Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషములు ధరించి నగరమున ప్రవేశించినారు. పుష్పమాలాదులు , గంధము ఉండెడి గృహములందు దూరి వానిని ధరించినారు. అర్ధరాత్రి జరాసంధుని గృహమున ప్రవేశించినారు. అట్లు బ్రాహ్మణులు ప్రవేశించుట అక్కడి పద్దతి.
    జరాసంధుడు వారిని చూచినాడు. ఎదురు వచ్చినాడు. మధుపర్కములను ఇచ్చినాడు. సత్కరించదలచినాడు. వచ్చినవారు వాటిని నిరాకరించినారు. తరువాత వారి మధ్య ఈవిధంగా సంభాషణ జరిగినది.
    జరాసంధుడు:- మీ వేషములు బ్రాహ్మణులవలె ఉన్నవి. లక్షణములు క్షత్రియుల వలె ఉన్నవి. మీరు భేరీలను బద్దలు కొట్టినారు. ద్వారము లేని చోటు నుండి పురమున ప్రవేశించినారు. పుష్పమలాదులు బలవంతముగా గ్రహించినారు. నేనిచ్చిన మధుపర్కములను నిరాకరించినారు. మీరెవ్వరు?
    శ్రీకృష్ణుడు :- మేము క్షత్రియ జాతి స్నాతకులము. అమిత్రుని పురమున ద్వారములేని చోటు నుండి ప్రవేశించవలెను. మిగతా కార్యములు అందుకు తగినట్లు చేసినాము. మాకు నీతో ఇతర ప్రయోజనము ఉన్నది. అందువలన నీవు ఇచ్చిన మధుపర్కములు గ్రహించలేదు.
    జరాసంధుడు:- నేను మిమ్ములను ఇంతకూ ముందు ఎరుగను. మీకు అపకారము చేసి ఎరుగను. నేను మీకు శత్రువును ఎట్లయినాను?
    శ్రీకృష్ణుడు:- జరాసందా! అధర్మము పలుకుచున్నావు. నీకు కీడు తలపెట్టని రాజులను తెచ్చి చెరపట్టినావు. రోజుకు ఒక్కరి చొప్పున వధించి రుద్రపూజ చేయుచున్నావు. అది ధర్మమగునా? నీవు బలవంతుడను అని గర్వించుచున్నావు. జయాద్రధ, దంబోద్భవ,కార్తవీర్యార్జునులను మించిన వాడవుకావు. వారు పెద్దలను అవమానించినారు. హతులయినారు. మేము సర్వధర్మములను రక్షించుటకు సమర్దులము. కాబట్టి చెరనున్న రాజులను విడువుము. నేను శ్రీకృష్ణుడను. యితడు భీముడు అతడు అర్జునుడు. నీవు రాజులను విడవకున్న భీమార్జునులు యుద్దమున నీ గర్వము అణచుదురు. చెరలో నున్న రాజులను విడిపింతురు.
    జరాసంధుడు కోపించినాడు. కనుబొమలు కదిలించినాడు. బలగర్వమున అన్నాడు :- "నేను క్షత్రియ కార్యము చేసినాను. . రాజులను పట్టితెచ్చినాను. విడిపించను. మీతో యుద్దము చేయ సిద్దముగా నున్నాను. ఎవరు చేతురు యుద్దము నాతొ? ఒకరా? ఇద్దరా? ముగ్గురా?"
    శ్రీకృష్ణుడు నవ్వినాడు. అన్నాడు "జరసందా! మా ముగ్గురిలో ఒకరిని ఎన్నుకొనుము. మల్ల యుద్దము చేయును. అప్పుడు చూతము."
    జరాసంధుడు భీముని కోరుకున్నాడు. కార్తీక శుక్లపాడ్యామి నాడు మల్లయుద్దము ప్రారంభము అయినది. భీమ జరసందులు మహాబలవంతులు. వారిద్దరు సమముగా యుద్దము చేసినారు. రెండు సింహముల వలె పోరినారు. రెండు మదపుటేనుగుల వలె పోరినారు. దేవేంద్ర వృత్రాసురుల వలె పోరినారు.
    నాడు కార్తీక త్రయోదశి. రాత్రి సమయము. జరాసంధుడు అలసి ఉన్నాడు. అది శ్రీకృష్ణుడు గ్రహించినాడు. భీమునితో "జరాసంధుని చంపి నీ బలము , నీ తండ్రి వాయుదేవుని బలము ప్రదర్శింపుము" అన్నాడు. భీముడు తండ్రి వాయుదేవుని తలచుకున్నాడు. భీముడు విక్రమించినాడు. పరాక్రమించినాడు. మహా భయంకరుడు అయినాడు. జరాసంధుని పట్టినాడు. నేలకు కొట్టినాడు. నూరుమారులు విసరినాడు. జరాసంధుడు గాలికి గడ్డి పరకవలె పడకినాడు. జరాసంధుని దేహమును భీముడు దారుణముగా మధ్యకు చీల్చినాడు. వాని ఎముకలు విరిచినాడు. జరాసంధుడు రక్తము కక్కి భయంకరముగా చచ్చినాడు.
    భీముడు జరాసంధుని చంపి సింహనాదము చేసినాడు. ఆ విజయధ్వానమునకు దిక్కులు పిక్కటిల్లినవి. అది విని గిరివ్రజ ప్రజ ఉరికి వచ్చినది. జరాసంధుని భార్యల గర్బములు కుల్లినవి. జరాసంధుని సైన్యపు ధైర్యము చచ్చినది. భీముడు జరాసంధుని కళేబరమును నగర ద్వారమునకు తెచ్చి పడవేసినాడు. మహా పరాక్రమవంతుడై విరాజిల్లినాడు.
    అప్పటికి తెల్లవారినది. సూర్యుడు ఉదయించినాడు. చల్లని గాలులు వీచినవి. శ్రీకృష్ణుడు చెర నున్న రాజులను విదిపించినాడు. వారందరు గ్రహణము విడిచిన చంద్రుని వాలే ప్రకాశించినారు. శ్రీకృష్ణునకు రత్నరాసులిచ్చి పూజించినారు. జరాసంధుని కొడుకు వసుదేవుడు. శ్రీకృష్ణుడు వసుదేవుని రాజ్యమున నిలిపినాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని దివ్య రధమును తెప్పించినాడు. అది ఇంద్రుడు వసురాజునకు , వసురాజు బృహద్రదునికి ఇచ్చిన రధము. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచినాడు. గరుడుడు సారధ్యము వహించినాడు. శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్తమునకు బయలుదేరినారు. చెరవీడిన రాజులు కూడ వత్తుమన్నారు. వారి సహితముగా శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్ర ప్రస్థము చేరినారు. తమ విజయ యాత్రను గురించి ధర్మరాజునకు వివరించినారు. విడిపించిన రాజులను చూపించినారు. ధర్మరాజు, ఆ రాజులను గౌరవించినాడు సత్కరించినాడు. మర్యాద పూర్వకముగా వారి వారి దేశములకు పంపినాడు.
    శ్రీకృష్ణుడు ధర్మరాజు అనుమతి పొందినాడు ఆ దివ్యరధమును ఎక్కినాడు. ద్వారకకు వెళ్ళినాడు. అంతట ధర్మరాజు నలుగురు తమ్ములను దిగ్విజయ యాత్రకు పంపినాడు.
    అర్జునుడు అగ్నిదేవుడు ఇచ్చిన రధమును ఎక్కినాడు. గాండీవము ధరించినాడు. ఉత్తర దిక్కునకు వెళ్ళినాడు. పుళిందరాజును, ప్రతివింధ్యుని, భగదత్తుని, సేనాబిందుని, విష్వగశ్వుని, పార్వతేయులను, బర్బర, పారశీక, తుర్కదేశపు రాజులను, పౌండ్ర కాశ్మీర, త్రిగర్త లోహిత, సుధవ్వ, గాంధార, కాంభోజ, సింహపుర, నిషాదరాజులను జయించినాడు. అర్జునుడు అజేయములయిన ఉత్తర కురు దేశములను జయించినాడు. వారి వద్ద ధనరాసులను తీసుకున్నాడు.
    భీముడు తూర్పుదిక్కునకు వెళ్ళినాడు. దశార్ణరాజు సుధన్వుని ఆశ్వరధ ప్రభువు రోచమానుని , చేది దేశపురాజగు శిశుపాలుని, పుళింద, కోసల, అయోధ్య, కాశీ, మత్స్య , మాళవ, కర్ణాట దక్షిణ మల్లులను జయించినాడు. భీముడు చంద్రసేనుని , పాండ్రక వాసుదేవుని గెలిచినాడు. వారి వద్ద రత్నరాశులను తీసుకున్నాడు.
    సహదేవుడు దక్షిణమునకు వెళ్ళినాడు. మిత్ర, శూరసేన, దత్త, యవనులను జయించి గోశ్రుంగ పర్వతవాసులను గెలిచి, కుంతిభోజునిచే గౌరవించబడి, జంభకునితో యుద్దము చేసి అనేక ధనరాసులను గ్రహించినాడు.
    సహదేవుడు మాహిష్మతీ పట్టణమును ముట్టడించినాడు. అప్పుడు అగ్ని ప్రజ్వరిల్లినది. సహదేవుని సైన్యమును చుట్టుముట్టినది. అట్లు జరిగుటకు ఒక కధ ఉన్నది:-
    పూర్వము మాహిష్మతిని నిషదుడు పాలించినాడు. అప్పుడు అగ్ని దేవుడు బ్రాహ్మాణ రూపమున ఆ పట్టణమున ఉన్నాడు. అతడు పొరపాటున పరస్త్రీతో రమించినాడు. భటులు అగ్నిని పట్టుకున్నారు. రాజు శాస్త్ర సమ్మతమయిన శిక్ష విధించ తలచినాడు. అగ్ని నిజరూపము ప్రదర్శించినాడు. రాజు గడగడలాడినాడు. మన్నించమని వేడుకున్నాడు. అగ్ని సంతసించినాడు. రాజును వరము కోరమన్నాడు. మాహిష్మతికి వచ్చిన శత్రువులను దహించవలసినదని వరముకోరినాడు రాజు. అగ్నిదేవుడు వరము ఇచ్చినాడు. తనకు ప్రియమయిన కార్యము చేయవలసినదని రాజును కోరినాడు. అదే మన మాహిష్మతీ నగరమునందలి స్త్రీలు పర పురుషులతో సంగమించినను వ్యభిచారిణులుగా పరిగణించరాదు. రాజు అందులకు అంగీకరించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.