన్మానము పొందగనే సరిపోదు. రమ్ము యుద్దమునకు! ఒక్కడవు కాదు పాండవులు, భీష్ముడు అందరు కలిసి రండు! చూపింతును నా పరాక్రమము" అట్లని మరెన్నో విధముల శ్రీకృష్ణుని తూలనాడినాడు.
అంతవరకు శాంతముగా కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అతడు తొణకలేదు, బెణకలేదు. సాక్షీభూతుడయి సమస్తము చూచినాడు. శ్రీకృష్ణుడు లేచినాడు. కల్లోల సాగరము వలె ఉండిన సభ శాంతించినది. పెనుగాలి తరువాత వలె ప్రశాంతత నెలకొన్నది. శ్రీకృష్ణుడు మాట్లాడవలెను. సభ సాంతము వినుటకు వేచి యున్నది. శాంత గంభీరస్వరమున శ్రీకృష్ణుడు మాట్లాడినాడు:-
"సభాసదులారా! రాజన్యులారా! పూర్వము మేము ప్రాగ్జ్యోతిషపురము మీదికి దండెత్తి, భగదత్తునితో యుద్దము చేసినాము. శిశుపాలుడు మేము లేని సమయము చూచి అతి క్రూరముగా ద్వారకను దహించినాడు. రాజులు తమ తమ స్త్రీలతో విహారమునకు గాను రైవతక పర్వతమునకు వెళ్ళినారు. మత్తులో ఉన్నపుడు చాటుగా వచ్చి వారందరిని చంపినాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగము తలపెట్టినాడు. అప్పుడు ఈ శిశుపాలుడు యాగాశ్వమును అపహరించినాడు. యాగమునకు విఘ్నము కలిగించినాడు. యాదవుడైన బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. వీడు దుర్మార్గుడు. మహా పాపాత్ముడు. నాకు అనేక అపకారములు చేసినాడు. అయినను మా అత్తకు ఇచ్చిన మాటను బట్టి నూరు అపరాధములు సహించినాను. ఇప్పుడు మీ అందరి ఎదుట నన్ను నిందించినాడు. కయ్యమునకు కాలు దువ్వుచున్నాడు. నా సహనము చచ్చినది. నూరు అపరాధములు నిండినవి."





