Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    33. నీవు ఉపయామము ద్వారా గ్రహించబడినావు. నిన్ను అశ్వినులు - సరస్వతి - సుత్రాత ఇంద్రుని కొరకు అందుకొనుచున్నాను. గ్రహమా! ఇది నీస్థానమగును. నేను నిన్ను అశ్వినులు సరస్వతి - సుత్రాతి ఇంద్రుని కొరకు ఇచట స్థాపించుచున్నాను.

    34. (ఋత్విజః ప్రాణభక్షం భక్షయంతి)

    గ్రహమా! నీవు నాప్రాణపాలకుడవు. నా అపానపాలకుడవు. నేత్ర పాలకుడవు. నా కర్ణపాలకుడవు. నీవు నావాణికి భేషజమవు. నా వాక్కును అనృతము నుండి మార్చి సత్కర్మలు చేయించుదానవు. నీవు నామనసునకు సత్ప్రేరకమవు.

    35. అశ్వినులు, సరస్వతి, సూత్రాత ఇంద్రునిచే దర్శించబడి ఋత్విజులచే ఉహూతమగు నిన్ను నేను భక్షించుచున్నాను.

    36. ఇంద్రుడు అపూర్వ కర్మలు చేయువాడు. సోమపానమున వర్ధిల్లువాడు. ఉషఎగిసి ఉడిగినపుడు, తూర్పున మహాజ్యోతి దర్శనము ఇచ్చినపుడు ఇంద్రుడు మేల్కొన్నాడు. ముప్పది ముగ్గురు దేవతల సహితుడై వజ్రబహువగు ఇంద్రుడు వృత్రుని వధించినాడు. నదుల ద్వారములు తెరచినాడు.

    37. యజమాని ఋత్విజులచే ప్రశంసింపబడువాడు. శూరుడు. పుత్రాదులచే వంశము నిలపెట్టువాడు. పశువపాయుక్తుడు ఆవుపాలు, తేనె హవిస్సులందు కలుపువాడు. స్వర్ణఖండములు దక్షిణగా ఇచ్చి ఆనందింప చేయువాడు. విశాలహృదయుడు. అతడు ఇంద్రుని యజించును.

    38. ఇంద్రుడు ఋత్విజులచే స్తుతించబడువాడు. సుఖప్రదుడు. అతడు వసువులతోను ఆదిత్యులతోను విచ్చేసినాడు. దర్భాసమున ఆసీనుడు అయినాడు. వేదిపూర్వభాగమున స్థిరపడినాడు.

    40. యజ్ఞద్వారములారా! ధ్వనిచేయండి. ఉరకండి. ముత్తైదువుల వలె ముందుకు సాగండి. ఇంద్రునకు స్వాగతము పలకండి. మీరు వీర రుతుయుక్తలు. ఉత్సవములందు విస్తృతినొందువారు. వీరుడగు ఇంద్రుని కొరకు పూర్తిగా తెరుచుకొనండి.

    41. ఉషారాత్రులు మహత్తులు. తుహినయుతలు. ఫలప్రదాతలు. సుందర కిరణవంతలు. విశాల కాలతంతువును నలుపు, తెలుపురంగులతో నేయువారు. వారు శూరుడు దేవదేవుడగు ఇంద్రుని యజింతురు.

    42. దేవహొతలు యజ్ఞము చేయువారు మానవ హొతలకన్న ప్రథములు, ప్రధానభూతులు. ఇంద్రుని యజ్ఞపు ప్రధాన అంగమున స్థాపించువారు. సురుచిర వాక్కుగలవారు. వారు అగ్ని వాయువులకు పూర్వదిశయందున్న ఆహవనీయ జ్యోతిని మధుఘృతధారల హవిస్సుచే అర్చింతురు.

    43. హవివలన వర్ధిల్లువాడు ఇంద్రుడు. అతనిని సాధ్వులగు పత్నుల వలె సేవించువారు సర్వగమనలగు ఇడ, సరస్వతి, భారతి. ఆముగ్గురు దేవేరులు యజ్ఞతంతువును అవిచ్ఛిన్నము చేయుదురు గాత.

    44. చతురుడు, యశస్వి, ఇంద్రునకు బలము కలిగించువాడు, సర్వత్రగామి, వర్షకుడు, వర్షక ఇంద్రుని పూజించువాడు, బలవంతుడునగు త్వష్ట యజ్ఞమునకు శిరస్థానమగు ఆహవనీయమున దేవతలను యజించును గాత.

    45. యూపము - కసాయివలె - తనకు కట్టిన పశువులను దేవతలకు అర్పించును. అది యజ్ఞపశువుచే ఇంద్రుని కడుపు నింపును. అట్లే మధురఘృతమున యజ్ఞమును సుస్వాదువొనరించును.

    46. వృషాయమానుడు, వర్షణశూరుడు, శత్రుపీడకుడగు ఇంద్రుడు వపాబిందురూప సోమపానము చేసి ప్రసన్నుడగును గాత. ఘృతబిందు మాత్రమున ప్రసన్నచిత్తులగు వారును, అమరులను అగు దేవతలు సహితము వపాసోమమున ఆనందమున తేలియాడుదురు గాత.

    47. మమ్ము రక్షించుటకు ఇంద్రుడు ఇచటికి విచ్చేయును గాత. మాప్రశంసలు అందుకొను శూరఇంద్రుడు మాతో కలసి సోమపానము చేయును గాత. ఇంద్రుని పూర్వకర్మములు ద్యులోకము వలె స్తవనీయములు. అట్లు ఇంద్రుడు మమ్ము రక్షించుటకు దూరఅంతరిక్షము నుండి గాని సమీప పృథ్వినుండి గాని మావద్దకు రావలెను.

    48. ఇంద్రుడు అభీష్టప్రదుడు. ఉగ్రుడు. మానవపాలకుడు. వజ్రబాహువు. యుద్ధమందు శత్రువును సత్వరమే నష్టపరచువాడు. అట్టి ఇంద్రుడు మమ్ము రక్షించుటకు దూరఅంతరిక్షము నుండి గాని సమీప పృథ్వినుండి గాని మావద్దకు రావలెను.

    49. మమ్ము రక్షించుటకును హవిస్సులు అందుకొనుటకును, ఇంద్రుడు మాకు అభిముఖుడై త్వరత్వరగా విచ్చేయవలెను. ఇది అన్నప్రాప్తి కొరకగు యుద్ధము. వజ్రధారి, ధనవంతుడు, మహామహుడగు ఇంద్రుడు ఇచట ఉండవలెను. దీనిని రక్షించవలెను.

    50. రక్షక ఇంద్రుని యుద్ధములకు ఆహ్వానించబడు ఇంద్రుని శూరఇంద్రుని పురుహొత ఇంద్రుని ఆహ్వానించుచున్నాను. అతడు మాకు శుభములు కలిగించవలెను.

    51. ఇంద్రుడు సురక్షకుడు. సర్వజ్ఞుడు. సంపన్నుడు. రక్షించువాడు. అతడు మాకు సుఖములు కలిగించవలెను. అతడు ద్వేషులను వధించవలెను. మాకు నిర్భయత కలిగించవలెను. అతని దయచే మేము  బలశాలురము కావలెను.

    52. మేము ఇంద్రుని సద్బుద్ధియందును ప్రసన్నమనమునందును ఉండవలెను. సురక్షక, ధనశాలియగు ఇంద్రుడు మా శత్రువులను వేరుచేసి నష్టపరచవలెను.

    53. ఇంద్రా! మయూర రోమముల మందగమనల హర్యశ్వములపై మాయజ్ఞమునకు విచ్చేయుము. మార్గమున దుష్టరాక్షసాదులు వేటకాడు పక్షిని పట్టినట్లు నిన్ను పట్ట కుండును గాత. వర్తకుడు త్వరత్వరగా ఎడారిని దాటి మంచి స్థలమునకు చేరినట్లు నీవు ఆటంకములను అధిగమించి మా యజ్ఞమును విచ్చేయుము.

    54. వసిష్ఠగోత్రజులగు ఋషులు వర్షక, వజ్రబహు ఇంద్రుని మంత్రములచే సంస్తుతింతురు. ఇంద్రుడు మా స్తుతులను అందుకుని వీరపుత్ర యుక్త, గోయుక్త ధనమును ప్రసాదించవలెను. అతడు మమ్ము  ఎల్లవేళల శుభములిచ్చి పాలించును గాత.

    55. అశ్వినులారా! అగ్ని ప్రజ్వలితుడైనాడు. మహావీరఘటము కాలి సిద్ధమైనది. సోమరసము అభిషుతమైనది. ఇచట - ఈ యజ్ఞమునందున్న - సరస్వతి శుద్ధము, ఇంద్రునకు బలకారకమగు ఆవుపాలు పితుకుచున్నది.

    56. ఆరోగ్య రక్షకులును, వైద్యులగు అశ్వినులిద్దరు మరియు సరస్వతి సోమము అభిషుతమైనంత జగములను మధువుచే పూరింతురు. వారు యజ్ఞమార్గమున ఇంద్రునకు బలము కలిగింతురు.

    57. ఋత్విజులచే ప్రశంసనీయమైన యజ్ఞము ద్వారా సరస్వతి ఇంద్రునకు అభిషుతసోమము, సురాభాండము అందించినది. సోమము అభిషుతమైనంత వైద్యులగు అశ్వినులు ఇంద్రునకు మధురసరూపమును ప్రదానము చేసినారు.

    58. ఇంద్రుని ఆహ్వానించునట్టి సరస్వతి ఇంద్రునకు నేత్రాది అవయవములను అందించినది.అశ్వినులు పశువుల అన్నము, ఓజస్సు ధనము ప్రదానము చేసినారు.

    59. అశ్వినులు - ఇంద్రుని కొరకు - నముచి రక్తమును శుద్ధముచేసి, సోమరసమును అభిషుతము చేసినారు. సరస్వతి ఇంద్రుని దర్భాసనము మీద కూర్చుండ పెట్టినది. సోమరసమందు చిలికిన సురను చేర్చి ఇంద్రునకు - పానమునకు - అందించినది.

    (ఒకసారి నముచి ఇంద్రునితో కలిసి సోమము సేవించినాడు. అప్పుడు అతని రక్తము సోమమైనది. ఇంద్రుడు నముచిని వధించినాడు. అతని రక్తము పారినది. అశ్వినులు దానిని శుద్ధము చేసి సోమమును చేసినారని వృత్తాంతము)

    60. శబ్దము, అవకాశముతో కూడిన ద్వారము. దిశలు, అశ్వినులు, సరస్వతి, ఇంద్రుడు ద్యావాపృథ్యుల నుండి సకల మనోరథములను పితికినారు.

    61. జ్ఞానియు, సుస్వరూపియునగు సరస్వతి సహితముగా ఉషోరాత్రులు, రాత్రింబవళ్లు, ఇంద్రునకు ఇంద్రియ బలము కలిగించుచుందురు.

    62. అశ్వినులారా! మీరు మమ్ము పగళ్లందు రక్షించండి. సరస్వతీ! నీవు మమ్ము రాత్రులందు రక్షింపుము. అభిషుత సోమరసపాన నిమగ్న ఇంద్రుని దైవీహొతయు, అశ్వినూలును రక్షింతురు గాత.

    63. అశ్వినులారా! మధ్యస్థానపు సరస్వతి - ద్యుస్థానపు భారతి - పృథివీస్థానపు ఇడయను ముగ్గురు దేవేరులు చిలికిన సురసహిత సోమమున ఇంద్రునకు అందించినారు.

    64. సోమరసము అభిషుతమైనది. అప్పుడు అశ్వినులు, సరస్వతి, త్వష్ట అందు ఓషధులు, మధురూపభేషజము, యశస్సు, మున్నగునవి కలిపినారు. ఇంద్రునకు అందించినారు.

    65. ప్రశంస్యమాన మనస్పతులు ఇంద్రునికొరకు అప్పుడప్పుడు వడకట్టిన సోమము మరియు మధువును సిద్ధము చేయును. అశ్వినులకు, ధేనుభూతయగు సరస్వతి తోడై మధుర దుగ్ధములను ఇంద్రునకు అందించును.

    66. అశ్వినులారా! గోవు మున్నగు పశువులను 'మాసరము'ను జల్లించిన సురను అభిషుత సోమమును ఇంద్రునకు సమర్పించండి. వనస్పతులారా! మీరు సహితము సరస్వతి సహితులై ఇంద్రునకు సోమరసము సమర్పించండి.

    67. అశ్వినులును సరసత్వియు తమ బుద్ధి బలమున నముచి శరీరము నుండి ఇంద్రుని కొరకు ఇంద్రియ బలము, పరిశుద్ధ సోమరసము, మహాధనమును తీసినారు.

    68. అశ్వినులు, సరస్వతి ఇంద్రునకు హవిఅందించి అభివృద్ధిని చేసినారు. ఇంద్రుడు నముచిని వధించినాడు. నముచి తోటివాడగు ధనిక బలధైత్యుని ఇంద్రుడు వధించినాడు.

    69. పశువులు, అశ్వినులు, సరస్వతి యజ్ఞములందు హవి అందించి ఇంద్రునకు బలము కలిగింతురు. ఇంద్రుని స్తుతింతురు.

    70. సవిత, వరుణుడు, భగుడు, ఇంద్రునకు ఇంద్రియ బలము కలిగించినారు. ఇంద్రుడు చక్కని రక్షకుడు, హవిస్సులకు స్వామి. అతడు యజమానికి కోరిన వరములనీయవలెను. యజమానితో చేరవలెను.

    71. సురక్షణల ఇంద్రుడు నముచి నుండి గుంజుకోని వచ్చిన బలధనాదులను హవి ప్రదాత యగు యజమానికి. సవిత మరియు వరుణుడు ప్రదానము చేయవలెను.

    72. యజమాని కొరకు వరుణుడు క్షాత్రబలమును, సవిత సంపదలను, సురక్షణ గల ఇంద్రుడు యశముతోటి బలమును - అందించుచు యజ్ఞమునకు విచ్చేయుదురు.

    73. అశ్వినులును, సరస్వతియు గోవుల  వలన ఇంద్రియ బలమును, అశ్వముల వలన వీర్య బలమును హవి వలన ఇంద్రుని, యజమానిని వర్ధిల్లచేసినారు.

    74. సుస్వరూపులు, సువర్ణ మార్గవర్తనులు, నరాకారులగు అశ్వినులు హవియుక్త సరస్వతి ఇంద్రుడును యజమానికి ఇంద్రియ బలము ప్రసాదింతురు గాత.

    75. సుకర్మనులును, సరస్వతియు నముచిలో ఉన్న సురను పానము చేయుచు - యజ్ఞాది కర్మ రక్షకుడును, వ్యాపకుడును అగు ఇంద్రుని రక్షించవలెను.

    76. అశ్వినులును, సరస్వతియు నముచిలో ఉన్న సురను పానము చేయుచు - యజ్ఞాది కర్మ రక్షకుడును, వ్యాపకుడును అగు ఇంద్రుని రక్షించవలెను.

    77. ఇంద్రా! మాతాపితృలు బిడ్డలను రక్షించినరీతి - స్వకర్మ కౌశలమున అశ్వినులు నిన్ను రక్షించినారు. అంతియకాదు సరస్వతియు సరస్వతియు నిన్ను సేవించినది. నీవో సురమణీయ సోమరసమును స్వశక్తిచే పానము చేసినవాడవు!

    78. అగ్ని యందు అశ్వములున్నవి. గోవులున్నావి. వృషభములున్నవి. మేషములున్నవి. ఆహ్వానములు ఉన్నవి. అగ్ని అన్నరసపాయి. సోమహుతివంతుడు. బుద్ధి ప్రదాత. ఉత్పాదకుడు. అట్టి అగ్నికి బుద్ధియందు నిలుపండి. హృదయమున శుద్ధి చేయండి.

    79. శుద్ధి ఘృతము వలెను చర్మము పై  సోమము వలెను అగ్నీ! ణీ జ్వాలా ముఖములందు హవిని ఆహుతి చేసినాము. నీవు ప్రసన్నుడవగుము. మాకు అన్నము, వీరపుత్రులను, గో, అశ్వ ధనమును, మహాకీర్తిని ప్రసాదించుము.

    80. అశ్వినులు వెలుగు తోటి నేత్రములను, సరస్వతి ప్రాణము తోటి వీర్యమును, ఇంద్రుడు బలముతోటి ఇంద్రియ బలమును యజమానికి ప్రసాదించినారు.

    81. నాసత్య అశ్వినులారా! రుద్రమార్గమున రాకపోకలు సాగించువారలారా! మీరు గో, అశ్వయుక్త ధనసహితులై ఈ యజ్ఞమునకు విచ్చేయండి.

    82. అశ్వినులారా! ఆ ధనము అన్యులకు అందనట్టిదియు శత్రువుల చేతికి చిక్కనట్టిదియు కావలెను.

    83. బుద్ధిమాన్ అశ్వినులారా! బంగరు రంగుదియు, ధనమిచ్చునట్టిదియునగు అశ్వ, గోధనమును మాకు తెచ్చి ఇవ్వండి.

    84. పవిత్ర కర్మలు కలదియు అన్నములు గల అన్నవతియు, బుద్ధి యందు ధనమును దాల్చునట్టి సరస్వతి మా యజ్ఞమును ఆశించవలెను.

    85. సూనృతములకు ప్రేరణ కలిగించునదియు - సుబుద్ధిని చైతన్యవంతము చేయునట్టి సరస్వతి మా యజ్ఞమును భరించును గాత.

     86. సరస్వతి తాన్ జ్ఞానమున మహాబలమును వెల్లడించును. సమస్త ప్రాణులందున్న బుద్ధిని ప్రదీప్తము చేయును.

    87. విచిత్ర దీప్తుల ఇంద్రా! నిన్ను నిత్యము ఆశించు సోమరసము అభిషుతమైనది - అంగుళులు, దశా పవిత్రమున పవిత్రమైనవి. నీవు త్వరత్వరగా ఈ యజ్ఞమునకు రావలసినది.

    88. ఇంద్రా! నీవు కర్మాభిప్రేతవు. స్తోత్రముల ప్రేరణ గల వాడవు. సోమాభిలాషిని. స్తోత్రాభిలాషివి. నీవు త్వరత్వరగా ఈ యజ్ఞమునకు రావలసినది.

    89. హర్యశ్వఇంద్రా! అతి శీఘ్రముగా హవిరన్నముల కొరకు యజ్ఞమునకు విచ్చేయుము. సోమరసము అభిషుతమైనంత మా సోమరసమును ణీ పొట్టలో పోసుకొనుము.

    90. అశ్వినా పిబతాం మధు సరస్వత్యా సజోషసా|
    ఇంద్రః సుత్రామా వృత్రహా జుషన్తాం సోమ్యాంమధు||

    అశ్వినులారా! సరస్వతి అభిమానముగల మీరు సోమరస పానము చేయండి. సుత్రాత, వృహ్రహంత ఇంద్రుడు సహితము సోమరసమును సేవించును గాత.

    విద్వాంసుడు, బహుభాషా వేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాల సాహిత్య రచయిత, విమర్శకుడు, చలన చిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, కార్మికోద్యమ కార్యకర్త, స్వాతంత్ర్యం సమరయోధుడు, ప్రగతి పథగామి, ప్రపన్నుడగు, దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర శుక్ల యుజుర్వేద సంహిత యందలి సేకాద్యాసందీహౌత్రాంతమగు ఇరువదవ అధ్యాయము ముగిసినది.

   
                                                     సర్వేభవస్తు సుఖినః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.