Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

                                   రాజసూయము - శిశుపాలవధ

    ధర్మరాజు శ్రీకృష్ణుని పూజించి ఇట్లు అన్నాడు:-
    "మహాత్మా! నీ వలన లోకమందలి రాజులందరు నాకు లోబడినారు. ఇది గొప్ప కార్యము. ఘనవిజయము. ఇప్పుడు అగ్నిహోత్రమందు హోమము చేయవలసి ఉన్నది. దేవతలకు తర్పణములు చేయవలెను. బ్రాహ్మణులను తృప్తి పరచవలెను. కావున నీవు ఈ యజ్ఞము చేయుము. నాకును లోకములకును మేలు కలిగించుము. ఇది ఒక పద్దతి. మరొక పద్దతి వినుము. నన్ను రాజసూయమున నియమించి అనుగ్రహింపుము. ఈ రెండు పద్దతులందు నీకు ఇష్టమయినట్లు ఈ ధనమును వినియోగింపుము."
    శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పినది విన్నాడు. "ధర్మరాజా! నీవు సకల రాజన్యులకు పూజ్యుడవు. ధర్మమార్గమున నిర్మల కీర్తి పొందినావు. మహాదైవశ్వర్యములు కలిగి ఉన్నావు. దేవేంద్రుని విభవము కలిగి ఉన్నావు. నీకు దైవ, మానుష సంపదలు రెండును ఉన్నవి. కావున నీవు రాజసూయ యజ్ఞము చేయుము. నీకు ఇష్టమగు కార్యములు చేయుటకు నన్ను పంపుము. నీకు ఇష్టమగు వారిని సకల కార్యములకు వియోగింపుము." అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని అమృత వాక్కులు విన్నాడు. చాల సంతోషించినాడు. తన తమ్ములను సంప్రదించినాడు. రాజసూయము చేయుటకు పూనుకున్నాడు. యత్నములు పారంభించినాడు. ఏర్పాట్లు- చేసినాడు. యజ్ఞశాల నిర్మించుటకు సహదేవుని నియమించినాడు.
    సహదేవుడు ఇంద్రసేనాది శిల్పులను పిలిపించినాడు. శాస్త్ర ప్రకారము యజ్ఞశాలలు నిర్మించినాడు. యజ్ఞశాలయందు సకల సామగ్రులను ఏర్పరచినాడు. ఇంద్రప్రస్థము చుట్టును గొప్ప గృహములు నిర్మించినాడు. బావులు త్రావ్వించినాడు. కోనేరులను ఏర్పరచినాడు. రాజులందరను ఆహ్వానించినాడు.
    సకల రాజన్యులు ధర్మరాజు ఆహ్వానములను అందుకున్నారు. ఇంద్రప్రస్థమునకు విచ్చేసినారు. అట్లు వచ్చిన వారిలో విరాట, ద్రుపద , శిశుపాల, గాంధార, రాజులున్నారు. ప్రాగ్జ్యోతిష ప్రభువు పుత్ర మిత్ర బాంధవుల సహితముగా వచ్చినాడు. సాల్వ, బృహద్భల, చంద్రసేన, కుంతిభోజ, పౌండ్రక, వాసుదేవాదులు, శక, యవన, యదువృష్టి, భోజ , అంధక, వంశస్తులు , బలరామాది యాదవులును వచ్చినారు. సకల వేదవేదాంగ వేత్తలు వచ్చినారు. తమ తమ కర్మములందు ప్రవర్తించేడి వైశ్యులు, శూద్రులు వచ్చినారు. సకులుడు హస్తిన నుండి భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణ, కృపాచార్య, అశ్వత్ధామ, సోమదత్త, కర్ణ, శల్య, శకుని, సైంధవ, దుర్యోధన, దుశ్శాసనాదులను తోడ్కొని వచ్చినాడు. ధర్మరాజు వారందరిని గౌరవించినాడు. పూజించినాడు. వారందరి ఎదుట భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులతో అన్నాడు:-
    "బంధుమిత్రులారా! భీష్మాది కురువృద్దులారా! నేను చేయ తలపెట్టినది మహత్కార్యము. ఇది రాజసూయము. ఇది నా ఒక్కనితో అగునది కాదు. మీ అందరి అనుగ్రహము ఉన్ననే ఈ కార్యము నెరవేరును. కావున మీరందరును పూనుకొనవలెను. యజ్ఞమును నిర్వహించవలెను. నన్ను అనుగ్రహించవలెను."
    భీష్మ ద్రోణాదులు ధర్మరాజు విన్నపములు విన్నారు. సంతసించినారు. అనుగ్రహించినారు. అన్ని విషయములందు తోడ్పడేదమన్నారు. కార్యములు నిర్వర్తించుటకు అంగీకరించినారు. అప్పుడు ధర్మరాజు వారిని వివిధ కార్యములందు నియమించినాడు. దాన ధర్మములు చేయుటకు కృపాచార్యుని నియమించినాడు. మంచి చెడ్డలు ఎరిగి చెప్పుటకు భీష్మ, ద్రోణులను , వ్యయము చేయుటకు విదురుని నియమించినాడు. సకల రాజులు తెచ్చిన కానుకలు అందుకొను కార్యమును దుర్యోధనునకు అప్పగించినారు.
    ధర్మరాజు సకల కార్యములు ఇతరులకు అప్పగించినాడు. తాను యజ్ఞదీక్ష వహించినాడు. బ్రాహ్మణజన, జ్ఞాతి, జనులకు కూడ యజ్ఞశాల ప్రవేశించినాడు. అప్పుడు అతడు మూర్తి మంతమయిన తేజస్సు వలె ప్రకాశించినాడు. బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు , బ్రహ్మ ఋషులు సేవించుచుండ దేవేంద్రుని వలె ప్రకాశించినాడు.
    అప్పుడు యజ్ఞశాల జనులాతో పిక్కటిల్లినది. వేద ధ్వనులు, ఆశీర్వాదధ్వనులు, వాద్య ధ్వనులు మారు మ్రోగినవి. రాజసూయము ప్రారంభమయినది.
    రాజసూయ మహాయజ్ఞమునకు పైల, ధౌమ్యులు హోతలు. యజ్ఞ్యావల్క్యుడు, అధ్వర్యుడు, వేదవ్యాసుడు బ్రహ్మ సోముడు ఉద్గాత. నారదాది మహామునులు, భీష్మాది రాజ శ్రేష్ఠులు సదస్యులు.
    ధర్మరాజు చేసిన రాజసూయమున సర్వక్రియలు సమగ్రమముగా జరిగినవి. షడంగ సమృద్ది కలిగి వున్నవి. సంపూర్ణ దక్షిణలు ఇవ్వబడినవి. రాజసూయము శ్రీకృష్ణునిచే రక్షించబడినది.
    రాజసూయమున సకల జనులు సంతృప్తులు అయినారు. మంత్రాహుతుల చేత దేవతలు తృప్తులయినారు. సంపూర్ణ దక్షిణల చేత బ్రాహ్మణులు తృప్తులయినారు. నానావిధ సత్కారముల చేత రాజులు తృప్తులయినారు. అట్లు తృప్తి చెంది అందరును ధర్మరాజును కీర్తించినారు. ఆశీర్వదించినారు.
    రాజసూయమునకు నారద మహర్షి వచ్చినాడు. ఆ వైభవము చూచినాడు. ఎంతో సంతోషించినాడు. ధర్మరాజు నిత్య సత్యత్వమును సుతించినాడు. ఆ సభయందు సామాన్య మానవుని వలె శ్రీకృష్ణుడు ఉండుటను చూచినాడు. తన మనసులో ఇట్లనుకున్నాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. బ్రహ్మాది దేవతల ప్రార్ధనమును మన్నించి, భూభారము పోగొట్టుటకు యదువంశమున అవతరించినాడు. రానున్న భారత యుద్దమున రాక్షసాంశమున పుట్టిన రాజులను అంతమొందించగలడు. అట్లు అనుకోని ఎంతో అనందిన్చినాడు.
    రాజులు, సామంతులు, ప్రభువులు, సభ తీర్చి ఉన్నారు. సభామధ్యమున భీష్ముడు ధర్మరాజు చేసిన రాజసూయమును కొనియాడినాడు. మరియు ధర్మరాజుతో ఇట్లు అన్నాడు:-
    "ధర్మజా! స్నాతకుడు, సద్గురుడు, స్నేహితుడు, ఋత్విజుడు రాజు, జ్ఞాని వీరందరు పూజనీయులు. గావున ఈ సభలో ఉన్నవారిలో గుణాధిక్యుని నిర్ణయించి పూజింపుము."
    ధర్మరాజు భీష్ముని మాటలు విన్నాడు. "అటువంటి మహాత్ముని నీవే నిశ్చయింపుము" అని భీష్ముని ప్రార్ధించినాడు. అది విని భీష్మ పితామహుడు ప్రకటించినాడు:-
    "సూర్యుడు కాంతి చేత సమస్త లోకములను ప్రకాశింప చేయుచున్నాడు. చంద్రుడు అమృత రూపుడయి సమస్త జనులను సంతోషింపచేయుచున్నాడు. ఆ సూర్యచంద్రులకు శక్తిని ఇచ్చువాడు పరమాత్ముడు. అతడు సత్య స్వరూపుడు. జ్ఞాన స్వరూపుడు. ధర్మ స్వరూపుడు. ఆ పరమాత్ముడు విష్ణుదేవుడు. మన మధ్యన ఉన్న శ్రీకృష్ణుడే ఆ విష్ణు దేవుడు. అతడు యజ్ఞపురుషుడు. సర్వలోక పూజ్యుడు. అతనిని మించిన పూజ్యులు లేరు. కావున నీవు శ్రీకృష్ణ దేవుని పూజింపుము."
    ధర్మరాజు భీష్ముని ఆదేశము విన్నాడు. సహదేవుడు పూజా ద్రవ్యములు తెచ్చినాడు. ధర్మరాజు శాస్త్రోక్తముగా శ్రీకృష్ణదేవుని పూజించినాడు.
    సభ సాంతము సంతసించినది. కాని శిశుపాలుడు మందిపోయినాడు. సభా మధ్యమున లేచినాడు. శ్రీకృష్ణుని దూషించినాడు.ధర్మరాజును తూలనాడినాడు. భీష్ముని పరిహసించినాడు.
    "అవని నాధుల నేకులుండగ విశిష్టారాధ్యులార్యుల్ మహీ
    దివిజుల్ పూజ్యులు సల్యురుండగ ధరిత్రీనాధ గొంగేయు దు
    ర్వ్యవ సాయంబున గృష్ణు గష్టచరితున్ వార్ణేయు బూజించి నీ
    యవివేకం బేరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే?"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.