Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                      జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                     ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                         ఇరువది ఒకటవ అధ్యాయము
1.    ఇమం మే వరుణ శ్రుదీ హవమచ మృడయ
    త్వామవస్యురాచకే||

    వరుణదేవా! నేడు నీవు మా ఆహ్వానమును ఆలకింపుము. నన్ను రక్షించుమని నేను నిన్నే పిలుచుచున్నాను.

    2. నేను నిన్ను మంత్రయుక్తముగ నమస్కరించి ఆహ్వానించుచున్నాను. యజమాని హవి సహితుడై నీ రాకను ఆకాంక్షిచు చున్నాడు.

    వరుణా! నీవు కోపింపకుము. మా వద్దకు రమ్ము, మమ్ము తెలిసికొనుము.

    అత్యంత ప్రశంసిత వరుణా! మా ఆయువును నష్టపరచకుము. "మాన ఆయుః ప్రమోషీః


    3. అగ్నీ! నీవు పరమ విద్వాంసుడవు. నీవే వరుణ దేవుని క్రోధమును నివారింపుము. అత్యంత యజన కుశల, హవ్యవాహక, జాజ్వల్యమాన అగ్నీ! మమ్ము  ద్వేషించువారి నుండి మమ్ము విడిపింపుము. మా పాపములను దూరము చేయుము.

    4. అగ్నీ! నేడు ఉష వెడలినంత నీవు నీ రక్షణలచే మమ్ము రక్షించుటకు మా వద్దకు విచ్చేయుము. విశేష సాధన ఘృతమును ఆహ్వానించుము... వరుణుని అర్చింపుము. సుఖముల నిచ్చు వరుణునకు కడుపునిండుగ సోమాన్నము తినిపించుము. ఆదరణీయ ఆహ్వానము నీవు సహితము సమిధాదులచే అభివర్ధిల్లుము.

    5. అదితి మహతి. శుభకర్మ జనయిత్రి. యజ్ఞపాలిక. ప్రభూత రక్షణవతి. జరహీన. ప్రభూత గమన. శుభ ఆశ్రయ. శుభనీతివతి. అట్టి అదితిని మేము నేడు మమ్ము రక్షించమని ఆహ్వానించుచున్నాము.

    6. ఓ యజ్ఞమయీ నౌకా! నీవు సురక్షణశీలవు. విస్తారవతివి. ప్రభాయుక్తవు. పాపరహితవు. ఆశ్రయవతివి. అదితి రూపవు. సునీతివి. ఛిద్ర రహితవు. దేవసంబంధివి. మాకు శుభములు కలుగవలెనని నిన్ను ఎక్కుచున్నాను. "ఆరోహేమాస్వస్తయే"

    7. అచ్ఛిద్ర, అపాప, శతారిత్ర యజ్ఞరూప సునావను స్వశుభలకు ఆరోహించుచున్నాను.

    8. మిత్రా వరుణులారా! మా మార్గములను ఘృత దుగ్ధములచే నింపుడు. నా లోకములను మధువుతో తడుపుడు.

    9. మిత్రా వరుణులారా! మా జీవనమునకు గాను మీ దీర్ఘ బహువులను చాచండి. మా క్షేత్రములను ఘృత స్వరూప వర్ష జలమున తడపండి. నన్ను జనులందు గొప్పవాడని ప్రకటించండి. "మేమిత్రావరుణ హవేమ" మిత్రా వరుణులారా! మా ఆహ్వానమును ఆలకించండి.

    10. అశ్వములు దేవరక్షక యజ్ఞమందు అపరిమిత గమనలు, స్వర్గీయలు, స్వర, వృక, రాక్షసుల నుంచి రక్షకులు, వాధ్యులను మా నుంచి నిర్మూలించునవి. అవి మాకు సుఖ కారకములు కావలెను.

    11. అశ్వములారా! అన్నప్రాప్తికగు యుద్ధములందు మమ్ము రక్షించండి. ధనప్రాప్తి కగు యుద్ధములందును రక్షించండి. మీరు "విప్రా అమృతా ఋతజ్ఞః" మీరు  ఈ మధు భాగమును పానము చేయండి. మదోన్మత్తులు కండి. చివరకు దేవమార్గమున స్వర్గమున పయనించండి.

    12. అగ్ని వెలిగినాడు. వరణీయుడగు వాడు సమిధలచే సంపూర్ణముగా ప్రదీప్తుడయినాడు. గాయత్రి ఛందము మరియు సంవత్సరన్నర గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినవి.

    13. పవిత్ర్రకర్మ తనూనపాద అగ్ని దేహమును పవిత్రము చేయు సరస్వతి - ఉష్ఠిక్ ఛందము, దివ్య హవిని వహించు గోవు ఇంద్రునకు బలముస, ఆయువు కలిగించినారు.

    14. వనస్పతులతో కూడిన స్తుత్య అగ్ని, అమరము, ద్యోతమానమగు సోమము - అనుష్టుప్ - ఛందము, రెండున్నర ఏండ్ల గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    15. పూషతో పాటు దర్భాసనముగల అగ్ని - మరణము లేని స్తీర్ణిబర్హి - బృహతీ ఛందము మూడేండ్ల గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    16. ద్యోతమాన ద్వారము, మహాదిశలు, బ్రహ్మ, బృహస్పతి, పంక్తి ఛందము, నాలుగేండ్ల గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    17. గొప్పవారును శోభస్కర రూపులును. అగు ఉషారాత్రులు, అమరులగు విశ్వేదేవతలు త్రిష్టుప్ ఛందము, పూర్ణ వయసు గల గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    18. దివ్యహొతవైద్యులు - ఇంద్రయుతులు, పరస్పర సంయుక్తలగు ఇంద్ర వాయువులు జగతీ ఛందము, పూర్ణ వయసు గల గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    19. ఇడ, సరస్వతి, భారతి యను ముగ్గురు దేవేరులు, ఇంద్రుని ప్రజయగు మరుత్తులు, విరాట్ ఛందము, ధేనువు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    20.క్షిప్రవ్యాపియగు అద్భుత త్వష్ట - పుష్టిని పెంచు ఇంద్రాగ్నులు - ద్విపాద ఛందస్సు- సేచన సమర్థ గోవు ఇంద్రాగ్నులు - ద్విపాద చంధస్సు - సేచన సమర్థ గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    21. సుఖములనిచ్చు వనస్పతులు, ధనోత్పన్నసవిత, కకుప్ ఛందము, వంధ్య గోవు ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    22. మంచి రక్షణల వరుణుడు ఇంద్రునకు యజ్ఞవైద్యము చేసినాడు. స్వాహా ఆకృతి గల వనస్పతులు, అతిచ్ఛందము, పెద్ద వృషభము ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    23. వసంతర్తువు, త్రివృత్ సోమము, రథన్తర పృష్ఠ సంస్తుతులగు వసువులు, వపారూపహవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    24. గ్రీష్మ ఋతువు, పంచదశ స్తోమము, బృహత్పుష్ఠ సంస్తుత రుద్ర దేవతలు యశముతోటి హవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    25. వర్ష ఋతువు. సప్త దశ స్తోమము, వైరూపపుష్ఠ సంస్తుత ఋభువులు, సిరితోటి హవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    26. శరదృతువు, ఏకవింశత్సోమము, శ్రీ, వైరాజ పుష్ఠ సంస్తుత ఋభువులు, సిరితోటి హవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    27. హేమంతము, త్రిణవస్తోమము, శక్వర పృష్ఠ సంస్తుత మరుత్తులు, బలముతో కూడిన హవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    28. శిశిరము, త్రయస్త్రింశ స్తోమము, రైవత పృష్ఠస్తుత అమర దేవతలు, సత్యయుక్త క్షాత్రము హవి ఇంద్రునకు బలము, ఆయువు కలిగించినారు.

    29. గోష్పాదమందున్న ఆహవనీయాగ్నియు, దైవీ హోత అగ్నియు, అశ్వినులును, సరస్వతియు ఇంద్రుని సమిధలచే యజింతురు గాత. ఆ యజ్ఞమున అజ, మేష, ధూమ్ర, మధు గోధుమ, బదరి, యవాంకురములు భేషజములగును. తేజస్సు, బలము, పాలు, సోమరసము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.
   
    30. దైవీహోత తనూనపాదగ్ని, అశ్వినులు, సరస్వతి ఇంద్రుని యజింతురు గాత. ఆ మధుమయ పథ యాగమందు అజ, మేష, బదరి, యవాంకుర, వ్రీహ్యంకురములు భేషజములగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    31. దైవీహొత తనూనపాదగ్ని, అశ్వినులు, సరస్వతి ఇంద్రుని యజింతురు గాథ. ఆ మధుమయ పథ యాగమందు అజ, మేష, బదరి, యవాంకురములు భేషములగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హొతా! యజింపుము.

    32. ఋత్విజుల ప్రశంసలందుకొను దైవీ హోత ఇడ, సరస్వతి, అశ్వినులు ఇంద్రాదులను గోవృషభముల ద్వారా వర్ధిల్ల చేయుచు యజింతురు గాత. యవలు, బదరి, మధు; కర్కంధు భేషజములగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హొతా! యజింపుము.

    33. దైవీ హోత, ఉన్ని వంటి కోమల బర్హి - వైద్యులు, నాసత్యులగు అశ్వినులు - సరస్వతి యజింతురు గాత. బలోపేత అశ్వము, సద్య ప్రసూత గోవు భేషజములగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    34.  దైవీహోతలగు దిశల వంటి, అవకాశముగల, శబ్దాయమాన ద్వారములు, అశ్వినులు, సరస్వతి ఇంద్రుని యజింతురు గాత. ద్యావాపృథ్వుల సహితముగా సరస్వతి గోవై శుద్ధ జ్యోతి స్వరూప భేషజమగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    35. దైవీహోత సురూప ఉష, రాత్రి, అశ్వినులు, సరస్వతి ఇంద్రుని యజింతురు గాత. వారు చిత్తము, శ్రీసహితులై  మాసర రూప ఓషధి, శ్యేన పత్రము మరియు కాంతిని ఇంద్రుని యందు చేర్చెదరు. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    36. దైవీ హోతలు, దివ్యహోతలగు ఇడ, భారతి, సరస్వతి, అశ్వినులు ఇంద్రుని యజింతురు గాత. సరస్వతి దేవవాణిచే త్రిధాత్రు భేషజమగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత హోతా! యజింపుము.

    37. దైవీహోతలగు ఇడ, భారతి, సరస్వతి, అశ్వినులు ఇంద్రుని యజింతురు గాత. సరస్వతి దేవవాణిచే త్రిధాత్రు భేషజమమగును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    38. దైవీహోత, బలవంతుడు, సర్వహితుడగు త్వష్ట, అశ్వినులు, సరస్వతి ఇంద్రుని- వృక, సుర, మాసరములచే యజింతురు గాత. ఈ యజ్ఞము వలన ఇంద్రునకు ఓజస్సు. వేగము, వీర్యము, సిరి, యశస్సు కలుగును గాత. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రాది దేవతలందు వ్యాపించును గాత. హోతా! యజింపుము.

    39. దైవీహోత, పశుసంస్కర్త యూపము- భయంకరుడు, క్రోధి, వ్యాఘ్రము వంటివాడు, శతక్రతువగు ఇంద్రుడును అన్నమున సరస్వతిని యజింతురు గాత. సరస్వతి ఇంద్రునకు కోపము, బలము కలిగించును. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రుని యందు చేరును గాత. హోతా! యజింపుము.

    40. దైవీ హోత అగ్నిని యజించును గాత. ఘృతమునకు స్వాహా. మేధలకు వేరువేరుగా స్వాహా. అశ్వినులకు అజ స్వాహా. సరస్వతికి మేష స్వాహా. సింహ బల ఇంద్రునకు వృషభ స్వాహా. భేషజులకు స్వాహా. సోమశక్తికి స్వాహా. ఘృత భక్షక దేవతలకు స్వాహా. వైద్యులను సేవించు అగ్నికి స్వాహా. దుగ్ధము, సోమము, సుర, ఘృతము, మధువు ఇంద్రునందు చేరును గాత. హోతా! యజింపుము.

    41. దైవీహోత అశ్వినులను యజించును గాత. అశ్వినులు ఛాగపు వపచే మేదను సేవింతురు గాత. హోతా! హవిని హోమము చేయుము.

    దైవీ హోత సరస్వతిని యజించును గాత. సరస్వతి మేష వపచే మేదను ఆస్వాదించును గాత. హోతా! హవిని హోమము చేయుము.
   
    దైవీ హోత ఇంద్రుని యజించును గాత. ఇంద్రుడు వృషభాపు వపచే మేదను ఆస్వాదించును గాత. హోతా! హవిని హోమము చేయుము.

    42. దైవీ హోతలు అశ్వినులు, సరస్వతి ఇంద్రుని యజింతురు గాత. అధ్వర్యులారా! ఓహో! మీ సోమము ఎంతో బాగున్నది. అది ఛాగ, మేష, వృషభములచే అభిషుతమై ఉన్నది. అది తృణ, యవాంకుర, లాజలతో తేజరిల్లుచున్నది. అది మసరములచే శుద్ధి చేయబడి మరింత మత్తు కలిగించునదై ఉన్నది. ఓహో! ఇహ పాలు కలసి ఇది అమృతమైనది. దేవతలు ఇటువైపు తరలినారు. అశ్వినులు, సరస్వతి- సుత్రాత, వృత్రహంత ఇంద్రులారా! మీరు ఈ మధుర రసమును  పానము చేయండి, సకల దేవతలారా! దీనిని సేవించండి. మదోన్మత్తులు కండి. హోతా! యజింపుము.

    43. దైవీహోత అశ్వినులను యజించును గాత. నేడు అశ్వినులు ఛాగమాంసమును తినవలెను. అది మధ్య నుంచి మేద తీయబడినది. రాక్షసాది శత్రువులు భక్షించక మున్నే  మాంసాహార మానవులు ఎగబడక మున్నే అశ్వినులు దీనిని భక్షించవలెను.

    ఇది - ఈ ఆడ మేక- పచ్చని గడ్డిమీద సంచరించినది. యవల తొలి మొక్కలను మేసినది. అది స్వయముగా కరిగినది. వందల స్తుతులచే స్తుత్యుడగు అగ్నిచే పచనము చేయబడినది. ప్రతి అంగమును బయటకు తీసి ఒక్కొక్క దానిని కోసి చేసిన మాంస వపా ఖండములను అశ్వినులు ఆస్వాదించవలెను. ఆనందించవలెను. హోతా! యజింపుము.

    44. దైవీహోత సరస్వతిని యజించును గాత. నేడు సరస్వతి మేక మాంసమును భక్షించవలెను.          
   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.