Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    22. ఆ అశ్వపు పది ప్రతినిధి అశ్వములు నన్ను వహించును. ఇట్లే అశ్వములు తుగ్రపుత్రుడు భుజ్యుని వహించినవి.

    23. పాకస్థాముడు తండ్రికి తగిన పుత్రుడు. అతడు నివాసదాత. స్పష్టరూపమున బలములనిచ్చువాడు. అతడు శత్రుహింసకుడు. రిపు భోజనుడు.

    పాకస్థాముడు మాకు లోహిత అశ్వములను ఇచ్చినాడు. నేను అతనిని స్తుతింతును.


                                  నాలుగవ సూక్తము

  ఋషి - కణ్వగోత్ర దేవాతిథి, దేవత - ఇంద్ర - పూషలు, ఛందస్సు - బృహతి ఉష్ణిక్

    1. ఇంద్రా ! నిన్ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నాలుగు దిక్కులందుండువారు ఆహ్వానింతురు. అయినను ఆమక్, రాజు పుత్రుని కొఱకు స్తోతలు నిన్ను పిలిచినపుడు ప్రేరణపొందుదువు. తుర్జశుని కొఱకు స్తోతలు పిలిచినపుడు పలికెదవు.

    2. ఇంద్రా ! నీవు రుమ, రుమశ, శ్యావక, కృపనామక రాజులతో మత్తుడవగుదువు. అయినను స్తోత్రవాహక కణ్వులు నీకు స్తోత్రములు అందింతురు. రమ్ము. రారమ్ము.

    3. గౌర మృగము దప్పిగొన్నపుడు గడ్డిలేని నీరున్న చోటికి చేరదలచును. అట్లే ఇంద్రా ! మైత్రి కలుగగా వెంటనే మా వద్దకు విచ్చేయుము. మేము కణ్వపుత్రులము. మాతో కలిసి సోమపానము చేయుము.

    4. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. సోమపానము చేసినావు. ఇది నిన్ను అభిషవకర్తకు ధనము ఇచ్చుటకు ఉన్మత్తుని చేయవలెను. ఈ సోమము అభిషవ ఫలకమున అభిషుతమైనది. ఆతి ప్రశంశనీయము. దీనివల్లనేనీవు ఇంత బలము కలిగినావు.

    5. ఇంద్రుడు తన వీరకృత్యములతో శత్రువులను అణచినాడు. తన బలమున ఇతరుల క్రోధమును నష్టపరచినాడు. సకల శత్రువులను చెట్లనువలె నరికినాడు.

    6. ఇంద్రా ! నిన్ను స్తుతించిన వారికి సహస్రసంఖ్యాక వజ్రమంతటి బలము కలుగును. నీకు నమస్కరించి హవ్యము సమర్పించువాడు శోభన శూరుడుగను. శత్రుఘాతక పుత్రుని పొందును.

    7. ఇంద్రా ! నీవు ఉగ్రుడవు. మాకు నీ మైత్రి లభించినది. ఇక మాకు భయములేదు. అలసటలేదు. నీకు అభీష్ట వర్షకుడవు. నీ మహాకార్యములను వెల్లడించవలసి ఉన్నది. మేము తుర్వశుని, యదువును చూచినాము.

    8. ఇంద్రుడు కోరికలు తీర్చువాడు. అతడు తన ఎడమ రొంటిన సకల ప్రాణులను కప్పి ఉంచినాడు. హవిర్దాత ఇంద్రునకు కోపము కలిగించడు. ఇది జుంటి తేనె కలిసినది.  హర్షము కలిగించు సోమము ఇంద్రా ! దాని ముందుకు చేరుము. స్వీకరించుము.

    9. ఇంద్రా ! నీకు మిత్రుడయినవాడు అశ్వవంతుడు, రథవంతుడు, రూపవంతుడు, గోవులు కలవాడగును. అతనికి త్వరత్వరగా ధనము లభించును. అతడు ఆహ్లాదకారియై సభలకు వెళ్లును.

    10. రుశ్యనామక మృగమువలె పాత్రలో ఉన్న సోమము ముందునకు రమ్ము. ఇచ్చవచ్చినంత త్రావుము. నీవు నిత్యము నిన్ను ముఖ వర్షము కురిపింతువు. తేజస్వివి, బలవంతుడవు అగుము.

    11. అధ్వర్యు ! ఇంద్రుడు సోమపానము చేయగోరుచున్నాడు. సోమము అభిషవింపుము. రెండు తరుణాశ్వములు కట్టబడినవి. అదిగో ! వృత్రహంత వచ్చినాడు !!

    12. ఇంద్రా ! నీవు ఎవని సోమమున సంతుష్టుడవైనావో, ఆ విషయమున ఆ హవ్యదాత ఎరుంగును. నీకు తగిన సోమపాత్ర నిండియున్నది. రమ్ము. దానివద్దకు చేరుము. పానము చేయుము.

    13. సోమాభిషవమునకు చర్మము పరచబడినది. రాతిమీద రాయి ఉంచబడినది. యజమాని పక్షమున యజ్ఞనిష్పాదక సోమము అభిషవించబడి నలుదిశల శుభములనందుచున్నది.

    అధ్వర్యులారా ! ఇంద్రుని రథము వచ్చినది. ఇంద్రుడు దానిపై ఉన్నాడు. అతనికి ఆ సోమము అందించండి.

    14. హర్యశ్వములు అంతరిక్షమున సంచరించునవి. సేచన సమర్థములు. అవి ఇంద్రుని మాకర్మువద్దకు తేవలెను. ఇంద్రా ! యజ్ఞ సేవి, గతిశీలములగు నీ అశ్వములు సవనముల వద్దకు చేర్చవలెను.

    15. పూష బహుధనవంతుడు. మేము అతని మైత్రికోరిక అతనిని వరించినాము. పూషను అనేకులు ఆహ్వానింతురు. అతడు పాపవిమోచాకుడు. అతడు తన బుద్ధితో మాకు ధనప్రాప్తి కలిగించవలెను. మమ్ము శత్రువినాశక సమర్థులను చేయవలెను.

    16. మా బుద్ధికి మంగలి కత్తివంటి పదను కలిగించుము. పాపవిమోచకా ! మాకు ధనము నిమ్ము. నీ గోధనము మాకు సులభ సాద్యము కావలెను. నీవు మానవులకు ఇటువంటి ధనము నంపుచుందుము.

    17. పూషా ! నిన్ను అలంకరించవలెనను కోరిక కలిగినది. నిన్ను స్తుతించవలెనను కోరిక కలిగినది. నాకు ఇతర దేవతలను స్తుతించు కోరికలేదు. వారు సుఖములను ఇవ్వగల వారుకారు. స్తోతయు, సామమంత్రయుక్త పజ్రునకు కోరిన ధనము ప్రసాదించుము.

    18. పూషా ! నీవు అమరుడవు. దీప్తిమంతుడవు. మా గోవులు మేయుటకు తరలును. అట్టి మా గోధనమును నిత్యము చేయుము. నీవు మాకు రక్షకుడవు. మంగళ ప్రదుడవు. అన్నదానమునకు ఉదారుడవగుము.

    19. కరంగనామక రాజు దీప్తుడు. సౌభాగ్యవంతుడు. అతడు స్వర్గప్రాప్తి కొఱకు యజ్ఞము చేసినాడు. మానవులకు ధనము దానము చేసినాడు. అతడు మాకు వంద అశ్వములతో కూడిన ధనము దానము చేసినాడు.

    20. కణ్వపుత్రుడు, హవింతుడు మేధాతిథి - ఇంకను అతని అనేకమంది స్తోతలు కీర్తించినట్టివియు, ప్రియమేధనామక ఋషులచే సేవితమైనట్టియు, అతి పవిత్రమైనట్టియు అరువది వేల గోవులను నేను చివరన పొందినాను.

    21. నాకు ధనము లభించినంత ఇతనికి ప్రశంసనీయ గోధనము, అశ్వధనము లభించినదని, వృక్షములు సహితము హర్షధ్వనులు చేసినవి.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలము అయిదవ అష్టకమున ఏడవ అధ్యాయము సమాప్తము)

       
                                     శ్రీః

            ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి.
            నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతావి నమే తస్థివాంసః


                ఎనిమిదవ అధ్యాయము             అయిదవ సూక్తము

                ఋషి - కణ్వగోత్రజ బ్రహ్మాతిథి దేవత - అశ్వినులు. ఛందస్సు -
                  తొలి 36 గాయత్రి, 37,38 బృహతి, 39 అనుష్టుప్.

        ఓమ్ దూరాదిహే వయత్సత్యరుణాప్సురశశ్వితత్ విభామం విశ్వధాతమమ్.

    1. ఉష దూరమునుండియే దగ్గర విరాజిల్లి దర్శనమిచ్చునది దీప్తరూప. ఆమె సకలపదార్థములను శ్వేతవర్ణము చేసినపుడు దీప్తిని అనేక ప్రకారములు విస్తరించును.

    2. అశ్వినులారా ! మీరు దర్శనీయులు. నేతలతో సమానులు. మీరు కోరగనే గుఱ్ఱములు రథమున తగులును. ఆ రథము అన్నయుక్తము. మీరు ఆ రథమును ఉషస్సును కలపండి.

    3. అశ్వినులారా ! మీరు అన్నయుక్తులు. ధనసంపన్నులు. మీ కొఱకు చేసిన స్తోత్రములను చూడండి. దూతస్వామి వచనమునకు ప్రార్థించును. అట్లే మీ మాట కొఱకు ప్రార్థింతుము.

    4. అశ్విద్వయమా ! మీరు ప్రియులు. ఆనంద దాతలు. బహుధనవంతులు. మేము కణ్వగోత్రజులము. మా రక్షణ కోరి ఉన్నాము. మిమ్ము అందుకు ప్రార్థించుచున్నాము.

    5. మీరు పూజ్యులు. అందరిని మించిన అన్నదాతలు. శోభన ధనములకు స్వాములు. మంగళ ప్రదుడగు హవ్యదాత గృహములకు వెళ్లుచుందురు.

    6. దేవతావంతుడగు హవ్యదాతకు ఉత్తమ యజ్ఞయుక్తము, అవినాశ్యమగు గోచరభూమి సేద్యమునకు నీరు ఇవ్వండి.

    7. అశ్విద్వయమా ! అశ్వములమీద ఎక్కండి. అతి వేగముగా సాగండి. మా స్తోత్రముల వైపునకు రండి. ఈ అశ్వముల వేగము ప్రశంసనీయము.

    8. అశ్వినులారా ! మూడు పగళ్లు, మూడు రాత్రులు అశ్వముల సాయమున దూర యానము చేయండి.

    9. మీరు ప్రభాతమున స్తుతియోగ్యులు. మాకు గోయుక్త అన్నము, అనుభవించదగిన ధనము ఇవ్వండి. వాటిని అనుభవించు మార్గము చూపండి.

    10. అశ్విద్వయమా ! మా కొఱకు గోవులు, పుత్రులు, సుందర రథము, పుత్రులతో కూడిన ధనము తెండి.

    11. మీరు శోభన పదార్థములకు స్వాములు. దర్శనీయులు. హిరణ్మయులు. మార్గయుక్తులు. అశ్వినులారా ! ప్రవృద్దులుకండి. సోమమయ మధుపానము చేయండి.

    12. అశ్వినులారా ! మీరు అన్నయుక్తులు. ధనయుక్తులు. మేము ధనికులము మాకు నలువైపుల విస్తరించిన అహింసనీయ గృహమును ప్రసాదించండి.

    13. మీరు మానవ స్తోతను రక్షించండి. రండి. త్వరగరండి. ఇతరుల వద్దకు వెళ్లవద్దు.

    14. అశ్విద్వయమా ! మీరు స్తుతియోగ్యులు, మేము అందించు సోమ భాగమును సేవించండి. అది మదకము, మనోహరము మధురము.

    15. మాకొఱకు వందలది, వేలది అనేక నివాసయుక్తము అందరిని భరించగలగు ధనమును తెండి.

    16. నేతృద్వయమా ! మనీషులు మిమ్ము అనేక దేశములకు ఆహ్వానింతురు. స్వారిచేయు అశ్వములమీద విచ్చేయండి.

    17. హవ్యసంపన్నులు, తగినంతపని చేయు మానవులు కుశలను బాదుచు మిమ్ము ఆహ్వానింతురు.

    18. అశ్విద్వయమా ! ఇది మా స్తోత్రము. అందరిని మించి మిమ్మే వహించవలెను. మాకు దగ్గరకావలెను.

    19. అశ్వినీ ద్వయమా ! మధుపూర్ణ చర్మ పాత్ర మధ్యన ఉన్నది. అందలి మధువును పానము చేయండి.

    20. అశ్వినులారా ! మీరు అన్నయుక్తులు. ధనవంతులు. మా పశు, పుత్ర, గోవులకొరకు ఆ రథమున అన్నము తెండి. అనాయాసమున తెండి.

    21. అశ్వినులారా ! మీరు ప్రభాతమున ఎరుగదగినవారు. స్వర్గీయ వాంఛనీయ జలములను మా ద్వారము వరకు తెండు.

    (నదుల ద్వారానో, కాలువల ద్వారానో తెమ్మనుట)

    22. నేతలగు అశ్వినులారా ! తుగ్రపుత్రుడు భుజ్యుడు సముద్రమున తోయబడినాడు. అతడు ఎప్పుడు మిమ్ము స్తుతించి సేవించినాడు? మీ రథము అశ్వములకూడి ఎప్పుడు పోయినది?

    23. నాసత్యద్వయమా ! అసురులు కణ్వుని మేడకింద కట్టి పెట్టినారు. మీరు అప్పుడు అతనికి నానావిధ రక్షణలు కలిగించినారు.

    (నా సత్యులు ఎన్నడు అబద్దమాడనివారు. అశ్వినులు వైద్యులు, వైద్యులు అబద్దమాడరాదని సూచన)

    అసురులు కణ్వుని కనులు పెరికినారు. అశ్వినులు మరల కనులు కలిగించినారని వృత్తాతము.

    24. అశ్వినులారా ! మీరు వర్ష పరాయణులు ధనయుక్తులు. నేను పిలిచినపుడెల్ల అభినవములు, ప్రశస్తములగు రక్షణలతో విచ్చేయండి.

    25. అశ్విద్వయమా ! మీరు కణ్వుని, ప్రియమేధను, ఉపస్తుతిని, స్తోత అత్రిని రక్షించినారు. అట్లే మమ్ము రక్షించండి.

    26. ధనముల కొఱకు అంశుని, గోవుల కొరకు అగస్త్యుని, అన్నము కొరకు సౌభారుని రక్షించినారు. అట్లే మమ్ము రక్షించండి.

    27. అశ్విద్వయమా ! మీరు వర్షకారులు. ధనసంపన్నులు. మిమ్ము స్తుతించు మేము ఇంత. ఇంతకన్న ఎక్కువ ధనము యాచింతుము.

    28. అశ్వినులారా ! సువర్ణ నిర్మితము. సారథిస్థానముగలది, బంగారు కళ్లెముగల రథమున ఆసీనులు కండి.

    29. అశ్వినులారా ! మీరథపు దండము బంగారపుది. ఇరుసు బంగారపుది. రెండు చక్రములు బంగారపువి.

    30. అన్నము, ధనముగల అశ్వినులారా ! ఈ రథమున ఎంత దూరము నుంచి అయినను రండి. మా శోభన స్తుతుల వద్దకు విచ్చేయండి.

    31. అమర అశ్వినులారా ! అసురుల పురములు భగ్నము చేయుచు మీరు దూరదేశము నుండి అన్నములు తెండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.