Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఇదీ స్వదేశ్ లో ప్రకటీంపబడిన ఉదంతం. పావుకాలం నిండా ప్రకటించబడింది.
లేఖ ఈ ఉదంతం మరిచిందో లేదో మళ్ళీ పత్రికలో ఇంకో ఉదంతం వచ్చింది.
శివార్పితమై భైరవి పాదచారిణి అయి బాటన వెళ్తుంది. ఆమె చేతిలో కుంకుమాంకితమైన దీర్ఘ త్రిశూలం ఉంది. ఆమె కళ్ళు భీకరంగా ఉన్నాయి. ఆమెను చూచిన వారంతా అలాగే నుంచుండిపోయారు. దేవాలయపు చేరువకు రాగానే ఆమె మధుర స్వనం "నమః శివాయ" అని పలికింది. బాణంలా రివ్వున దూసుకుని పోయింది. అలా కొన్ని అడుగులు వేసి సుడిగాలిలా రివ్వున వెనక్కు తిరిగి తనక్కావలసిన పదార్ధం దొరికినట్లు రోడ్డు దాటి లేఖ ఇంటి గుమ్మం ముందు ఆగింది.
లేఖ బాల్కనీ మీద నుంచుంది. "నమో జగన్మాతా నమో నమః" అని చేతులు జోడించి తల పైకి ఎత్తి చూసింది. లేఖ గబగబా క్రిందికి దిగింది. భైరవి త్రిశూలాన్ని క్రింద పడేసి మోకాళ్ళ మీద వంగి నమస్కరించింది. ఆమె కళ్ళల్లోని బీకరత్వం , భక్తిగా మారింది. ఆమె కూడా స్తుతించింది.
"ప్రాణిలోకమ్ములో పరమఆనందమయజ్యోతి వెలిగించు మాతా!
నమస్తే, నమస్తే, నమాస్తే, నమో నమః"
ఆమె ఆలాపనలో అనందం పొంగులు వారింది. మేఘచ్చన్నమైన సూర్యుడు మందంగా వున్న ఆ సమయంలో భైరవి కాంతిచ్చటలు దశదిశలా వెలిగాయి.
ప్రేక్షబృందంలో ఉన్న ఒక పోటో గ్రాఫరు ఫోటో తీసుకున్నాడు. మరుసటి రోజు పత్రికలో ఆ ఫోటో ప్రకటించబడింది. వివరాలు కూడా వివరంగా ప్రకటించబడినాయి.
భైరవీ వృత్తాంతం ఒక వారం దాకా వేడిగానే ఉంది. ఆ ఉదంతాన్ని గురించి పాఠకులు లేఖలు వ్రాశారు. సంపాదకీయం వ్యాఖ్యలు వ్రాయబడ్డాయి. ఇలాంటి వింతలూ తెంపు లేకుండా సాగాయి.
ఇరవై ఏళ్ళ అయినా నిండని ఒక స్పుర ద్రూపి అయిన యువకుడు రెపరెపలాడే సిల్కు వలువలు ధరించి ఒకనాడు గుడి దగ్గరికీ వచ్చాడు. అతడు సహితం భైరవి లాగానే లేఖ పాదాల మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అది సాయంకాలం. గుళ్ళో గంటలు మోగాయి. పూజా సమయం కావడం మూలాన వందలమంది ప్రజలు ఆ ఉదంతాన్ని చూశారు. ఆ యువకుడు సహితం భక్తీ పారవశ్యంలో స్తుతించాడు.
"ప్రాణిలో కమ్ములం గాచి రక్షించుమాతా!
నమస్తే, నమస్తే, నమస్తే, నమో నమః"
ఆ యువకుణ్ణి ఎవరూ గుర్తించలేదు. అతడు ఒక లక్షాధికారి బిడ్డ అనీ, అతని పేరు ప్రకటించరాదనీ స్వదేశ్ రాసింది. పూజనీయుడైన ఒక వ్యక్తీ కుమార్తెలో ఆవిర్భవించిన జగన్మాతను దర్శించుకోవాలని ఆ యువకునికి అభీష్టం కలిగింది. అనిర్వచనీయమైన ఈ అనుభూతి అతని జీవితాన్నే మార్చేసింది. తలి దండ్రులనూ, ఇండ్లనూ , వాకిళ్ళ నూ వదిలి ముక్తి మార్గం అన్వేషిస్తూ దేశ సంచారం చేయడానికి నిర్ణయించుకున్నాడు.
లేఖ భయంతో వణికిపోయింది. అ యువకుని వైరాగ్యానికి తానె కారణం అనుకుంది. తానె అతని అదృష్టానికి అడ్డు తగిలానని కుమిలిపోయింది.
నూతన శివాలయంలోని యువతికి అఖండమైన ఆత్మశక్తి ఉందని స్వదేశ్ వ్యాఖ్యానించింది.
లేఖకు ఏమీ అర్ధం కాలేదు. తన్ను ఆలయానికి అంకితం చేసిన్నాటి నుంచీ ఏవో వింతలు జరిగిపోతున్నాయి. అగంతకంగా వచ్చిన ఉద్రేకమే తన్ను దేవళానికి అంకితం చేసేట్టు చేసింది. ఆ ఉద్రేకం ఎక్కడిది? తనలొ ఉన్న అంధకారంలోంచి రాలేదు కదా? అయితే గుడి మాత్రం ? అదీ చీకటే, వెలుగెక్కడుంది? ఒక వారం గడిచిందో లేదో ఆమెకు అంతా అర్ధం అయింది. బిటేన్ కు ఆమె చేసిన అపరాధమూ, అతని ముందు తన అస్వాభావిక ప్రవర్తనా ఆమెకు గుర్తుకు వచ్చాయి. ఆమె చేసిన నేరం నగ్నంగా అవిచ్చిన్నంగా జ్వలించసాగింది.
అతడు తన్ను మరిచిపోలేదు. ఎన్నటికీ మరువలేదు. అతడు తిరిగి రానే రాడా?
నాడు తనకు ఏమైంది ? చిత్తం చలించింది. మనిషిలా ప్రవర్తించలేదు. మనసు చెడిపోయింది. మళ్ళీ అలా జరుగుతుందా? ఎన్నటికీ జరుగదు.
ఒకనాటి రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఒక పురుషుడు చేతులు చాచి ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. దగ్గరికి అదుముకున్నాడు. అతని పెదవులు ఆమెనుదుటినీ, కళ్ళనూ అంటాయి. ఆ పెదవులు ఆమె పెదవుల మీదికి వచ్చాయి. ఆమె అతణ్ణి నెట్టి వేయలేదు. ఆమె సైతం చేతులు చాచి అతన్ని గట్టిగా కౌగలించుకుంది. కాలం, జీవితం కరిగి ప్రవహించి పోతున్నాయి. చుక్కల సహితంగా ఆకాశం గాలిలో ఎగురుతూ దిగి వస్తుంది. అలా దిగుతూ, దిగుతూ, ఆకాశం వారి దగ్గరికి వచ్చేసింది. కాంతి గల కళ్ళతో చుక్కలు వారిని చూశాయి. అతడు వెనక్కు తగ్గాడు. ఆమె అతడు తన్ను తిరస్కరించాడనుకుంది. ఆమెలో పిపాస పెరిగింది. ఆమె రెండు చేతుల్లోనూ అతని ముఖాన్ని పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూసింది. దగ్గరికి లాక్కుంది. వక్షోజాలకు అడుముకుంది. చక్కని చుక్కలు చూస్తూ మిణుకు మిణుకుమంటున్నాయి.
"చంద్రలేఖా!"
పిలుపు కలలోదే. అయినా కలను తుద ముట్టించింది. కళ్ళు తెరచింది. చీకటి. అంధకారం లోకి చూసింది. ఆమె శరీరం నలిగి పోయినట్లు ఉంది. మనసు ఏదో తీయని బాధ అనుభవించింది. చేత్తో పెదవులు తాకి చూసింది. భయం కాలేదు. అనందం అయింది.
తాను చపలచిత్తకాడు. మనిషి, అందరి లాంటి మనిషి, లోకవ్యవహరాల్లో తాను భాగస్వామిని అవుతుంది. స్త్రీలలో స్త్రీ అవుతుంది.
ఏమిటిదంతా? చిత్రం జరిగిపోయింది. ఈ చిత్రానికి కారణం ఎవరు? బిటేన్ నాటి ఆలింగనం తనలో భీతాహం రేపింది. అయినా నాటి ఆ అలింగనమే తనలోని స్త్రీత్వాన్ని మెల్కొల్పింది.
క్రమక్రమంగా భయం అడుగంటింది. ఇప్పుడు పూర్తిగా పోయింది.
కల ఆమె గుండె నిండిపోయింది. గుండె అంచులు నిండాయి. ఆమె కోర్కెలకు రంగు పులిమింది. సాధారణమైన మాటలూ, చిన్న చిన్న సంఘటనలూ కొత్త కొత్త అర్ధాలు కల్పించుకున్నాయి. తేలిగ్గా వచ్చే బిటేన్ నవ్వూ, అలా ఎగిరే అతని కనుబొమలు, అతని వదనంలో సదా కనిపించే ఆలోచన మగ్నతా , ఆమె కళ్ళ ముందు కనిపించాయి. అతడు బాధగా " చంద్రలేఖా" అన్నమాట తల్చుకుంటే గుండె జలదరిస్తుంది.
దుఖం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది. "పాపిష్టిదానా! నీవు అతని కాలి మట్టికి కూడా కొరగావు. అన్న మాటలు మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించాయి.
ఇక తాను అతని కోసం గుడి కట్టదు. అతడూ మనుషుల్లో మామూలు మనిషి అయిపోతాడు. తాను స్త్రీ అవుతుంది. అతడు పురుషుడు అవుతాడు.
అతడు తిరిగి వస్తాడా? జరిగినదంతా మొదటి నుంచి చివరి దాకా అతనికి చెప్పాలని ఆమె మనసు ఉరకులు పెట్టింది. ఆమె శరీరం అనాఘ్రత పుష్పం. అది అపవిత్రం కాలేదు. ఆమె కోరికలు చివుళ్ళు ఎత్తి కొత్త అర్దాలిచ్చింది. గుండె వేగంగా బాదింది. బాధ నుండి తప్పుకోవడానికి ఆమెకు ఇంకొక ఉపాయం తట్టింది. అద్దంలో చూసుకుంది. ఆమె ముఖం అందంగా కనిపించింది. తన కళ్ళను తానే చూసుకుంది. ఈ మధ్య ఆమె బరువు పెరిగింది. రకరకాలుగా చూసుకుంది. ఆమెకు సంతృప్తి కలిగింది. ముఖం సుందరంగా ఉంది. కళ్ళల్లో వెలుగుంది. ముక్కు బాణంలా వంగి ఉంది. చుబుకం బలిష్టంగానూ, గుండ్రంగా నూ ఉంది. ఛాయా పాలూ, లత్తుకరసం కలిపినట్లూ లేకున్నా అందంగానే ఉంది.
ప్రజలు సౌందర్యం అనేది తానాకు ఉందా?" తనలో వాస్తవమైన స్త్రీత్వం ఉందా?
ఉంది. ప్రస్తుతం ఆమె సామాన్య స్త్రీలలో స్త్రీ. ఆమెకూ స్త్రీల లాంటి కోరికలూ, అవసరాలూ కలిగాయి. జనం ఆమెను జగన్మాతను చేసింది. అయినా ఆమె స్త్రీ అయిన క్షణం నుంచీ ఆమెలో నారీ సహజ కామనలు చిగిర్చాయి.
మళ్ళీ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. భైరవి వచ్చినప్పుడు ఫోటోలు తీసినవాడే. అతనికి లేఖ సహజత్వం ప్రతిబింబించే చిత్రం కావాలి.
"చేయి ఆశీర్వదిస్తూన్నట్లుగా ఉండాలి. ఏదీ ఇలా.........ఇలా. ఆ .......అంతే. ముఖంలో కరుణ ఉండాలి. జగత్తు యావత్తూ మీదా ఉండే దయారసం ముఖంలో కనిపించాలి."
ఆ దయారసం అతనికి అవసరం అయిన భావాలూ ఆమెలో ప్రతిబిబించలేదు. "నేనేం సినీతారనా?" అని తన అసమ్మతి వ్యక్తపరిచింది.
ఫోటో గ్రాఫర్ ఆమెను విసిగించాడు. కరుణ, సకల భూతాల మీద దయ. అది ఆమెలో ప్రతిబింబించాలి. ఆమె కరుణామూర్తి కావాలి. జగన్మాత కావాలి. ఎందుకూ ఇదంతా? జనం తన్ను వంటిగా ఎందుకు ఉండనీరు?
అభిజిత్ ఏదో వింత వస్తువును చూసినట్లు, కెమెరాను చూస్తూ నుంచున్నాడు. జగన్మాత విసిగిపోయింది. ఆమెకు విశ్రాంతి ఇవ్వడానికి ఫోటో గ్రాఫర్ తన దృష్టి కుర్రాడి మీదికి మళ్ళించాడు.





