Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                         జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                  ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                ఇరువదవ అధ్యాయము


1.    క్షత్రస్యయోనిరసి క్షత్రస్యనాభిరసి|
    మాత్వా హింసీన్మా మా హింసీః ||

    (ఉత్తర దక్షిణవేదుల మధ్య ఒక ఎత్తుపీఠమును వేయవలెను)

    పీఠమా! నీవు క్షత్రియుల యోనివి. క్షత్రియుల నాభవి.

    (పీఠముపై కృష్ణాజినము పరచవలెను)

    కృష్ణాజినమా! నీవు పీఠమును బాధించకుము. పీఠము నిన్ను బాధించకుండును గాత.

    2. వ్రతధారియు, సుకర్మయు అగు వరుణరాజు రాజ్యము నిమిత్తము ప్రజలయందు ప్రవేశించినాడు.

    (యజమాని పీఠము మీద కూర్చండవలెను. అతని ఒకపాదము క్రింద వెండి ముక్క మరొక పాదము క్రింద బంగారు ముక్క పెట్టవలెను)

    రుక్మమా! నన్ను అకాలమరణము నుండి కాపాడుము. స్వర్ణరుక్మమా! నన్ను విద్యుద్ఘాతము నుండి కాపాడుము.

    3. (ఆసందిపై కూర్చున్న యజమానిని అధ్వర్యు నీటితో తడుపవలెను)

    యజమానీ! నేను  సవితృని అనుజ్ఞలో ఉన్నవాడను. అశ్వినుల బహువులతోను, పూషహస్తములతోను నిన్ను సించితము చేయుచున్నాను. అశ్వినుల వైద్యము నీకు తేజస్సును బ్రహ్మవర్చస్సును కలిగించవలెనని ఆశించితము చేయుచున్నాను. ఇంద్రుని ఇంద్రియబలము కొరకును సిరి మరియు యశము కొరకును నిన్ను ఆసించితము చేయుచున్నాను.

    4. (అధ్వర్యు యజమానిని తాకవలెను)

    యజమానీ! నీవు ప్రజాపతివి అగుదువు. ప్రజాపతితముడవగుదువు. ప్రజాపతి పదము కొరకును - ప్రజాపతివి అగుటకొరకును నిన్ను స్పృశించుచున్నాను.

    (యజమాని ఇట్లు పిలుచును)

    సుశ్లోకా! సుమంగళుడా! సత్యరాజా! విచ్చేయుము నావద్దకు విచ్చేయుము - "సుశ్లోకసు మజ్గిల సత్యరాజన్!"

    నా శిరము  శ్రీ యుక్తము అగును గాత. నా ముఖము యశోయుక్తమగును గాత. వెంట్రుకలు, గడ్డమీసములు దీప్తి యుక్తములు అగును గాత. నాప్రాణము సామ్రాట్టును, అమృతమయుడును అగును గాత. చక్షువులు ప్రభువులు - శ్రోత్రములు విరట్టులు అగుదురు గాత.

    6. నా జిహ్వభద్రమగును గాత. మాట మహత్తు అగును గాత. మనసు మన్యుపూర్ణమగును గాత. క్రోధము స్వరాట్టు అగును గాత. అంగుళులు మోదము. అంగములు ప్రమోదములు అగును గాత. మిత్రుడు శత్రుంజయుడు అగును గాత.

    7. నా బహువులకు ఇంద్రుని బలము కలుగును గాత. నాచేతులందు వీరకర్మము చేరును గాత. ఆత్మయందును హృదయమునందును క్షత్రియకర్మము వ్యాపించును గాత.

    8. నా నాభి చిత్తమగును గాత. గుదుము విజ్ఞానమగును గాత. యోజి పూజ అగును గాత. అండకోశము ఆనందనందన మగును గాత. భగము సౌభాగ్యమగును గాత.

    నేను నాతొడలు మరియు పాదముల మీద ప్రజలకు రాజునై నిలిచినాను. (స్వబలమున అని)

    (చిట్ట విజ్ఞానయోః కోవిశేష ఇతి. విజ్ఞానం విజ్ఞప్తిః తజ్జః సంస్కారం చిత్తం ఇతి ఉవటః)

    9. (యజమాని కృష్ణాజినము మీద ఆసీనుడగును)

    నేను క్షాత్రమునందు ప్రతిష్టతుడనైనాను. నేను రాజ్యమునండు ప్రతిష్ఠితుడనైనాను. నేను అశ్వములందు ప్రతిష్ఠితుడనైనాను. నేను గోవులందు ప్రతిష్ఠితుడనైనాను. నేను అంగ ప్రత్యంగములందు ప్రతిష్ఠితుడనైనాను. నేను ఆత్మయందు ప్రతిష్ఠితుడనైనాను. న్నెఉ ప్రాణమందు ప్రతిష్ఠితుడనైనాను. నేను సమృద్ధియందు ప్రతిష్ఠితుడనైనాను. నేను ద్యావాపృథ్వులందు ప్రతిష్ఠితుడనైనాను. నేను యజ్ఞమునందు ప్రతిష్ఠితుడనైనాను.

    (వశ్య విశ్వః విశ్వమే తనవశమునందున్నది అనుచున్నాడు మానవుడు. అంతటి బలమతనిది! అంతటి విశ్వాసమతనిది. అంతటి విశ్వాసమున్న అసాధ్యమేది?)

    11. సుధనసంపన్నులగు దేవతలు ముగ్గురు - పదకొండుగురు - ముప్పది ముగ్గురు. వారికి బృహస్పతి పురోహితుడు అగును. వారందరు సవితాదేవుని ఆజ్ఞాను వర్తులు. ఆ దేవతలు నన్ను దుఃఖముల నుండి రక్షింతురు గాత.

    (ముగ్గురు భూలోక, ద్యులోక, అంతరిక్షములందు ఉన్నవారు. ఒక్కొక్క చోట పదకొండు మంది చొప్పున ముప్పది ముగ్గురు)

    12. ప్రథమ దేవత ద్వితీయ దేవతతోను, ద్వితీయదేవత తృతీయదేవతతోను, తృతీయ దేవత సత్యముతోను, సత్యము యజ్ఞముతోను, యజ్ఞము యజుస్సులు సామముతోను, సామము ఋచలతోను, ఋచలు పురోఅనువాక్యములతోను, పురోఅనువాక్యములు యాజ్యావుల తోను, యాజ్యావులు వషట్కారములతోను, వషట్కారము ఆహుతులతోను కూడి నన్ను వర్ధిల్లచేయవలెను. ఆహుతులు నా మనో రథములను సమృద్ధము చేయవలెను, 'భూః స్వాహా'

    (భూః భువనం అని ఉవటుడు)

    13. నాలోమాములు ప్రయత్నము. త్వచ ఆనతి. మాంసము ఉపనతి. ఆస్థికలు ధనము. మూలుగు ఆనతి అగును.

    14. దేవతలారా! మేము మిమ్ము గురించి అపరాధములు చేసి ఉండినచో అగ్ని ఆపాపములనుండి మమ్ము విముక్తులను చేయవలెను.

    15. పగలుగాని రాత్రిగాని పాపములు చేసిఉన్నచో వాయువు ఆపాపముల నుండి మమ్ము విముక్తులను చేయవలెను.

    16. మేలుకొని ఉన్నప్పుడుగాని, నిద్రలోగాని పాపములు చేసి ఉన్నచో సూర్యుడు మమ్ము ఆపాపాములనుండి విముక్తులను చేయవలెను.

    17. గ్రామమందును, అరణ్యమందును, సభలందును, శూద్ర, వైశ్యుల విషయమునను పాపము చేసినాము. భార్యా భర్తలను ఏకధర్మమున పాపములు చేసినాము. ఘటమా! నీవు ఆపాపము లన్నింటికి నాశకమవు.

    (ఘటమని మహీధర వ్యాఖ్య. ఘటమనగా జీవితము కావచ్చును. జీవితమే అన్నింటిని నశింపచేయగలది. దానికి అంతటిశక్తి ఉన్నది.)

    18. వరుణదేవా! జలము అహింస్యము. మేము అహింస్యులము. అట్లయిన పాపవశమున అభిశప్తులమగుచున్నాము. ఆ పాపముల నుండి నన్ను కాపాడుము.

    నిచుంపుణమను యజ్ఞవిశేషమా! నీవు వేగగమనవు. అయినను ప్రస్తుతము మందగమన వగుము. ఏలనన నేను ఇంద్రియలోలుడనై దేవతల విషయమున చేసిన పాపములను, నా మనుష్యులచే అన్యమానవులకు చేసిన పాపములను ఇక్కడి వరకు తెచ్చినాను. యజ్ఞదేవా! ఆపాపముల క్రోధమునుండి నన్ను రక్షింపుము. విపరీత ఫలితముల నిచ్చు సంసారబంధనముల నుంచి సహితము నన్ను రక్షింపుము.  

    19. సాగరమందు జలగర్భమున నీహృదయము ఉన్నది. నీలో ఓషధులు, జలములు ప్రవేశించును గాత. మాకు జల ఓషధులు సుమిత్రులు కావలెను. మేము ద్వేషించువారికి, మమ్ము ద్వేషించువారి జలఓషధులు దుష్టమిత్రులు కావలెను.

    (యజమాని అవభృత ప్రదేశమునుండి ఉత్తర దిశకు రెండడుగులు వేసి చేతిలోనికి నీరు తీసికోని శత్రువులున్న దిక్కున్న చల్లవలెను)

    (జీవితము మిత్రుల మీద ఆధారపడినది అనుచున్నాడు. ఈ విషయము భర్తృహరి:-

    మొదల జూచిన గడుగొప్ప పిదపగురుచ
    యాది కొంచెము తర్వాత నధికమగుచు
    దనరు దినపూర్వపరభాగ జనితమైన
    ఛాయపోలిక గుజనసజ్జనులమైత్రి

    20. వడిగల నడకలవానికి పాదుకలు వదులుట వలనను - చెమటవంటి వానికి స్నానము వలన శుభ్రత కలిగినట్లును - ఘృతము జల్లించుట వలన శుద్ధమైనట్లును - జలము నన్ను పాపములనుండి విముక్తుని చేయవలెను.

    21. (ఈమంత్రము చదువుచు జలమునుంచి బయటకు రావలెను)

    ఉత్తమ సూర్యప్రకాశమును దర్శించి మేము అంధకారమును అధిమించినాము. దేవలోకమందున్న సర్వోత్తమ జ్యోతియగు సూర్యుని పొందినాము.

    22. (ఆహవనీయ ముపతిష్ఠ - యజమాని ఆహవనీయ అగ్నిని ఉపస్థానము చేయును)

    అగ్నీ! నేను జలస్నానము చేసినారు. నేను నీట తడిసినాను.  తడిసియే నీవద్దకు చేరినాను. నిన్ను చేరిన నాకు బ్రహ్మవర్చస్సు, సంతానము, ధనము కలిగించుము.

    23. (సమిధమాదత్తే - యజమాని అగ్నిలోసమిధ వేయును)

    సమిధా! నీవు ఇంధనమవు. నీప్రభావమున మేము వర్ధిల్లుదుము గాత.

    నీవు సమిధవు. నీవు నీతేజస్సువు. నీతేస్సును నాలో ప్రవేశపెట్టుము.

    (యజమాని ఘృతాహుతులు ఇచ్చును)

    పృథివి సమ్యగా వర్తితమగును. ఉష, సూర్యుడు, విశ్వము, జగత్తులు సమ్యగా వర్తితములగును. నేను వైశ్వానర జ్యోతినగుదును గాత. నేను సమస్త అభిలాషలను అందుకొందును గాత. 'భూ! స్వాహా'

    (ఇదే అహం బ్రహ్మాస్మి అగును)

    24. (యజమాన ఆహవనీయే తిస్రః సమిధ్కోఅభ్యాదధాతి. యజమాని ఆహవనీయమున మూడు సమిధలు సమర్పించును)

    యజ్ఞపాలక అగ్నీ! నేను నీయందు సమిధలు సమర్పించుచున్నాను. నీ దయవలన నాకు యజ్ఞమునందు శ్రద్ధకలుగును గాత. నేను నిన్ను ప్రజ్వలితుని చేయుచున్నాను. సమిధాధానమున నేను దీక్షవహించిన వాడనయినాను - "దీక్షితో అహమ్"

    25. ఏ బ్రహ్మలోకమున బ్రహ్మణక్షత్రియులు కలసి సాగుదురో. ఎచట అగ్ని సహితులై సమస్త దేవతలు విరాజమానులగుదురో, అపుణ్యలోకములు నాకు తెలియును గాత. "లోకం పుణ్యం ప్రజ్ఞేషం".

    26. ఎచట ఇంద్రవాయులు కలసి సంచరింతురో, ఎచట ఆకలి దప్పులుండవో అట్టి "లోకం పుణ్యం ప్రజ్ఞేషం".

    27. సురా! సోమాంశమున నీ అంశము సంయుక్తమగును గాత. పర్వము పురుషునితో సంయుక్త మగును గాత. నీ సుగంధము మత్తునకుగాను సోమమును ఆలింగనము చేయును గాత. అవినాశ్యమగు నీయొక్క రసము సొమముతో సంయుక్తమగును గాత.

    28. సోమరసమును సురచే సించితము, పరిసించితము, ఉత్సించితము చేయుదురు - పవిత్రము చేయుదురు. ఇంద్రుడు - బభ్రువర్ణసుర యొక్క - మత్తులో శత్రువును 'నీవెంత నీబలమెంత' అని దూషించును.

    29. ఇంద్రా! ఇచట వేసిన యవలు - కరంభము- అప్పులు, శస్త్రయుక్త సోమరసము ఉన్నది. వీనిని నీవు ప్రాతః కాలమున సేవించుము.

    30. ఋత్విజులారా! దేవతలు సామమున యజ్ఞమును వర్ధిల్లచేసినారు. సామముననే దేవతలు ఇంద్రుని కొరకని జాగరణశీల జ్యోతిని కల్పించినారు. మరల మరల వృత్రుని హతమార్చు ఇంద్రునికొరకు బృహత్సామ గానము చేయండి.

    31. అధ్వర్యులారా! సోమమును రాళ్లతో దంచండి. అభిషవించండి. దశాపవిత్రముణ జల్లించండి. దానిని ఇంద్రుని పానము కొరకు అర్పించండి.

    32. ఎవడు సమస్త భూతములకు అధిపతియో, ఎవనిని సమస్త భూతములు ఆశ్రయించి ఉన్నవో, ఎవడు మహిమాన్వితులలో మహిమాన్వితుడో, ఎవడు సర్వసమర్దుడో, అట్టి వాని అనుమతి తోనే ఈగ్రహమును, పాత్రను, గ్రహించుచున్నాను. పరమాత్మ స్వరూపమున నేను నిన్ను అందుకొనుచున్నాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.