Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
మరొకసారి "వెంట్రుకలు బాగు చేసి పేలు తీశావూ?" అని అడిగాడు.
లేఖ కళ్ళు మూసుకొని మౌనంగా పరధ్యానంలో ఉంది. ఆమె అతని మాట వినలేదు. అతడు లజ్జతో ముఖం తిప్పుకున్నాడు.
పూజ అయిపొయింది. "వాడి నెత్తిన ఇరవై ఒక్క పేను కనిపించింది. ఇరవై ఒకటి " అని జవాబు చెప్పింది.
వారు తిరిగి వెళ్ళేప్పటి కల్లా కుర్రాడు మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకొని కూర్చొని ఉన్నాడు.
కాలూ వాణ్ణి ఎగాదిగా చూశాడు. "భయపడకు" అని తలనిమిరాడు. "పుల్లలా ఉన్నాడు. రెండు సెర్ల బరువన్నా ఉంటాడా? ఇంకా తక్కువేనా?" అని బరువు చూడ్డానికా అన్నట్టు వాణ్ణి చేత్తో ఎత్తాడు.
"ఏమీ లేదు. వట్టి ఎముకలు , చర్మమే" అన్నాడు విచారంగా.
చేతుల్లో ఉన్న మాంసహీనమైన కుర్రాడి కళ్ళల్లోకి కాలూ అదేపనిగా చూశాడు. గొంతు పూడిపోతే సవరించుకోవడానికి అనేకసార్లు దగ్గాడు.
లేఖకు ధైర్యం వచ్చింది. కుర్రాడు జయించాడు.
"నా గదిలో పడుకోబెట్టు " అన్నాడు.
"అవసరం లేదు. నా మంచం పక్కనే పడక ఏర్పాటు చేశాను. బావుంది ."
"కాని, లేఖా........"
"వాడు ఏడిపిస్తాడు. నిన్ను నిద్ర పోనీయడు. నా గదిలోనే పడుకొని" అన్నది పట్టుదలతో.
"అలాగే కానీ" అన్నాడు. అతని కళ్ళల్లో విచారం కనిపించింది. "చూడు, అప్పుడే నిద్రపోయాడు" అన్నాడు.
"వాడికి నీ భయం తీరిపోయింది. "కుర్రాడు కాలూ భుజం మీద పడుకున్నాడు. నూనె రాసి పాపట తీసి వాడి వెంట్రుకలు అతని భుజం మీద పడుతున్నాయి.
"నువ్వూ ఇలాగే నిద్రపోయేదానివి ."
కుర్రాణ్ణి లేఖ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. చుట్టూ దోమతెర కప్పాడు. అతని కళ్ళు వాణ్ణి వదల్లేదు. కదలడానికి కాళ్ళు రాలేదు.
ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. కాలూ బొమలు ముడివేసి "లేఖా, చిత్రంగా ఉంది. నాకేమీ అర్ధం కావడం లేదు." అన్నాడు.
చెపుతూ చెపుతూ ఆగిపోయాడు. లేఖ తినడం మానేసి తండ్రి చెప్పేది వినాలని ఔత్సుక్యంతో చూస్తుంది.
"నీ తల్లి నాతో మాట్లాడింది. "అభిజిత్ నీకు తెలీదూ?" నీ సొంత కొడుకే తెలీదా?" అని అడిగింది.
"అభిజిత్ !"
"అవును, అభిజిత్తే. మీ అమ్మ ఇంకో నాలుగేళ్ల పాటు బ్రతికి ఉంటే ఒక మగబిడ్డను కనేది. వాడి పేరు అభిజిత్ అని పెట్టి ఉండేవాళ్ళం. కాని మీ అమ్మ అభిజిత్ అవతరించక ముందే అంతరించింది. నీ తల్లి నాకు గుసగుస చెప్పింది. నిజం లేఖా. నిజంగా నీ తల్లే."
లేఖ గొంతు నుంచి మాట రాలేదు. ప్రయత్నిస్తే గాని మాట పెగల్లేదు.
"అమ్మ మనసు విడిచిపొయిందెప్పుడూ? ఆమె ఎప్పుడూ మన వెంటనే ఉంటుంది. ఆమె మనకీ బిడ్డని చ్చింది. నా తమ్ముడు చిట్టి అభిజిత్ ."
కాలూ నవ్వాడు. మళ్ళీ భోజనం ముగించే దాకా మాట్లాడలేదు.
"మీ అమ్మ పోలికలు కనిపెట్టావా?"
"మా అమ్మ పోలికలా?" నాకెలా తెలుస్తుంది ?"
"అది కాదు. నీ పోలికలు ."
"నాకు చట్టి ముక్కుందా?"
"సరిగ్గా నీలాగే అని అర్ధం కాదు. నీ పోలిక ఇంకొకళ్ళ కూడా వస్తుందా? నిన్ను చూస్తె చాలు నా హృదయం పొంగిపోతుంది. ఆ కుర్రాణ్ణి చూసినప్పుడూ సుమారు అలాంటి అనుభూతే కలుగుతుంది. అర్ధం అయింది కదూ?"
"పాపం, ఆ కుర్రాడికి పేరైనా లేదు."
"వాడు అభిజిత్. అంతే. వేరే కావడానికి వీల్లేదు."
అదీ అభిజిత్ రంగానికి వచ్చిన విధం.
23
"ఒక్క ఫోటో, అంతే ఇంకొక్క ఫోటో " పోటోగ్రాఫర్ ప్లేటు మార్చడానికి తొందరపడుతూ బతిమాలినట్లు అడిగాడు.
"ఎందుకు ! అన్ని తీస్తున్నావ్. నేనేం సినీతారనా?"
"పెద్ద వాళ్ళ నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇదిగో ఒక్కటి. అంతే."
"పెద్దవాళ్ళేమిటి?"
నాలుక కరుచుకున్నాడు ఫోటో గ్రాఫర్. ట్రిపాడ్ జరిపాడు. "ఏదీ ఒక్క ఫోజు. సహజమైన ఫోజు.
ఆమె ఫోటోలు అనేకం తీసుకో బడ్డాయి. చేతిలో బుట్ట పట్టుకొని తోటలో పూలు తెంపుతున్నట్లూ, ధ్యాన మగ్నమై పద్మాసనం లో ఉన్నట్టూ, కూరగాయలు వగైరాలు కోస్తూ ఇంటి పనుల్లో మునిగిఉన్నట్లూ అనేక పోజులు తీసుకున్నాడు. కాని వీటిలో దేనికీ సహజత్వం లేదు.
"సహజత్వం ప్రతిబింబించే చిత్రం కావాలి. మీ ఆత్మ అందులో కనిపించాలి. అంటే ఆ బొమ్మలో మీరు మూర్తి భవించి ఉండాలని అర్ధం."
లేఖ కళ్ళల్లో విచారం కనిపించింది. తనకు ఉన్న ఆత్మసౌందర్యం ఏమిటి? స్వదేశ్ పత్రిక లేఖను గురించి వింతగా వ్రాసింది. లేఖ వాటిని నెమరు వేసుకుంది. ఆమెను గురించి పత్రికలు పెర్కొనడం ఇది రెండవసారి - మొదటిసారి వంగదేశంలో ప్రధమ బహుమతి గెల్చినప్పుడు, స్వదేశ్ వ్రాసిన వ్రాతలు ఆమెను ఆలోచనలో ముంచేశాయి. "దైవత్వానికి సహితం ప్రాకృతిక సూత్రాలే వర్తిస్తాయి. సుందరమైన సుకుమారకుసుమాల్లో పరిమళం పూజ్యం కాగా బిల్వ పత్రాల్లో సువాసన నింపడం ఎంత ఆశ్చర్యం! పారమార్ధిక విజ్ఞానానికి ప్రసిద్ది గాన్న ఈ సనాతన భారతదేశంలో, దైవం తన కాంతిని సామాన్య కుటుంబీకుడైన పురుషుని మీదా స్త్రీ మీదా ప్రసరించింది. అది స్వల్పమైన దీప కాంతే కావచ్చు. ఇలాంటి అద్భుతాలు ఈ సనాతన నగరానికి అపరిచితాలేమీ కావు. ఈ సందర్భంలో నూత్న శివాలయంలోని సుందరిని దర్శించుకోవాలి. ఈమె విషయంలో గత కొలది మాసాలుగా జరుగుతున్న ఉదంతాలు ప్రభావాత్మకంగా ఉన్నాయి." ఇదీ పత్రిక తీరు.
పత్రిక పేర్కొన్న ఉదంతాలు లేఖకు వింతగా కనిపించాయి. ఆమె అదిరి పడింది.
ఒకనాటి మధ్యాహ్నం సూర్యుడు నెత్తిన ఉన్నప్పుడు ఒక బిక్షుకుడు పాటపాడుతూ దారే పోతున్నాడు. దేవాలయం దగ్గరికి రాగానే చటుక్కున ఆగిపోయాడు. ఏదో వింత వస్తువు కోసం వలె చుట్టూ చూశాడు. అలా దోవన వెళ్తూన్న ఒకణ్ణి పిలిచి అడిగాడు.
"నాయనా , ఆ దేవి ఎక్కడ? జగన్మాత ఎక్కడ?" పిచ్చివాడు . వట్టి పిచ్చివాడు. అని అతడు వెళ్ళిపోయాడు.
ఆ బట్టతల భిక్షుకుడు అంతటితో వదల్లేదు. ఇంటింటికీ తిరిగాడు. అతనిలోని అభిలాష శాఖోపశాఖలుగా పెరిగింది. "ఏదీ, ఆ జగన్మాత ఎక్కడ ?"
ఆ వింత ముసలిని జనం చూస్తూ నుంచుండిపోయారు.
చివరకు గుడికి చేరాడు. గేటులో అడుగు పెట్టేవరకూ అతని కళ్ళల్లో జ్యోతులు వెలిగాయి. "జై" అనే నినాదం అతని గొంతును చీల్చుకొని బైట పడింది.
"దొరికింది. తల్లి దొరికింది. ధన్యుణ్ణి"
లేఖ పుస్తకం చదువుకుంటూ పద్మ మండపంలో కూర్చుంది. భిక్షుకుడు పరిగెత్తి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. తలను చలవరాతికి తాకించి సాగిలిమొక్కాడు.
ఆశ్చర్యంలో ఆమె నోరాడలేదు. చూస్తూ ఉండిపోయింది. ఏం చేయాలి? భిక్షుకుడు లేచి నుంచొని స్తుతించాడు.
"సర్వభూతాలలో సాక్షిభూతమ్మలె ఉన్న మాతా!
నమస్తే, నమస్తే నమస్తే, నమో నమః"
అవే చరణాల్ను మళ్ళీ మళ్ళీ చదివాడు. అతని అనందం చిందులు తొక్కింది. కళ్ళు కాంతులు చిమ్మాయి. అవయవాలన్నీ వణికాయి.





