Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    12. ఇంద్రావరుణులారా! ద్విపాత్తులు, చతష్పాత్తులు మున్నగు వానియందు మీ విషయమున జరిగిన పాపమును ఈ హోమమున నశింపచేయుచున్నాను అనవలెను. జీవనమునకు కావలసినవి జలములు, ఓషధులు, వనస్పతులు, ప్రజలు, పశువులే కదా! యజమానికి సంబంధించిన అవన్నియు వరుణ పాశముల నుండి బయటపడును.

                                  పదునాలుగవ అనువాకము

    1. 'ఇంద్రం వో విశ్వతస్పరి' ఇత్యాది అనువాక్య. 'ఇంద్రంనరో నేమధిత' ఇత్యాది యాజ్య.

    2. సోమరాజా! నీవు సమస్త పాపముల నుండి మమ్ము కాపాడుము. నీ వంటి ప్రభువునకు మిత్రుడు - సమర్థుడయయు - మమ్ము హింసించడు.

    3. సోమరాజా! నీవు స్వర్గము, భూమి, పర్వతములు, ఓషధులు, జలములందు స్థానము కలవాడవు. నీవు చల్లని మనసు గలిగి, కోపము విడిచి మా హవిస్సులను స్వీకరించుము.

    4. అగ్ని సోములారా! మీ జ్ఞానము సమానము. మీ ఆహ్వానములు సమానములు. దేవతలందు మీరు కలసి ఉన్నవారు. మీరు మాస్తుతులను స్వీకరించండి.

    5. సోముడా! నీవును అగ్నియు సమాన సంకల్పము గలవారు. మీరు కలిసి ఆకసమునందు నక్షత్రాదులను స్థాపించినారు.

    సోమాగ్నులారా! నదులు పిల్లకాలువలు, బురద మున్నగు వానిచే దూషితములు కాగా మీరు వానిని దోషరహితములను చేసినారు.

    6. అగ్నిసోములారా! మీరు కోరికలు తీర్చువారు. మీరు మా ఆహ్వానములు వినండి. స్తోత్రములు గ్రహించండి. హవిస్సులు అర్పించిన యజమానికి సుఖములు కలిగించండి.

    7. మీలో ఒకరగు అగ్నికి వాయువు ఆదిత్యుని నుండి తెచ్చినారు. మరొకరగు సోముని గాయత్రి పక్షిరూపము దాల్చి కొండలపైనుండి సోమరక్షకులను ఓడించి తెచ్చినది.

     అగ్నిసోములారా! మంత్రములచే వర్థిల్లండి. యజ్ఞముల కొరకు ఈ లోకమును విస్తారము చేయండి.

    8. అగ్ని సోములారా! మీరు కోరికలను తీర్చువారు. మేము హవిస్సులు అర్పించుచున్నాము. వాటి సారమును గ్రహించండి. సేవించండి. శోభన సుఖయుక్తులు, శోభన రక్షణోపేతులు కండి. యజమానికి సుఖమును, పుత్రాదులతో కలయికను కలిగించండి.

    9. 'ఆప్యాయస్వ సమేతుతే' పురోనువాక్య. సంతేపయాగంసి, ఇత్యాది యాజ్య.

    (ఏతే ఉభే చతుర్ధ కాండస్య ద్వితీయ ప్రపాఠకే వ్యాఖ్యాస్యేతే. ఈ రెండును నాలుగవ కాండపు రెండవ ప్రపాఠకమున వ్యాఖ్యానించబడును.)

    10. బ్రహ్మణాం బ్రహ్మణస్పతే! నీవు విద్వాంసులకు విద్వాంసుడవు. ఉపమానముచే కీర్తించబడు వారిలో ఉపమ శ్రవుడవు. రాజులందు జ్యేష్ఠుడవు. గణములకు స్వామివి. అటువంటి నిన్ను 'హవామహే' ఆహ్వానించుచున్నాము. నీవు రక్షణ సహితుడవై విచ్చేయుము. ఆసనము గ్రహింపుము.

    11. ఏ యజమాని శ్రద్ధగల మనస్సుతో దేవతలకు పాలకుడగు బ్రహ్మణస్పతికి హవిస్సులు సమర్పించి పరిచర్యలు చేయునో, అతనికి సేవకులతో కూడిన అన్నము కలుగును. అతని ప్రజలు పన్నులు ఇచ్చువారు అగుదురు. అతనికి బ్రాహ్మణులు, పుత్రులతో కూడిన అన్నము లభించును. అతడు బంధువులు, ధనముతో కూడినవాడు అగును.

    12. అతడు - ఆ దేవత - సుష్టుభులు, ఋక్కులు, ధ్వనియుక్త మంత్రములచే సంతృప్తిచెందినాడు. యజమానికి బలము కలుగుటకు గల అవరోధములను తొలగించినాడు.

    బృహస్పతి హవిస్సును ఆరగించువాడు. ఆరగించి ఆనందమున కేకలు వేయువాడు. అతడు యజమానికి - పాలు చేపుటచే దూడలను అంబారావములచే పిలుచునట్టి - ఆవులను కలిగించును.

    13. 'మరుతో యద్ధవః, అనునది అనువాక్య. 'యావః శర్మ' యాజ్య
           ఏతచ్చోభయం ప్రథమ కాండస్య పంచమ ప్రపాఠకే వ్యాఖ్యాతమ్.   

    14. ఆర్యమా యాతి - ఆదిత్యుడు వచ్చుచున్నాడు. అతడు కోరికలు తీర్చువాడు. మహాబలుడు. ధనదాత. పురుహోతుడు. స్వర్గము నివ్వగలవాడు. సహస్రాక్షుడు. పర్వతములను భేదించువాడు. వజ్రబాహువు. ఆ దేవుడు మాకు ధనములు ప్రసాదించును గాత.

    15. రాజువగు ఆదిత్యా! నీయొక్క దేవయానము పెక్కు దారులది. అవి స్వర్గపర్యంతము సాగును. దేవా! ఆ మార్గములందే మాకు మహా సుఖములు ప్రసాదించుము. మా మనుష్యులకు సుఖకరుడవు అగుము. మా పశువులకు సుఖంకరుడవు అగుము.

    16. కర్మారంభము నుండి పూర్తియగు వరకు ఇంద్రుడు అంగిరులచే స్తుతించబడినాడు. ఈ రాజు పర్వతము వంటివాడు. సకలమునకు ఆధారభూతుడు. అతనికి సమానులు అతనికి ద్రోహము తలపెట్టినారు. బలవంతముగా ఆర్జించిన అడ్డంకులు కలిగించినారు. ఇంద్రుడు వాటిని అన్నింటిని తొలగించినాడు. సోమపానమున మదించిన ఇంద్రుడు ఆ ద్రోహనివారణాది కార్యములను నిర్వహించినాడు.

    17. ఇంద్రుడు నదుల మొదలు నుంచి చివరి వరకు కొలబద్దచే కొలిచినాడు. నదుల ప్రవాహమునకు అడ్డువచ్చు పర్వతములను వజ్రముచే బద్దలు కొట్టినాడు. నదులకు ప్రవాహ మార్గమును కల్పించినాడు. వీనిని అన్నింటిని అనాయాసముగ చేసినాడు. సోమపానము వలన మదించి ఆ కార్యములను చేసినాడు.

    18. బృహస్పతి విద్వాంసుడు. అతడు బ్రాహ్మణ యజమానిని అతని బంధువులందరిలో గుర్తించును. ఆ దేవుడు సర్వప్రాణుల పుట్టుకను గురించి తేపతేప చెప్పును. అతడు వేదము మధ్య నుండియు, క్రిందినుండియు, పైనుండియు పరివ్యాప్తమైన కర్మను ఉద్దరించినాడు. అమృతము అందుకొని యజమానిని గూర్చి ప్రస్థాన మొనరించినాడు.

    19. బృహస్పతి సామర్థ్యమున మహామహుడు. అతడు పృథివి, అంతరిక్షములను ద్యులోలోకమును, గృహములను, నేల మీది ధూళిని పుట్టినంతనే స్తంభింపచేసినాడు. సామ్రాట్టు అగు బృహస్పతి దేవతగా కలవాడు జన్మచేతనే ఆజన్మాంతము వ్యాపించిన వాడగును.

    20. బృహస్పతి ఆమూలాగ్రము స్వబలమున వర్ధిల్లినవాడు. అన్యదేవతలు అతని వద్దకు వత్తురు. విశేషముగ పరిచర్యలు చేయుదురు. బృహస్పతి యజమానికి ప్రతికూలముగ ఉండు ప్రబల తముని సహితము తొలగించును. యజమానిని వ్యతిరేకించు పురములను భేదనమొనరించినాడు.

    బృహస్పతి ఉత్సాహమున కేకలు పెట్టుచు జలక్షేత్రాదికములను జయించినాడు.


            శ్రీమాదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            రెండవ కాండమునందలి మూడవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.