Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    "నాకు అదంతా తెలుసుకోవాలని ఉంది. ఏదీ ఆ బాధనంతా కళ్ళల్లో ........" ఆగిపోయాడు. కళ్ళల్లోకి చూస్తూ నిశ్చలుడైపోయాడు.
    కన్నీటితో మెరిసిపోతున్న ఆమె సుందర వదనాన్ని చూసి తన్నుతానే మరిచి పోయారు. లేచి నుంచున్నాడు. రెండు చేతులూ ఆమె భుజాల మీదికి పోనిచ్చాడు. గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. మరీ దగ్గరికీ లాక్కున్నాడు. ఆమె శరీరం అతని శరీరంలో కలిసి ఏకం అయిపొయింది. ఊపిరి గబగబా పీల్చాడు.
    "చంద్రలేఖా!" కంఠం కంపించింది దగ్గరికీ అదుముకున్నాడు.
    కొద్ది క్షణాల పాటు ఆమె గడ్డ కట్టుకొని పోయింది. పిడుగు పడ్డట్టు ప్రాణం ఎగిరిపోయింది. ప్రతిమలా కొద్ది క్షణాలు ఉండిపోయింది. క్రమక్రమంగా ధమనుల్లోకి కొద్ది కొద్దిగా రక్తం ప్రసరించింది. మనసులోంచి పొంగిన విష తరంగం గొంతు దాకా పొర్లింది.
    "వద్దు ........వద్దు ........"
    ఆమెను పట్టుకొని బాదుతున్నట్లు గొంతులో భయంకరమైన బాధ వ్యక్తం అయింది. రెండు చేతుల్తోనూ అతన్ని వెనక్కు నెట్టింది.
    ఆమె కోపం అతణ్ణి చకితుణ్ణి చేసింది. పొంగుతూ తగ్గుతూన్న ఆమె వక్షోజాలు అతణ్ణి భయ విహ్వలున్ని చేశాయి.
    అలా నెట్టి పడక గదిలోకి పారిపోతున్న లేఖను చూసి "చంరలేఖా!" అని అరచాడు. ఆమె విననైనా విననట్టే గదిలోకి వెళ్ళి దుభాల్న తలుపు వేసుకుంది.
    భయం వికృతాట్టహాసం చేస్తున్న ఆమె ముఖం ఆమె వెళ్ళిపోయినా , చాలాసేపు అతని ముందు నిల్చి ఉంది. అతని కలలన్నీ పటాపంచలైనాయి. ముఖంలో భయం తాండవించడం అతడు ఇంతకూ ముందు ఒకసారి చూశాడు. అదే పూర్ణి ముఖం. అది నేటికీ అతని హృదయంలో నిలిచి ఉంది.
    "నా కష్టాలు గట్టెక్కే రోజు వస్తుంది. అప్పుడే నాకు విముక్తి."
    "గ్లాసుడు చల్ల తెచ్చేదా?" వంటమనిషి మాట విని తేరుకున్నాడు.
    తల పంకించి సాగిపోయాడు. మెట్ల దాకా వెళ్ళాడు. ఆగి చుట్టూ చూశాడు. వంటమనిషి దగ్గరగా వచ్చి చూసింది. ఆశ్చర్యం ఆమె కళ్ళల్లో కనిపించింది.
    మెల్లగా మెట్లు దిగాడు.

                                                          *    *    *

    ఉన్మాదం తగ్గింది. ఉపశమనం లభించింది. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసిన విషతరంగానిక్కారణం ఆమెకు తెలుసు. ఆ విష వలయాన్నించి దూరంగా ఉండడానికి తాను పడిన బాధలన్నింటిని మననం చేసుకుంది.
    ........ఆ రక్కసి మగవాడున్న గదిలోకి నెట్టి తలుపులు వేసుకొని వెళ్ళిపోయింది . రొప్పుతూ రోజుతూ తాను గోడకు చేరగిలబడింది. వాడు తన మీదికి వస్తుంటే అరచేతులు గోడకు ఆన్చి గోడకు అతుక్కుని పోయింది. అతడు మీదికి వస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుంది. భయంతో గజగజా వణికి పోయింది. వాడు "అర్ధం అయింది ' అని లైటు అర్పేశాడు. "భయపడకు" అని చెవులో చెప్పినంత మెల్లగా అన్నాడు. అతని శ్వాస పాము బుసలా ముఖానికి తాకింది. చీరే పట్టుకొని లాగాడు. కొంగు రొమ్ము మీద గట్టిగా పట్టుకొని వాడితో పోరాడింది. అతడేదో అన్నాడు. ఆమెకు వినిపించలేదు. అతని చేతులు శరీరం మీద అక్కడక్కడ తడిమాయి. అతని చేయి చీర క్రిందికిపోయి పాలిండ్ల ను పట్టుకుంది. ఆ తాకిడితో ఆమెలోని శక్తి జ్వాలగా లేచింది. పాము పాడగ విప్పి బుస కొట్టింది. ఒక్కసారి వెనక్కు గెంటి తలుపు వైపు పరిగెత్తింది.
    "తాళం ఉంది" అన్నాడు మెల్లగా.
    తలుపు పట్టుకుని వంగింది. వెలిగించిన సిగరెట్టూ పట్టి మంచం మీద కూర్చున్నాడని గ్రహించింది. వాడేదేదో చెప్పాడు. ఆమెకు ఏమీ అర్ధం కాలేదు. నగలూ, బట్టలూ, చక్కని ఇల్లూ ఇంకేమేమో ఇస్తానన్నాడు. మెత్తని కత్తులు, "బుద్ది తెచ్చుకో, రాణిలా ఉండు" అని బుద్ది చెప్పాడు.
    తాను అక్కడే నుంచుంది. నూనె వడిసిన దీపంలా ఆమెలోని శక్తి భగ్గు భగ్గు మంటుంది. తనవీపు కొరడా దెబ్బల్తో నెప్పి పెడుతూంది. నుంచొని , నుంచొని పడిపోయింది. అలా నిద్రవస్తే బాగుండను కుంది. శాశ్వత నిద్ర వచ్చినా మేలేననుకుంది . కాళ్ళు గడగడా వణికాయి.
    మళ్ళీ గబాగబా వచ్చే ఊపిరి తన ముఖం మీద మంట పెట్టింది. వాడు తన్ను పిచ్చిగా పట్టుకున్నాడు. ఊపిరైనా అడనంత గట్టిగా పట్టుకున్నాడు. మూతి తన ముఖాన్ని తాకుతుంది. అది కనురెప్పలనూ, చెక్కిళ్ళనూ , మెదనూ బిగించిన పెదవులనూ తాకింది. తనలోని శక్తి చచ్చి వగర్చింది. మూలిగింది. కాని ముఖం తిప్పుకునే శక్తి లేకపోయింది.
    "వద్దూ ......వద్దూ ........" అని చివరకు అరచి, చేతుల్తో బలవంతంగా ముఖాన్ని వెనక్కు నెట్టి పెదవుల్ని లాక్కొని ముఖం మీద ధూ .....ధూ..... ధూ అని అనేకసార్లు ఊపింది.
    కడుపులో తిప్పి వాంతి వచ్చింది. పుల్లటి నీళ్ళు నోట్లోకి వచ్చాయి.
    నాటి గుర్తులు నేటికీ తన శరీరం మీద ఉన్నాయి అనుకుంది. రూడి చేసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళింది.
    గుర్తులేమీ లేవు. తన ముఖం అందరి ముఖాల్లాగే ఉంది.
    అద్దంలోకి చూసుకుంటూ జాకేట్టూ గుండీలు తీసింది. వక్షోజాలు సంపూర్ణ స్వర్ణకలశాల్లా వున్నాయి. ఒక గంట ముందు అవి కరుకు మగచేతిలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే విముక్తములైనాయి. అయితే అ పురుష హస్త చిహ్నలేవీ ?
    శరీరం మార్ధవాన్ని గానీ, సౌందర్యాన్ని గానీ కోల్పోలేదు. బాధ కలిగింది మనసుకు. లేఖ హృదయం వ్యధ చెందింది. ఆమె అందరి లాంటి ఆడది కాదు. ఆమె విశేష స్పష్టి.
    తాను హర్ధకానురాగం అందించింది. అతడు ఒలకపోసుకున్నాడు. తన హృదయంలో మందిరం నిర్మించింది. అది కూల్చుకున్నాడు. అతడు ఎందుకు అలా చేశాడు? అతడు మనుష్యమాత్రుడు కాడు. మానవాతీతుడు.
    తండ్రి తన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. తాను అతణ్ణి విశ్వసిస్తున్నానని జవాబ చెప్పింది.
    "మానవుడు క్రూర మృగాలను ఆదిగమించగలడనే విషయం అప్పుడే మరచావా ? నాటి రాత్రి ..... ఆ భయంకర కాళ...."
    అతనిలో ఉన్న రక్క సితనం తన్ను నాటి రాత్రికి తీసికెళ్ళినది. తన కోసం నిర్మించిన మందిరాన్ని కూల్చుకున్నాడు.
    అద్దం మీది నుంచి ముఖం తిప్పుకుంది. గుండీలు తీసిన జాకెట్టు రెండు రెక్కలూ కొట్టుకుంటూ ఉండగా గదిలో అటూ ఇటూ తిరిగింది.
    "ఉత్సాహం చాలా ఉంది. కాని నా అధీనంలో ఉన్నావు. " అతని ముఖంలోని మార్దవం, దయార్ధ్రత ఒక మహా శక్తి లాంటిది. అది శ్రుంఖలాల్ను పటాపంచలు చేస్తుంది. అతని కళ్ళల్లో పోరాటం - నీవూ నేనూ సాగిపోదాం. కలుపుగోలుతనం -- నిర్మించబోయే కొత్త జీవితం -- నీవూ నేనూ ఉంటె చాలు -- లేఖ లేఖగా ఉంటె చాలు -- ఎక్కువ గానీ, తక్కువ గానీ అవసరం లేదు -- ఎంత అసమర్దురాలైనా తనలా కాగలుగుతుంది - తన స్థానంలో నిలువ కలుగుతుంది.
    అతణ్ణి తన ముందు చూడ్డానికి ఒక లిప్త. ఒక క్షణం సహితం దీర్ఘాకలంగా కనిపిస్తుంది. నిండుముఖం-- కనీనికల్లో కాంతి -- అతని స్పర్శలో ఏదో ఉద్రేకం ఏదో ఆవేశం -- సర్వదా సంసిద్దత్వం -- అంతా ఏదో నాటకంలో పాత్రలా ఉండేది. వాస్తవానికి దూరంగా ఆదర్శాలతో చేయబడిన మూర్తిలా ఉండేవాడు.
    "మానవుడు క్రూర మృగాలను అధిగమించగలడనే విషయం అప్పుడే మరచావా?"
    తాను భ్రమతో అతని కోసం మందిరం నిర్మించింది.
    "సరే. మరి ఇంకో మందిరం? ఆ బండ దేవుడి గుడి ?"
    గుడిని గురించిన ఆలోచన రాగానే ఆమె కిటికీ లోంచి వంగి చూసింది. గుడి గోపురం మీది ఇత్తడి త్రిశూలం సూర్యుని కాంతికి ధగధగా మెరుస్తుంది. ఆమెలో ఏర్పడ్డ అగాధాన్ని దేవాలయం పూడ్చగలదా?
    తదేక ధ్యానంతో ఆమె దృక్కులు గుడి మీద నిలిచాయి. సూర్యకాంతికి మెరిపోతున్న దేవాలయం వంగి ఆమెను తాకినట్లు అయింది. తానూ దేవాలయం అయింది. దేవాలయం తానైంది. బేధం అంతరించి అంతా అధైత్వం అయిపొయింది.
    మంత్రముగ్ధ అయిన లేఖ సర్వస్వమూ అ వింత అనుభూతి ముందు మోకరిల్లింది.
    వేసవి గాలి ఆమె వెంట్రుకల్లోకి దూసుకొని పోయి వాటిని చెక్కిళ్ళ మీదికి విసిరింది. కితికిని పట్టుకున్న ఆమె చేతులు తిమ్మిర్లేక్కాయి. ఆమె గుండె, తధస్తూ తధాస్తూ అన్నది.
    మాయం అయిపోయిన బాధ మళ్ళీ ఆమె నాయన యుగాన్ని కాటువేసింది. నేత్రాలు బాధా పరితప్తాలు అయినాయి. కాన అధర మాత్రం కదల్లేదు.  




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.