Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                                        శ్రీః
                                          శ్రీహయగ్రీవాయనమః
           
            జ్ఞానానందమయం దేవం | నిర్మల ప్పటక్కాకృతిం
            ఆధారం సర్వ విద్యానాం | హయగ్రీవముపాస్మహే||

                    ఎనిమిదవ మండలము
                ఏడవ అధ్యాయము             మొదటి అనువాకము

                                  మొదటి సూక్తము     
           
    ఋషి - మేధాతిథి - మేధ్యాతిధి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - బృహతి, చివరి రెండు త్రిష్టుప్.


                           మాచిదన్యాద్విశంసత సఖాయో మారిషణ్యత
                ఇంద్రమిత్త్సోతా వృషణం సచాసుతే ముహురుక్థాచశంసత

    1. మిత్రులగు స్తోతలారా ! ఇంద్రుని తప్ప ఇతరులను స్తుతించకండి. హింసితులు కావలదు. సోమాభిషవము అయినంత ఒకచోటకూడి కోరికలు తీర్చు ఇంద్రుని స్తుతించండి.

    2. ఇంద్రుడు వృషభమువలె శత్రుహింసకుడు. బాధించని వృషభమువలె మానవ విజేత. శత్రువులను ద్వేషించువాడు. స్తోతలకు పూజనీయుడు. దివ్య, పార్థివ ధనవంతుడు. దాతలలో శ్రేష్ఠుడు. అట్టి ఇంద్రుని స్తుతించండి.

    3. ఇంద్రా ! తన రక్షణకొఱకు మానవులు నిన్ను వేరు వేరుగా స్తుతింతురు. అయినను మా ఈ స్తోత్రము సదా నిన్ను వర్థిల్ల చేయవలెను.

    4. ధనవంత ఇంద్రా ! నీ స్తోతలు విద్వాంసులు. శత్రువులను గడగడలాడించగలవారు సదా ఆపదలనుంచి ఉత్తీర్ణులు కాగలవారు. నీవు మావద్దకు రమ్ము. మా తృప్తికొరకు బహురూపములు కాగలిగి, దగ్గర ఉన్న ధనమును ప్రదానము చేయుము.

    5. వజ్రధర ఇంద్రా ! నిన్ను ఎంత ఎక్కువ ధరకైనను అమ్మబోను. వేయి, పదివేలకైనను అమ్మబోను. అనంత ధనమునకైనను అమ్మబోను.

    6. ఇంద్రా ! నీవు మాతండ్రికన్న ధనికుడవు. పారిపోని నా సోదరునికన్న ధనవంతుడవు. నాతల్లి, నీవు సమానులు. మీరు ఉభయులు నాకు ధనము కలుగుటకు పూజించండి.

    7. ఇంద్రా ! నీవు ఎచటకి వెళ్లినావు? ఎక్కడ ఉన్నావు? నీ మనసు అనేక దిశలందుండును. యుద్ధ కుశలుడవు, యుద్ధకారివగు పురందరా ! విచ్చేయుము. గాయకులు నీ స్తుతులు పాడుచున్నారు.

    8. ఈ ఇంద్రునకు గానయోగ్యమగు పాటలు పాడండి. ఇతడు అందరకు పూజనీయుడు. ఏ ఋక్కులతో ఇంద్రుడు కణ్వపుత్రుల యజ్ఞమునకు వెళ్లినాడో, ఏ ఋక్కులతో శత్రుపురములను ధ్వంసము చేసినాడో ఆ ఋక్కులనే గానము చేయండి.

    9. ఇంద్రా ! నీకు పదియోజనములు నడువగల వంద, వేయి గుఱ్ఱములు ఉన్నవి. అవి శీఘ్రగాములు. సేచన సమర్ధములు. ఆ అశ్వములమీద వెంటనే రమ్ము.

    10. గోవు పాలిచ్చునది. మంచివేగము గలది. సుళువుగా పితుకనిచ్చునది. అట్టి గోరూపు ఇంద్రుని స్తుతింతును. అంతేకాక అనేక ధారలు కల వర్షస్వరూప ఇంద్రుని స్తుతింతును.

    11. సూర్యుడు ఏతశ, నామక రాజర్షిని కష్టములపాలు చేసినాడు. అప్పుడు వంకర నడకలు కలిగి వాయువేగమున సాగు రెండు అశ్వములు అర్జున పుత్రుడు కుత్స, ఋషిని మోసినవి. అనేక కర్మలు కలవాడు ఇంద్రుడు. అతడు అహింసితుడు, కిరణవంతుడగు సూర్యుని మారువేషమున ఆక్రమించుటకు వెడలినాడు.

    12. ఇంద్రుడు అతుకుల పదార్థము వాడడు. మెడనుండి రక్తము రానీయడు. కాని కీళ్లను అతుకును. అట్టి ధని - బహుధని ఇంద్రుడు విడివిడిన వాటిని తిరిగి చేర్చగలడు.

    (సూర్యుడు ఏతశుని గాయపరచగా ఇంద్రుడు బాగుచేసినాడని)   

    13. ఇంద్రా ! నీ దయవలన మేము అధములను కాకుండవలెను దుఃఖితులము కాకుండవలెను. తరిగిపోవు ధనవంతులవలె పుత్ర, పౌత్రాది శూన్యులము కాకుండవలెను. మమ్ము ఇతరులు కాల్చరాదు. ఇంట ఉండి మేము నిన్ను స్తుతించుచుందుము.

    14. ఇంద్రా ! తొందరపడక, క్రోధములేక, మెల్లగా మేము నిన్ను స్తుతింతుము. ఒకేసారి మేము కోరినది ధనవంతులమై నీ కొఱకు సుందర స్తుతులు చెప్పెదము.

    15. ఇంద్రుడు మా స్తోత్రములు విన్నంతనే మా సోమము అతనిని సంతోషపెట్టును, ఆసోమము వక్రభావముగల దశాపవిత్రముతో పావనమైనది. ఏకధనము మున్నగు తీర్థములతో వర్థిల్లినది. అందువలననే సోమములన్నియు మదకారకములయినవి.

    16. ఇంద్రా ! స్తోతలు నీ సేవకులు. వారు ఇతరులతో కలిసి స్తుతించుచున్నారు. వారివద్దకు విచ్చేయుము. ఇతర హవివంతుల స్తుతులు మావద్దకు చేరవలెను. ఇప్పుడు కూడ నేను నిన్ను అందముగా స్తుతించ కోరుచున్నాను.

    17. అధ్వర్యులారా ! శిలలో సోమము అభిషవించండి. దానిని నీటితో కడగండి.

    గోచర్మము వంటి మేఘములను కప్పుకున్న మరుత్తులు నదులకొఱకు నీటిని పితుకదురు.

    18. ఇంద్రా ! పృథివి, అంతరిక్షము లేక ఇతర ప్రకాశవంత ప్రదేశములనుండి రమ్ము. విస్తృతమగు నా స్తుతులతో వర్థిల్లుము. మావద్ద పుట్టిన మనుష్యులకు వారు కోరిన ఫలములు ప్రసాదించుము.

    19. అధ్వర్యులారా ! ఇంద్రుని కొఱకు అన్నింటిని మించిన మదకర సోమమును సమర్పించుడు.

    యజమానులు. కర్మవంతులు. అన్నాభిలాషులు. ఇంద్రా ! వారిని పెంపొందించుము.

    20. ఇంద్రా ! నేను యజ్ఞమున నీకు సోమము అర్పింతును. స్తుతింతును. ప్రార్థింతును. నీకు కోపము రానీయము. నీవు పోషించువాడవు. సింహమువలె భయంకరుడవు. నిన్ను యాచించనివాడు లోకములందున్నాడా?

    21. ఇంద్రుడు ఉగ్రబలవంతుడు. స్తోతలు అతనికి మాదక సోమము సమర్పింతురు. సోమపానమున ఆనందించిన ఇంద్రుడు మాకు శత్రువిజేత గర్వ విధ్వంసక పుత్రుని ప్రసాదించును.

    22. ఇంద్రుడు సుఖదమగు యజ్ఞము హవి అందించు యజమానికి అతివరణీయ ధనము ఇచ్చును. అతడే సోమాభిషవకర్తకు స్తోతకు ధనము ఇచ్చును. ఇంద్రుని సర్వకార్య ఉద్యత స్తోతలు ప్రశంసింతును.

    23. ఇంద్రా ! రారమ్ము. నీవు దర్శనీయ ధనముతో సంతుష్టుడవగుము. ఒకేచోట పానము చేయు సోమముతో విస్తీర్ణము, వర్ధకమగు నీ ఉదరమును సరస్సునువలె నింపుము.

    24. ఇంద్రునకు శత సంఖ్యాక, సహస్ర సంఖ్యాక అశ్వములు ఉన్నవి. అవి బంగారు రథమున ఇంద్రుని వహించవలెను. ఇంద్రయుక్త అశ్వములు కేశవంతములయినవి.

    (కేశములుగల అశ్వములు ఉత్తమములు)

    25. తెల్లనితోకలు, నెమలిరంగుగల గుఱ్ఱములు - మధుర స్తుతియోగ్య సోమపానమునకు ఇంద్రుని, బంగారు రథముమీద తేవలెను.

    26. స్తుతియోగ్య ఇంద్రా ! ఈ సోమము సుసంస్కృతము. రసవంతము. ఇది మాదకము - శోభస్కరము. ఇది మత్తు కలిగించుటకు సుసంపన్నమైనది. దీనిని ప్రథమ సోమపాయిగా పానము చేయుము.

    27. ఇంద్రుడు తన కర్మములతో ఒంటరిగానే సమస్త శత్రువులను పరాజితులను చేయును. అతను తన కర్మలవలన విశాలుడు ఉగ్రుడు శిరప్రాణము కలవాడు. అట్టి ఇంద్రుడే రావలెను. వేరుగా రాకూడదు. మా స్తోత్రములముందుకు రావలెను. ఇంద్రుడు మమ్ము విడువరాదు.

    28. ఇంద్రా ! శుష్ణ అసురుని కదలికగల సదనమును నీ వజ్రమున చూర్ణము చేసినావు. నీవు స్తోతల యజ్ఞకర్తల ఆహ్వానయోగ్యుడవు. దీప్తిమంతునివై నీవు శుష్ణుని వెన్నాడినావు.

    29. సూర్యోదయముకాగా నా సకల స్తోత్రములను ఆవర్తితము చేయుము. మధ్యాహ్నమున నా స్తుతులను ఆవర్తితము చేయుము. దివసాంతమున నా స్తుతులను ఆవర్తితము చేయుము. రాత్రికూడ నా స్తుతులను ఆవర్తితము చేయుము.

    30. అసంగుడను రాజు మేధ్యాతిథికి చాల ధనము దానము చేసినాడు. ఇది తనను స్తుతించమని కోరుట:- మేధ్యాతిథీ ! తేపతేప మరలమరల నన్ను స్తుతించుము. నన్ను ప్రశంసించుము. ధనవంతులలో మేము అందరిని మించిన ధనవంతులము. మా శక్తితోనే ఇతరుల అశ్వములు సిద్ధమైనవి. మా మార్గము ఉత్కృష్టము. మా ఆయుధము ఉత్కృష్టము.

    31. భోజనము ముగించి నేను శ్రద్ధగా మీ రథమును జోడించినాను. నాకు మనోహరమగు దానము చేయుట తెలియును. నేను యదువంశపువాడను. పశువంతుడను.

    32. తనను స్తుతించమన్న అసంగునితో మేధ్యాతిథి అనుచున్నాడు.

    అతడు బంగారు చర్మస్తరణముతో పాటు నాకు గతిశీల ధనమును దానము చేసినాడు. అది చప్పుడు చేయు రథముతోకూడి శత్రువుల సకల ధనమునలను గెలువ వలెను.

    33. అగ్నీ ! ప్లషోగ పుత్రుడు అసంగుడు పదివేల ఆవులను దానము చేసినాడు. సమస్త దాతలను దాటిపోయినాడు. తదుపరి సేచన సమర్థములు, దీప్యమానములగు సమస్త పశువులు సరోవరము నుంచి నళమువలె అసంగుని వీడిపోయినవి.

    (నళము చెరువున పుట్టినట్టి ఒక రకపు గడ్డి)

    34. గుహ్యదేశమున అసంగునిముందు "స్థూలము" కనిపించును. అది అస్థిరహితము. విశాలము. దిగువకు వ్రేలాడునది. అసంగుని భార్య శశ్వతి, దానిని చూచి భర్తతో ఆర్యా ! చక్కని భోగసాధక వస్తువును సాధించినావు అన్నది.

    (అసంగ రాజునకు దైవశాపమున నపుంసకత్వము కలిగినది. ఆ శాపము విడిపించుటకు అతని భార్య శశ్వతి తపస్సు చేసినది. అందువలన అసంగునకు మగతనము మరలి వచ్చినది. అందుకు గుర్తుగా గుహ్య దేశమున స్థూలము ఏర్పాటు చేయబడినది)


                                   రెండవ సూక్తము

           ఋషి - కణ్వపుత్రుడు మేధ్యాతిథి - అంగిరస ప్రియమేధ, దేవత -
              ఇంద్రుడు, ఛందస్సు 27 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి.

    1.వాసాయిత ఇంద్రా ! ఇది అభిషుత సోమము పానము చేయుము. ఉదరమునింపుము. అకుతోభయ ఇంద్రా ! మేము నీకు సోమము సర్పింతుము.

    2. నేతలు కడిగినది, బట్టతో అభిషుతము చేసినది, మేష లోమమున పరిపూతమైన నదిలో తానమాడిన గుఱ్ఱమువలె సోమము శోభిల్లుచున్నది.

    3. ఇంద్రా ! మేము నీకొఱకు యవలు కలిసినది. క్షీరాది యుక్తమగు సోమమును రుచికరముగా సిద్ధము చేసినాము. ఈ యజ్ఞమున అట్టి సోమము సేవించుటకు నిన్ను పిలుచుచున్నాము.

    4. మానవులందును, దేవతలందును సమస్త సోమపానమునకు ఇంద్రునకు మాత్రమే అధికారము ఉన్నది. అభిషుత సోమము అందుకొను ఇంద్రుడే అన్నివిధముల అన్నముగలవాడు.

    5. విస్తృతవ్యాపక ఇంద్రుని ప్రదీప్త, సోమము అప్రసన్నుని చేయదు. దుర్లభద్రవ్యమిశ్రసోమము అప్రసన్నుని చేయదు. తృప్తినిచ్చు అన్య పురోడాశాదులు అప్రసన్నుని చేయవు. అట్టి ఇంద్రుని మేము స్తుతింతుము.

    6. వలలో చిక్కిన మృగములకొఱకు వేటకాడు వెదకును. మేముకాక అన్య ఋత్విక్కులు స్తోతలు ఉన్నారు. వారు సంస్కరించబడినసోమముతో ఇంద్రునికొఱకు అన్వేషింతురు. కుత్సితులై స్తుతించుచు ఇంద్రునివద్దకు పోయిన వారికి ఇంద్రుడు అందడు.

    7. ఇంద్రుడు అభిషుత సోమము సేవించువాడు. అతనికి త్రివిధసోమము సవనత్రయమున యజ్ఞగృహమున సిద్ధము చేయవలెను.

    8. ఋత్విక్కులను భరించునది ఏకమాత్ర యజ్ఞము. అందు మూడు విధముల కోశములందు సోమము క్షరణమగును. మూడు చమసములు సోమపూర్ణములైనవి.

    9. సోమమా ! నీవు పవిత్రువు. అనేక పాత్రలలో ఉన్నావు. మధ్యనపాలు, పెరుగు కలుపుకొని ఉన్నావు. నీవు వీరుడగు ఇంద్రునకు ఎక్కువమత్తు కలిగించుము.

    10. ఇంద్రా ! నీకొఱకగు సోమము ఘాటైనది. మేము అభిషవించిన దీప్త మిశ్రమ సోమము నిన్ను వాంఛించుచున్నది.

    11. ఇంద్రా ! ఇదిగో సోమము. ఇందుమిశ్రమ ద్రవ్యములు కలుపుము. సోమమున పురోడాశాదులను కలుపుము. అందువలన నీవు ధనవంతుడవు అగుదువు.  




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.