Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    (పరిధి మేడిపుల్ల. హోమాగ్నికి రక్షణగా నాలుగువైపుల ఉంచునది. ఇది మొదటి మంత్రమునకు వినియోగము.)

    6. జ్ఞాతులందు 1. ఎక్కువవారు. 2. తక్కువ వారు 3. స్త్రీలు ఈ మూడు వర్గముల వారేకదా కావలసినవారు! ఈ ఇష్టి వలన యజమాని వారిని స్వాధీన పరచుకొనును. వారు యజమానికి స్వాధీనులై సేవింతురు.

                                   పదవ అనువాకము

    1. పెరుగు నుండి తీయబడిన నూతన పదార్థమైనందున వెన్న నవనీతము అయినది. అగ్ని సంపర్కము కలుగగా కరిగినందున 'సర్పి' అయినది. గడ్డ కట్టినందున ఘృతము అయినది.

    2. యజమానీ! నీవు అశ్వినులకు ప్రాణమవు. ఎవరికి నీవు ప్రాణమవు అగుదువో ఆ అశ్వినులు నీకు ప్రాణమును, ఆయువును ప్రసాదింతురుగాక. స్వాహా.

    నీవు ఇంద్రునకు ప్రాణమవు. ఎవరికి నీవు ప్రాణము అగుచున్నావో ఆ ఇంద్రుడు ఆయువును ప్రసాదించును గాత. స్వాహా.

    నీవు మిత్రావరుణులకు ప్రాణమవు. నీవు ఎవరికి ప్రాణము అగుచున్నావో వారు నీకు ఆయువును కలిగింతురు గాత. స్వాహా.

    నీవు విశ్వేదేవతలకు ప్రాణమవు. వారు నీకు ఆయుష్యమును ఇచ్చెదరు గాక. స్వాహా.

    3. ఆజ్యము అమృత మార్గము. ఇంద్రునిచే ప్రసాదించ బడినది. మరుత్తులచే నిలువ ఉంచబడినది. అట్టి ఆజ్యధారను యజమాని చూడవలెను.

    ఆజ్యమా! నిన్ను విష్ణు సమానుడగు యజమాని చూచుచున్నాడు. ఇడ పశువుల అధిదేవత. ఆమె నిన్ను గోవుల యందు నిలుపుచున్నది.

    4. పావమాన స్తోమము, గాయత్రి మార్గము, ఉపాంశు సామర్థ్యముల వలన దీర్ఘాయువు - అందుకు తగిన ఓషధులు లభించును గాత. సవితా దేవత దీర్ఘ రోగముల నుండి విముక్తి కలిగించును గాత.

    బృహద్రథంతర సామము చేతను, త్రిష్టుభ మార్గము చేతను, శుక్ర గ్రహ సామర్థ్యము చేతను సవితా దీర్ఘ రోగము నుండి విముక్తి కలిగించును గాత.

    అగ్నిని స్తుతించు గీతము చేతను, జగతి మార్గము చేతను ఆగ్రయణగ్రహ సామర్థ్యము చేతను సవితా దేవత దీర్ఘాయువును, అందుకు అవసరమగు ఓషధులను ప్రసాదించి దీర్ఘ వ్యాధి నుండి విడిపించును గాత.

    5. అగ్నీ! ఈ యజమానికి దీర్ఘాయువును, తేజస్సును కలిగించండి.

    వరుణ, సోములారా! ఇతనికి పుత్రోత్పాదకమగు రేతస్సు కలిగించండి.

    భూదేవీ! ఇతనికి తల్లివలె సుఖములను కలిగించుము.

    విశ్వేదేవతలారా! ఇతనికి అకాల జర కలుగకుండ చేయండి.

    6. అగ్ని ఆయుష్మంతుడు. ఆ అగ్ని వనస్పతులచే ఆయుష్మంతుడు. అట్టి ఆయుష్మంతుడగు అగ్ని ఆయుస్సుచే నిన్ను ఆయుష్మంతుని చేయుచున్నాను.

    సోమము ఓషధులచే ఆయుష్మంతమగును. యజ్ఞము దక్షిణలచే వర్ధిల్లును. వేదము బ్రాహ్మణుల వలన ఆయుష్మంతమగును. దేవతలు అమృతము వలన ఆయుష్మంతులు అగుదురు. పితృ దేవతలు 'స్వధయా' పిండాదులచే ఆయుష్మంతులు అగుదురు.

    వారి ఆయువుచే నిన్ను ఆయుష్మంతుని చేయుచున్నాను.

                                    పదకొండవ అనువాకము

    1. దీర్ఘ వ్యాధి పీడితుని దేహము అగ్ని యందును, బలము సోమము నందును చేరును. ఇతనిని వరుణుడు తన పాశములచే బంధించును. ఇతని వాక్కు సరస్వతిని, జీవాత్మ అగ్నా విష్ణువులందు చేరును.

    2. దీర్ఘ వ్యాధి నుండి విముక్తి కోరువాడును, పరిపూర్ణ ఆయువు కోరువాడును, అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును, సోమదేవతాకమైన చరును, వరుణ దేవ తాకమగు దశ కపాల పురోడాశమును, సరస్వతీ దేవతాకమగు చరును, అగ్ని విష్ణు దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేసి ఇష్టిని అనుష్ఠించవలెను.

    ఆ విధముగా చేయుట వలన అతడు అగ్ని నుండి దేహమును, సోమము నుండి బలమును పొందును. వరుణుని పాశము నుండి విముక్తి కలుగును. సరస్వతినుండి వాక్కు లభించును.

    అగ్నిస్సర్వా దేవతా విష్ణుర్యజ్ఞః అగ్ని సర్వదేవతలు, విష్ణువు యజ్ఞము అగుచున్నారు. వారు అతనికి దేవతలచేతను, యజ్ఞము చేతను చికిత్స చేయుదురు. అందువలన విగత జీవుడైనను నిశ్చయముగా జీవించును.

    3. నూతన రూపము పొందినందున అది నవనీతము అయినది. అట్లని ఆజ్యమును చూడవలెను. ఆజ్యమే మంత్ర స్వరూపము. మంత్రమే ఆజ్యపు మహిమను చాటుచున్నది.

    4. నీవు అశ్వినులకు ప్రాణమవు అని చెప్పబడినది. అశ్వినులే దేవతలకు వైద్యులు. వారే నీకు చికిత్స చేయుదురు.

    ఇంద్రునకు ప్రాణమవని చెప్పబడినది. అందువలన ఇంద్రుడు నీకు ఇంద్రియ శక్తిని కలిగించును.

    మిత్రావరుణులకు ప్రాణమవని చెప్పబడినది. అందువలన వారు ప్రాణాపానములను కలుగచేసెదరు.

    విశ్వేదేవతలకు ప్రాణము అగుదువని చెప్పబడినది. అందువలన వారు వీర్యశక్తిని కలిగింతురు.

    5. అమృతమార్గమగు ఘృతధారను చూడవలెనని యజుర్మంత్రము చెప్పిన దానినే గ్రహించవలెను.

    6. పవమాన స్తోమమున అనుటచే అది అతనియందు ప్రాణమును చేర్చును.

    బృహద్రథంతర స్తోమము అనుట వలన అతని యందు బలమును చేర్చును.

    అగ్నిని స్తుతించు గీతము అనుట వలన అతని యందు జీవాత్మను చేర్చును.

    (పదవ అనువాకము 4వ మంత్రపు వివరణ.)

    7. ఋత్విజులు చుట్టు కూర్చుని మంత్రమును ఉచ్ఛరింతురు. ఎంతమంది ఋత్విజులు ఉందురో అంతమంది అతనికి చికిత్సకులు అగుదురు.

    8. బ్రహ్మ చేతిని పట్టుకొని చుట్టు కూర్చున్నవారు మంత్రములు ఉచ్ఛరింతురు. ఋత్విజులందరు ఒక్కటిగనే యజమానికి ఆయుష్యము కలిగింతురు.

    9. బంగారము నుండి ఆజ్యమును సేవించవలెను. ఆయుర్వై ఘృతమగును. అమృతగం హిరణ్యం - బంగారము అమృతమగును. కావున అతడు అమృతము నుండియే ఆయువును స్వీకరించును.

    10. హిరణ్యము వంద గురిగింజలంత కావలెను. మనిషి నూరేండ్ల ఆయువు కలవాడు. నూరు ఇంద్రియములు కలవాడు. నూరు ఇంద్రియములందు స్థిరమగు ఆయువు కలవాడు.

    గడచినవి కాక ముందు ఎన్ని సంవత్సరములు జీవించనున్నాడో అన్ని గురువిందలు ప్రమాణమగును. అందువలన సమృద్ధి కలుగును.

    11. అగ్నీ! ఇతనికి దీర్ఘాయువును, బలమును ప్రసాదించుము అనుట వలన అతనికి నిశ్చయముగా ఆయుష్యము, బలము కలుగుచున్నవి. విశ్వేదేవతలారా! ఇతనికి అకాల వార్థక్యము కలిగించకండి అనుట వలన ఇతనికి నిశ్చయముగా అకాల వార్థక్యము కలుగకున్నది.

    12. అగ్నిరాయుష్మాన్ అని చేతిని పట్టుకొనవలెను. ఈ దేవతలందరు దీర్ఘాయుష్మంతులు దీర్ఘాయుష్మంతులగు దేవతలే ఇతనిని దీర్ఘాయుష్మంతుని చేయుదురు. సర్వమాయురేతి - అతడు పరిపూర్ణ ఆయుష్మంతుడు అగును.

                                      పన్నెండవ అనువాకము

    1. ప్రజాపతి వరుణునకు అశ్వమును ఇచ్చినాడు. అందువలన అతడు దేవత్వము కోల్పోయినాడు. ప్రజాపతి దీర్ఘరోగగ్రస్తుడు అయినాడు. అప్పుడు ప్రజాపతికి నాలుగు పాత్రల పురోడాశమే సాధనముగా కనిపించినది. అతడు దానిని నిర్వాపము చేసినాడు. దానితో ప్రజాపతి వరుణ పాశముల నుండి విముక్తుడు అయినాడు.

    ('ప్రాజాపత్యోవా అశ్వఇతి శ్రుతేః ప్రజాపతిరేవ పూర్వమశ్వస్య దేవతా' అని సాయణాచార్యులు. అశ్వములు ప్రజాపతి సంబంధములని శ్రుతి. పూర్వము ప్రజాపతియే అశ్వములదేవత.)

    (తాను అశ్వదేవతారూపుడు. దానిని ఇచ్చినందున దేవత్వము కోల్పోయినాడు.)

    2. అశ్వమును ఇచ్చువానిని వరుణుడు పట్టుకొనును. అతడు రోగగ్రస్తుడు అగును. అతడు ఎన్ని గుర్రములను ఇచ్చునో అన్ని చతుష్కపాల పురోడాశములను నిర్వాపము చేయవలెను. వరుణుని స్వభాగధేయమున అర్చించవలెను. అప్పుడు వరుణుడే అతనిని వరుణ పాశముల నుండి విముక్తుని చేయును.

    3. గుర్రము నాలుగు పాదములది. కావున కపాలములు నాలుగు కావలెను. అవి సమృద్ధి కలిగించును.

    4. ఒక అశ్వమును ఇచ్చుట - ఎప్పుడో ఇచ్చిన దానిని మరచుట జరిగినపుడు అదనముగా ఒక పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన వరుణ పాశ విముక్తుడు అగును.

    5. మరొక అశ్వమును ఇచ్చినపుడు సూర్యదేవతాకమగు ఏక కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన ఆదిత్యునే ఆకాశమున సంచరింపచేసినట్లగును.

    6. జలములందు అవభృధ స్నానము చేయవలెను. వరుణుడే జలము. అందువలన సాక్షాత్తు వరుణునే నిరాకరించినట్లగును.

    7. ఆపోనప్తృ దేవతాకమగు చరును అవభృధ స్థానము నుండి యజ్ఞ భూమికి తెచ్చి నిర్వాపము చేయవలెను. అశ్వము జలములందు పుట్టినది. కావున అశ్వము - ఈ నిర్వాపము వలన స్వస్థానమునకు చేరును. అది యజమానిని శాంతముగ సేవించును.

    (ఉచ్సైశ్రవసోశ్వస్య సముద్రాదుత్పత్తిః - ఉచ్చైశ్రవము సముద్రము నుండి పుట్టినదని పురాణ ప్రసిద్ధము.)  

                                    పదమూడవ అనువాకము

    1. ఇంద్రావరుణులారా! మీరు పాపవిముక్తి కలిగించు వారు. ఈ యజమానికి పాప విముక్తి కలిగించండి.   

    2. ఇంద్రావరుణులారా! మీరు సాహసవంతులు. ఇతనికి పాప విముక్తి కలిగించండి. ఇంద్రా వరుణులారా! మీరు రక్షించగలవారు. ఇతనిని పాప విముక్తుని చేయండి. ఇంద్రావరుణులారా! మీరు తేజోవంతులు. ఇతనిని పాప విముక్తుని చేయండి.

    3. ఇంద్రా వరుణులారా! యజ్ఞమునందు యజమాని మీ విషయమున అపరాధము చేసి ఉండవచ్చును. అట్టి అపరాధమును ఈ హోమమున దహించుచున్నాను.

    4. ఇంద్రా వరుణులారా! ద్విపాత్తులందు, చతుష్పాత్తులందు, గోశాలలందు, గృహము లందు, జలములందు, ఓషధులందు, వనస్పతులందు మీకు సంబంధించి చేసిన పాపముల నన్నింటిని ఈ కర్మముచే నాశము చేయుచున్నాను.

    5. ఇంద్రుడైనను పాపము చేసినచో అతని ఇంద్రియ బలము తొలగి పోవును. వరుణుడు అతనిని తన పాశములచే బంధించును.

    పాపగ్రస్తుడగు వాడు ఇంద్రవరుణదేవతాకమగు పాలవిరుగుడు - అమిక్షను - నిర్వాపము చేయవలెను. అప్పుడు ఇంద్రుడే అతనికి ఇంద్రియ బలము కలిగించును. వరుణుడే అతనిని తన పాశముల నుండి విముక్తి కలిగించును.

    6. పాల విరుగుడు నందు పాలు ఆక్రమించును. అట్లే యజమానిని పాపములు ఆక్రమించును. కావున పాలవిరుగుడు హవిస్సుగా అర్పించినందున పాలే యజమానికి పుణ్యము కలిగించును.

    7. పాల విరుగుడు పురోడాశము కావలెను. అది యజమానికి బలము కలిగించును. గృహాదులు కలవానిని చేయును.

    8. హవిస్సును నాలుగు భాగములు చేయవలెను. అందువలన యజమానికి నాలుగు దిశలందు ప్రతిష్ఠ కలుగుచున్నది.

    9. విభజించిన హవిస్సును తిరిగి కలుపవలెను. అట్లగుటచే దిక్కులే అతనికి చికిత్స చేయును.

    10. పురోడాశ - అమిక్షలను కలిపి అవదానము చేయవలెను. అది శత్రువు విడిచిన బాణము గుచ్చుకున్న దేహము నుండి పెరికి వేయుట వంటిడగును.

    11. ఇంద్రావరుణులారా! యజ్ఞమునందు మీకు సంబంధించి చేసిన అపరాధమును ఈ హోమముచే నాశనము చేయుచున్నాను అనవలెను. అప్పుడు యజమాని అపరాధము దూరమగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.