Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అగ్నిదేవుడు నిషధునకు ఇచ్చిన వరమును అనుసరించి సహదేవుని సేనలను చుట్టుముట్టినాడు. సహదేవుడు అగ్నిదేవుని స్తుతించినాడు. ధర్మరాజు చేయనున్న రాజసూయమును గురించి విన్నవించినాడు. ధర్మకార్యమునకు విఘ్నములు కలిగించవద్దని ప్రార్ధించినాడు. అగ్నిదేవుడు ప్రసన్నుడు అయినాడు. అగ్నిభయము పోగొట్టినాడు. మాహిష్మతి రాజు నీలుడు అది విన్నాడు. సహదేవుని వద్దకు వచ్చినాడు. ధనరాశులు ఇచ్చి సాగనంపినాడు. సహదేవుడు అచట నుండి బయలుదేరినాడు. రుక్మి, భీష్మక, శూర్పక, అనేక పాద, కాకముఖ, కర్ణప్రావరక, రాక్షస యోధులను వశపరచుకున్నాడు. పాండ్య, కేరళ, కళింగ , ద్రవిడ, యవన, కర, హాటక, మున్నగు దక్షిణరాజులను జయించినాడు. లంకయందలి విభీషణునకు వర్తమానము పంపినాడు. విభీషణుడు రాజసూయమునకు రత్నరాసులు పంపినాడు.
నకులుడు పశ్చిమ దిక్కునకు దండెత్తినాడు. అతడు మహితక దేశమున విడిసినాడు. అక్కడి రాజులు దత్తకుడు, మయూకుడు అనువారు శూద్రులు, వారితో యుద్దము చేసి జయించినాడు. పిమ్మట మరు, మాళవ, బర్బర, కర్ణాట, హాటక, పుష్కర రాజులను జయించినాడు. అరణ్య వాసులయిన అభీర గణములను సరస్వతీ సింధు కులాశ్రితులయిన గ్రామణియులను, పంచజన సింహ్య, దామరపత్తన, యదుపర్వతనివాసులను జయించినాడు. ద్వారకలో శ్రీకృష్ణునకు వార్త పంపినాడు. తన మేనమామ శల్యుని సాకల్య పట్టణమున చూచినాడు. అతని నుండి బహుమతులు గొన్నాడు. పశ్చిమ సముద్రమందలి బర్బర కిరాతులను పరాజితులను చేసినాడు.
నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి వచ్చినారు. లెక్కలెనన్ని ధనరాసులు తెచ్చినారు. ధర్మరాజు అది చూచినాడు. సంతోషించినాడు. రాజసూయము చేయుటకు నిశ్చయించినాడు. అతని మంత్రులు అతనిని ప్రోత్సహించినారు.
"మహారాజా! నీ తమ్ములు సకల రాజులను జయించినారు. వారందరూ నీ వశమున ఉన్నారు. కుబేరుని అక్షయనిధుల వంటి ధనరాసులు నీ వద్ద ఉన్నవి. వేదములు మూర్తీభవించిన మహా యాజ్ఞికులు ఉన్నారు. వెంటనే రాజసూయము చేయుట మంచిది" అన్నారు.
శ్రీకృష్ణుడు ద్వారక నుండి వచ్చినాడు. ధర్మరాజాదులు అతనిని పూజించినారు.
ఆలోచనామృతము
1. భారతము మానవ చరిత్ర . మానవ సంహిత. భరతవర్ష చరిత్ర అనంతము. ఇది పాశ్చాత్యజాతి చరిత్ర వలె కొన్ని శతాభ్దములది కాదు. కొన్ని వేల , వేల సంవత్సరములది. మానవ కళ్యాణమునాకు ఎంతో మంది మహాత్ముల కృషి చేసినారు.
మానవ కళ్యాణమందు స్త్రీ పురుష సంబంధములు అత్యంత ప్రాధాన్యత వహించుచున్నవి. వానిని గురించి జరిగిన ప్రయోగాములలో సమాజ హితము కాని వానిని వదిలివేయుట జరిగినది. కృత్రిమ సంతానమును కనుగొన్నారు. వదిలినారు. దేవరన్యాయమును కనుగొన్నారు. వదిలినారు. జరాసంధుని జన్మ మానవ సంబంధములందు మరొక మైలురాయి.
బృహద్రధునకు సంతానము కలుగలేదు. అతడు దేవర పద్దతి అవలంభించలేదు. చండ కౌశికుని ఆశ్రయించినాడు. చండ కౌశికుడు సంతానము కలుగు ఔషధము కనుగొనినవాడు అయి ఉండవలెను. తద్వారా బృహద్రదునకు సంతానము కలిగినది. పూర్వ పద్ధతులకు స్వస్తి చెప్పబడినది.
"జర" శాస్త్రవైద్య నిపుణురాలుగా కనిపించుచున్నది. ఆమె తన శస్త్రవైద్య నైపుణ్యమున పనికిరాని పిల్లలకు ప్రాణము పోసి ఒక నూతన పద్దతిని కనిపెట్టినది. అందుకే ఆమె పేర ఉత్సవము జరిపినారు.
2. మాహిష్మతి కధ మహిళా విమోచనోధ్యపు కధ. నిషాదుడు వివాహ వ్యవస్థ ప్రవేశపెట్టినాడు. స్త్రీ పురుషులు పరులతో సంగమించరాదను నియమము ఏర్పరచినాడు. కఠినమయిన నియమములు ఏర్పరచినాడు. స్త్రీలు ఉద్యమము లేవదీసినారు. ఇది నేడు పాశ్చాత్య దేశములందు వచ్చిన స్త్రీ స్వేచ్చా ఉద్యమము వంటిది. ఉద్యమమునకు నాయకత్వము వహించిన వాడు అగ్ని. అతడు బహిరంగముగా శాసనమును ధిక్కరించినాడు. పట్టుబడినాడు. కాని ఉద్యమ బలము వలన రాజు అతనిని శిక్షించలేకపోయినాడు. తన శాసనమును ఉపసంహరించుకున్నాడు.
సహజ సంస్కరణలు శాసన బలమున సాధ్యపడవు. అనుటకు ఇది ఒక బలమయిన నిదర్శనము.
3. జరాసంధుడు అధర్మము చేసినాడు. ఆనాటి అచారమును ధిక్కరించినాడు. మానవ హింసకు, నరహత్యకు కారణము అయినాడు.
ఆనాడు దండయాత్రలు జరిగినవి. కాని రాజులను చెరపట్టుట, చంపుట జరుగలేదు. చదరంగపుటాటలు యుద్ధ విద్య ననుసరించి ఏర్పడినది. అందు రాజును చాపుటకు వీలులేదు. అతనిని కట్టి వేయవలెను. ఇంతవరకు మనము పాండురాజు పాండవుల విజయయాత్రలు చూచినాము. ఎచ్చటను రాజులను చెరపట్టలేదు.
జరాసంధుడు ఈ నియమమును దిక్కరించినాడు. రోజుకు ఒకరి చొప్పున రాజులను హత్య చేసినాడు. అట్లు మానవతకు రాజకీయమునకు మహా నేరము చేసినవాడు అయినాడు.
బలదర్పమున అందరిని ధిక్కరించినాడు. శ్రీకృష్ణుడు తన ఉపాయమున అతనిని హతమార్చినాడు. మానవతకు మహోపకారము చేసినాడు.
ఉపాయము ఏదయినను మానవతకు మేలు కలుగవలె అను సిద్దాంతమును ప్రవచించినాడు.
4. పాండవులు నాలుగు దిక్కుల దండెత్తినారు. ఆ సందర్భమున పేర్కొన్న రాజ్యముల, రాజుల పేర్లు సరిగా ఉన్నట్లనిపించదు. మనది మౌఖిక సంప్రదాయము (Oral Tradition). అయినను కొన్ని ఆసక్తికర విషయములు వెల్లడి అయినవి. రాజు అగుటకు కులముతో నిమిత్తము లేదని వెల్లడి అయినది. వైశ్యులు, శూద్రులు రాజులుగా ఉన్న దేశములను పేర్కోనుట జరిగినది. అసలు రాజులేని దేశాములున్నవి. అవి ప్రజాపాలన గల దేశములు, నేటి ప్రజాస్వామ్య రాజ్యముల వంటివి కావచ్చును. అభీర గణములు, గ్రామనీయులు, పంచజన సింహ్యన దామర పత్తన, యదు తుర్వసులు అత్తివారు.
5. దండెత్తుట ఓడించుటకు కాదు, ఒప్పించుటకు , అందరును ధర్మరాజు పెట్టనమును అంగీకరించినారు. ఇది నేడున్న "కామన్ వెల్త్ " వంటిది - సుమారు!





