Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
అతడు బుధ్న, అగ్ర శబ్దములు గల యాజ్యపురోను వాక్యలు చేయవలెను. అవి అతనిని తొలి నుండి చివరి వరకు అగ్రగణ్యుని చేయును.
తమ్ముల కన్న కొంచెముగా చూడబడు అనుజా వరునకు ఆనుషూక అధిదేవతయే సమృద్ధి కలిగించును.
6. అనుజావరుడగు బ్రాహ్మణుడు బృహస్పతి దేవతాకమగు ఆనషూక చరును నిర్వాపము చేయవలెను. అతడు బృహస్పతిని స్వభాగధేయముగ అర్చించవలెను. బృహస్పతియే అతనికి సమానులందు అగ్రస్థానము కలిగించును.
తడు బుధ్న, అగ్ర శబ్దములు గల యాజ్యాపురోను వాక్యలు చేయవలెను. అవి అతనిని మొదటినుండి ఆసాంతము అగ్రస్థానము గల వానిని చేయును.
ఆజావరునకు ఆనుషూక అధిదేవతయే సమృద్ధి కలిగించును.
అయిదవ అనువాకము
1. ప్రజాపతికి ముప్పది ముగ్గురు పుత్రికలు. అతడు వారినందరిని రాజగు సోమునకు ఇచ్చినాడు. సోముడు రోహిణిని మాత్రము పరిగ్రహించినాడు. మిగిలిన ముప్పది ఇద్దరు అది సహించలేక పోయినారు. వారందరు మరల ప్రజాపతి దగ్గరకు వెళ్లినారు.
సోముడు వారిని అనుసరించినాడు. ప్రజాపతి వద్దకు వెళ్లినాడు. వారిని మరల తనకు ఇవ్వవలసినదని కోరినాడు. ప్రజాపతి అందుకు సమ్మతించలేదు. తన కూతుళ్లను అందరను సమానముగ చూచెదనిని శపథము చేయమన్నాడు. సోముడు అట్లే శపథము చేసినాడు.
శపథము చేసిన సోమునకు ప్రజాపతి తన పుత్రికలను వప్పగించినాడు. సోముడు శపథమును ఉల్లఘించినాడు. ఎప్పటివలె రోహిణి విషయముననే అనురక్తుడు అయినాడు. అందువలన అతనికి యక్ష్మ - క్షయ కలిగినది.
రాజగు సోమునకు కలిగినందున అది రాజయక్ష్మ అయినది. పాపము చేయుటవలన కలిగినందున పాపయక్ష్మ అయినది. భార్య నిమిత్తము కలిగినందున అది 'జాయేన్య' అయినది. ఈ మూడు పేరులు గల యక్ష్మరోగపు పుట్టు పూర్వత్తరములు తెలిసిన వానికి ఈ వ్యాధులు కలుగవు.
అప్పుడు సోమదేవత మిగిలిన వారిని సమానముగా చూచెదనని వారితో అన్నాడు. వారు సహితము 'మమ్ము సమానముగ చూచునట్టి వరము కోరుచున్నాము' అన్నారు. వారు సోముని కొరకు ఆదిత్య దేవతాకమగు చరును నిర్వాపము చేసినారు. ఆ విధముగా చేసి సోముని రోగము నుండి విముక్తి కలిగించినారు.
2. పాపయక్ష్మము వలన బాధపడువాని కొరకు ఆదిత్య దేవతాకమగు చరును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ఆదిత్యులను అర్చించవలెను. ఆదిత్యులే అతనికి ఆ రోగము నుండి విముక్తి కలిగింతురు.
3. అమావాస్య నాడు ఈ చరును నిర్వాపము చేయవలెను. శుక్లపక్షమున వృద్ధిచెందు చంద్రుడు ఈ వ్యాధిగ్రస్తునకు అభివృద్ధి కలిగించును.
4. నవోనవో భవతి జాయమానః - నవనవోన్మేషముగా జన్మించినవాడు అగుచున్నాడు. అను పురోను వాక్యము వలన అతనికి దీర్ఘాయువు కలుగుచున్నది. ఆదిత్యా అగంశు మాప్యాయన్తి - ఆదిత్యులు వర్ధిల్లచేయుచున్నారు అణు యాజ్య వలన అతనికి అభ్యుదయము కలుగుచున్నది.
ఆరవ అనువాకము
1. ప్రజాపతి దేవతలు ఆరగించుటకు యోగ్యమగు అన్నమును వారికి పంచి ఇచ్చినాడు. ఈ లోకము లందు అభివ్యాపించి అతిరిక్తమగునది తనకొరకు అగునని నిర్దేశించినాడు. ఆ అన్నము ఈ లోకములను అభివ్యాపించి అతిరిక్తమయినది. అవి ఇందర్రాజము, ఇంద్రాధిరాజము, ఇంద్రస్వరాజ్యము అయినవి. అప్పుడు ప్రజాపతి ఈ లోకములను మూడు విధములుగా పితికినాడు. అందువలన త్రిధాతు యాగమునకు త్రిధాతుత్వము కలిగినది.
2. అన్నము తినువాడు కావలెనని కోరువాడు త్రిధాతుయాగము చేయవలెను. రాజగు ఇంద్రుని కొరకును, అధిరాజగు ఇంద్రుని కొరకును, స్వరాట్టయిన ఇంద్రుని కొరకును, ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. భూలోకాధిపతి యగు ఇంద్రుడు రాజు. అంతరిక్షాధిపతియైన ఇంద్రుడు అధిరాజు. స్వర్గలోకాధిపతియగు ఇంద్రుడు స్వరాట్టు. ఆ ఇంద్రులను అతడు స్వభాగధేయమున అర్చించవలెను. వారే అతనికి అన్నము ప్రసాదింతురు. అతడు అన్నాదుడు - అన్నము తినువాడు అగును.
దూడ కుడుచుట వలన ఆవు చేపును, జనులు అట్టి ఆవుపాలను పిండుకొందురు. అట్లే ప్రజలు అనుభవించినంత ఈ లోకములు దేవతలచే వర్థిల్లచేయబడుచున్నవి. అట్టి లోకములందు యజమాని అన్నాద్యత నొందును.
3. సారము పోకుండుటకు గాను ఊర్ధ్వముఖములైన కపాలములందు పురోడాశమును ఉంచవలెను.
4. పురోడాశములు మూడు కావలెను. అవి మూడు లోకములు పొందుటకు సాధనములు అగును.
5. పురోడాశము ఒకదానికన్న మరొకటి పెద్దది కావలెను. అదెందుకనగా భూలోకమున కన్న అంతరిక్షము, అంతరిక్షము కన్న స్వర్గలోకము పెద్దది కదా! అది సమృద్ధి కలిగించును.
6. అన్ని పురోడాశములందును చేయిపెట్టవలెను. ఒకదానిని కూడ విడువరాదు. అన్నిటినుండి అవదానము చేయవలెను.
7. అవినాశము కొరకు యాజ్యాను వాక్యాల వ్యత్యాసము చెప్పవలెను.
ఏడవ అనువాకము
1. దేవతలకు అసురులకు యుద్ధము జరిగినది. ఆ యుద్ధమున రాక్షసులు దేవతలను జయించినారు. పరాజయము పొందిన దేవతలు రాక్షసులకు సేవకులు అయినారు. అందువలన దేవతల ఇంద్రియ సామర్థ్యమును, శరీర సామర్థ్యమును తొలగిపోయినవి.
ఇంద్రుడు ఆ విషయము గ్రహించినాడు. వానిని సంపాదించుటకు ప్రయత్నించినాడు. కాని సఫలుడు కాలేక పోయినాడు. అప్పుడు అతడు వానిని సాధించుటకు ప్రజాపతిని సేవించినాడు.
ప్రజాపతి ఇంద్రుని చేత 'సర్వపృష్ట' యాగము చేయించినాడు. ఆ యాగము వలననే ప్రజాపతి ఇంద్రునకు ఇంద్రియ, శరీర ఉభయసామర్థ్యములు కలిగించినాడు.
2. ఇంద్రియ సామర్థ్యము, శరీరసామర్థ్యము కోరుకొనువాడు సర్వపృష్ట ఇష్టిని యజించవలెను. ఈ దేవతలనే అతడు స్వభాగధేయమున యజించవలెను. వారే అతనికి ఇంద్రియ, శరీరసామర్థ్యములు కలిగింతురు.
3. రథాంతర ఇంద్రునకు నిర్వాపము చేసినవాడు అగ్ని యొక్క తేజస్సును పొందును.
బార్హత ఇంద్రునకు నిర్వాపము చేయువాడు ఇంద్రుని తేజస్సును పొందును.
వైరూప ఇంద్రునకు నిర్వాపము చేయువాడు బ్రహ్మతేజస్సును పొందును.
శాక్వర ఇంద్రునకు నిర్వాపము చేయువాడు మరుత్తుల తేజస్సును పొందును.
రైవత ఇంద్రునకు నిర్వాపము చేయువాడు బృహస్పతి తేజస్సును పొందును.
ఏతావన్తి వై తేజాగంసి తాన్వేవావరున్ద - తేజస్సులు ఇన్నియే. అతడు వానిని అన్నింటిని పొందును.
4. సారము పోకుండుటకు గాను ఊర్ధ్వ ముఖములైన కపాలములందు పురోడాశమును ఉంచవలెను.
5. విశ్వేదేవతల ప్రీతి కొరకు ద్వాదశ కపాల పురోడాశము అగుచున్నది.
6. అన్ని పురోడాశముల నుండి అవదానము చేయవలెను. అందువలన యజమాని యందంతటను సామర్థ్యము కలుగును.
7. అవినాశము కొరకు యాజ్యానువాక్యల వ్యత్యాసము చెప్పవలెను.
8. యజమాని పుంస్త్వాధిక్యత కొరకు అశ్వము, ఎద్దు, గొర్రెపోతు, మేకపోతు దక్షిణ అగును.
9. విధ్యాపవాదము కలిగినవాడు ఈ ఇష్టినే యజించవలెను. అందువలన దేవతలు యజమాని పురోడాశములను స్వీకరింతురు. వారు యజమానికి పురోడాశము వంటి అన్నమును ప్రసాదింతురు.
ఎనిమిదవ అనువాకము
1. కుణి కుమారుడు రజనుడు. అతనికి దృష్టిదోషము. జనకుని పుత్రుడగు క్రతుజిత్తు కంటివైద్యుడు. రజనుడు కంటి చికిత్స కొరకు క్రతుజిత్తు వద్దకు వెళ్లినాడు. క్రతుజిత్తు రాజనుని కొరకని భ్రాజస్వంతుడగు అగ్ని కొరకు అష్టాకపాల పురోడాశమును, సూర్యదేవతాకమగు చరును, భ్రాజస్వంతుడగు అగ్ని కొరకు అష్టాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేసినాడు. త్రిహవిష్కమగు ఇష్టిని యజించినాడు. అందువలన రజనుని దృష్టి దోషము నివారణమై కళ్లకు శక్తి కలిగినది.
2. కంటి చూపునకు పాటవము కోరువాడు. భ్రాజస్వంతుడగు అగ్నికి అష్టాకపాల పురోడాశమును సూర్య దేవతాకమగు చరును, భ్రాజస్వంతుడగు అగ్నికి అష్టా కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. త్రిహవిష్కమగు ఈ ఇష్టిని యజించవలెను.
అగ్ని యొక్క నేత్రముచే మానవులు చూచుచున్నారు. కంటి రెప్ప వాలుట లేచుట వలన మానవుని దృష్టి అనిత్యమగుచున్నది. అగ్ని జ్వలించుట చల్లారుటచే అనిత్యము అగుచున్నది. ఈ అనిత్యసామ్యమున మానవుని దృష్టికి అగ్నికి సంబంధము.
దేవతలు సూర్యుని దృష్టితో చూతురు. సూర్యుని వలె దేవతల దృష్టి అనిమేషము. అయినందున దేవతల దృష్టి సూర్య సంబంధమగును.
యజమాని అగ్ని, సూర్యులను స్వభాగధేయమున అర్చించవలెను. అగ్ని, సూర్యులు అతని దృష్టికి పాటవము కలిగింతురు. అతడు చక్షుష్పాటవము కలవాడు అగును.
3. అగ్ని దేవతాకములగు రెండు పురోడాశములు చెప్పబడినవి. అందువలన యజమాని రెండు నేత్రములకు బలము చేకూరును. సూర్య దేవతాకమగు చరు నాసికకు బలము కలిగించును.
సూర్యదేవతాకమునకు రెండు ప్రక్కల అగ్ని దేవతాకములు అయినవి. అందువలన నాసికకు ఇరువైపుల నేత్రములయినవి. కావున ముక్కు వలన రెండు నేత్రములు నిలిచి ఉన్నవి.
4. యాజ్యాను వాక్యలు సమానములైనట్లు కన్నులు సమానములు అగుచున్నవి. కావున అది సమృద్ధి కొరకు అగుచున్నది.
5. 1. ఉద్యుతం 2. చిత్రం దేవానాం 3. సప్తత్వాహరితః రథే అను మూడు మంత్రములచే పిండ ప్రదానము చేయవలెను. అందువల్ల వ్యాధి కలుగకముందున్న చక్షుష్పాటవము మరల కలుగుచున్నది.
(మూడు మంత్రములు సూర్య సంబంధములు.)
తొమ్మిదవ అనువాకము
1. మధ్యమ పరిధీ! నీవు స్థిరమైన దానవు. నేను జ్ఞాతులందు స్థిరుడను, ధైర్యవంతుడను, ధనవంతుడను అగుదును గాక.
దక్షిణ పరిధీ! నీవు స్థిరమవు. నేను జ్ఞాతులందు స్థిరుడను, ధీరుడను, సంపన్నుడను అగుదును గాక.
ఉత్తర పరిధీ! నీవు స్థిరమవు. నేను జ్ఞాతులందు స్థిరుడను, ధీరుడను, సంపన్నుడను అగుదును గాక.
2. హుతమగుచున్న ఆజ్యమా! నీవు పుత్రమిత్రాదులను కోరుదానవు. నేను పుత్రమిత్రాదులు సుమనస్కులు కావలెనని కోరుచున్నాను. దేవతలారా! వారిని నేను మనసున నిలుపుచున్నాను. వారు నన్ను మనసున నిలుపుదురు గాత. వారికి నాయందు అభిమానము కలుగునట్లు చేయండి.
హుతమగుచున్న ఆజ్యమా! నీవు సజాతులను కోరుదానవు. నేను సజాతులను కొరువాడను. ఏ స్త్రీలు నాకు మనసా అనుకూలురు అగుచున్నారో నేను వారికి మనసా అను కూలుడను అగుచున్నాను. దేవతలారా! వారు నాకు మనసా అనుకూలురు అగుదురు గాక. వారిని నాకు మనసా అనుకూలురను చేయండి. స్వాహా.
3. గ్రామాధికారము కోరువాడు విశ్వేదేవతాకమగు సాంగ్రహిణి ఇష్టిని నిర్వహించవలెను. బంధువులు విశ్వేదేవతా సంబంధులు. విశ్వేదేవతలను స్వభాగధేయమున అర్చించవలెను. వారే అతనికి బంధుజనులను సమకూర్తురు. అతడు నిశ్చయముగ గ్రామస్వామి అగును.
4. ఈ ఇష్టి సంగ్రహణి అగును. బంధువుల మనసులను స్వాధీన పరచుకొనుటయే సంగ్రహణము. దానివలన బంధువుల మనసులను యజమాని స్వాధీనము చేసికొనును.
5. ధ్రువోసి ధ్రువోహగం సజాతేషు భూయాసం - నీవు స్థిరమవు నన్ను జ్ఞాతులందు స్థిరపరచుము అను మంత్రము చదువుచు పరిధులను చుట్టు ఉంచవలెను. ఇది ఆశీస్సుగా కోరబడునది. తదుపరి పరిధులు చుట్టు ఉంచబడుచున్నవి. ఈ విషయము తెలిసిన విద్వాంసులకు బంధువుల విషయమున కోరినదంతయు అధికముగ సంభవించును.





