Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    ద్వాదశ కపాల పురోడాశము సవితృదేవతాకము. అందువలన యజమాని సవితృదేవుని వలన హిరణ్యము పొందును.

    చరు హవిస్సు భూదేవతాకము. కావున యజమాని భూమినుండియే బంగారము పొందును.

    11. ఒకనికి హిరణ్యము కలుగును. అందువలన చోరాది భయములు కలుగును. భయమున బలము లేనివాడగును. అతడు ఇంద్రియ బలవిహీనుడు అగును. అట్టివాడు ఇంతకు ముందు చెప్పిన మూడు హవిస్సుల ఇష్టిని చేయవలెను. అందువలన యజమానికి ఇంద్రియ బలహీనత కలుగకుండును.

    12. బంగారము పోగొట్టుకున్న వాడును ఈ మూడు హవిస్సుల ఇష్టినే ఆచరించవలెను.

    నిర్వాపము చేయబడిన పురోడాశము అగ్ని దేవతాకము. హిరణ్యము అగ్ని సంబంధి. హిరణ్యము ఏ అగ్నికి సంబంధించినదో ఆ అగ్నియే యజమానికి పోయిన బంగారమును తిరిగి ఇప్పించును.

    నిర్వాపము చేయబడిన పురోడాశము సవితృదేవతాకము. కావున సవితృనిచే ప్రేరితుడై యజమాని పోయిన బంగారమును తిరిగి అందుకొనుచున్నాడు.

    నిర్వాపము చేయబడిన పురోడాశము భూమి దేవతాకము. ఈ భూమియందే కదా బంగారము దాగి ఉన్నది! అందువల్ల యజమాని ఈ భూమియందే నష్టపోయిన బంగారము కనుగొనుచున్నాడు.

    13. ఇంద్రుడు సోమపానము చేసినాడు. త్వష్టను చూచినాడు. భయపడినారు. నానాదిక్కులకు పరుగులు పెట్టినాడు. ఆ విధముగా పరుగులెత్తి, బడలిక కలిగి, ఆరోగ్యము కలిగించు సోమము లేనివాడు అయినాడు. అతడు సోమమును వాంతి చేసుకున్నాడు. ఆ వాంతి పడిన నేల మీద శ్యామాక ధాన్యము ఏర్పడినది.

    అంతట ఇంద్రుడు ప్రజాపతిని సేవించినాడు. ప్రజాపతి ఇంద్రుని కొరకని సోమేంద్ర దేవతాకమగు శ్యామాక చరు నిర్వాపము చేసినాడు. అందువలన ఇంద్రునకు బలమును, సోమపానమును ఏర్పరచినాడు.

    14. సోమమును వాంతి చేసికొన్నవాడే ఆరోగ్యప్రదమగు సోమము లేనివాడు అగుచున్నాడు. అట్టి వాడు సోమేంద్ర దేవతాకమగు శ్యామాక చరుహవిస్సును నిర్వాపము చేయవలెను. అతడు సోమ, ఇంద్రులను స్వభాగధేయమున అర్చించవలెను. సోమేంద్రులే అతని యందు బలకారకము సోమమును నిలుపుదురు. యజమాని బలకరమగు సోమము నుండి వియుక్తుడు కాడు.

    15. చరు సోమదేవతాకమగును. అందు వలన నిర్వాపకర్తకు సోమము ప్రయోజనము కలిగించును.

    చరు ఇంద్ర దేవతాకము. ఇంద్రుడు ఇంద్రియ బలకారకుడు. కావున యజమానికి బలకరమగు సోమపానము ప్రయోజనకారి అగును.

    16. పశువులను కోరువాడు పశుప్రదాత అగు అగ్ని కొరకు అష్టాదశ కపాల పురోడాశమును - అధిక ఫలప్రదాత యగు ఇంద్రుని కొరకు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    అగ్ని యజమానికి పశువులను కలిగించును. ఇంద్రుడు వానిని వృద్ధిపొందించును.

    17.  1. పెరుగు 2. తేనె 3. నేయి 4. నీరు 5. వేపుడు బియ్యము హవిస్సులగును. ఈ అయిదు పశురూపములు. వాని వలననే పశువులను పొందవచ్చును.

    18. పంచద్రవ్యములందు ఒక్కొక్క దానిని గ్రహించుట పంచగృహీతత్వము అగును. పశువులు పంక్తి ఛందస్సునకు సాధ్యములు. హవిస్సులు బహురూపములు. అందువలన పశువులు బహురూపములవి. వాని వలన సమృద్ధి కలుగుచున్నది.

    19. పంచద్రవ్యరూపహవిస్సు ప్రజాపతి దేవతాకమగును. పశువులు ప్రజాపతి సంబంధులు. కావున ప్రజాపతియే యజమాని కొరకు పశువులను కలిగించును.   

    20. మధువు పురుషునకు ఆత్మయగుచున్నది. మధువును అగ్నియందు హోమము చేయుటవలన యజమాని తన్ను తాను అగ్నికి సమర్పించినట్లు అగుచున్నది. ఇవి పంక్తి ఛందస్సు నందలి యాజ్య పురోనువాక్యలు అగుచున్నవి.

    పురుషుడు పాంక్తుడు - రెండు చేతులు + రెండు కాళ్లు + ఒక తల వలన అయిదింటివాడు - అగుచున్నాడు. పశువులు పంక్తి ఛందో సాధ్యము లైనందున పాంక్తములు.

    ఇందువలన యజమాని మృత్యువును తప్పించుకున్నవాడై, సమృద్ధి కలవాడు అగుచున్నాడు.

                                    మూడవ అనువాకము

    1.  దేవతలు యశస్సు కోరినారు. యశస్సు కలిగించు సత్రమును అనుష్ఠించినారు. అందువలన రాజగు సోమునకు యశస్సు కీర్తి లభించినవి.

    రాజగు సోముడు కీర్తిసహితుడై పర్వతమును ఆరోహించినాడు. అగ్ని సహితము అతనిని అనుసరించినాడు. పర్వతమును ఆరోహించినాడు. అక్కడ అగ్నియు సోముడును ఐకమత్యము నొందినారు.

    ఇంద్రుడు యజ్ఞభ్రష్టుడు అయినాడు. ఫలరహితుడు అయినాడు. చిరకాలమునకు అతడు సోమాగ్నులను కలిసినాడు. నాకు ఫలము కలుగునట్లు యజింపచేయుడని వారిని కోరినాడు.

    అగ్నిసోములు అగ్నిదేవతాకమగు అష్టాకపాల పురోడాశమును, ఇంద్ర దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును, సోమదేవతాకమగు చరు గల ఇష్టిని నిర్వహించినారు. అందువలన ఇంద్రునకు తేజస్సు, బలము, బ్రహ్మవర్చస్సు కలిగినవి.

    2. యజ్ఞభ్రష్టుడైన వాడు అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును, ఇంద్రదేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును, సోమ దేవతాకమగు చరు గల ఇష్టిని అనుష్ఠించవలెను. అగ్ని దేవతాకము యజమానికి తేజస్సు కలిగించును. ఇంద్ర దేవతాకము బలము కలిగించును. సోమదేవతాకము బ్రహ్మవర్చస్సు కలిగించును.

    3. అగ్నిదేవతాక, సోమదేవతాక భాగములను ఇంద్రదేవతాకము నందు కలుపువలెను. అందువలన తేజస్సు, బ్రహ్మవర్చస్సు కలిసి యజమాని యందు చేరును.

    4. కోరిన కోరిక నెరవేరనివాడు అగ్ని సోమ దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    బ్రాహ్మణుడు అగ్నికి సంబంధించినవాడు. అతడు సోమము త్రాగును. అగ్నిసోములు బ్రాహ్మణునకు దేవతలగుదురు. అతడు వారిని స్వభాగధేయమున సేవించును. ఆ దేవతలే అతని కోరికలను తీర్చెదరు. అతడు కోరికలు నెరవేరిన వాడు అగును.

    5. బ్రహ్మవర్చసము కోరువాడు అగ్ని సోమ దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అతడు అగ్ని సోములను తన భాగధేయమున సేవించవలెను. వారే అతనికి బ్రహ్మవర్చస్సు కలిగింతురు. అతడు బ్రహ్మవర్చసి అగును.

    అష్టా కపాల పురోడాశము అగ్నిదేవతది. శ్యామాకము సోమదేవతది. ఇవి రెండును యజమానికి సమృద్ధి కలిగించును.

    6. నపుంసకత్వ భయము కలవాడు ప్రజనన సమర్థమగు అన్నరసము గల సోమునకు శ్యామాక చరును నిర్వాపము చేయవలెను. ప్రజనన సమర్థ అన్నరూప రేతస్సు కొరవడినందున నపుంసకత్వము సంభవించును. అందువలన అతడు ప్రజనన సమర్థమగు అన్నరసము గల సోముని స్వభాగధేయమున అర్చించవలెను. ఆ సోముడే అతని యందు ప్రజనన సమర్థమగు అన్న రసరూపమగు రేతస్సును ఉంచును. అప్పుడు అతడు నపుంసకుడు కాకుండును.

    7. గ్రామాధికారము కోరువాడు బ్రహ్మణస్పతి దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అతడు బ్రహ్మణస్పతిని స్వభాగధేయమున సేవించవలెను. బ్రహ్మణస్పతియే అతనికి జనులను సమకూర్చును. అతడు నిశ్చయముగ గ్రామాధిపతి అగును.

    8. యాజ్యా పురోనువాక్యలు గణశబ్దవంతములు. అవి అతనిని జన సముదాయము కల వానిని చేయును.

    9. ధనగర్వమున వైశ్యుడు బ్రాహ్మణుని అవమాన పరచదలచినచో బ్రాహ్మణుడు ఈ ఇష్టినే అనుష్ఠించవలెను.

    10. యాజ్యా పురోనువాక్యలను మరుత్సంబంధులను చేయవలెను. మరుత్తులు దేవతలకు ప్రజలు అగుదురు. వారి అనుగ్రహమున యజమానికి ప్రజ అధీనము అగును.

                                  నాలుగవ అనువాకము

    1. స్వర్గము కోరువాడు ఆర్యముని కొరకు చరు నిర్వాపము చేయవలెను. అసౌవై ఆదిత్యః. అర్యముడే ఆదిత్యుడు. అతడు స్వభాగధేయమున అర్యముని సేవించవలెను. అర్యముడే అతనికి స్వర్గము కలిగించును.

    2. జనులు తనకు దానము చేయవలెనను కోరిక గలవాడు అర్యముని కొరకు చరునిర్వాపము చేయవలెను. అసౌ వై ఆదిత్యః. దానము ఇచ్చువాడు అర్యముడు - తేజోవంతుడు. అతడు అర్యమునే స్వభాగధేయమున సేవించవలెను. ఆ అర్యముడే ప్రజలు అతనికి దానము ఇచ్చునట్లు చేయును. ప్రజలు అతనికి దానము ఇచ్చువారు అగుదురు.

    3. ప్రజాసమూహములు నిరాటంకముగా తన పక్షము వహించవలెనని కోరువాడు అర్యముని కొరకు చరు నిర్వాపము చేయవలెను. అసౌ వై ఆదిత్యః. అతడు అర్యముని స్వభాగధేయమున అర్చించవలెను. అర్యముడే అతనిని గమ్యమునకు చేర్చును.

    4. ఒకప్పుడు ఇంద్రుడు తన తమ్ముల కన్న తక్కువ వానిగా చూడబడినాడు. అప్పుడు అతడు ప్రజాపతిని అర్చించినాడు. ప్రజాపతి ఇంద్రుని కొరకు ఇంద్రదేవతాకమగు ఆనుషూకమగు ఏకాదశకపాల పురోడాశమును నిర్వాపము చేసినాడు. ఆ హవిస్సుచేతనే ఇంద్రునకు దేవతలందు అగ్రగణ్యత్వము లభించినది.

    ఇంద్రుడు బుధ్న, అగ్రశబ్దముల గల యాజ్యా పురోనువాక్యలను చేసినాడు. అందువలననే ఇంద్రునకు మొదటినుంచి చివరి వరకు అగ్రత్వము కలిగినది.

    (పంట కోసి తరువాత మరల వేరునుంచి మొలిచినది అనూషూకము. దానినుండి మొలిచినది ఆనుషూకము.)

    5. తమ్ముల కన్న తక్కువగా చూడబడునట్టివాడు ఇంద్రదేవతాకమగు ఆనుషూకమును ఏకాదశ కపాలములందు నిర్వాపము చేయవలెను. అతడు ఇంద్రుని స్వభాగధేయమున యజించవలెను. ఇంద్రుడే అతనిని సమానులందు అగ్రుని చేయును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.