Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
22
రెండు వారాల తరువాత ఒకనాటి సాయంకాలం సూర్యుడు పశ్చిమాద్రికిచేరి ఆకాశం రక్తసిక్తం చేశాడు. పడకగది కిటికీ లోంచి లేఖ ఉబుసుపోకకు వీధులు చూస్తుంది. మొలకు ఒక చింపిరిగుడ్డ మాత్రం ఉన్న బానపొట్ట కుర్రాడు తూలుతూ చెత్త కుండీ వైపు నడుస్తూ కనిపించాడు. ఆ కుర్రాడి మెడకు ఒక ఇత్తడి తాయోత్తు ఉంది. చెత్తకుండి దగ్గరికి వచ్చి ఆగిపోయి అటూ ఇటూ బెదురు చూపులు చూశాడు. ఎవరూ కనిపించలేదు. చెత్త లో వెదకడానికి కుండీలో చేతులు పెట్టాడు.
అన్నార్తులందర్నీ నగరం ఆవలకు గెంటేశారు. ఈ కుర్రాడు ఎలా మిగిలిపోయాడు? ఒక నిముషం లేఖ ఆ కుర్రాణ్ణి చూసింది. కిటికీ దగ్గరి నుంచి తిరిగి, మెట్లు దిగి ఇంటి ముందుకు వెళ్ళింది. సగం తిన్న మామిడి పండు చేతిలో ఉన్న కుర్రాడు కనించాడు. లేఖను చూడగానే కర్రబారిపోయాడు. అతని చేయి బలవంతంగా మామిడిపండును చెత్త కుండీలో వేసింది. అతని కళ్ళు లేఖనే చూస్తూ ఉండిపోయాయి. మాట్లాడ్డానికి నోరు తెరిచాడు. కాని మాట పెకల్లేదు.
మట్టికొట్టి జడలు కట్టి ఎర్రబారిన వెంట్రుకల మీద చేయి ఉంచి లేఖ నిమిరింది.
"పాపా, నీ పేరు ?"
అయిదారెండ్ల కంటే ఎక్కువ లేని ఆ బాలుని నోట మాట రాలేదు. లేఖ చూపిన దయ అతన్ని కొద్దిగా ఓదార్చింది. జలజలా కన్నీరు కారింది.
"పేరేమీ లేదు " కష్టంగా అన్నాడు తల ఊపుతూ.
"మీ నాన్నా అమ్మా ఏమని పిలిస్తారు?"
"నాన్న లేడు" మళ్ళీ తల ఊపాడు.
"అమ్మా?"
"మోటార్లో తీసికెళ్ళారు"
"ఎవరు?"
"పోలీసులు"
లేఖకు అర్ధం అయింది. "నిన్నెలా వదిలారు ?"
"చెత్తకుండిలో దాక్కున్నా అదిగో అక్కడ."
కుర్రాడి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసికెళ్ళింది. "ఆకలిగా ఉంది కదూ?" ముందు తిను భయం లేదు కదూ?" ఏం భోకా! (కుర్రాడా ?)
కుర్రాడికి ఆమె మీద నమ్మకం కలిగినట్లు చూశాడు.
"అమ్మ నన్ను ఆ పేరుతోనే పిలుస్తుంది. భోకా అని పిలుస్తుంది. వేరే పేరేమి లేదు."
కుర్రాడు కూర్చున్నాడు. లేఖ చూస్తుంటే తినేశాడు. మాట్లాడకుండా తినేశాడు. పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పెట్టుకుని గబగబా మింగేశాడు. తన ముందున్న అన్నం ఎవడైనా లాక్కుపోతారేమో అని భయపడినట్లు దడదడా తినేశాడు. ఒక్కసారి మాత్రం తిండి ఆపి ' అమ్మ వస్తుందా ?" అని అడిగాడు. కళ్ళు జవాబు వినాలనే కుతూహలంతో పెద్దవి అయినాయి.
"వచ్చేస్తుంది" లేఖ హామీ ఇచ్చింది.
"తొందర్లో వస్తుందా ?"
"తొందర్లోనే వస్తుంది "
లేఖ కుర్రాణ్ణి స్నానాల గదికి తీసి కెళ్ళింది. నేత గుడ్డ కాస్తా విప్పేసింది. షవర్ తిప్పింది. వర్షధార క్రింద కుర్రాడు ఉక్కిరిబిక్కిరి అయినాడు. పీట మీద కూర్చిబెట్టి సబ్బు రుద్దింది. వంటి కున్న మురికి, వాసనా అన్నీ వదిలేదాకా రుద్దింది. పల్లెజనం పిల్లలకు దుష్టగ్రహ బాధ సోకకుండా వేసే ఎర్ర తాడు మాత్రం తెగకుండా జాగ్రత్తగా రుద్దింది.
"ఇప్పుడు చెప్పు జరిగినదంతా."
కుర్రాడు ఆశ్చర్యంతో మునకలు వేశాడు. ఇంతవరకు ఎవ్వరూ వాడి విషయంలో అంత శ్రద్ధ తీసుకోలేదు. స్నానం కావాలనిపించినప్పుడు ఊరి వాళ్ళంతా మునిగే చెరువులో మునిగేవాడు. ఒకటి రెండు సార్లు జమీందారు కొడుకు స్నానానికి వచ్చినప్పుడు తప్ప అతడు సబ్బు చూడలేదు. దొరబిడ్డ రాగానే గౌరవ చిహ్నంగా చెరువులో ఉన్న కుర్రాళ్ళంతా బైటికి వచ్చేసేవారు. సబ్బు ఇలా పూలవసనలతో "ఘమ్ము" మంటుందని అతనికి తెలియనే తెలియదు. మాతృస్పర్శ గల ఒక స్త్రీ ని అతడు అదేపనిగా చూశాడు. చివరకు మధ్యమధ్య ఆగుతూ చెప్పాడు.
"మోటారోచ్చింది. అమ్మను దాని పొట్టలో వేశారు. "భోకా పరిగెత్తు . భోకా దాక్కో" అని అమ్మ అరచింది. పరిగెత్తి చెత్త కుండీలో దాక్కున్నా కదల్లేదు. మెదల్లేదు. ఊపిరి కూడా పీల్చలేదు. వాళ్ళు నన్ను చూడలేదు. కారు వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయింది"
తల్లి, తన కొడుకును మృత్యువు నుంచి రక్షిస్తున్నా ననుకుంది. కారు వెళ్ళిపోయాక చెత్తకుండీ ఎక్కి చూశాడు. తల్లి కనిపించలేదు. ఏడ్పు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. తల్లితో తన్నూ తీసికెళ్తే బాగుండేది అనుకున్నాడు. చీకటి పడ్డంతో వంటిగా పుట్ పాత్ మీద పడుకోవడానికి భయం వేసింది. ఇటూ అటూ తిరిగాడు. తుదకు ఎండ వేడి భరించలేక ఆరుబయట మంచం వేసుకుని పడుకున్న పాన్ కొట్లో పనిచేసేవాడు కనిపించాడు. అతడు మంచంలో పడి సీతారాముల్ను గురించి పాటలు పాడుతున్నాడు.
భోకా అతని ప్రక్కన పడుకున్నాడు. కుర్రాన్ని చూసి పడుకున్నవాడు గట్టిగా ఉరిమాడు. భోకా అదిరిపడి ఇంకో స్థలం కోసం గాలించాడు. కడుపులో భయం గుబ, గుబా అన్నది. పడుకున్న వాణ్ణి చూస్తూ అలాగే కూర్చుండి పోయాడు. పడుకున్న వ్యక్తీ గుర్రు పెడ్తుంటే భోకాకు ధైర్యంగా ఉండేది. శీతాకాలం వచ్చేదాకా కిళ్ళీ కొట్టు మనిషి ఆరు బైటే పడుకున్నాడు. మంచు పడ్డంతో అతడు బిచానా ఎత్తాడు. భోకా వంటరిగాడైపోయాడు. మళ్ళీ ఆతని కడుపులో బుగులు మొదలైంది.
కిళ్ళీ బడీ వాడి తమ్ముడు కాస్త పెద్ద కుర్రాడు. వాడు భోకాతో "మీ అమ్మను గంగలో ముంచేశారు" అన్నాడు. "మా అమ్మ వాళ్ళకేం చేసింది. చూస్తుండు తిరిగి వస్తుంది." అన్నాడు భోకా. పెద్ద కుర్రాడికి కోపం వచ్చి చెంప మీది నుంచి అంటుకున్నాడు.
ఆ దెబ్బ ఇంకా చెంప మీదనే ఉన్నట్లు భోకా చేత్తో చెంప రుద్దుకున్నాడు. లేఖ కళ్ళల్లో నీరు తిరిగింది. ఆమె ఎముకలు వెళ్ళిన కుర్రాడి మేను నిమిరింది. జడలు కట్టిన వెంట్రుకలను అరచేత్తో నలిచింది. మళ్ళీ భోకాను షవర్ క్రింద కూర్చోబెట్టింది.
కుర్రాడికి గుడ్డలు ఒక సమస్య అయింది. తండ్రి సిల్కు కండువాను రెండు మడతలు వేసి నడుం చుట్టూ చుట్టింది. ఆ దుస్తుల్లో కుర్రాడు వింతగా కనిపించాడు. కొద్దిగా వెడల్పైన ముఖమూ, చట్టి ముక్కూ- కుర్రాణ్ణి చూస్తుంటే లేఖ గుండె పొంగింది.
"బాబా ఒప్పుకుంటాడా?" అదీ ఆమె బాధ.
"లేఖా తండ్రి పిలుపు వచ్చింది. కుర్రాడి చేయి పట్టుకొని బాల్కనీ కి నడిపించుకొని పోయింది. కాలూ కుర్రాణ్ణి దిగులు పడి చూశాడు.
"ఈ కుర్రాడేవరూ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"వీధిలో దొరికాడు. వీడు భగవత్ప్రసాధం " అని కధంతా చెప్పింది.
"సరే, గుడికి వెళ్దాం పద. తరువాత మాట్లాడ్దాం. ఇది ఒక్క క్షణంలో తేల్చే విషయం కాదు. కుర్రాణ్ణి గురించి నాకేమీ తెలియదు."
కుర్రాణ్ణి బాగా చూశాడు. వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు.
ఈ పదిహేను రోజుల్నుంచీ లేఖ దేవాలయంలో లీనం అయిపొయింది. రోజూ సాయంకాలపు హారతిలో పాల్గొంటుంది. ఆమె మనో వాక్కులూ పూజల్లోనే నిమగ్నం అయిపోయాయి. లేఖలో తండ్రి స్వయంగా విశ్వసించలేనంత మార్పు వచ్చింది. అతడు ఆశ్చర్యపడి అభ్యంతరం కూడా తెలియజేశాడు. కాని ఆమె గట్టిగా నిలిచింది. ఆమెలో కలిగిన ఈ మార్పుకు బిటేన్ నిర్గమనమే కారణం అని కాలూ శంకించాడు. బిటేన్ కనీసం వారితో చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతడు నగరంలోని లక్షలాది జనంలో ఒకడై పోయాడు.
పెండ్యులంలా లేఖ ఈ చివర నుంచి ఆ చివర వరకు ఊగింది. దేవాలయం ఆమెకు ఆత్మశాంతి ప్రసాదించగలదా? ఆమెలోని భక్తీ బ్రాహ్మలు చేసే పూజా పురస్కారాల కంటే అనేక రెట్లు మెరుగైంది. అది రాత్రికి దైవత్వాన్ని , బూటకానికి వాస్తవతనూ ప్రసాదించింది.
పూజ జరుగుతుంది. అంతా మంత్రం పఠనంలో లీనం అయి ఉన్నారు. లేఖ కళ్ళు మూసుకుని కూర్చుంది." కుర్రాడికి కడుపు నిండా తిండి పెట్టావా?" అని చెవులో మూతి పెట్టి అడిగాడు కాలూ.
ఆమె తల ఊపి జవాబు చెప్పింది.





