Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
41. అగ్నీ! నీ జ్వాలలందు పావనము చేయు శక్తి పరివ్యాప్తమై ఉన్నది. అ మహాపవిత్ర శక్తిచే మమ్ము పావనులను చేయుము.
42. సోమము సర్వదర్శి. దానికి పావనము చేయు శక్తి కలదు. ఆ శక్తిచే మమ్ము పావనులను చేయవలెను. పావనము చేయగల వాయువు సహితము మమ్ము పవిత్రులను చేయవలెను.
43. సవితృ దేవా! నీవు నీ పవిత్రము మరియు అనుజ్ఞ రెండింటితోను మమ్ము పావనులను చేయుము.
44. సవితృ దేవా! నీవు నీ పవిత్రము మరియు అనుజ్ఞ రెండింటితోను మమ్ము పావనులను చేయుము.
44. విశ్వేదేవతలకు సంబంధించినదియు- పవిత్ర కారకమగు సురాకుంభము లభించినది. ఇందు అనేక మధుధారలు చేరినవి. ఆ సురాకుంభము వలన యజ్ఞము నందు దేవతల సహితులమై కూర్చుండు ఆనందము కలిగినది. అందువలన మేము ధనస్వాములము అగుదుము గాత.
45. పితరులు సమ మనస్కులు. పదవి, అధికారములందు సమానులు. వారు యమాలోకమున విరాజిల్లుచున్నారు. ఆ పితృలోకమున పితరులకు స్వధ లభించును గాథ. యజ్ఞమును దేవతలేకదా కల్పించినారు. యజ్ఞమునకు నమస్కారము.
46. నా తోటి ప్రాణులు సమాన మనస్కులు. పదవి అధికారములందు సమానులు. వారు ఈ లోకమున ఉన్నవారు. వారందరి సిరిసంపదలు నూరేళ్ళ వరకు నాకు చేరవలెను.
47. మర్త్యులగు మానవులకు రెండే మార్గములున్నవి. ఒకటి దేవయానము. రెండవది పితృయానము. ఈ రెంటితోనే ఈ లోకమున రాకపోకలు జరుగుచున్నవి. మాటా పితృలకు భేదమేమనిన ద్యులోకము పితరుడు, భూలోకము మాతయగును.
48. (శేషం యజమానో భక్షతి. దేవ పితరులకు సమర్పించగా మిగిలినది యజమాని సేవించును.)
ఇది పాల హవి. ఇది నాలో ప్రజనన శక్తి కావలెను. ప్రాణ, అపానాదులకు - సమస్త అంగములకు బలము కలిగించవలెను. శుభములను కలిగించవలెను. ఈ హవి ఆత్మ బలము నిచ్చునది. సంతానము నిచ్చునది. పశువులను ఇచ్చునది. లోకమునిచ్చునది. స్వర్గము నిచ్చునది అగును గాత.
అగ్ని నా ప్రజలను బహు సంఖ్యాకులను చేయును గాత.
ఋత్విజులారా! మీరు మాకు అన్నము, పాలు, బలము కలిగించండి.
49. సోమము సముపార్జించు మా పితరులు నిమ్మ లోకములందు ఉన్నచో వారు ఉన్నత మధ్యమ లోకమునకు చేరుకుందురు గాత. మధ్యమలోకమున ఉన్న పితరులు ఉత్తమ లోకమునకు చేరుకుందురు గాత. ఉత్తమ లోకములందున్న పితరులు విముక్తులగుదురు గాత. కపటము తెలియని - సత్యము వాయవ్య శరీర ధారులగు పితరులు ఆహ్వానముల నుండి రక్షింతురు గాత. "న్కోవన్తు పితరో హవేషు"
(ఈ ఆహ్వానము పై నుంచి వచ్చునది. దానిని తప్పించమనుట)
50. సోమ సముపార్జకులగు అంగిరులు, నవగ్వ, దశగ్వ అధర్వులు, భృగువులే మాకు పితరులు. ఆ యజనశీల పితరుల మంచిమనసులందు మేము నిలువవలెను. వారి శుభ సంకల్పములందును మాకు స్థానము లభించవలెను.
51. వసిష్ఠులు మా పూర్వజులు. సోమపాయులు. వారు సోమ యాగము చేసినారు. దానిని దేవతలకు అందించినారు. అట్టి మా పితరుల తోడుగా అభిలాషల యముడు హవిస్సులను స్వేచ్ఛగా స్వీకరించవలెను. మాకు అభీష్ట వరములనీయవలెను.
52. విశిష్ట చైతన్యవంత సోమమా! నీవు మనీషవు. మమ్ము సన్మార్గమున నడిపించుము. మా పితరులకు నీవే మార్గదర్శివైనావు. అందువలన వారికి యజ్ఞ ఫలప్రాప్తి కలిగినది. వారు స్వర్గమందున్నారు.
53. పావక సోమమా! మా పూర్వజ పితరులు నీ అనుగ్రహముననే జ్ఞానవంతలైనారు. సోమయాగాది కర్మలు నిర్వర్తించినారు. నీవు వాయువు మున్నగు ఉపద్రవములకు అతీతుడవు. ఈ యజ్ఞమును ఉపద్రవములనుండి రక్షింపుము. మాకు వీరపుత్రులను, అశ్వములను ప్రసాదించి మా విషయమున ధనప్రదుడవగుము.
54. సోమమా! మా పితరులతో ఏకత్వము పొంది నీవు ద్యావాపృథ్వులను విస్తారపరచినావు. అట్టి నిన్ను హవిస్సులచే సేవించుచున్నాము. నీ దయ వలన మేము ధనస్వాములము కావలెను.
(ఇంతవరకు సోమపాయులగు పితరుల మంత్రములు ముగిసినవి. కుశాసనములపై ఆసీనులగు పితరుల మంత్రములు మొదలు)
55. కుశాసనాసీన పితరులారా! మీరు మమ్ము రక్షించుటకుగాను చక్కగా యజ్ఞమునకు విచ్చేయండి. మేము మీకుగాను హవిస్సులు సముపార్జించినాము. విచ్చేయండి. వీనిని సేవించండి. ఎంతో శాంతి నిచ్చు అన్నమున తృప్తి చెందండి. మాకు కలుగుచున్న దుఃఖములను నివారించండి. కలుగనున్న దుఃఖ భయమును నివారించండి.
56. కుశాసన పితరులు ఎంతో జ్ఞానవంతులు. వారిని నేను బాగుగా ఎరుంగుదును. యజ్ఞపు దేవయాన, పితృయాన మార్గములను కూడా ఎరుంగుదును. ఆ మార్గములందు రాకుండుట ఉన్నది. తిరిగి వచ్చుట ఉన్నది. ఏ బర్హిషదులగు పితరులు సోమపు తమ భాగమును స్వధ ద్వారా సేవింతురో వారు ఈ యజ్ఞమునకు విచ్చేయవలెను.
57. సోమపాయి పితరులను - కుశాసనమున - స్థాపించిన ప్రియధన సోమ రసమునకు ఆహ్వానించుచున్నాము. వారు మా ఆహ్వానములను వినవలెను.మా యజ్ఞమునకు విచ్చేయవలెను. పక్షపాతయుతముగా మమ్ము తమవారిగా చెప్పుకొనవలెను. వారు ప్రసన్నులై మమ్ము దుఃఖములనుండి కాపాడవలెను.
(ముందు వచ్చునని అగ్నిష్వాత్త పితరుల మంత్రములు)
58. సోమరస పానము చేయు అగ్ని ష్వాత్తులగు మా పితరులు దేవయాన మార్గమున ఇచటకి ఈ యజ్ఞమునకు విచ్చేయ వలెను. వారు ఈ యజ్ఞము నందలి స్వధాన్నము సేవించి ఉన్మత్తులు కావలెను. వారు పక్షవాత యుతముగా మమ్ము తమ వారిగా చెప్పుకొనవలెను. మమ్ము దుఃఖములనుంచి కాపాడవలెను.
(అగ్ని స్వధాహవిస్సులు ఆస్వాదింప చేయునట్టి పుణ్యకర్మ పితరులు అగ్నిష్వాత్తులు.)
59. అగ్నిష్వాత్త పితరులారా! మీరు సన్మార్గగాములు. ఈ యజ్ఞమునకు విచ్చేయండి. మీ కొరకు ఏర్పరచిన విశిష్ట స్థానమును అలంకరించండి. కుశల మీద ఉంచిన స్వధా హవిస్సులను ఆరగించండి. ప్రసన్నులై మాకు పుత్రయుక్త గో, అశ్వధనమును ప్రసాదించండి.
60. అగ్నిష్వాత్త పితరులకును - ద్యులోక మధ్యమున స్వధచే ఆనందించు అగ్నిష్వాత్త పితరులకును స్వయంశోభాయమానుడగు యమరాజు తగు రీతిని శరీరములు ఏర్పరచును.
61. ఆయా ఋతువులందు జరుగు యజ్ఞములందలి తమ భాగమును అందుకొనువారును నరాశంస చమసమున సోమరస పానము చేసిన వారునయిన అగ్నిష్వాత్త పితరులను ఆహ్వానించుచున్నాము. విద్వాంసులగు మా పితరులు మాకు మంచి ఆహ్వానవంతులు కావలెను. సహనాభవన్తు, వారి దయ వలన మేము ధనస్వములమగుదుము గాత.
62. పితరులారా! దక్షిణదిశన కుడి తొడ బలము మీద ఆసీనులు కండి. ఆసీనులై మా యజ్ఞమును ప్రశంసించండి. మానవ సహజ చాంచల్యమున చేసిన ఏ అపరాధ కారణమునను మమ్ము బాధించకండి.
63. ఎర్రని గొర్రెల మీద ఆసీనులైన పితరులారా! హవిర్దాత యజమానికి ధనము ప్రసాదించండి. పుత్రులకు ఆ ధనము నందలి భాగమును అందించండి. మాకు బలము కలిగించండి.
(కుతప ప్రియులగు పితరులకు ఎర్ర గొర్రె ఆసనమని - కుతప ప్రియాశ్చపితరః ఎర్రని ఆదిత్య లోకపు వారనియు అర్థము. ఆదిత్య లోక జితః పితర ఉచ్యన్తే అని ఉవటుడు)
64. అగ్నీ! నీవు పితరులకు స్వధాన్నము అందించువాడవు. నీవు ఉత్తమముగా భావించునదియు వాణిచే స్తుతించబడునదియు అందుకొనుటకు యోగ్యమైన దనమును దేవతలకు అందించుము.
65. అగ్ని పితృ భోజనమగు కవ్యమును వారి వద్దకు చేర్చును. సత్యమును వర్ధిల్ల చేయును. పితరులను యజించును. అగ్నియే ఆయా దేవతలకు హవిని అందించి అందును గురించి చెప్పును. పితరులకు సహితము అందించుము.
66. కవ్యవాహకఅగ్నీ! ప్రశంసితుడవైన నీవు హవిని సుగంధితము చేసి వహించినావు. స్వధను పితరులకు అందించినావు. పితరులు దానిని ఆరగించినారు. ఇక నీవు సహితము నీకు సమర్పించిన హవిస్సులను ఆస్వాదించుము.
67. అగ్నిదేవా! పితరులు ఈ యజ్ఞమునకు విచ్చేసినవారున్నారు. విచ్చేయనివారున్నారు. మేము ఎరిగినవారున్నారు. ఎరుగని వారున్నారు. నీవు జతవేదివిగదా! పితరులందరిని బాగుగా ఎరుగుదువు. స్వధల ద్వారా మా ఈపుణ్యయజ్ఞమును ఆస్వాదించుము.
68. పితరులందు చెల్లిపోయినవారున్నారు. కర్మలను త్యజించి పరబ్రహ్మను చేరినవారున్నారు. ఈలోకమందే ఉన్నవారు కలరు. యజ్ఞయాగాదులు చేయుచు మానవులందున్నారు. అట్టి పితరులందరకు నేడు హవిరన్నము అందును గాత.
69. అగ్నీ! మా పూర్వులగు ఉత్కృష్ట పితృజనులు యజ్ఞములు నిర్వహించి, ఉక్ధములు పఠించి, అంతమున పవిత్ర ప్రకాశమును చేరినారు. పృథ్విని ఛేదించినారు. ఎరుపుగోవులను విడిచిపుచ్చినారు.
(అంగిరులు పూర్వపితరులు. వారు నవగ్వ - దశగ్వయజ్ఞములు చేసినారు. వేదిమున్నగు వానికొరకు నేలను త్రవ్వినారు. వారు ప్రకాశమును చేరుకున్నారు. అప్పుడు వారు పణుల అధీనమున ఉన్న గోష్ఠములను విరిచినారు. గోవులను విముక్తము చేసినారు)
70. అగ్నీ! కోరికలతోనే నిన్ను వేదిమీద ప్రతిష్టించుచున్నాము. కోరికలతోనే నిన్ను ప్రజ్వలింపచేయుచున్నాము. కోరికలు గల నీవు హవిస్సులను కోరుచున్న పితరులను హవిభక్షణకు ఇచటికి తీసికొనిరమ్ము.
71. సర్వయుద్ధములందు జయించిన ఇంద్రుడు నీటినురగతో అసుర నముచి శిరమును ఛేదింనాడు.
(నముచి ప్రస్తావన ఋగ్వేదమందున్నది. ఇతరగ్రంథలందును ఉన్నది. నముచి వృత్రుని వంటివాడు. ఇంద్రుడు వృత్రుని వజ్రాయుధమునను, నముచిని నీటినురగతోను వధించినాడని వృత్తాంతము)
72. అభిషుత సామ్రాట్టు సోమము అమృతస్వరూపుడు అయినాడు. ఏలనన అతడు ఋజీషమున మృత్యువును త్యజించినాడు. దశాపవిత్రమున శుద్ధమైన సోమమును పానము చేసిన సత్యబలము నిచ్చును. ఈపాలు సహితము ఇంద్రునకు మధుర అమృతప్రాయము కావలెను.
(ఋజీషం నీరసం సోమలతా చూర్ణం అని మహీధరుడు)
73.అవయవముల సారము ప్రాణమగును. హంస తనకున్న నైపుణ్యమున క్షీర నీరములను విడదీసి పానము చేయును. అట్లే సోమమును శుద్ధిచేసి పానము చేసినంత అది సత్యజలము అగును. ఇంద్రుని ఇంద్రియము కూడ అమృతమగును.
74. సూర్యుడు జలములను శుద్ధిచేసి వానిని సోమరూపమున పానము చేయును. అట్లే దశాపవిత్రమున శుద్ధిచేయబడిన పానము చేసిన సోమము అమృతమగును.
(నీరు ఎంతటి కలుషితమైనను సూర్యుడు శుద్ధజలమును మాత్రమే గ్రహించును)
75. సురాసోమమిశ్రము నుండి ప్రజాపతి గాయత్రి ద్వారా సోమమును వేరు చేయించినాడు. అతడు అట్లు శుద్ధి చేసిన సోమమును పానము చేసినాడు. అతడు క్షత్రియులను వశపరచుకున్నాడు. ఇందువలన శుద్ధిచేసి పానము చేసిన సోమమే ఇంద్రియములకు బలము నిచ్చునను సత్యము విదితమైనది.
76. పురుషుని లింగము యోనియందు ప్రవేశించినపుడు వీర్యము విడుచును. అట్లు కానపుడు మాత్రము విడుచును. గర్భము నందున్నప్పుడు మాయకప్పిన శిశువు జన్మించినంత దానిని వదిలివేయును. ఇదియే సత్యమగును.
77. ప్రజాపతి ఎంతో విచారించి సత్యమును అసత్యమును వేరుచేసినాడు. సత్యమునకు శ్రద్ధను అసత్యమునకు అశ్రద్ధ జోడించినాడు. ఇదియే సత్యమగును.
78. ప్రజాపతి తనజ్ఞానమున విచక్షించి శుద్ధిచేసిన సోమమును శుద్ధిచేయని పాలను త్రావినాడు ఇదియే సత్యము.
79. ప్రజాపతి అభిషుత సోమ సురలను పరిశీలించినాడు. సోమమును మాత్రమే త్రావినాడు. అట్లు పరిశీలించియే పాలను సహితము త్రావినాడు. ఇది సత్యమగును.
80. మనీషులు తమ మనోబలమున తంత్రమును సీసమున దించుదురు. మరల దానిని ఊలుదారమున గ్రుచ్చుదురు. అట్లే అశ్వినులు, సవిత, సరస్వతి, వరుణుడు ఇంద్రునకు వైద్యము చేయుటకు యజ్ఞతంత్రము ఏర్పరచెదరు. ఆయంత్రమును సోమసూత్రమున గ్రుచ్చుదురు.
81. ఇద్దరు అశ్వినులు, సరస్వతి ముగ్గురు తమ యుక్తులచే అవలీలగా ఇంద్రుని శరీరమును నిర్మించినారు. మొలకెత్తిన ధాన్యమును రోమములు, యవలమొలకలతో చర్మము, లాజలతో మాంసము నిర్మించినారు.
82. అశ్వినులును, రుద్రమార్గావర్తి సరస్వతి ఇంద్రుని శరీరపు లోపలి భాగమును నిర్మించినారు. గరికపొడి మున్నగు వానిని కర్రకు కట్టి ఎముకలు చేసినారు. గోవు తిత్తిలో మధువు నింపి 'గలనవాసము' న మూలుగును చేసినారు.
83. సరస్వతి నాసత్యులతో మనసు కలిపి మాంసిలము, చూడముచ్చటైన దేహమును అల్లుచున్నది. చిలికిన సుర రసమున ఎర్రని ద్రవము చేసినది. 'నగ్నహు' ను నేయుటకు పడుగు, పేకలు తీర్చినది.
84. పాలచే జయశీలము, అవినాశ్యము, శ్వేతమగు వీర్యమును చేసినది. సురతో మూత్రము చేసినది. ఆమాశయమునందలి అపక్వ అన్నరూపమును, పక్వాశయము నందలి అన్నమును చేసినది. ఆసమాయమున అశ్వినులును, సరస్వతియు దుర్బుద్ధిని హింసించినారు.
85. సురక్షణల ఇంద్రుడు హృదయమును హృదయముచే నిర్మించినాడు. సవిత పురోడాశముచే సత్యమును ఏర్పరచినాడు. ఇంద్రునకు చికిత్స చేయుచు వరుణుడు 'యకృత్' 'క్లోమము', లను చేసినాడు. సౌమిక యాగపు ఊర్ధ్వ పాత్రలచే మతస్న మరియు పిత్తము చేసినాడు.
86. మధువు చిలుకు స్థాళులు ఆంత్రములైనవి. పాలు పితుకు పాత్ర, పాడియావు, గుదము అయినవి. శ్యేనపు రెక్క ప్లీనము, మాతృస్థానీయ ఆసంది మరియు యుక్తి యులనుండి నాభి, ఉదరము ఏర్పడినవి.
87. సురాభాండము గర్భము అయినది. నూరుచిల్లుల కల్లుకుండ శిశ్నమైనది. సురాభారడము పితరుల కొరకు స్వధ కలిగించును.
88. సతమను పాత్రనుండి ఇంద్రుని ముఖము ఏర్పడినది. దానితోనే తల ఏర్పడినది. పవిత్రజిహ్వ ఏర్పడినది. చప్యగుదమైనది. సుర వడకట్టు వస్త్రము ఇంద్రుని లింగమైనది. ఆ లింగము వీర్యమున అత్యంత వేగవంతమైనది.
89. అశ్వినియను పాత్రలు ఇంద్రుని అమర నేత్రములైనవి. ఛాగము నేత్రగత తేజమైనది. గోధుమలచే నేత్రలోమము ఏర్పడినది. కువలములతో రుతములు, పేశములచే కనులందలి నలుపు తెలుపు ఏర్పడినవి.
90. మేకయు - సరస్వతి మేకయు ఇంద్రుని నాసిక యందలి శక్తిగా నిలిచినది. సారస్వత గ్రహములు ప్రాణముల అమరమార్గములైనవి. యవాంకురముచే సరస్వతి ఇంద్రుని వ్యానవాయువు చేసినది. కుశలు - రేగులతో వెంట్రుకల చేసినది.
91. ఋషభుడు ఇంద్రుని బలము కొరకు తన రూపము ఏర్పరచినాడు. ఐంద్రగ్రహములు త్రికాలశబ్ద సమర్థములగు ఇంద్రుని కర్ణములైనవి. యవాంకురములు కుశలు కనుబొమలైనవి. తేనెవంటి రేగు చీమిడి అయినది.
92. తోడేలు వెంట్రుకలు రోమములు - అంగము మీది వెంట్రుకలైనవి. పులివెంట్రుకాలు గడ్డము, మీసములయినవి. సింహపు వెంట్రుకలు శిరోజములు - తలకొప్పు -తేజస్సు, ఇంద్రియాదులైనవి.
93. వైద్యులగు అశ్వినులు ఇంద్రునిరూపము, నూరేళ్ల ఆయువు, చంద్రుని నుంచి అమృతజ్యోతి యగు మనసు ఏర్పరచి వివిధ అవయవములను కూర్చినాడు. చివరకు సరస్వతి అవయవములకు ఆత్మనుచేర్చినది.
94. సరస్వతి అశ్వినుల పత్నియై ఇంద్రలక్షణుని గర్భమున ధరించినది. జలముల రాజగు వరుణుడు సంపదల నిమిత్తము ఇంద్రుడు పుట్టగా జలములందు ధరించినాడు.
95. పశువుల తేజస్సు, వీర్యవంతహవి, చిలికిన సుధ, అనభిషుత దుగ్ధము, పట్టుతేనె మున్నగు వానిచే వైద్యులగు అశ్వినులు సరస్వతి ద్వారా ఇంద్రుని కొరకు తేజస్సును కల్పించినారు. అభిషుత అనభిషుతములచే అమృతము, ఆహ్లాదక సోమము కూడ ఏర్పరచినారు.
(ఇవివైద్యసంబంధములట్లున్నవి. భిషగ్వరులు పరిశీలించవలెను)
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
సుగదీంద్రాభిషేకాన్తమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
సర్వేభవన్తు సుఖినః





