Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
32. అశ్వినులారా ! మీరు అనేకులకు మిత్రులు సత్యస్వభావులు. మావద్దకు అన్నముతో రండి. కీర్తితో రండి. ధనముతో రండి.
33. అశ్వినులారా ! మీ అశ్వములు స్నిగ్ధరూపములు. పక్షులవంటి శీఘ్ర గమనము కలవి. అవి మిమ్ము సుందర యజ్ఞ మానవులవద్దకు చేర్చవలెను.
34. మీ రథము అశ్వయుక్తము. స్తోతలు ప్రశంసించునది. ఈ రథము సైన్యములను బాధించదు.
35. మనోవేగముగల అశ్వద్వయమా ! వడిగల అడుగులుగల గుర్రములు లాగు రథముపై ఎక్కి విచ్చేయండి.
36. వర్షకారులు, ధనయుక్తులగు అశ్విద్వయమా ! మీకు ఎల్లవేళ జాగృతమును, అన్వేషణీయ సోమ పానము లభించును.
37. అశ్వినులారా ! మీరు అభినవము. కీర్తనీయమగు ధనమును తెలిసికొనుడు. చేది వంశీయుడు కశుడను రాజు వంద ఒంటెలను, వేయి ఆవులను దానము చేసినాడు. అదికూడ తెలిసికొనండి.
38. కశురాజు నా సేవకొరకు బంగారమువలె మెరయునట్టి పదిమంది రాజులను ఇచ్చినాడు. సకల ప్రజ ఆ కశురాజు అడుగులక్రిందనే అణచి ఉండును.
(యుద్ధమున గెలిచిన రాజులను ఇచ్చినాడు. ఇది అతను శూరుడని చెప్పుట. సకల ప్రజల అడుగులక్రింద ఉండుట పాలనా సామర్థ్యమును చెప్పుట)
39. చేది వంశస్థులు దారిన మరొకడు సాగలేడు కశుని మించి ఏ విద్వాంసుడుగాని, ఏదాన పరాయణుడుకాని స్తోతకు దానము ఇవ్వలేడు.
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున ఎనమిదవ అద్యాయమున మొదటి అనువాకము సమాప్తము.)
రెండవ అనువాకము ఆరవ సూక్తము
ఋషి - కాణ్వవత్సుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.
1. ఇంద్రుడు పర్జన్య సమాన బలవంతుడు. గొప్పవాడు. అతడు పుత్రుతుల్య స్తోతవలన వర్ధిల్లును.
2. ఇంద్రుని అశ్వములు ఆకాశమును నింపునవి. అవి యజ్ఞప్రజ అయిన ఇంద్రుని వహించును. అప్పుడు విద్వాంసులు యజ్ఞప్రాపక స్తోత్రము ద్వారా ఇంద్రుని స్తుతింతురు.
3. కణ్వులు ఇంద్రుని స్తుతించినారు. యజ్ఞసాధకుని చేసినారు. అందుకే జనులు ఇంద్రుని భ్రాత అందురు.
4. నదులు సముద్రునకు ప్రణమిల్లును. సమస్త మానవ జాతికి ఇంద్రుని క్రోధమన్న భయము. వారు స్వచ్చందముగా ఇంద్రునకు ప్రణమిల్లుదురు.
5. ఇంద్రుని బలము గొప్పది. అతడు ఆ బలమున ద్యావాపృథ్వులను చర్మమువలె భద్రపరచును.
6. వృత్రుడు వడుకుచున్నాడు. ఇంద్రుడు వందధారల పరాక్రమశాలి, వజ్రము అందుకున్నాడు. వాని తల నరికినాడు.
7. మేము స్తోతలముందు నిలుతుము. వారి స్తోత్రములు అగ్ని సమాన దీప్తములు. వానిని మేము మరల మరల చదువుదుము.
8. స్తుతుల గుహయందున్నవి. అవి స్వయముగా ఇంద్రుని చేరును. దీవించును. వాటిని కణ్వులు సోమధారాయుక్తము చేసెదరు.
9. ఇంద్రా ! మేము గోవులు, అశ్వములతో కూడిన ధనము పొందవలెను. జ్ఞానప్రాప్తికిగాను ఇతరుల కన్నముందు అన్నము పొందవలెను.
10. ఇంద్రుడు పితా - సత్యస్వరూపుడు. నేను అతని అనుగ్రహమునకు పాత్రుడను అయినాను. నేను సూర్యునివలె వెలిగినాను.
11. కణ్వునివలె నేను నిత్యస్తోత్రములతో వాక్కులను అలంకరింతును. ఆ స్తోత్రములతో ఇంద్రుడు బలవంతుడగును.
12. ఇంద్రా ! నిన్ను స్తుతించని వారున్నారు. నిన్ను స్తుతించు ఋషులు ఉన్నారు. ఆ ఇద్దరి నడుమ నా స్తుతి స్తుతించబడవలెను. వృద్ధిపొందవలెను.
13. ఇంద్రుని క్రోధము వృత్రుని ముక్కలు ముక్కలు చేసి ధ్వనించినది. అప్పుడు ఇంద్రుడు వర్షజలమును సముద్రమున కంపినాడు.
14. ఇంద్రా ! శుష్ణుడు దస్యుడు. నీ వజ్రము ధారణయోగ్యము. దానిని వానిమీద ప్రయోగించినావు. ఉగ్ర ఇంద్రా ! నీవు అభీష్టవర్షివి.
15. ఇంద్రుని ద్యులోకము. తన బలమున వ్యాప్తిచెందించ లేదు. అంతరిక్షము వజ్రధర ఇంద్రుని వ్యాప్తిచెందించలేదు. భూమి సహితము ఇంద్రుని వ్యాప్తి చెందించలేదు.
16. ఇంద్రా ! వృత్రుడు నీజలమును అంతరిక్షమున వ్యాపింప చేసినాడు. కట్టి పెట్టినాడు. ఆవృత్రుని నీవు పారు నట్టి నీటి మధ్యహతమార్చినావు.
17. ఇంద్రా ! వృత్రుడు గొప్పవి కలిసి ఉన్నవి అగు ద్యావాపృథ్వులను కప్పిపెట్టినాడు. ఇంద్రా ! నీవు వృత్రుని అనాది అనంత అంధకారమున త్రోసినావు.
18. ఓజస్వి ఇంద్రా ! యతులగు అంగిరులు నిన్ను స్తుతింతురు. భృగువులు నిన్ను స్తుతింతురు. వారిలో నీవు నా స్తుతులను వినుము.
19. ఆవులు ఇంద్రుని యజ్ఞమున వర్థిల్ల చేయును. పాలు, నేయి ఇచ్చును.
20. ఇంద్రా ! ప్రసవించగల ఆవులు నీవు ప్రసాదించిన అన్నము తిన్నవి. సూర్యుని నలువైపున గల జలమువలె గర్భములు దాల్చినవి.
21. బలశాలివగు ఇంద్రా ! కణ్వులు ఉక్థలతో నిన్ను వర్థిల్ల చేయుదురు. అభిషుత సోమము నిన్ను వర్థిల్ల చేయును.
22. వజ్రహంత ఇంద్రా ! నీవు మార్గదర్శివి ఆయనపుడు ఉత్తమ స్తుతి, ప్రవృద్ధ యజ్ఞము కలుగును.
23. ఇంద్రా ! మాకు మహంతము, గోయుక్తమగు అన్నమును రక్షించుటకు వీర్యవంతుడగు పుత్రుని ప్రసాదించుటకు ఇచ్చగించుము.
24. ఇంద్రా ! నీవు నహుషునకు, ప్రజలముందు, వేగముగల అశ్వయుక్త బలమును ప్రదానము చేసినావు. అట్టి దానినే మాకు ప్రసాదించుము.
25. ఇంద్రా ! నీవు ప్రాజ్ఞుడవు. అదిగో దగ్గరలో దర్శనీయమగు గోశాల కనిపించుచున్నది. దానిని నింపుము. మమ్ము సుఖపెట్టుము.
26. ఇంద్రా ! నీ బలమునకు తగినట్లు ఆచరింపుము. మానవులకు రాజువగును. నీ బలమున మహానుడవగుము. అపరాజయుడవగుము.
27. ఇంద్రా ! నీవు బహు వ్యాపకుడవు. హవివంతులు సోమముతో నిన్ను తృప్తుని చేయదలతురు. నీ వద్దకు వత్తురు. స్తుతింతురు.
28. పర్వత ప్రాంతములందును, నదుల సంగమ స్థానములందును, యజ్ఞములందును, మేధావి ఇంద్రుడు ఆవిర్భవించును.
29. ఇంద్రుడు సర్వవ్యాపకుడు. అతడు లోకములందు విహరించును. పైలోకమునుండి దిగువకు సముద్రమును చూచును.
30. ద్యులోకమున ఇంద్రుడు వెలుగులు పొందును. అప్పుడు ప్రాచీన జలదాత ఇంద్రుని నివాసప్రదజ్యోతిని జనులు దర్శింతురు.
31. ఇంద్రా ! సమస్త కణ్వగణములు నీ బుద్ధిని, బలమును పెంచును. వారు నీ శ్రేష్ఠకార్యములనుకూడ వృద్ధిచెందింతురు.
32. ఇంద్రా ! ఇది మాసుందర స్తుతి. దీనిని స్వీకరింపుము. మమ్ము తగు రీతిగా రక్షింపుము. మా బుద్ధిని పెంచుము.
33. ఇంద్రా నీవు ప్రవృద్దుడవు. వజ్రధరుడవు. మా జీవనము కొఱకు నిన్ను స్తుతించుచున్నాము.
34. కణ్వులు స్తుతింతురు. నీరు పల్లమునకు పారును. అట్లే రమణీయమగు స్తుతి ఇంద్రుని చేరును.
35. నదులు సముద్రమును పెంచును. అట్లే మంత్రములు ఇంద్రుని పెంచును. ఇంద్రుడు అజరుడు. అతని కోపమును ఎవ్వడు నివారించలేడు.
36. ఇంద్రా ! సుందర రథమున ఎక్కుము. దూరదేశము నుండి మావద్దకు రమ్ము. అభిషుత సోమము సేవింపుము.
37. ఇంద్రుడు అందరినిమించిన శత్రు సంహారకుడు. కుశలు కోయువారు. అన్నప్రాప్తికొఱకు ఇంద్రుని పిలిచెదరు.
38. ఇంద్రా ! రథచక్రము గుఱ్ఱమును అనుసరించును. ద్యావాపృథ్వులు నిన్ను అనుసరించును. అభిషుత సోమము సహితము నిన్నే అనుసరించును.
39. ఇంద్రా ! శర్యణ దేశమున తటాకము వద్ద ఋత్విక్కులు ప్రారంభించిన యజ్ఞమున తృప్తుడవగుము. సేవకుల స్తుతులు వినుము. ఆనందించుము.
40. ఇంద్రుడు ప్రవృద్ధుడు. కోరికలు తీర్చువాడు. వజ్రవంతుడు. సోమపాయి. వృత్రహంత. అతడు ద్యులోకమునుండి పలుకును.
41. ఇంద్రా ! నీవు పూర్వము పుట్టిన ఋషివి. నీ బలము అసమానము. నీ బలమున నీవు దేవతలకు ప్రభువువు అయినావు. నీవు మరల మరల ధనమును ఇచ్చుచుండుము.
42. మేము అందించు అభిషుత సోమము. అన్నముకొరకు మంచి వీపులుగల అశ్వములు నిన్ను తేవలెను.
43. కణ్వులు ఉక్థలు ఉచ్చరించవలెను. పూర్వజులు కృతము, మధురమగు జలమును పెంచు యాగక్రియను వర్థిల్ల చేయవలెను.
44. దేవగణములు విశిష్ఠరూపమున గొప్పవారు. వారిలో ఇంద్రుడు మరింత గొప్పవాడు మానవులు ఇంద్రునే వరింతురు. అతనినే ధనము, రక్షణ ఆర్థింతురు.
45. ఇంద్రా ! నిన్ను అనేకులు స్తుతింతురు. నీ అశ్వములను యజ్ఞప్రియ ఋషులు స్తుతింతురు. అవి నిన్ను సోమపానమునకు మా వద్దకు గొనిరావలెను.
46. యదువులలో పరశుపుత్రుడు తిరందరుడు. నాకు నూరు, వేల ధనములు ఇచ్చినాడు.
47. తిరందరరాజులు పజ్రునకు సామునకు మూడు వందల గుఱ్ఱములు వేయి ఆవులు ఇచ్చియున్నారు.
48. తిరందరుడు ఎంతో ఎదిగినాడు. నాలుగు స్వర్ణభండార యుక్తములగు ఒంటెలను దానము చేసినాడు. యదువులను దాసులనుగా దానము చేసినాడు. అతని కీర్తి స్వర్గద్వారముల వరకు వ్యాపించినది.
ఏడవ సూక్తము
ఋషి - కణ్వగోత్రజ పునర్వత్సస్యుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.
1. మరుత్తులారా ! విప్రులు మూడు సవనములు చేతురు. వానిలో అగ్నియందు సోమ అన్నము ఆహుతి చేయుదురు. అప్పుడు మీరు పర్వతములందు దీప్తినొందుదురు.
2. మరుత్తులారా ! మీరు శుభంకరులు. బలాభిలాషులు. మీరు రథమున అశ్వములు పూన్చినపుడు పర్వతములు సహితము నడక సాగించును.
(భయపడును - గడగడలాడునని భావము)
3. మరుత్తులు శబ్దకర్తలు, పృశ్నిపుత్రులు, వారు మబ్బులను పైకి లేపుదురు. వృద్ధికరమగు అన్నమును దానము చేయుదురు.
4. మరుద్గణములు వాయువుతో కలిసినపుడు వర్షము కురిపింతురు. పర్వతములను వడకింతురు.
5. మీ రథముల నడకను పర్వతములు నిలిచి ఉన్నవి. నదులు సముద్రములు తమ రక్షణ, బలములకు నిలిచి ఉన్నది.
6. మేము మిమ్ము రాత్రులందు రక్షణలకు పిలుస్తాము. పగలు పిలుస్తాము. యజ్ఞారంభమున పిలుస్తాము.
7. మరుద్గణములు అరుణవర్ణులు, ఆశ్చర్యభూతులు. శబ్దకర్తలు. వారు రథముపై ద్యులోకపు అగ్రభాగమున సంచరింతురు.





