Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    12. సుర త్రాగువానికి పిచ్చిమత్తు కలుగును. మరింత మత్తు కలిగించుటకు వానిలో యుద్ధము చెలరేగును. అట్లే ఇంద్రా ! త్రావిన సోమము హృదయమున యుద్ధము కలిగించును.

    ఇంద్రా ! నీవు సోమ పూర్ణుడవు. జనులు పాడి ఆవును కాపాడుకునన్నట్లు నిన్ను కాపాడుకుందురు.

    13. హర్యశ్వా ! నీవు ధనికుడవు కావలెను. నీ స్తోత ధనికుడు కావలెను. నీవంటి ధనికుడు, కీర్తివంతునకు స్తోత ప్రభువు అగును.

    14. ఇంద్రుడు స్తుతిరహితునకు శత్రువు. అతడు ఉక్థ గానమును తెలియును. ఇప్పుడు గానయోగ్యగానము, గానము చేయపడుచున్నది.

    15. ఇంద్రా ! నీవు మమ్ము వధించు శత్రువునకు వప్పగించకుము. పరాభవించువాని వద్ద మమ్ము విడువవద్దు. శక్తివంత ఇంద్రా ! నీ కర్మబలమున మాకు ధనమును అందించుము.

    16. ఇంద్రా ! మేము నీకు మిత్రులము. నిన్ను అభిలషించువారము. నిన్ను స్తుతించుటయే మాకు ప్రయోజనము. కణ్వగోత్రీయులు ఉక్థలతో నిన్ను నుతింతురు.

    17. వజ్రధర ఇంద్రా ! నీవు కర్మవంతుడవు. నేను నీ స్తుతి మాత్రమే ఎరుగుదును. నీ అభినవ యజ్ఞమున నేను వేరు స్తుతులు ఉచ్ఛరించను.

    18. దేవతలు సోమాభిషవము చేయు యజమానిని అభిలషింతురు. నిద్రించు మానవుని అభిలషించరు. దేవతలు ఆరాటములేనివారై మదకర సోమమును సేవింతురు.

    ("ఇచ్ఛంతి దేవాః సున్వన్తమ్ నస్వప్నాయ" దేవతలు పనిచేయువారినే ఇచ్చగింతురు. సోమరులనుకాదు. వేదము పనిని కర్మను ప్రోత్సహించును. సోమరులను గుర్తించదు)

    19. ఇంద్రా ! మావద్దకు ధనముతో రమ్ము. ఉత్తమ రీతిగా రమ్ము. వయసు భార్యను పొందిన గుణవంతుడు ఆమెను కోపించడు. ఇంద్రా ! నీవు మమ్ము కోపించకుము.

    20. దుస్సహ ఇంద్రా ! కుత్సితుడగు అల్లునివలె పిలిచినంత సాయంకాలము కానివ్వడు.

    21. ఇంద్రుని అనుగ్రహము ధనవంతము. కళ్యాణకరము. అది మాకు తెలియును. ముల్లోకములందు ఆవిర్భూత ఇంద్రుడు మాకు తెలియును.

    22. అధ్వర్యులారా ! కణ్వగోత్రీయులు ఇంద్రుని కొఱకు త్వరగా సోమ హవనము చేయవలెను. అతిబలవంతుడు అనంత రక్షణల ఇంద్రుని కన్న అధిక యశశ్విని మేము ఎరుగము.

    23. ఇంద్రుడు శక్తిశాలి. వీరుడు. మానవహితైషి. అభిషవకర్తలగు అధ్వర్యులారా ! ఇంద్రునకు ప్రధానముగా సోమము సమర్పించండి. ఇంద్రుడు సోమపానము చేయవలెను.

    24. ఇంద్రుడు సుఖకర స్తోతలను బాగుగా ఎరుగును. ఆ ఇంద్రుడే హోతలకు, స్తోతలకు అనేక అశ్వములు, గోవులు కల అన్నము అందించవలెను.

    25. అభిషవ కర్తలారా ! మత్తు కలిగించు, స్తుతియోగ్యమగు సోమమును వీర, శూర ఇంద్రునకు సమర్పించండి.

    26. సోమపాన పారాయణుడు, వృత్రహంత ఇంద్రుడు విచ్చేయవలెను. మేము దూరము వెళ్లనవసరము ఉండరాదు. అనేక రక్షణలుకల ఇంద్రుడు శత్రువును తిరస్కరించవలెను.

    27. ఇంద్రుని రెండు అశ్వములు స్తోత్రవంతనములు. సుఖావహములు. అవి స్తుతులద్వారా వినదగినవాడును ఆశ్రయము యోగ్యుడను, మిత్రుడగు ఇంద్రుని ఈ యజ్ఞమునకు తేవలెను.

    28. ఇంద్రుడు శిరస్త్రాణము కలవాడు. ఋషి, శక్తివంతుడు. అట్టి ఇంద్రా ! ఇది స్వాదిష్ట సోమము. క్షీరాది ద్రవ్యములు కలిసినది. నీవు విచ్చేయుము. నీవు ప్రసన్నతా ప్రియుడవు. స్తోతలు నిన్ను స్తుతించుచున్నారు.

    29. ఇంద్రా ! వర్థిల్లగోరు స్తోతలు, సకల స్తోత్రములు బహుధన, బలప్రాప్తికొరకు నిన్ను వర్థిల్ల చేయుదురు.

    30. ఇంద్రా ! నీవు స్తుతులచే మహనీయుడవు. స్తోత్రములు, ఉక్థలు అన్ని కలిసి నీ బలమును పెంచును.

    31. ఇంద్రుడు బహుకర్మి. వజ్రపాణి. అతడు సదా శత్రువులకు అజేయుడు. అతడు స్తోతలకు బలము కలిగించును.

    32. ఇంద్రుడు ఎడమచేత వృత్రుని వధించినాడు. అతడు అనేక స్థానములకు పిలువబడువాడు. అతడు అనేక కార్యములవలన ఘనుడు.

    33. సకల ప్రజ ఇంద్రుని అధీనులు. ఇంద్రుడు అచ్యుతుడు. బలవంతుడు. అభినవుడు. అతడే యజమానులను అనుగ్రహించును.

    34. ఇంద్రుడు ఈ సకల కార్యములు చేసినాడు. అతడు సర్వత్ర విఖ్యాతుడు. హవివంతులకు అన్నదాత.

    35. ఇంద్రుడు ప్రహరణశీలుడు. గమనశీలుడు, గవాభిలాషులగు స్తోతలను అపక్వబుద్ధిగల శత్రువుల నుండి రక్షించును. ఇంద్రుడు రక్షించిన స్తోత స్వామి అగును. ధనవాహకుడు అగును.

    36. ఇంద్రుడు ధనికుడు. అతడు అశ్వసాయమున చేరదలచిన చోటుకు చేరును. అతడు శూరుడు. మరుత్తుల సాయమున వృత్రుని వధిస్తాడు. అతడు తన సేవకుడగు యజమానిని రక్షించును. ఇంద్రుడు సత్యస్వరూపుడు "సత్యోవితా"

    37. ఇంద్రుడు ప్రియమేధ - ఋషి. అతనిమీద మనసుంచి యజ్ఞము చేయండి. సోమపానమున ఇంద్రుడు ప్రసన్నుడగును. అతని హర్షము నిష్ఫలము కాదు.

    38. ఇంద్రుడు సాధురక్షకుడు. అన్నాభిలాషి. నానాదేశగామి. వేగవంతుడు. యశోవంతుడు. కణ్వపుత్రులారా ! అటువంటి ఇంద్రుని స్తుతించండి.

    39. ఇంద్రుడు సుకర్మ, సఖుడు. అడుగుల గుర్తులు లేకున్నను నేతలగు గోవులను తిరిగి ఇచ్చినాడు. దేవతలు తాము కోరిన వాటిని ఇంద్రుని నుండియే పొందినాడు.

    (యజమానుల గోవులను గుర్తించుటకు వాటి అడుగుల గుర్తులు కారణములయినట్లున్నవి. ఇంటిని గుర్తించుటకు చేతిగుర్తులు వేయుట గృహప్రదేశమున ఆచారము.)

    పణులు అపహరించిన గోవులను ఇంద్రుడు తిరిగి ఇచ్చినాడు.

    40. వజ్రీ ఇంద్రా ! నీవు మేక రూపమున పోవుచు ఇట్లు స్తుతించు కణ్వపుత్రుడు మేధ్యాతిథిని స్వీకరించినావు.

    41. విభిందు రాజా ! నీవు దాతవు. నాకు నలుబది వేల ధనమును ఇచ్చినావు. తదుపరి ఎనిమిదివేలు దానము చేసినావు.

    42. ద్యావాపృథ్వి ప్రఖ్యాత. జలవర్ధక. ప్రాణుల స్రష్ట. స్తోతల విషయమున అనుగ్రహశీల. ధనోత్పత్తికిగాను నేను ద్యావాపృథ్వులను స్తుతించినాను.


                                  మూడవ సూక్తము

    ఋషి -కణ్వపుత్రుడు మేధాతిథి, దేవత - ఇంద్రుడు  ఛందస్సు బృహతి, 21
                             అనుష్టుప్, 22-23 గాయత్రి.

    1. ఇంద్రా ! మా సోమము అభిషుతము రసవంతము దుర్ధయుక్తము. దీనిని సేవించుము. తృప్తుడవగుము. నీవు మాతో కూడి మత్తుడవు కాదగిన వాడవు. బంధువవై మమ్ము వర్థిల్ల చేయుటకు ప్రవృద్ధుడవగుము. నీ అభివృద్ధియే మాకు పరమరక్ష.

    2. మా మీద నీ అనుగ్రహము కలుగవలెను. మేము హవిగల వారము కావలెను. శత్రువు కొఱకు మమ్ము కొట్టవద్దు. అనేక రక్షణలు కలిగించి మమ్ము రక్షించుము. మమ్ము ఎల్లప్పుడు సుఖముగా ఉంచుము.

    3. ఇంద్రా ! నీవు బహుధనవంతుడవు. ఇవి మా స్తుతిరూప వచనములు. ఇవి నిన్ను వర్థిల్లచేయును. విద్వాంసులు అగ్ని సమాన తేజస్కులు. విశుద్దులు. వారు నిన్ను స్తుతింతురు.

    4. ఇంద్రుడు వేయిమంది ఋషులనుండి బలము పొందినాడు. విస్తీర్ణుడు అయినాడు. అతని వాస్తవ మహిమ, ప్రఖ్యాతి గొప్పవి. వారిని యజ్ఞములందును, విప్రరాజ్యములందును స్తుతించుట జరుగును.

    5. మేము యజ్ఞప్రారంభమున ఇంద్రుని పిలుతుము. యజ్ఞపు చివరన కూడ ఇంద్రుని పిలిచెదము. మేము మరుత్తులము అగుదుము. ధనప్రాప్తి కొఱకు ఇంద్రుని పిలుతుము.

    6. తన బలపు మహిమతో ఇంద్రుడు ద్యావాపృథ్వులను విస్తరింపచేసినాడు. సూర్యుని వెలిగించినాడు. సకల భువనములను ఇంద్రుడి నియమించినాడు. సోమమును సహితము ఇంద్రుడే నియమించినాడు.

    7. ఇంద్రా ! స్తోతలు అందరు దేవతలకన్నముందు సోమపానమునకు నిన్నే ఆహ్వానింతురు. నిన్నే స్తుతింతురు. ఋభుగణములు సహితము. విధివిహితముగ నిన్నే స్తుతింతురు.

    ఇంద్రా ! నీవు ప్రాచీనుడవు. రుద్రులు సహితము నిన్నే స్తుతింతురు. "రుద్రాగృణంత పూర్వమ్"

    8. ఇంద్రుడు అభిషుత సోమ పానము చేయును. అతనికి మత్తు ఎక్కును. ఎప్పుడు అతడు యజమాని బలమును, వీర్యమును పెంచును. ప్రాచీనులు ఇంద్రుని స్తుతించినారు. నేటివారు సహితము ఇంద్రుని గుణగణములను స్తుతించుచున్నారు.

    9. ఇంద్రా ! నీవు శోభన వీర్యవంతుడవు. ప్రథమ లాభముగా నిన్ను నేను ఉత్తమ అన్నము యాచిస్తాను. నీవు నీ బలముతో కర్మ రహిత జనులనుండి హితకర ధనము గుంజుకున్నావు. దానిని భృగువునకు ఇచ్చినావు. ప్రస్కణ్వుని నీవు రక్షించినావు. నిన్ను నేను అట్టి బలము అన్నమునే యాచింతును.

    10. ఇంద్రా ! నీ బలము మహత్తరము. ఆ బలమున నీవు సముద్రమునకు కోరిన జలము ఇచ్చినావు. ఆ జలమే మాకు అభీష్ట ఫలదము కావలెను. నీ మహిమ స్వయముగా వ్యాపించదు. పృథ్వి నీ మహిమను వ్యాపింపచేయును.

    (ఇంద్రుడు తన మహిమను తాను చెప్పుకొనడు. ఇతరులు వ్యాపింప చేయుదురు అని తాత్పర్యము.)

    11. ఇంద్రా ! నీ వీరత్వము శోభన బలోపేతము. దానినే నేను కోరుచున్నారు. అటువంటి ధనమును ఇమ్ము. నిన్ను పూజించువానికి, హవినిచ్చు యజమానికి తొలుత ధనము ఇమ్ము. తదుపరి స్తోతలకు ఇమ్ము.

    12. ఇంద్రా ! నీ ధనము స్తుతించదగినది. పూజింపదగినది. దానితో నీవు పురురాజు పుత్రుని రక్షించినావు. ఆ ధనమునే యజమానికి ఇమ్ము, నీవు రుశ్మ, శ్యావక, కృప, నామక రాజులను రక్షించినావు. అట్లే హవి వంత యజమానులను రక్షింపుము.

    13. స్తుతులు సంతత గమన శీలములు. వాటికి ప్రేరణ కలిగించు ఏ అభినవ మానవునకు ఇంద్రుని స్తుతించు శక్తి కలదు? ఇంద్రుడు సుఖలభ్యుడు. అతనిని స్తుతించువారు ఇంద్రుని మహిమలు పొంద శక్తులగుదురా?

    14. రథము శత్రువిజయి. ధనవతి. అక్షయము. అన్నాభిలాషి. ప్రసిద్ధము, అత్యంత మధురమగు వాక్యము, స్తుతి ఆ రథమువలె ఉచ్చరించబడును.

    15. కణ్వులవలె, భృగువులును, సూర్యకిరణసమానధ్యాత, వ్యాప్తుడగు ఇంద్రునకు పరివ్యాప్తి కలిగించినారు. ప్రియమేధ నామక మానవులు ఇంద్రుని పూజించినారు. స్తోత్రములతో స్తుతించినారు.

    16. ఇంద్రా ! నీవు వృత్రుని వధించినావు. నీ హర్యశ్వద్వయమును రథమును పూన్చుము. నీవు ధనికుడవు. ఉగ్రుడవు. మరుత్తులు దర్శనీయులు. వారి వెంటరమ్ము. దూరదేశము నుండి రమ్ము. సోమపానమునకు రమ్ము. మావద్దకు రమ్ము.

    17. ఇంద్రా ! యజమానులు కర్మకర్తలు. ధీరులు. మేధావులు. యజ్ఞసేవకుగాను వారు నిన్ను స్తుతింతురు.

    ఇంద్రా ! నీవు ధనికుడవు. స్తుతిపాత్రుడవు. కాముకునివలె ఏకాగ్రముగ మా పిలుపువినుము.

    18. ఇంద్రా ! మహాధనువున నీవు వృత్రుని వధించినావు. మాయావులగు అర్బుద, మృగములను నీవు నాశము చేసినావు. పర్వతము నుండి గోవులను వెలికి తీసినావు.

    19. ఇంద్రా ! వృత్రుడు మహనీయుడు. హసన శీలుడు. వానిని నీవు అంతరిక్షమున తొలగించినావు. అప్పుడు నీ బలము వెల్లడి అయినది. అప్పుడు అగ్ని, సూర్య, ఇంద్రులు సేవించు సోమరసములు సహితము ప్రదీప్తములయినవి.

    20. ఇంద్ర మరుత్తులు నాకు ఇచ్చినారు. కురుయాన, పుత్రుడు పాకస్థాముడు, నాకు అదియే ఇచ్చినాడు. ఆ ధనము అన్ని ధనములవంటిదికాదు. అది స్వర్గమున కేగుచు ప్రభాయుక్త సూర్యునివంటి తేజస్సు పొందును.

    21. పాకస్థాముడు నాకు అశ్వములను ఇచ్చినాడు. అవి లోహిత వర్ణములు. సుందర వహన ప్రదేశములు. బంధన రజ్జుపూర్కములు. నానావిధ ధనములను సాధించునవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.